ఆదికాండము 41:1-14
ఆదికాండము 41:1-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
రెండు సంవత్సరాల ముగిసిన తర్వాత ఫరో కలగన్నాడు: అతడు నైలు నది దగ్గర నిలబడి ఉన్నాడు, నదిలో నుండి పుష్టిగా అందంగా ఉన్న ఏడు ఆవులు పైకి వచ్చి జమ్ము మధ్య మేస్తున్నాయి. వాటి తర్వాత, చిక్కిపోయి వికారంగా ఉన్న మరో ఏడు ఆవులు వాటి ప్రక్కన నైలు నది ఒడ్డున నిలబడ్డాయి. చిక్కిపోయి వికారంగా ఉన్న ఆవులు అందంగా పుష్టిగా ఉన్న ఏడు ఆవులను తినివేశాయి. అప్పుడు ఫరో నిద్రలేచాడు. మళ్ళీ అతడు పడుకున్నాడు, రెండవ కలగన్నాడు: పుష్టిగా, మంచిగా ఉన్న ఏడు వెన్నులు ఒకే కొమ్మకు పెరుగుతున్నాయి. వాటి తర్వాత పీలగా, తూర్పుగాలికి ఎండిపోయిన మరో ఏడు వెన్నులు పెరిగాయి. పీలవెన్నులు పుష్టిగా ఉన్న ఏడు వెన్నులను మ్రింగివేశాయి. అప్పుడు ఫరో నిద్రలేచాడు; అది కల అని గ్రహించాడు. ఉదయం అతని మనస్సు కలవరపడింది, కాబట్టి ఈజిప్టులోని మాంత్రికులను, జ్ఞానులను అందరిని పిలిపించాడు. ఫరో తన కలలు వారికి చెప్పాడు, కానీ వాటి భావం ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు ఫరోతో అన్నాడు, “ఈ రోజు నా తప్పులు నాకు జ్ఞాపకం చేయబడ్డాయి. ఫరో ఒకసారి తన సేవకులపై కోప్పడి, నన్ను రొట్టెలు కాల్చేవారి నాయకున్ని అంగరక్షకుల అధిపతి ఇంట్లో నిర్బంధంలో ఉంచారు. మా ఇద్దరికి ఒకే రాత్రి కలలు వచ్చాయి, ఒక్కొక్క కలకు ఒక్కొక్క అర్థం ఉంది. అక్కడ మాతో పాటు ఒక హెబ్రీ యువకుడు ఉన్నాడు. అతడు అంగరక్షకుల అధికారికి దాసుడు. మా కలలు అతనికి చెప్పాం, అతడు ఎవరి కల భావాన్ని వారికి చెప్పాడు. అతడు వాటిని వివరించినట్టే మాకు జరిగింది: నా స్థానం నాకు తిరిగి వచ్చింది, మరో వ్యక్తి వ్రేలాడదీయబడ్డాడు.” అప్పుడు ఫరో యోసేపును పిలిపించాడు, వారు అతన్ని చెరసాల నుండి త్వరగా తీసుకువచ్చారు. యోసేపు శుభ్రంగా క్షౌరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో సమక్షంలో నిలబడ్డాడు.
ఆదికాండము 41:1-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రెండు సంవత్సరాల తరువాత ఫరోకు ఒక కల వచ్చింది. అందులో అతడు నైలు నది దగ్గర నిలబడ్డాడు. పుష్టిగా ఉన్న అందమైన ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి. వాటి తరువాత వికారంగా, బక్కచిక్కిన ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి ఆ ఆవుల దగ్గర నది ఒడ్డున నిలబడ్డాయి. అప్పుడు అందవిహీనమైనవీ చిక్కిపోయినవీ అయిన ఆవులు అందమైన బలిసిన ఆవులను తినేశాయి. దాంతో ఫరో నిద్రలేచాడు. అతడు నిద్రపోయి రెండవసారి కల కన్నాడు. అందులో మంచి పుష్టిగల ఏడు కంకులతో ఉన్న కాడ పైకి వచ్చింది. తూర్పుగాలి వల్ల పాడైపోయిన ఏడు తాలు కంకులు వాటి తరువాత మొలిచాయి. అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు కంకులను ఆ తాలుకంకులు మింగివేశాయి. అంతలో ఫరో మేలుకుని అది కల అని గ్రహించాడు. ఉదయాన్నే అతని మనస్సు కలవరపడింది కాబట్టి అతడు ఐగుప్తు శకునగాళ్ళందరినీ అక్కడి పండితులందరిని పిలిపించి తన కలలను వివరించి వారితో చెప్పాడు గాని ఫరోకు వాటి అర్థం చెప్పే వాడెవడూ లేడు. అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు “ఈ రోజు నా తప్పు గుర్తుకు వచ్చింది. ఫరో తన సేవకుల మీద కోపపడి నన్నూ రొట్టెలు చేసేవారి నాయకుడినీ రాజు అంగరక్షకుల అధిపతి ఇంట్లో కావలిలో ఉంచాడు. ఒకే రాత్రి నేనూ అతడు కలలు కన్నాము. ఒక్కొక్కడు వేర్వేరు అర్థాలతో కలలు కన్నాము. అక్కడ రాజ అంగ రక్షకుల అధిపతికి సేవకుడిగా ఉన్న ఒక హెబ్రీ యువకుడు మాతో కూడ ఉన్నాడు. అతనితో మా కలలను మేము వివరించి చెబితే అతడు వాటి అర్థాన్ని మాకు తెలియచేశాడు. అతడు మాకు ఏమి చెప్పాడో దాని ప్రకారమే జరిగింది. నా ఉద్యోగం నాకు మళ్ళీ ఇప్పించి వేరేవాడిని ఉరి తీయించారు” అని ఫరోతో చెప్పాడు. ఫరో యోసేపును పిలిపించాడు. చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించారు. అతడు క్షవరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో దగ్గరికి వచ్చాడు.
ఆదికాండము 41:1-14 పవిత్ర బైబిల్ (TERV)
రెండు సంవత్సరాల తర్వాత ఫరోకు ఒక కల వచ్చింది. ఫరో నైలునది ప్రక్కగా నిలబడినట్లు అతనికి కల వచ్చింది. అప్పుడు ఏడు ఆవులు నదిలోనుంచి బయటకు రావటం ఫరో చూశాడు. ఆవులు బలిసి అందంగా ఉన్నాయి. ఆవులు అక్కడ నిలబడి గడ్డి తింటున్నాయి. అప్పుడు ఇంక ఏడు ఆవులు నదిలోనుంచి బయటకు వచ్చాయి. కానీ ఈ ఆవులు చిక్కిపోయి, బక్కగా ఉన్నాయి. అందంగా ఉన్న ఏడు ఆవుల ప్రక్కగా ఈ ఏడు ఆవులు నిలబడ్డాయి. అసహ్యంగా ఉన్న ఏడు ఆవులు అందంగా బలిసి ఉన్న ఏడు ఆవులను తినివేశాయి. అంతలో ఫరో మేల్కొన్నాడు. ఫరో మరల నిద్రపోగా రెండవసారి కల వచ్చింది. ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం అతడు తన కలలో చూశాడు. ఆ ధాన్యపు గింజలు బలంగా, బాగుండటం అతడు చూశాడు. తర్వాత అదే ధాన్యపు మొక్కకు మరో ఏడు వెన్నులు పెరగటం అతడు చూశాడు. అయితే ఈ వెన్నులు పీలగా ఉండి, వేడి గాడ్పులకు పాడైపోయాయి. అప్పుడు పీలగా ఉన్న వెన్నులు, బలంగా బాగున్న వెన్నులను తినివేశాయి. ఫరోకు మరల మెళకువ వచ్చింది. అదంతా కల మాత్రమేనని ఫరో గ్రహించాడు. మర్నాడు ఉదయం ఆ కలల విషయమై ఫరోకు కలవరం కలిగింది. కనుక అతడు ఈజిప్టులోని మంత్రగాళ్లందరిని పిలిపించాడు. విద్వాంసులందరిని అతడు పిలిపించాడు. ఆ కలను గూర్చి ఫరో వాళ్లతో చెప్పాడు. అయితే వాళ్లలో ఒక్కడు కూడా ఆ కలను వివరించలేక పోయారు. దాని భావం చెప్పలేకపోయారు. అప్పుడు ద్రాక్షాపాత్రల సేవకునికి యోసేపు జ్ఞాపకం వచ్చాడు. ఆ సేవకుడు ఫరోతో ఇలా చెప్పాడు: “నాకు జరిగిన ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. నా మీద, మరో సేవకుని మీద తమరికి కోపం వచ్చింది. మీరు మమ్మల్ని చెరసాలలో వేసారు. చెరసాలలో మా యిద్దరికీ ఒకే రాత్రి కలలు వచ్చాయి. ఒక్కో కలకు ఒక్కో అర్థం ఉంది. హెబ్రీ యువకుడు ఒకడు మాతో బాటు ఆ చెరసాలలోనే ఉన్నాడు. రాజు సంరక్షక ధళాధిపతికి అతడు సేవకుడు. మేము మా కలలు అతనితో చెబితే, అతడు వాటిని మాకు వివరించాడు. ఒక్కో కల అర్థం అతడు మాకు చెప్పాడు. అతడు చెప్పిన అర్థాలు సత్యం. నాకు విడుదల అవుతుందని, నా పాత ఉద్యోగం మళ్లీ నాకు లభిస్తుందని అతడు నాకు చెప్పాడు. అది సత్యమే. వంటల పెద్ద మరణిస్తాడని అతడు చెప్పాడు, అదీ సత్యమే.” కనుక ఫరో చెరసాలలోనుంచి యోసేపును పిలిపించాడు. సంరక్షకులు వెంటనే యోసేపును చెరసాలలోనుంచి తీసుకొని వచ్చారు. యోసేపు క్షౌరం చేసుకొని, శుభ్రమైన బట్టలు వేసుకొన్నాడు. అప్పుడు అతడు వెళ్లి ఫరో ముందర నిలవబడ్డాడు.
ఆదికాండము 41:1-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటిదగ్గర నిలిచియుండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైన యేడు ఆవులు యేటిలోనుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి యేడు ఆవులు ఏటిలోనుండి పైకి వచ్చుచు ఏటి యొడ్డున ఆ ఆవులదగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండవసారి కల కనెను. అందులో మంచి పుష్టిగల యేడు వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలిచేత చెడి పోయిన యేడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ యేడు వెన్నులను ఆ పీలవెన్నులు మ్రింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్ర నందరిని అక్కడి విద్వాంసులనందరిని పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెనుగాని ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడును లేక పోయెను. అప్పుడు పానదాయకుల అధిపతి–నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఫరో తన దాసులమీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతియింట కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొకడు వేరువేరు భావములుగల కలలు చెరి యొకటి కంటిమి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైయుండిన యొక హెబ్రీ పడుచువాడు మాతోకూడ ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొకని కలచొప్పున దాని దాని భావమును తెలిపెను. అతడు మాకు ఏ యే భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించెనని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలోనుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరోయొద్దకు వచ్చెను.
ఆదికాండము 41:1-14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)