ఆదికాండము 3:6-10
ఆదికాండము 3:6-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నాం అని గ్రహించి అంజూరపు ఆకులు కలిపి కుట్టి ఒళ్ళు కప్పుకునేవి తయారు చేసుకున్నారు. సాయంత్రం చల్లబడిన తరువాత ఆ తోటలో దేవుడైన యెహోవా నడుస్తున్న శబ్ధం వాళ్ళు విన్నారు. ఆదాము, అతని భార్య దేవుడైన యెహోవాకు ఎదురు పడకుండా తోటలో చెట్ల మధ్య దాక్కున్నారు. దేవుడైన యెహోవా ఆదామును పిలుస్తూ “నువ్వెక్కడ ఉన్నావు?” అన్నాడు. అతడు “నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు నగ్నంగా ఉన్నాను గనక భయపడి దాక్కున్నాను” అన్నాడు.
ఆదికాండము 3:6-10 పవిత్ర బైబిల్ (TERV)
ఆ చెట్టు చాలా అందంగా ఉన్నట్లు ఆ స్త్రీ చూసింది; ఆ ఫలం తినటానికి మంచిదిగా ఉన్నట్లు, ఆ చెట్టు తెలివినిస్తుందని ఆమె తెలుసుకొంది. కనుక ఆ స్త్రీ ఆ చెట్టు ఫలం తీసుకొని దానిని తిన్నది. ఆ పండులో కొంత ఆమె భర్తకు ఇచ్చింది, అతడు కూడా దాన్ని తిన్నాడు. అప్పుడు ఆ పురుషుడు, స్త్రీ ఇద్దరూ మారిపోయారు. వారి కళ్లు తెరవబడ్డట్లు వారికి అన్నీ వేరుగా కనబడ్డాయి. వారికి బట్టలు లేనట్లు, నగ్నంగా ఉన్నట్లు వాళ్లు చూశారు. కనుక వారు అంజూరపు ఆకులను కుట్టి వాటినే బట్టలుగా ధరించారు. సాయంకాలపు చల్లని వేళలో యెహోవా దేవుడు ఆ తోటలో నడుస్తుండగా ఆ పురుషుడు, స్త్రీ ఆ చప్పుడు విని, తోటలోని చెట్లమధ్య దాగుకొన్నారు. యెహోవా దేవుని నుండి దాగుకొనేందుకు వారు ప్రయత్నించారు. అయితే యెహోవా దేవుడు ఆ పురుషుని పిలిచాడు. “నీవు ఎక్కడున్నావు?” అన్నాడు యెహోవా. “నీవు తోటలో నడుస్తున్న చప్పుడు విన్నాను, నాకు భయం వేసింది. నేను నగ్నంగా ఉన్నాను, అందుకే దాగుకొన్నాను” అన్నాడు ఆ పురుషుడు.
ఆదికాండము 3:6-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమై నదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొనితిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడ తినెను; అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్లమధ్యను దాగు కొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి– నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు–నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయపడి దాగుకొంటిననెను.
ఆదికాండము 3:6-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
స్త్రీ ఆ చెట్టు పండు తినడానికి మంచిది, చూడటానికి బాగుంది, తింటే జ్ఞానం వస్తుందని తలంచి, దానిలో కొంచెం తిని, తన భర్తకు కూడా ఇచ్చింది, అతడు కూడా తిన్నాడు. అప్పుడు వారి ఇద్దరి కళ్లు తెరవబడి తాము నగ్నంగా ఉన్నారని గ్రహించి, తమ శరీరాలను కప్పుకోడానికి అంజూర ఆకులు అల్లుకొన్నారు. అప్పుడు ఆ రోజు చల్లని సమయంలో యెహోవా దేవుడు తోటలో నడుస్తున్న శబ్దం విని, ఆదాము అతని భార్య యెహోవా దేవునికి కనబడకూడదని తోట చెట్ల మధ్య దాక్కున్నారు. అప్పుడు యెహోవా దేవుడు ఆదామును పిలిచి, “నీవెక్కడున్నావు?” అని అడిగారు. అతడు, “తోటలో మీ శబ్దం విని, నేను దిగంబరిగా ఉన్నానని భయపడ్డాను; అందుకే నేను దాక్కున్నాను” అని జవాబిచ్చాడు.