ఆదికాండము 38:20-30
ఆదికాండము 38:20-30 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అంతలో యూదా ఆ స్త్రీ దగ్గర తాకట్టు పెట్టినవి విడిపించుకోడానికి తన స్నేహితుడైన అదుల్లామీయుని ద్వారా మేకపిల్లను పంపాడు కానీ ఆమె అతనికి కనబడలేదు. అక్కడున్న మనుష్యులను, “ఎనయీము దారి ప్రక్కన ఉండే పుణ్యక్షేత్ర వేశ్య ఎక్కడుంది?” అని అడిగాడు. “ఇక్కడ పుణ్యక్షేత్ర వేశ్య ఎవరు లేరు” అని వారన్నారు. కాబట్టి అతడు యూదా దగ్గరకు తిరిగివెళ్లి, “నేను ఆమెను కనుగొనలేదు. అంతేకాక, అక్కడ ఉండే మనుష్యులు, ‘ఇక్కడ పుణ్యక్షేత్ర వేశ్య లేదు’ అని అన్నారు” అని చెప్పాడు. అప్పుడు యూదా, “ఆమె తన దగ్గర ఉన్నవాటిని ఉంచుకోనివ్వండి, లేకపోతే మనం నవ్వుల పాలవుతాము. ఎంతైనా నేను ఆమెకు ఈ మేకపిల్లను పంపాను, కానీ నీకు ఆమె కనబడలేదు” అని అన్నాడు. దాదాపు మూడు నెలలు తర్వాత, “నీ కోడలు తామారు వ్యభిచారిగా అపరాధం చేసింది, ఫలితంగా ఇప్పుడు ఆమె గర్భవతి” అని యూదాకు తెలియజేయబడింది. యూదా అన్నాడు, “ఆమెను బయటకు తీసుకువచ్చి ఆమెను కాల్చి చంపండి!” అని అన్నాడు. ఆమెను బయటకు తీసుకువచ్చినప్పుడు, ఆమె తన మామకు వార్త పంపి, “ఇవి ఎవరికి చెందినవో ఆ యజమాని ద్వార నేను గర్భవతినయ్యాను” అని అన్నది. ఇంకా ఆమె, “ఈ ముద్ర, దారం, కర్ర ఎవరివో గుర్తుపడ్తారేమో చూడండి” అని అన్నది. యూదా అవి తనవేనని గుర్తుపట్టి ఇలా అన్నాడు, “ఆమె నాకంటే నీతిమంతురాలు, ఎందుకంటే నేను ఆమెను నా కుమారుడైన షేలాకు ఇచ్చి పెళ్ళి చేయలేదు.” ఆ తర్వాత అతడు ఆమెతో మరలా ఎప్పుడూ పడుకోలేదు. ఆమె బిడ్డను కనే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు. కాన్పు సమయంలో ఒక శిశువు బయటకు వస్తూ చేయి చాచాడు; మంత్రసాని ఎర్రటి నూలుదారం ఆ శిశువు చేతికి కట్టి, “ఇతడు మొదట బయటకు వచ్చినవాడు” అని అన్నది. అయితే ఆ శిశువు చేయి వెనుకకు తీసుకున్నప్పుడు, అతని సోదరుడు బయటకు వచ్చాడు, అప్పుడు ఆమె, “ఇలా నీవు దూసుకుని వచ్చావు!” అన్నది. అతనికి పెరెసు అని పేరు పెట్టారు. తర్వాత చేతికి ఎర్రటి దారం ఉన్నవాడు బయటకు వచ్చాడు. అతనికి జెరహు అని పేరు పెట్టారు.
ఆదికాండము 38:20-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తరవాత యూదా ఆ స్త్రీ దగ్గర నుండి ఆ తాకట్టు వస్తువులను తీసుకోడానికి తన స్నేహితుడయిన అదుల్లామీయుడి ద్వారా మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు “ఆ మార్గంలో ఏనాయిము దగ్గర కనిపించిన ఆ వేశ్య ఎక్కడ ఉంది?” అని అక్కడి మనుషులను అడిగాడు. అయితే వారు “ఇక్కడ వేశ్య ఎవరూ లేదు” అని అతనికి చెప్పారు. కాబట్టి అతడు యూదా దగ్గరికి తిరిగి వెళ్ళి “ఆమె నాకు కనబడలేదు. అంతేగాక, అక్కడి మనుషులు ఇక్కడికి వేశ్య ఎవరూ రాలేదని చెప్పారు” అన్నాడు. యూదా “మనలను అపహాస్యం చేస్తారేమో, ఆమె వాటిని ఉంచుకోనీ. నేను నీతో ఈ మేక పిల్లను పంపాను, ఆమె నీకు కనబడలేదు” అని అతనితో అన్నాడు. సుమారు మూడు నెలలైన తరువాత “నీ కోడలు తామారు జారత్వం జరిగించింది. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయ్యింది” అని యూదాకు కబురొచ్చింది. అప్పుడు యూదా “ఆమెను తీసుకు రండి, ఆమెను సజీవ దహనం చెయ్యాలి” అని చెప్పాడు. ఆమెను బయటికి తీసుకు వచ్చినప్పుడు, ఆమె తన మామ దగ్గరికి అతని వస్తువులను పంపి “ఇవి ఎవరివో ఆ మనిషి వలన నేను గర్భవతినయ్యాను. ఈ ముద్ర, ఈ దారం, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తు పట్టండి” అని చెప్పించింది. యూదా వాటిని గుర్తు పట్టి “నేను నా కుమారుడు షేలాను ఆమెకు ఇయ్యలేదు కాబట్టి ఆమె నాకంటే నీతి గలది” అని చెప్పి ఇంకెప్పుడూ ఆమెతో పండుకోలేదు. నెలలు నిండినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు. ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాపాడు. మంత్రసాని ఒక ఎర్ర దారం వాడి చేతికి కట్టి “వీడు మొదట బయటికి వచ్చాడు” అని చెప్పింది. వాడు తన చెయ్యి వెనక్కి తీయగానే అతని సోదరుడు బయటికి వచ్చాడు. అప్పుడామె “నువ్వెందుకురా చొచ్చుకు వచ్చావు?” అంది. అందుచేత వాడికి “పెరెసు” అని పేరు పెట్టారు. ఆ తరువాత చేతికి దారం కట్టి ఉన్న అతని సోదరుడు బయటికి వచ్చాడు. అతనికి “జెరహు” అని పేరు పెట్టారు.
ఆదికాండము 38:20-30 పవిత్ర బైబిల్ (TERV)
యూదా తామారుకు ఇచ్చిన మాట ప్రకారం ఒక మేకను ఇచ్చి తన స్నేహితుడు హీరాను ఏనాయిముకు పంపించాడు. మరియు ఆమె దగ్గర్నుండి ప్రత్యేక ముద్రను, చేతి కర్రను తీసుకొని రమ్మని యూదా అతనితో చెప్పాడు. కానీ హీరాకు ఆమె కనబడలేదు. “ఇక్కడ దారి ప్రక్కగా ఉంటూండే ఆ వేశ్య ఏమయింది?” అని ఏనాయిము దగ్గర కొందరిని అడిగాడు హీరా. “ఇక్కడ ఎన్నడూ వేశ్య నివసించలేదే” అని వాళ్లు అన్నారు. కనుక యూదా స్నేహితుడు యూదా దగ్గరకు తిరిగి వెళ్లి, “ఆ స్త్రీ నాకు కనబడలేదు. అక్కడ ఎన్నడూ వేశ్య లేదని అక్కడ ఉండేవాళ్లు చెప్పారు” అన్నాడు. అందుచేత యూదా, “ఆ వస్తువులు ఆమె దగ్గరే ఉండనివ్వు. మనుష్యులు నన్ను చూచి నవ్వటం నాకు ఇష్టం లేదు. ఆమెకు మేకను ఇవ్వాలని నేను ప్రయత్నం చేశాను, కానీ ఆమె మనకు కనబడలేదు. అది చాలు” అన్నాడు. మూడు నెలల తర్వాత, “నీ కోడలు తామారు ఒక వేశ్యలా పాపం చేసింది, ఇప్పుడు గర్భవతిగా ఉంది” అని యూదాతో చెప్పారు. అప్పుడు యూదా, “ఆమెను బయటకు లాగి చంపేసి, ఆమె శరీరాన్ని కాల్చివేయండి” అన్నాడు. తామారును చంపటానికి మనుష్యులు వెళ్లారు. అయితే ఆమె తన మామగారికి ఒక సందేశం పంపింది. “నన్ను గర్భవతిగా చేసినవాడు ఈ వస్తువుల స్వంతదారుడే. (ప్రత్యేక ముద్ర, చేతి కర్ర ఆమె అతనికి చూపించింది.) ఈ వస్తువులు చూడు. ఇవి ఎవరివి? ఈ ముద్ర, దారం ఎవరివి? ఈ చేతి కర్ర ఎవరిది?” వాటిని యూదా గుర్తుపట్టి, “ఆమెదే సరి. నాదే తప్పు. నేను వాగ్దానం చేసిన ప్రకారం నా కుమారుడైన షేలాను నేను ఆమెకు ఇవ్వలేదు” అన్నాడు. యూదా మళ్లీ ఇక ఆమెతో శయనించలేదు. తామారు ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమెకు కవలలు పుడతారని వారికి తెలిసింది. ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒక శిశువు చేయి బయటకు వచ్చింది. మంత్రసాని ఆ చేతికి ఒక ఎర్ర దారం కట్టి, “ఈ శిశువు ముందు పుట్టాడు” అంది. అయితే ఆ శిశువు తన చేయి లోపలకు లాగేసాడు. అప్పుడు మరో శిశువు ముందు పుట్టాడు. కనుక “మొత్తానికి నీవే ముందు భేదించుకొని పుట్టావన్న మాట” అంది మంత్రసాని. అంచేత వారు పెరెసు అని వానికి పేరు పెట్టారు. తర్వాత రెండో శిశువు పుట్టాడు. చేతికి ఎర్రదారం కట్టబడిన శిశువు వీడు. వారు వాడికి జెరహు అనే పేరు పెట్టారు.
ఆదికాండము 38:20-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తరువాత యూదా ఆ స్త్రీ యొద్దనుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లా మీయునిచేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు–మార్గమందు ఏనాయిము నొద్ద నుండిన ఆ వేశ్య యెక్కడనున్నదని ఆ చోటి మనుష్యులను అడుగగా వారు–ఇక్కడ వేశ్య యెవతెయు లేదని చెప్పిరి. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్లి–ఆమె నాకు కనబడలేదు; మరియు ఆ చోటి మనుష్యులు –ఇక్కడికి వేశ్య యెవతెయు రాలేదని చెప్పిరని అని నప్పుడు యూదా–మనలను అపహాస్యము చేసెదరేమో; ఆమె వాటిని ఉంచు కొననిమ్ము; ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను. రమా రమి మూడు నెలలైన తరువాత–నీ కోడలగు తామారు జారత్వము చేసెను; అంతేకాక ఆమె జారత్వమువలన గర్భవతియైనదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా–ఆమెను బయటికి తీసికొనిరండి, ఆమెను కాల్చి వేయవలెనని చెప్పెను. ఆమెను బయటికి తీసికొని వచ్చి నప్పుడు ఆమె తన మామయొద్దకు ఆ వస్తువులను పంపి–ఇవి యెవరివో ఆ మనుష్యునివలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర యీ దారము ఈ కఱ్ఱ యెవరివో దయచేసి గురుతు పట్టుమని చెప్పించెను. యూదా వాటిని గురుతు పెట్టి–నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటె నీతిమంతురాలని చెప్పి మరి యెప్పుడును ఆమెను కూడలేదు. ఆమె ప్రసవకాలమందు కవల వారు ఆమె గర్భమందుండిరి. ఆమె ప్రసవించుచున్న ప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎఱ్ఱనూలు తీసి వాని చేతికి కట్టి–ఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పెను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామె–నీవేల భేదించుకొని వచ్చితివనెను. అందు చేత అతనికి పెరెసు అను పేరు పెట్టబడెను. తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చెను. అతనికి జెరహు అను పేరు పెట్టబడెను.