ఆదికాండము 41:53-57
ఆదికాండము 41:53-57 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంటపండిన సంవత్సరములు గడచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు ఆరంభ మాయెనుగాని ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను. ఐగుప్తు దేశమందంతటను కరవు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి, అప్పుడు ఫరో–మీరు యోసేపునొద్దకు వెళ్లి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను. కరవు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నియు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరవు భారముగా ఉండెను; మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి.
ఆదికాండము 41:53-57 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఐగుప్తు దేశంలో సమృద్ధిగా పంట పండిన ఏడేళ్ళు గడిచిపోయాయి. యోసేపు చెప్పిన ప్రకారం ఏడేళ్ళ కరువు మొదలయింది గాని ఐగుప్తు దేశమంతటా ఆహారముంది. ఐగుప్తు దేశమంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశప్రజలు ఆహారం కోసం ఫరోకు మొరపెట్టుకున్నారు. అప్పుడు ఫరో “మీరు యోసేపు దగ్గరికి వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయండి” అని ఐగుప్తీయులందరితో చెప్పాడు. ఆ ప్రదేశమంతా కరువు వ్యాపించింది. యోసేపు గిడ్డంగులన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మాడు. ఐగుప్తు దేశంలో ఆ కరువు తీవ్రంగా ఉంది. ఆ కరువు లోకమంతా తీవ్రంగా ఉండడం వల్ల లోకమంతా యోసేపు దగ్గర ధాన్యం కొనడానికి ఐగుప్తుకు వచ్చింది.
ఆదికాండము 41:53-57 పవిత్ర బైబిల్ (TERV)
ఏడు సంవత్సరాల పాటు ప్రజలు తినేందుకు అవసరమైన ఆహారం అంతా వారికి ఉండినది. కానీ ఆ సంవత్సరాలు ముగిశాయి. తరువాత సరిగ్గా యోసేపు చెప్పినట్లే ఏడు సంవత్సరాల ఆకలి కాలం మొదలయింది. ఆ ప్రాంతల్లోని దేశాలలో ఎక్కడేగాని ఏ ఆహారం పండలేదు. తినుటకు ప్రజలకు ఏమీ లేదు. కానీ యోసేపు ధాన్యం భద్రపరచినందువల్ల ఈజిప్టులో ప్రజలు తినుటకు సమృద్ధిగా ఉంది. కరువు కాలం ప్రారంభం కాగానే ఆహారంకోసం ప్రజలు ఫరోకు మొరపెట్టారు. ఫరో ఈజిప్టు ప్రజలతో, “యోసేపును అడగండి. అతడు ఏమి చేయమంటే అలా చేయండి” అని చెప్పాడు. కనుక ఆ దేశంలో ఎక్కడ చూసినా కరవు ప్రబలుతున్నప్పుడు, ధాన్యము భద్రపరచిన గదులలో నుండి యోసేపు ప్రజలకు ధాన్యం ఇచ్చాడు. చేర్చిపెట్టిన ధాన్యం ఈజిప్టు ప్రజలకు యోసేపు విక్రయించాడు. ఈజిప్టులో కరవు చాలా భయంకరంగా ఉంది. మరియు ప్రాంతాలలోను కరవు తీవ్రంగానే ఉంది. కనుక ఇతర ఈజిప్టు చుట్టుప్రక్కల దేశాల ప్రజలంతా ధాన్యం కొనేందుకు ఈజిప్టులో ఉన్న యోసేపు దగ్గరకు రావలసి వచ్చింది.
ఆదికాండము 41:53-57 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఈజిప్టులో సమృద్ధి కలిగిన ఏడు సంవత్సరాలు ముగిశాయి, యోసేపు చెప్పినట్టే ఏడు సంవత్సరాల కరువు ప్రారంభమయ్యింది. ఇతర దేశాల్లో కరువు ఉన్నది కానీ ఈజిప్టు దేశమంతా ఆహారం ఉంది. ఈజిప్టు అంతా కరువు అనుభవించడం ప్రారంభమైనప్పుడు, ఆహారం కోసం ప్రజలు ఫరోకు మొరపెట్టారు. అప్పుడు ఫరో ఈజిప్టు వారందరితో, “యోసేపు దగ్గరకు వెళ్లి అతడు చెప్పినట్టు చేయండి” అని చెప్పాడు. దేశమంతటా కరువు వ్యాపించినప్పుడు, యోసేపు ధాన్య కొట్లన్నీ తెరిచి, ఈజిప్టువారికి ధాన్యం అమ్మాడు, ఎందుకంటే ఈజిప్టు దేశంలో కరువు చాలా తీవ్రంగా ఉంది. లోకమంతా ఈజిప్టుకు వచ్చి యోసేపు దగ్గర ధాన్యం కొనుగోలు చేశారు, ఎందుకంటే కరువు అంతటా తీవ్రంగా ఉంది.