ఆదికాండము 37:28-35
ఆదికాండము 37:28-35 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మిద్యానీయు లైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగివచ్చినప్పుడు యోసేపు గుంటలో లేక పోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగివెళ్లి–చిన్నవాడు లేడే; అయ్యో నేనెక్క డికి పోదుననగా వారు యోసేపు అంగీని తీసికొని, ఒక మేకపిల్లను చంపి, దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువు టంగీని పంపగా వారు తండ్రియొద్దకు దానిని తెచ్చి–ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గురుతుపట్టుమని చెప్పిరి అతడు దానిని గురుతుపెట్టి –ఈ అంగీ నా కుమారునిదే; దుష్ట మృగము వానిని తినివేసెను; యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి; అయితే అతడు ఓదార్పు పొంద నొల్లక–నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్లెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను.
ఆదికాండము 37:28-35 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ మిద్యాను వర్తకులు దగ్గరికి వచ్చినపుడు వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరవై షెకెల్ ల వెండికి అతణ్ణి అమ్మేశారు. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకుపోయారు. రూబేను ఆ గుంట దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు యోసేపు అందులో లేకపోవడంతో అతడు తన బట్టలు చింపుకున్నాడు. అతడు తన సోదరుల దగ్గరికి వెళ్ళి “చిన్నవాడు లేడే, అయ్యో, నేనెక్కడికి వెళతాను?” అన్నాడు. వారు ఒక మేకపిల్లను చంపి, యోసేపు అంగీని దాని రక్తంలో తడిపారు. వారు దాన్ని తమ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి “ఇది మాకు దొరికింది. ఇది నీ కొడుకు అంగీనో కాదో చూడు” అన్నారు. అతడు దాన్ని గుర్తుపట్టి “ఈ అంగీ నా కొడుకుదే, ఏదో ఒక క్రూర జంతువు వాణ్ణి చంపి తినేసింది. తప్పనిసరిగా అది యోసేపును చీల్చేసి ఉంటుంది” అన్నాడు. యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుముకు గోనెపట్ట కట్టుకుని చాలా రోజులు తన కొడుకు కోసం దుఃఖించాడు. అతని కొడుకులు, కూతుర్లు అందరూ అతణ్ణి ఓదార్చడానికి ప్రయత్నం చేశారు గానీ అతడు ఓదార్పు పొందలేదు. “నేను ఏడుస్తూ చనిపోయిన వారుండే స్థలానికి నా కొడుకు దగ్గరికి వెళ్తాను” అని అతడు యోసేపు కోసం ఏడ్చాడు.
ఆదికాండము 37:28-35 పవిత్ర బైబిల్ (TERV)
మిద్యానీ వ్యాపారవేత్తలు అటు రాగానే, ఆ సోదరులు యోసేపును బావిలో నుండి బయటకు తీశారు. 20 వెండి నాణాలకు వారతణ్ణి ఆ వ్యాపారవేత్తలకు అమ్మివేశారు. వ్యాపారవేత్తలు అతణ్ణి ఈజిప్టుకు తీసుకువెళ్లారు. ఇంతసేపూ రూబేను అక్కడ తన సోదరులతో లేడు. యోసేపును వారు అమ్మివేసినట్లు అతనికి తెలియదు. రూబేను బావి దగ్గరకు వచ్చినప్పుడు, యోసేపు బావిలో లేడు. రూబేనుకు ఎక్కడ లేని విచారం కలిగింది. తన విషాదాన్ని తెలియజేయడానికి తన గుడ్డలను చింపివేసుకొన్నాడు. రూబేను తన సోదరుల దగ్గరకు వెళ్లి, “పిల్లవాడు బావిలో లేడు, నేనేం చేయాలి?” అని అడిగాడు. ఆ సోదరులు ఒక మేకను చంపి, దాని రక్తాన్ని యోసేపుయొక్క అందమైన అంగీకి పూశారు. తర్వాత ఆ సోదరులు ఆ అంగీని తమ తండ్రికి చూపించారు. “ఈ అంగీ మాకు దొరికింది. ఇది యోసేపుదా?” అంటూ అడిగారు ఆ సోదరులు. తండ్రి అంగీని చూచి, అది యోసేపుదేనని తెలుసుకొన్నాడు. “అవును, అది అతనిదే, ఒకవేళ అడవి మృగం ఏదైనా అతణ్ణి చంపివేసిందేమో. నా కుమారుడు యోసేపును అడవి మృగం ఏదో భక్షించి వేసింది!” అన్నాడు ఆ తండ్రి. యాకోబు తన కుమారుని గూర్చిన దుఃఖంతో తన వస్త్రాలు చింపివేసుకున్నాడు. అతడు దుఃఖంలో ఉన్నట్లు వ్యక్తం చేసేందుకు ప్రత్యేక వస్త్రాలు యాకోబు ధరించాడు. యాకోబు తన కుమారుని విషయం చాలా కాలం దుఃఖంగానే ఉన్నాడు. యాకోబు కుమారులు, కుమార్తెలు అందరూ అతణ్ణి ఓదార్చాలని ప్రయత్నించారు. అయినా యాకోబుకు ఎన్నడూ ఆదరణ కలుగలేదు. యాకోబు “నా మరణ దినంవరకు నా కుమారుని గూర్చి దుఃఖిస్తూనే ఉంటాను” అన్నాడు. అందుచేత అతని కుమారుడైన యోసేపు కోసం యాకోబు దుఃఖంలోనే కాలం గడుపుతూ ఉండిపోయాడు.
ఆదికాండము 37:28-35 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి మిద్యాను వర్తకులు అటు వచ్చినప్పుడు, యోసేపును తన అన్నలు బావిలో నుండి బయటకు లాగి ఇరవై షెకెళ్ళ వెండికి ఆ ఇష్మాయేలీయులకు అమ్మివేశారు, వారు అతన్ని ఈజిప్టుకు తీసుకెళ్లారు. రూబేను ఆ బావి దగ్గరకు తిరిగివచ్చి, అక్కడ యోసేపు లేడని చూసి, తన బట్టలు చింపుకున్నాడు. అతడు తన తమ్ముళ్ల దగ్గరకు తిరిగివెళ్లి, “ఆ బాలుడు అక్కడ లేడు! నేనిప్పుడు ఎక్కడికి వెళ్లాలి?” అని అన్నాడు. అప్పుడు వారు యోసేపు అంగీని తీసుకుని, ఒక మేకను చంపి దాని రక్తంలో ముంచారు. వారు ఆ రంగుల అంగీని తమ తండ్రి దగ్గరకు తీసుకెళ్లి, “మాకు ఇది దొరికింది. ఇది నీ కుమారుని చొక్కాయో కాదో చూడండి” అని అన్నారు. అతడు దానిని గుర్తుపట్టి, “ఈ చొక్కా నా కుమారునిదే! ఒక క్రూరమృగం అతన్ని మ్రింగివేసింది. ఖచ్చితంగా యోసేపును ముక్కలు చేసి ఉంటుంది” అని అన్నాడు. అప్పుడు యాకోబు తన బట్టలు చింపుకుని, గోనెపట్ట కట్టుకుని చాలా రోజులు తన కుమారుని కోసం ఏడ్చాడు. అతని కుమారులు, కుమార్తెలు అందరు అతని ఓదార్చడానికి ప్రయత్నించారు, కానీ అతడు ఓదార్పు పొందలేదు. అతడు వారితో, “లేదు, నేను సమాధిలో నా కుమారుని కలిసే వరకు నేను దుఃఖిస్తాను” అని అన్నాడు. అలా అతడు తన కుమారుని కోసం ఏడ్చాడు.