ఆదికాండము 3:8-21
ఆదికాండము 3:8-21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు ఆ రోజు చల్లని సమయంలో యెహోవా దేవుడు తోటలో నడుస్తున్న శబ్దం విని, ఆదాము అతని భార్య యెహోవా దేవునికి కనబడకూడదని తోట చెట్ల మధ్య దాక్కున్నారు. అప్పుడు యెహోవా దేవుడు ఆదామును పిలిచి, “నీవెక్కడున్నావు?” అని అడిగారు. అతడు, “తోటలో మీ శబ్దం విని, నేను దిగంబరిగా ఉన్నానని భయపడ్డాను; అందుకే నేను దాక్కున్నాను” అని జవాబిచ్చాడు. అప్పుడు దేవుడు, “నీవు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినకూడదని నేను మీకు ఆజ్ఞాపించిన ఆ చెట్టు నుండి పండు తిన్నావా?” అని అడిగారు. అందుకు ఆదాము, “మీరు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ చెట్టు పండును కొంచెం నాకిచ్చింది, నేను తిన్నాను” అని చెప్పాడు. అప్పుడు యెహోవా దేవుడు స్త్రీని, “నీవు చేసిన ఈ పనేంటి?” అని అడిగారు. అందుకు ఆ స్త్రీ జవాబిస్తూ, “సర్పం మాటలకు మోసపోయి నేను తిన్నాను” అని చెప్పింది. అందుకు యెహోవా దేవుడు సర్పంతో, “నీవు ఇలా చేశావు కాబట్టి, “అన్ని రకాల పశువుల్లోను, అడవి జంతువులన్నిటిలోనూ నీవు శపించబడ్డావు! నీవు బ్రతుకు దినాలన్ని నీ పొట్టతో ప్రాకుతావు, మన్ను తింటావు. నేను నీకు స్త్రీకి మధ్య, నీ సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య శత్రుత్వం కలుగజేస్తాను; అతడు నీ తలను చితకగొడతాడు, నీవు అతని మడిమె మీద కాటేస్తావు” అని అన్నారు. తర్వాత దేవుడు స్త్రీతో ఇలా అన్నారు, “నీకు ప్రసవ వేదన అధికం చేస్తాను; తీవ్రమైన ప్రసవ వేదనతో పిల్లలను కంటావు. నీ వాంఛ నీ భర్త కోసం కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడు.” ఆదాముతో ఆయన ఇలా అన్నారు, “నీవు నీ భార్య మాట విని, ‘తినవద్దు’ అని నేను నీకు చెప్పిన ఆ చెట్టు పండును నీవు తిన్నావు కాబట్టి, “నిన్ను బట్టి ఈ నేల శపించబడింది; నీ జీవితకాలమంతా దాని పంట నుండి, కష్టపడి పని చేసి తింటావు. భూమి నీకోసం ముళ్ళ కంపలను గచ్చపొదలను మొలిపిస్తుంది, నీవు పొలం లోని పంటను తింటావు. నీవు మట్టి నుండి తీయబడ్డావు కాబట్టి నీవు మట్టికి చేరేవరకు, నీ నుదిటి మీద చెమట కార్చి నీ ఆహారాన్ని తింటావు నీవు మట్టివి కాబట్టి తిరిగి మన్నై పోతావు.” ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు, ఎందుకంటే ఆమె జీవంగల వారందరికి తల్లి. యెహోవా దేవుడు ఆదాముకు అతని భార్యకు జంతు చర్మంతో చేసిన వస్త్రాలను తొడిగించారు.
ఆదికాండము 3:8-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సాయంత్రం చల్లబడిన తరువాత ఆ తోటలో దేవుడైన యెహోవా నడుస్తున్న శబ్ధం వాళ్ళు విన్నారు. ఆదాము, అతని భార్య దేవుడైన యెహోవాకు ఎదురు పడకుండా తోటలో చెట్ల మధ్య దాక్కున్నారు. దేవుడైన యెహోవా ఆదామును పిలుస్తూ “నువ్వెక్కడ ఉన్నావు?” అన్నాడు. అతడు “నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు నగ్నంగా ఉన్నాను గనక భయపడి దాక్కున్నాను” అన్నాడు. దేవుడు “నువ్వు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినొద్దని నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావా?” అన్నాడు. ఆదాము “నాతో ఉండడానికి నువ్వు నాకిచ్చిన స్త్రీ నాకు ఆ చెట్టు పండు ఇచ్చింది. అప్పుడు నేను దాన్ని తిన్నాను” అన్నాడు. దేవుడైన యెహోవా స్త్రీతో “నువ్వు చేసిందేమిటి?” అన్నాడు. స్త్రీ “సర్పం నన్ను మోసం చేసిన కారణంగా నేను తిన్నాను” అంది. అందుకు దేవుడైన యెహోవా పాముతో “నువ్వు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో, జంతువులన్నిటిలో నిన్ను మాత్రమే శపిస్తున్నాను. నువ్వు నీ కడుపుతో పాకుతూ వెళ్తావు. బ్రతికినంత కాలం మట్టి తింటావు. నీకూ స్త్రీకీ నీ సంతానానికీ ఆమె సంతానానికీ మధ్య శత్రుత్వం ఉండేలా చేస్తాను. అతడు నిన్ను తలమీద కొడతాడు. నువ్వు అతన్ని మడిమె మీద కొడతావు” అన్నాడు. ఆయన స్త్రీతో “పిల్లలను కనేటప్పుడు నీకు కలిగే బాధ అనేక రెట్లు పెంచుతున్నాను. నీ భర్తపై నువ్వు వాంఛ కలిగి ఉంటావు. అతడు నిన్ను ఏలుతాడు” అని చెప్పాడు. ఆయన ఆదాముతో “నువ్వు నీ భార్య మాట విని ‘తినొద్దు’ అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావు గనుక నిన్నుబట్టి నేల శాపానికి గురయ్యింది. జీవితకాలమంతా కష్టం చేసి నువ్వు దాని పంట తింటావు. నువ్వు ఎంత కష్టం చేసినా నేల ముళ్ళ తుప్పలను, ముళ్ళ పొదలనే మొలిపిస్తుంది. నువ్వు పొలంలో పండించిన పంట తింటావు. నువ్వు మట్టికి తిరిగి చేరే వరకూ చెమటోడ్చి ఆహారం తింటావు. ఎందుకంటే నిన్ను తీసింది మట్టిలోనుంచే. నువ్వు మట్టే గనుక మళ్ళీ మట్టి అయిపోతావు” అని చెప్పాడు. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఎందుకంటే జీవులందరికీ ఆమే అమ్మ. దేవుడైన యెహోవా ఆదాముకు అతని భార్యకు జంతు చర్మంతో బట్టలు చేసి తొడిగించాడు.
ఆదికాండము 3:8-21 పవిత్ర బైబిల్ (TERV)
సాయంకాలపు చల్లని వేళలో యెహోవా దేవుడు ఆ తోటలో నడుస్తుండగా ఆ పురుషుడు, స్త్రీ ఆ చప్పుడు విని, తోటలోని చెట్లమధ్య దాగుకొన్నారు. యెహోవా దేవుని నుండి దాగుకొనేందుకు వారు ప్రయత్నించారు. అయితే యెహోవా దేవుడు ఆ పురుషుని పిలిచాడు. “నీవు ఎక్కడున్నావు?” అన్నాడు యెహోవా. “నీవు తోటలో నడుస్తున్న చప్పుడు విన్నాను, నాకు భయం వేసింది. నేను నగ్నంగా ఉన్నాను, అందుకే దాగుకొన్నాను” అన్నాడు ఆ పురుషుడు. దేవుడు ఆ పురుషునితో ఇలా అన్నాడు. “నీవు నగ్నంగా ఉన్నావని నీతో ఎవరు చెప్పారు? నిన్ను సిగ్గుపడేటట్లు చేసింది ఏమిటి? నేను తినవద్దని చెప్పిన పండు నీవు తిన్నావా ఏమిటి? ఆ చెట్టు ఫలం తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించానుగదా!” అందుకు ఆ పురుషుడు, “నా కోసం నీవు చేసిన ఈమె ఆ చెట్టు ఫలాన్ని నాకిచ్చింది, అందుచేత నేను తిన్నాను” అన్నాడు. అప్పుడు యెహోవా దేవుడు, “ఏమిటి నీవు చేసింది?” అన్నాడు ఆ స్త్రీతో. ఆ స్త్రీ, “సర్పం నన్ను మోసం చేసింది. నన్ను వెర్రిదాన్ని చేస్తే నేను ఆ పండు తినేశాను” అని చెప్పింది. అందుచేత యెహోవా దేవుడు సర్పంతో ఇలా అన్నాడు: “ఈ మహా చెడ్డ పని నీవే చేశావు కనుక నీవు శపించబడ్డావు. జంతువులన్నిటి కంటే నీ పరిస్థితి హీనంగా ఉంటుంది. నీవు నీ పొట్టతో పాకడం తప్పనిసరౌతుంది. నీవు జీవిత కాలమంతా మట్టి తింటావు. ఈ స్త్రీని, నిన్ను ఒకరికొకర్ని విరోధుల్నిగా నేను చేస్తాను. నీ సంతానము, ఆమె సంతానము ఒకరికొకరు విరోధులవుతారు. నీవు ఆమె శిశువు పాదం మీద కాటేస్తావు ఈ శిశువు నీ తలను చితుక కొడతాడు.” అప్పుడు స్త్రీతో యెహోవా దేవుడు ఇలా అన్నాడు: “నీవు గర్భవతిగా ఉన్నప్పుడు నేను నీకు బహు ప్రయాస కలుగజేస్తాను. నీవు పిల్లల్ని కనేటప్పుడు మహా గొప్ప బాధ నీకు కలుగుతుంది. నీవు నీ భర్తను వాంఛిస్తావు కాని అతడే నిన్ను ఏలుతాడు.” అప్పుడు పురుషునితో దేవుడు ఈలాగు అన్నాడు: “ప్రత్యేకమైన చెట్టుఫలాన్ని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించాను. అయితే నీవు నీ భార్య చెప్పిన మాటలు విన్నావు. ఆ చెట్టు ఫలాన్ని తిన్నావు. కనుక నీ మూలంగా భూమిని నేను శపిస్తాను. భూమి ఇచ్చే ఆహారం కోసం నీవు నీ జీవితాంతం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. పొలంలో పండే మొక్కల్ని నీవు తినాలని అనుకొంటావు కాని ముళ్లను, పొదలను నేల నీకోసం పండిస్తుంది. నీ భోజనం కోసం నీవు చాలా కష్టపడి పని చేస్తావు. నీ ముఖం అంతా చెమటతో నిండి పోయేంతగా నీవు పని చేస్తావు. నీవు చనిపోయే రోజు వరకు కష్టపడి పని చేస్తావు మరణించాక నీవు మరలా మట్టి అయిపోతావు. నేను నిన్ను చేసినప్పుడు మట్టిలో నుంచే నీవు తీయబడ్డావు మళ్లీ నీవు చనిపోయినప్పుడు తిరిగి మట్టిలోనే కలిసిపోతావు.” ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఎన్నడైనా సరే, బ్రతికిన ప్రతి మనిషికి ఈమె తల్లి కనుక ఆయన ఆమెకు ఆ పేరు పెట్టాడు. యెహోవా దేవుడు జంతు చర్మాలతో ఆ పురుషునికి, అతని భార్యకు చొక్కాలు చేశాడు. ఆ తరువాత ఆ చొక్కాలను వారికి తొడిగించాడు.
ఆదికాండము 3:8-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్లమధ్యను దాగు కొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి– నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు–నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయపడి దాగుకొంటిననెను. అందుకాయన–నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను. అందుకు ఆదాము–నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో–నీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీ–సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిననెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువు లన్నిటిలోను నీవు శపించ బడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నియు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో–నీవు నీ భార్యమాట విని–తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు; నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను.