ఆదికాండము 30:37-43

ఆదికాండము 30:37-43 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యాకోబు గంగ రావి, బాదం, సాల చెట్ల చువ్వలు తీసుకు ఆ చువ్వల్లో తెల్లచారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచాడు. మందలు నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టడం కోసం అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు తాగడానికి వచ్చే కాలవల్లో, నీటి గాళ్ళలో, వాటి ముందు పెట్టాడు. అప్పుడు ఆ మందలు ఆ చువ్వల ముందు చూలు కట్టి చారలు, పొడలు, మచ్చలు గల పిల్లలను ఈనాయి. యాకోబు ఆ గొర్రెపిల్లలను వేరుచేసి, చారలుగల వాటి వైపుకు, లాబాను మందల్లో నల్లని వాటి వైపుకు మందల ముఖాలు తిప్పి తన మందలను లాబాను మందలతో ఉంచకుండా వాటిని వేరుగా ఉంచాడు. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లా అవి ఆ చువ్వల ముందు చూలు కట్టే విధంగా యాకోబు మందకు ఎదురుగా కాలవల్లో ఆ చువ్వలు పెట్టాడు. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. ఆ విధంగా బలహీనమైనవి లాబానుకూ బలమైనవి యాకోబుకూ వచ్చాయి. ఆ విధంగా ఆ మనిషి అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసదాసీలు, ఒంటెలు, గాడిదలు గలవాడయ్యాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 30

ఆదికాండము 30:37-43 పవిత్ర బైబిల్ (TERV)

కనుక బూరగ, బాదం అను చెట్ల పచ్చటి కొమ్మలు యాకోబు నరికాడు. ఆ చువ్వల పైబెరడును అక్కడక్కడ యాకోబు తీసివేసినందువల్ల వాటి మీద తెల్ల చారలు కనబడుతున్నాయి. నీళ్లు త్రాగే స్థలాల్లో మందల ముందు యాకోబు ఆ చువ్వలను ఉంచాడు. ఆ జంతువులు నీళ్లు త్రాగటానికి వచ్చినప్పుడు, అక్కడే అవి కలిసేవి. ఆ చువ్వల ముందర మేకలు చూలు కట్టినప్పుడు మచ్చలు, చారలు, నలుపుగల పిల్లలు వాటికి పుట్టాయి. మచ్చలు, నలుపు ఉన్న జంతువులను మిగతా జంతువులనుండి యాకోబు వేరుచేశాడు. యాకోబు తన జంతువులను లాబాను జంతువులనుండి వేరుగా ఉంచాడు. మందలోని బలమైన జంతువులు ఎదైనప్పుడల్లా యాకోబు ఆ చువ్వలను వాటి కళ్లముందు ఉంచాడు. ఆ కొమ్మల దగ్గర ఆ జంతువులు చూలు కట్టేవి. అయితే ఒక్కటి, బలహీనమైన జంతువులు ఎదైనప్పుడు యాకోబు ఆ కొమ్మలను అక్కడ పెట్టలేదు. కనుక బలహీనమైన జంతువులకు పుట్టిన పిల్లలన్నీ లాబానువే. బలమైన జంతువులకు పుట్టిన పిల్లలన్నీ యాకోబువి. ఈ విధంగా యాకోబు చాలా ధనికుడయ్యాడు. పెద్ద మందలు, చాలా మంది సేవకులు, ఒంటెలు, గాడిదలు అతనికి ఉన్నాయి.

షేర్ చేయి
Read ఆదికాండము 30

ఆదికాండము 30:37-43 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసికొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్లగాళ్లలోను వాటియెదుట పెట్టగా మందలు ఆ చువ్వల యెదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. యాకోబు ఆ గొఱ్ఱెపిల్లలను వేరుచేసి, చారలుగల వాటితట్టును లాబాను మందలలో నల్లని వాటితట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల యెదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల యెదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను. ఆప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధిపొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను.

షేర్ చేయి
Read ఆదికాండము 30

ఆదికాండము 30:37-43 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అయితే యాకోబు చినారు, బాదం, సాలు అనే చెట్ల కొమ్మలను తీసుకుని ఆ కొమ్మల్లో తెల్లచారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలను ఒలిచాడు. తర్వాత అతడు మందలు నీళ్లు త్రాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టాలని ఒలిచిన కొమ్మలను వాటి ఎదురుగా ఉండేలా నీళ్లగాళ్లలో పెట్టాడు. మందలు వేడి మీద ఉన్నప్పుడు నీళ్లు త్రాగడానికి వచ్చాయి. అక్కడ అవి ఆ కొమ్మల ముందు చూలు కట్టి చారలు, మచ్చలు, పొడలు ఉన్న పిల్లలను ఈనాయి. యాకోబు మందలో చిన్నవాటిని వేరు చేశాడు, కానీ మిగితా వాటిని లాబాను మందలోని చారలు ఉన్నవాటి వైపు, నల్లనివాటివైపు వాటి ముఖాలు త్రిప్పి ఉంచాడు. ఇలా తన కోసం వేరే మందను చేసుకున్నాడు, వాటిని లాబాను మందలతో కలపలేదు. మందలలో బలమైన ఆడవి వేడి మీద ఉన్నప్పుడు, అవి కొమ్మల దగ్గర చూలు కట్టేలా యాకోబు ఆ కొమ్మలను వాటికి ఎదురుగా నీటి తొట్టిలో పెట్టేవాడు. ఒకవేళ పశువులు బలహీనంగా ఉంటే, వాటిని అక్కడ పెట్టేవాడు కాదు. కాబట్టి బలహీనమైనవి లాబానుకు వెళ్లాయి, బలమైనవి యాకోబుకు వచ్చాయి. ఈ విధంగా యాకోబు ఎంతో అభివృద్ధి చెందాడు, గొప్ప మందలను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను సొంతం చేసుకున్నాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 30