ఆదికాండము 42:35-38
ఆదికాండము 42:35-38 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు తమ సంచులు కుమ్మరిస్తే ఎవరి డబ్బుల మూట వారి సంచుల్లో ఉంది. వారూ వారి తండ్రీ ఆ డబ్బుల మూటలు చూసి భయపడ్డారు. అప్పుడు వారి తండ్రి యాకోబు “మీరు నా పిల్లల విషయంలో నన్ను దుఃఖానికి గురిచేశారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకుపోతారు. ఇవన్నీ నా మీదికే వచ్చాయి” అని వారితో అన్నాడు. అందుకు రూబేను “నేనతన్ని నీ దగ్గరికి తీసుకు రాకపోతే, నా ఇద్దరు కొడుకులను నువ్వు చంపెయ్యవచ్చు. అతన్ని నా చేతికి అప్పగిస్తే, అతన్ని తిరిగి మీ దగ్గరికి తీసుకు వస్తాను” అని చెప్పాడు. అయితే అతడు “నా కొడుకును మీతో వెళ్ళనివ్వను. అతని అన్న చనిపోయాడు, ఇతడు మాత్రమే మిగిలాడు. మీరు వెళ్ళే దారిలో ఇతనికి హాని కలిగితే తల నెరిసిన నన్ను దుఃఖంతో మృత్యులోకంలోకి దిగిపోయేలా చేస్తారు” అన్నాడు.
ఆదికాండము 42:35-38 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు ఆ సోదరులు వారి సంచుల్లో నుండి ధాన్యం తీయటానికి వెళ్లగా వారిలో ప్రతి సోదరునికి తన ధాన్యపు సంచిలో తన డబ్బుసంచి కనిపించింది. ఆ సోదరులు, వారి తండ్రి కూడ ఆ డబ్బును చూచి చాలా భయపడిపోయారు. యాకోబు, “నేను నా పిల్లలందర్నీ పోగొట్టుకోవాలని మీరు అనుకొంటున్నారా? యోసేపు పోయాడు. షిమ్యోను పోయాడు. ఇప్పుడు బెన్యామీనును గూడ మీరు తీసుకొని పోవాలనుకొంటున్నారు” అని వాళ్లతో అన్నాడు, అప్పుడు రూబేను, “నాయనా, బెన్యామీనును గనుక నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే, నా ఇద్దరు కుమారులను నీవు చంపేసేయ్. నన్ను నమ్ము. బెన్యామీనును నేను మళ్లీ నీ దగ్గరకు తీసుకొని వస్తాను” అని తన తండ్రితో చెప్పాడు. అయితే యాకోబు చెప్పాడు: “బెన్యామీనును మీతో నేను వెళ్లనివ్వను. అతని సోదరుడు మరణించాడు, నా భార్య రాహేలు కుమారులలో ఇతను ఒక్కడే మిగిలాడు. ఈజిప్టు ప్రయాణంలో ఇతనికి ఏమైనా సంభవిస్తే నేను చచ్చిపోతాను. నా వృద్ధాప్యంలో దుఃఖంతోనే మీరు నన్ను సమాధికి పంపిస్తారు.”
ఆదికాండము 42:35-38 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి. అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి– మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; మీరు బెన్యామీనును కూడ తీసికొనిపోవుదురు; ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను. అందుకు రూబేను–నేనతని నీయొద్దకు తీసికొని రానియెడల నా యిద్దరు కుమారులను నీవు చంపవచ్చును; అతని నా చేతికప్పగించుము, అతని మరల నీయొద్దకు తీసికొని వచ్చి అప్పగించెదనని తన తండ్రితో చెప్పెను. అయితే అతడు–నా కుమారుని మీతో వెళ్లనియ్యను; ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను.
ఆదికాండము 42:35-38 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
వారు తమ గోనెసంచులను ఖాళీ చేస్తుండగా, ఎవరి గోనెసంచిలో వారి వెండి మూట ఉంది. వారు, వారి తండ్రి, వారి డబ్బు మూటలు చూసి భయపడిపోయారు. వారి తండ్రి యాకోబు వారితో, “మీరు నన్ను పిల్లలు కోల్పోయేలా చేశారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీనును కూడా తీసుకెళ్లాలని చూస్తున్నారు. ప్రతిదీ నాకు వ్యతిరేకంగా ఉంది!” అని అన్నాడు. అప్పుడు రూబేను తన తండ్రితో, “నేను బెన్యామీనును తిరిగి నీ దగ్గరకు తీసుకురాకపోతే, నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చు. అతన్ని నాకు అప్పగించు, నేను తిరిగి అతన్ని నీ దగ్గరకు తీసుకువస్తాను” అన్నాడు. అయితే యాకోబు, “నా కుమారుడు నీతో అక్కడికి రాడు; అతని అన్న చనిపోయాడు, మిగిలింది ఒక్కడే. మీరు వెళ్లే ప్రయాణంలో ఏదైన హాని జరిగితే, మీరు నెరిసిన వెంట్రుకలతో ఉన్న నన్ను దుఃఖంలో సమాధికి తీసుకెళ్తారు” అని అన్నాడు.