ఆదికాండము 31:40-44
ఆదికాండము 31:40-44 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేనెలా ఉన్నానో చూడు, పగలు ఎండకీ రాత్రి మంచుకూ క్షీణించిపోయాను. నా కళ్ళకి నిద్ర అనేదే లేకుండా పోయింది. నీ ఇద్దరు కూతుళ్ళకోసం పద్నాలుగు సంవత్సరాలూ నీ మంద కోసం ఆరు సంవత్సరాలూ మొత్తం ఇరవై సంవత్సరాలు నీకు సేవ చేస్తూ నీ ఇంట్లో ఉన్నాను. అయినా నువ్వు నా జీతం పదిసార్లు మార్చావు. నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను తప్పకుండా ఖాళీ చేతులతోనే వెళ్ళగొట్టి ఉండేవాడివి. దేవుడు నా ప్రయాసనీ నా చేతుల కష్టాన్నీ చూశాడు. అందుకే గత రాత్రి నిన్ను గద్దించాడు” అని అన్నాడు. అందుకు లాబాను “ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడేదంతా నాదే. ఈ నా కుమార్తెలనైనా, వీరికి పుట్టిన కొడుకులనైనా నేనేం చేయగలను? కాబట్టి నువ్వూ నేనూ ఒక నిబంధన చేసుకుందాం రా. అది నాకూ, నీకూ మధ్య సాక్షిగా ఉంటుంది” అని యాకోబుతో అన్నాడు.
ఆదికాండము 31:40-44 పవిత్ర బైబిల్ (TERV)
పగలు ఎండకు నా బలం క్షీణించింది. రాత్రి చలి మూలంగా నా కన్నులకు నిద్ర దూరమయింది. 20 సంవత్సరాలు ఒక బానిసలా నేను నీకు పని చేశాను. నీ కుమార్తెలను సంపాదించుకోవటానికి మొదట 14 సంవత్సరాలు నేను నీకు పని చేశాను. తర్వాత ఆరు సంవత్సరాలు నీ జంతువుల్ని సంపాదించటంకోసం పని చేశాను. ఆ కాలంలో నా జీతాన్ని నీవు పదిసార్లు మార్చావు. అయితే నా పూర్వీకుల దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడే గనుక నాకు తోడుగా లేకపోతే, నీను నన్ను వట్టి చేతులతో పంపి ఉండేవాడివి. కాని నా కష్టాలను దేవుడు చూశాడు. నేను చేసిన పనిని దేవుడు చూశాడు. నాదే సరి అని గతరాత్రి దేవుడు రుజువు చేశాడు.” యాకోబుతో లాబాను చెప్పాడు: “ఈ అమ్మాయిలు నా కుమార్తెలు. వారి పిల్లలు నాకు చెందినవాళ్లు. ఈ జంతువులన్నీ నావే. ఇక్కడ నీకు కనబడుతోన్న సమస్తం నాదే. అయినప్పటికీ నా కుమార్తెలను, వారి పిల్లలను నా దగ్గర ఉంచుకొనేందుకు నేను చేయగలిగింది ఏమీ లేదు. కనుక నీతో ఒడంబడిక చేసుకొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మనకు ఒడంబడిక ఒకటి కుదిరిందని సూచించేందుకు మనం ఇక్కడ ఒక రాళ్ల కుప్ప వేద్దాం.”
ఆదికాండము 31:40-44 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూర మాయెను. ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలు గేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను. అందుకు లాబాను–ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది, ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసికొందము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా
ఆదికాండము 31:40-44 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నా పరిస్థితి ఇది: పగలు ఎండ రాత్రి చలి నన్ను క్షీణింపజేశాయి, నిద్ర నా కళ్ళకు దూరమైంది. నీ ఇంట్లో ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలా ఉండేది. నీ ఇద్దరు కుమార్తెల కోసం పద్నాలుగు సంవత్సరాలు, నీ మంద కోసం ఆరు సంవత్సరాలు పని చేశాను, అయితే నీవు పదిసార్లు నా జీతం మార్చావు. ఒకవేళ నా తండ్రి యొక్క దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడే దేవుడు నాకు తోడుగా లేకపోతే, నీవు నన్ను ఖచ్చితంగా ఖాళీ చేతులతో పంపియుండేవాడివి. కానీ దేవుడు నా ప్రయాసను, నా చేతి కష్టాన్ని చూశారు, గత రాత్రి నిన్ను గద్దించారు.” లాబాను యాకోబుతో, “ఈ స్త్రీలు నా కుమార్తెలు, పిల్లలు నా పిల్లలు, మందలు నా మందలు. అయినా ఇప్పుడు ఈ నా కుమార్తెల గురించి, లేదా వారు కన్న పిల్లల గురించి నేనేమి చేయగలను? ఇప్పుడు రా, మనం నిబంధన చేసుకుందాము. అది మనిద్దరి మధ్య సాక్ష్యంగా ఉంటుంది” అని అన్నాడు.