ఆదికాండము 37:5-9
ఆదికాండము 37:5-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతనిమీద మరి పగపెట్టిరి. అతడు వారినిచూచి–నేను కనిన యీ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి; నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పెను. అందుకతని సహోదరులు– నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా? మామీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలనుబట్టియు అతని మాటలనుబట్టియు అతనిమీద మరింత పగపెట్టిరి. అతడింకొక కల కని తన సహోదరులకు తెలియచేసి– ఇదిగో నేను మరియొక కలకంటిని; అందులో సూర్య చంద్రులును పదకొండు నక్షత్రములును నాకు సాష్టాంగ పడెనని చెప్పెను.
ఆదికాండము 37:5-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యోసేపు ఒక కల కని తన సోదరులతో దాన్ని గూర్చి చెప్పినప్పుడు వారు అతని మీద మరింత పగపట్టారు. అతడు వారితో ఇలా చెప్పాడు. “నేను కన్న ఈ కల మీరూ వినండి. అదేమిటంటే మనం పొలంలో ధాన్యం కట్టలు కడుతూ ఉన్నాం. నా కట్ట లేచి నిలబడగానే మీ కట్టలు దాని చుట్టూ చేరి నా కట్టకి సాష్టాంగపడ్డాయి.” అందుకు అతని సోదరులు “నువ్వు నిజంగానే మమ్మల్ని ఏలుతావా? మామీద నువ్వు అధికారివి అవుతావా” అని అతనితో చెప్పి, అతని కలలను బట్టీ అతని మాటలను బట్టీ అతని మీద మరింత పగ పెంచుకున్నారు. అతడింకొక కల కని తన సోదరులతో “ఇదిగో నేను మరొక కల గన్నాను. అందులో సూర్య చంద్రులూ, పదకొండు నక్షత్రాలూ నాకు సాష్టాంగ పడ్డాయి” అని చెప్పాడు.
ఆదికాండము 37:5-9 పవిత్ర బైబిల్ (TERV)
ఒకసారి యోసేపుకు ఒక ప్రత్యేకమైన కల వచ్చింది. తర్వాత ఈ కల విషయం యోసేపు తన అన్నలతో చెప్పాడు. దీని తర్వాత అతని అన్నలు అతణ్ణి మరింతగా ద్వేషించారు. “నాకో కల వచ్చింది, మనమంతా పొలంలో పని చేస్తున్నాం. మనం గోధుమ పనలు కడ్తున్నాం. నా పన నిలబడింది, దాని చుట్టూ మీ పనలు లేచి నిలబడ్డాయి. అప్పుడు మీ పనలన్నీ నా పనకు సాష్టాంగపడ్డాయి” అని చెప్పాడు యోసేపు. అతని సోదరులు, “అంటే మా మీద నీవు రాజువై అధికారం చేస్తావా?” అని అడిగారు. వారిని గూర్చి యోసేపుకు వస్తోన్న కలల మూలంగా ఇప్పుడు వారు అతణ్ణి ఇంకా ఎక్కువగా ద్వేషించారు. అప్పుడు యోసేపుకు మళ్లీ ఒక కల వచ్చింది. ఈ కలను గూర్చి యోసేపు తన సోదరులకు చెప్పాడు. “నాకు ఇంకో కల వచ్చింది. సూర్యుడు, చంద్రుడు, మరియు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడటం నేను చూశాను” అంటూ చెప్పాడు యోసేపు.
ఆదికాండము 37:5-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఒక రోజు యోసేపుకు ఒక కల వచ్చింది, అది తన అన్నలకు చెప్పినప్పుడు వారతన్ని మరీ ఎక్కువగా ద్వేషించారు. అతడు వారితో, “నాకు వచ్చిన కలను వినండి: మనం పొలంలో వరి పనలు కడుతున్నాము, అప్పుడు అకస్మాత్తుగా నా పన లేచి నిలబడింది, నా పన చుట్టూ మీ పనలు చేరి సాష్టాంగపడ్డాయి” అని చెప్పాడు. అతని అన్నలు అతనితో, “నీవు మమ్మల్ని ఏలాలి అనుకుంటున్నావా? నిజంగా మమ్మల్ని ఏలుతావా?” అని అన్నారు. అతని కలను బట్టి వారు అతన్ని ఇంకా ద్వేషించారు. అతనికి మరో కల వచ్చింది, “వినండి. నాకు ఇంకొక కల వచ్చింది, ఈసారి సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి” అని తన అన్నలకు చెప్పాడు.