ఆదికాండము 37:26-28
ఆదికాండము 37:26-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదము రండి;వాడు మన సహోదరుడు మన రక్త సంబంధిగదా? వానికి హాని యేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయు లైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.
ఆదికాండము 37:26-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు యూదా “మనం మన తమ్ముణ్ణి చంపి వాడి చావుని దాచిపెట్టడం వలన ఏం ప్రయోజనం? ఈ ఇష్మాయేలీయులకు వాణ్ణి అమ్మేద్దాం రండి. ఎలాగైనా వాడు మన తమ్ముడు, మన రక్త సంబంధి గదా? వాడిని చంపకూడదు” అని తన సోదరులతో చెప్పాడు. అందుకు అతని సోదరులు అంగీకరించారు. ఆ మిద్యాను వర్తకులు దగ్గరికి వచ్చినపుడు వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరవై షెకెల్ ల వెండికి అతణ్ణి అమ్మేశారు. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకుపోయారు.
ఆదికాండము 37:26-28 పవిత్ర బైబిల్ (TERV)
కనుక యూదా తన సోదరులతో “మనం మన సోదరున్ని చంపి, వాని మరణాన్ని దాచిపెడితే మనకేం లాభం? ఈ వ్యాపారస్తులకు గనుక మనం వాణ్ణి అమ్మివేస్తే మనకు లాభం వస్తుంది. పైగా మన సొంత సోదరున్ని చంపిన అపరాధం మనమీద ఉండదు” అన్నాడు. మిగిలిన సోదరులు సమ్మతించారు. మిద్యానీ వ్యాపారవేత్తలు అటు రాగానే, ఆ సోదరులు యోసేపును బావిలో నుండి బయటకు తీశారు. 20 వెండి నాణాలకు వారతణ్ణి ఆ వ్యాపారవేత్తలకు అమ్మివేశారు. వ్యాపారవేత్తలు అతణ్ణి ఈజిప్టుకు తీసుకువెళ్లారు.
ఆదికాండము 37:26-28 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యూదా తన అన్నలతో, “మన తమ్మున్ని చంపి, అతని రక్తం దాచిపెట్టడం ద్వారా మనకు ఉపయోగం ఏంటి? రండి, వీడిని మనం ఏమి హాని చేయకుండా, ఇష్మాయేలీయులకు అమ్మివేద్దాం; ఎంతైనా మన తమ్ముడు మన సొంత శరీరం కదా” అని అన్నాడు. అతని అన్నలు అందుకు ఒప్పుకున్నారు. కాబట్టి మిద్యాను వర్తకులు అటు వచ్చినప్పుడు, యోసేపును తన అన్నలు బావిలో నుండి బయటకు లాగి ఇరవై షెకెళ్ళ వెండికి ఆ ఇష్మాయేలీయులకు అమ్మివేశారు, వారు అతన్ని ఈజిప్టుకు తీసుకెళ్లారు.