ఆదికాండము 34:1-12

ఆదికాండము 34:1-12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యాకోబు లేయాలకు పుట్టిన కుమార్తెయైన దీనా ఆ దేశంలోని యువతులను దర్శించడానికి వెళ్లింది. ఆ ప్రాంత పాలకుడు, హివ్వీయుడైన హమోరు కుమారుడైన షెకెము ఆమెను చూశాడు, ఆమెను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతడు యాకోబు కుమార్తె దీనాపై మనస్సు పడ్డాడు; ఆ యువతిని అతడు ప్రేమించాడు, ఆమెతో ప్రేమగా మాట్లాడాడు. షెకెము తన తండ్రి హమోరుతో, “ఈ అమ్మాయిని నాకు భార్యగా చేయండి” అని అన్నాడు. యాకోబు తన కుమార్తెయైన దీనా మానభంగం చేయబడి అపవిత్రమైనది అని విన్నప్పుడు, అతని కుమారులు తన మందతో పొలంలో ఉన్నారు; కాబట్టి వారు ఇంటికి వచ్చేవరకు అతడు ఏమి చేయలేదు. అప్పుడు షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడడానికి వెళ్లాడు. ఇంతలో యాకోబు కుమారులు జరిగిన సంగతి విన్న వెంటనే పొలాల నుండి వచ్చేశారు. ఇశ్రాయేలులో జరగకూడని దారుణమైన సంఘటన, యాకోబు కుమార్తెను షెకెము బలత్కారం చేశాడని వారు ఆశ్చర్యానికి గురై ఆగ్రహంతో ఉన్నారు. కానీ హమోరు వారితో, “నా కుమారుడు షెకెము మీ కుమార్తె మీద మనస్సు పడ్డాడు. దయచేసి ఆమెను అతనికి భార్యగా ఇవ్వండి. మనం వియ్యమందుకుందాం; మీ కుమార్తెలను మాకు, మా కుమార్తెలను మీకు ఇచ్చి పుచ్చుకుందాము. మీరు మాతో నివసించవచ్చు, ఈ దేశం మీ ఎదుట ఉంది. ఇక్కడ ఉండండి, వ్యాపారం చేయండి, ఆస్తి సంపాదించండి” అని అన్నాడు. తర్వాత షెకెము దీనా తండ్రితో, సోదరులతో, “మీ దృష్టిలో నేను దయ పొందితే మీరు ఏది అడిగినా నేను ఇస్తాను. వధువు కట్నం, నేను తెచ్చే బహుమానం ఎంతైనా సరే, మీరు అడిగింది నేను ఇస్తాను. యువతిని మాత్రం నాకు భార్యగా ఇవ్వండి” అని అడిగాడు.

ఆదికాండము 34:1-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యాకోబుకు లేయా ద్వారా పుట్టిన కూతురు దీనా. ఆమె ఆ దేశపు యువతులను చూడడానికి బయటికి వెళ్ళింది. ఆ దేశపు రాజు, హివ్వీయుడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకుని, బలాత్కారం చేసి చెరిచాడు. అయితే అతడు ఆమెపై మనసు పడ్డాడు. ఆమెని ప్రేమించి ఆమెతో ఇష్టంగా మాట్లాడాడు. షెకెము తన తండ్రి హమోరును “ఈ అమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చెయ్యి” అని అడిగాడు. అతడు తన కూతురిని చెరిచిన సంగతి యాకోబు విన్నాడు. తన కుమారులు పశువులతో పొలంలో ఉండడం వలన వారు వచ్చే వరకూ నెమ్మదిగా ఉన్నాడు. షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడడానికి అతని దగ్గరికి వచ్చాడు. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలం నుండి తిరిగి వచ్చారు. అతడు యాకోబు కూతురును మానభంగం చేసి ఇశ్రాయేలు ప్రజలను కించపరిచాడు. అది చేయకూడని పని కాబట్టి అది వారికి చాలా అవమానకరంగా ఉంది. వారికి చాలా కోపం వచ్చింది. అప్పుడు హమోరు వారితో “షెకెము అనే నా కొడుకు మీ కూతురిపై మనసు పడ్డాడు. దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్ళి చేయండి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకుని మాతో వియ్యం కలుపుకుని మా మధ్య నివసించండి. ఈ దేశం మీ ఎదుట ఉంది. మీరు ఇందులో నివసించి వ్యాపారాలు చేసి ఆస్తి సంపాదించుకోండి” అని చెప్పాడు. అతడింకా “నామీద దయ చూపండి. మీరేమి అడుగుతారో దాన్ని నేనిస్తాను. ఓలి గానీ, కట్నం గానీ ఎంతైనా అడగండి. మీరు అడిగినంతా ఇస్తాను. ఆ యువతిని మాత్రం నాకు ఇవ్వండి” అని ఆమె తండ్రితో, సోదరులతో చెప్పాడు.

ఆదికాండము 34:1-12 పవిత్ర బైబిల్ (TERV)

యాకోబు లేయాల కుమార్తె దీనా. ఒక రోజు, ఆ ఊరి స్త్రీలను చూడాలని దీనా బయటకు వెళ్లింది. ఆ దేశం రాజైన హమోరు కుమారుడు షెకెము దీనాను చూశాడు. అతడు ఆమెను బంధించి, బలవంతంగా ఆమెతో శయనించాడు. షెకెము దీనాను ప్రేమించాడు. ఆమె తనను పెళ్లి చేసుకునేలా ఒప్పించేందుకు ఆమెతో మాట్లాడాడు. “నేను పెళ్లి చేసుకోవటానికి దయచేసి ఈ అమ్మాయినే తెచ్చి పెట్టమని” షెకెము తన తండ్రితో చెప్పాడు. ఆ యువకుడు తన కూతురికి చేసిన దుష్కార్యాన్ని గూర్చి యాకోబు విన్నాడు. అయితే యాకోబు కుమారులంతా పశువులతోబాటు పొలాల్లో ఉన్నారు. అందుచేత వాళ్లు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు యాకోబు ఏమీ చేయలేదు. అదే సమయంలో షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడేందుకు వెళ్లాడు. జరిగినదాన్ని గూర్చి యాకోబు కుమారులకు పొలంలోనే తెలిసింది. ఇది విని వాళ్లకు చాలా కోపం వచ్చింది. యాకోబు కూతురుతో షెకెము శయనించి, ఇశ్రాయేలీయుల వంశానికి అవమానం తెచ్చాడు గనుక వారికి పిచ్చి కోపం రెచ్చిపోయింది. షెకెము చాలా చెడ్డపని చేశాడు కనుక ఆ సోదరులంతా పొలాలనుండి వచ్చేశారు. అయితే హమోరు ఆ సోదరులతో మాట్లాడాడు. “నా కుమారుడు షెకెముకు దీనా కావాలని ఉంది. దయచేసి వాడిని ఆమెను పెళ్లి చేసుకోనివ్వండి. మనకు ఒక ప్రత్యేక ఒడంబడిక ఉన్నట్లు ఈ వివాహం వ్యక్తం చేస్తుంది. అప్పుడు మా మగవాళ్లు మీ అమ్మాయిలను, మీ మగవాళ్లు మా అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు. ఈ దేశంలోనే మీరు కూడ మాతో కలిసి ఉండవచ్చును. భూమిని స్వంతం చేసుకొనేందుకు, వ్యాపారం చేసేందుకు ఇక్కడ మీకు స్వేచ్ఛ ఉంటుంది” అన్నాడు. షెకెము కూడ యాకోబుతోను, దీనా అన్నదమ్ములతో మాట్లాడాడు. షెకెము అన్నాడు: “దయచేసి నన్ను స్వీకరించండి, నేను చేసిన దాని విషయంలో నన్ను క్షమించండి. మీరు నన్నేమి చేయమంటే అది చేస్తా. మీరు నన్ను దీనాను పెళ్లి చేసుకోనిస్తే, మీరు కోరిన కన్యాశుల్కం మీకు ఇస్తా. మీరు ఏమి అడిగితే అది ఇస్తా కాని దీనాను నన్ను పెళ్లాడనివ్వండి.”

ఆదికాండము 34:1-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

లేయా యాకోబునకు కనిన కుమార్తెయైన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్లెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తెయైన దీనా మీదనే ఉండెను; అతడు ఆ చిన్నదాని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి ఈ చిన్నదాని నాకు పెండ్లిచేయుమని తన తండ్రియైన హమోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని, తన కుమారులు పశువులతో పొలములలోనుండినందునవారు వచ్చువరకు ఊరకుండెను. షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాటలాడుటకు అతనియొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములోనుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను; అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపమువచ్చెను. అప్పుడు హమోరు వారితో–షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తెమీదనే ఉన్నది; దయచేసి ఆమెను అతని కిచ్చి పెండ్లిచేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యమంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ యెదుట ఉన్నది; ఇందులో మీరు నివసించి వ్యాపారముచేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను. మరియు షెకెము–మీ కటాక్షము నామీద రానీయుడి; మీరేమి అడుగుదురో అది యిచ్చెదను. ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి; మీరు అడిగినంత యిచ్చెదను; మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోను ఆమె సహోదరులతోను చెప్పెను.