ఆదికాండము 37:1-8
ఆదికాండము 37:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యాకోబు తన తండ్రి పరదేశీయుడుగా ఉండిన కనాను దేశంలో నివసించాడు. యాకోబు జీవిత వృత్తాంతం ఇది. యోసేపు పదిహేనేళ్ళ వాడుగా ఉన్నప్పుడు తన సోదరులతో కూడ మందను మేపుతూ ఉన్నాడు. అతడు చిన్నవాడుగా తన తండ్రి భార్యలైన బిల్హా కొడుకుల దగ్గరా జిల్పా కొడుకుల దగ్గరా ఉండేవాడు. అప్పుడు యోసేపు వారి చెడ్డ పనులను గూర్చిన సమాచారం వారి తండ్రికి చేరవేసేవాడు. యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు కాబట్టి తన కొడుకులందరికంటే అతణ్ణి ఎక్కువగా ప్రేమించి అతని కోసం ఒక అందమైన నిలువుటంగీ కుట్టించాడు. అతని సోదరులు తమ తండ్రి అతణ్ణి తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం వలన అతని మీద పగపట్టి, అతనితో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేవారు కాదు. యోసేపు ఒక కల కని తన సోదరులతో దాన్ని గూర్చి చెప్పినప్పుడు వారు అతని మీద మరింత పగపట్టారు. అతడు వారితో ఇలా చెప్పాడు. “నేను కన్న ఈ కల మీరూ వినండి. అదేమిటంటే మనం పొలంలో ధాన్యం కట్టలు కడుతూ ఉన్నాం. నా కట్ట లేచి నిలబడగానే మీ కట్టలు దాని చుట్టూ చేరి నా కట్టకి సాష్టాంగపడ్డాయి.” అందుకు అతని సోదరులు “నువ్వు నిజంగానే మమ్మల్ని ఏలుతావా? మామీద నువ్వు అధికారివి అవుతావా” అని అతనితో చెప్పి, అతని కలలను బట్టీ అతని మాటలను బట్టీ అతని మీద మరింత పగ పెంచుకున్నారు.
ఆదికాండము 37:1-8 పవిత్ర బైబిల్ (TERV)
యాకోబు కనాను దేశంలో ఉంటూ, అక్కడే నివసించాడు. ఇదీ, అతని తండ్రి నివసించినదీ ఒకటే దేశం. ఇది యాకోబు కుటుంబ గాధ. యోసేపు 17 సంవత్సరాల యువకుడు. గొర్రెల్ని, మేకల్ని కాయటం అతని పని. బిల్హా, జిల్ఫా కుమారులైన తన సోదరులతో కలిసి యోసేపు ఈ పని చేశాడు. (బిల్హా, జిల్ఫా అతని తండ్రి భార్యలు.) అతని సోదరులు చేసే చెడ్డ పనులను గూర్చి యోసేపు తన తండ్రితో చెప్పేవాడు. అతని తండ్రి ఇశ్రాయేలు (యాకోబు) చాలా వృద్ధుడుగా ఉన్నప్పుడు యోసేపు పుట్టాడు. కనుక ఇశ్రాయేలు (యాకోబు) తన కుమారులందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. యాకోబు తన కుమారునికి ఒక ప్రత్యేకతగల అంగీ ఇచ్చాడు. ఈ అంగీ చాలా పొడుగ్గా, అందంగా ఉంది. యోసేపు సోదరులు వారి తండ్రి వారందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించటం గమనించారు. అందుచేత వారు వారి సోదరుణ్ణి ద్వేషించారు. వాళ్లు యోసేపుతో స్నేహభావంతో మాట్లాడలేదు. ఒకసారి యోసేపుకు ఒక ప్రత్యేకమైన కల వచ్చింది. తర్వాత ఈ కల విషయం యోసేపు తన అన్నలతో చెప్పాడు. దీని తర్వాత అతని అన్నలు అతణ్ణి మరింతగా ద్వేషించారు. “నాకో కల వచ్చింది, మనమంతా పొలంలో పని చేస్తున్నాం. మనం గోధుమ పనలు కడ్తున్నాం. నా పన నిలబడింది, దాని చుట్టూ మీ పనలు లేచి నిలబడ్డాయి. అప్పుడు మీ పనలన్నీ నా పనకు సాష్టాంగపడ్డాయి” అని చెప్పాడు యోసేపు. అతని సోదరులు, “అంటే మా మీద నీవు రాజువై అధికారం చేస్తావా?” అని అడిగారు. వారిని గూర్చి యోసేపుకు వస్తోన్న కలల మూలంగా ఇప్పుడు వారు అతణ్ణి ఇంకా ఎక్కువగా ద్వేషించారు.
ఆదికాండము 37:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యాకోబు తన తండ్రి పరదేశవాసిగ ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబువంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతోకూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమునుగూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండు వాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కు వగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటె ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతనిమీద పగపెట్టి, అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేక పోయిరి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతనిమీద మరి పగపెట్టిరి. అతడు వారినిచూచి–నేను కనిన యీ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి; నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పెను. అందుకతని సహోదరులు– నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా? మామీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలనుబట్టియు అతని మాటలనుబట్టియు అతనిమీద మరింత పగపెట్టిరి.
ఆదికాండము 37:1-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యాకోబు తన తండ్రి ప్రవాసమున్న కనాను దేశంలో నివసించాడు. యాకోబు వంశావళి వివరాలు ఇవి. యోసేపు పదిహేడు సంవత్సరాల యువకుడు, తన అన్నలతో, తన తండ్రి భార్యలైన బిల్హా జిల్పాల కుమారులతో కలిసి మందలను మేపుతూ ఉండేవాడు. వారు చేసే చెడు పనుల గురించి తండ్రికి చెప్పేవాడు. ఇశ్రాయేలు తన ఇతర కుమారుల కంటే యోసేపును ఎక్కువ ప్రేమించాడు, ఎందుకంటే అతడు తన వృద్ధాప్యంలో పుట్టినవాడు; అతని కోసం ఒక ప్రత్యేకమైన బాగా అలంకరించబడిన అంగీని కుట్టించాడు. తమ తండ్రి అతన్ని తమకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చూసి వారు యోసేపును ద్వేషించారు, అతని క్షేమసమాచారం కూడా అడగలేదు. ఒక రోజు యోసేపుకు ఒక కల వచ్చింది, అది తన అన్నలకు చెప్పినప్పుడు వారతన్ని మరీ ఎక్కువగా ద్వేషించారు. అతడు వారితో, “నాకు వచ్చిన కలను వినండి: మనం పొలంలో వరి పనలు కడుతున్నాము, అప్పుడు అకస్మాత్తుగా నా పన లేచి నిలబడింది, నా పన చుట్టూ మీ పనలు చేరి సాష్టాంగపడ్డాయి” అని చెప్పాడు. అతని అన్నలు అతనితో, “నీవు మమ్మల్ని ఏలాలి అనుకుంటున్నావా? నిజంగా మమ్మల్ని ఏలుతావా?” అని అన్నారు. అతని కలను బట్టి వారు అతన్ని ఇంకా ద్వేషించారు.