ఆదికాండము 20:1-18

ఆదికాండము 20:1-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అబ్రాహాము అక్కడినుండి దక్షిణాదికి ప్రయాణం చేసి కాదేషుకు, షూరుకు మధ్య నివాసం ఉన్నాడు. కొంతకాలం గెరారులో ఉన్నాడు. అక్కడ అబ్రాహాము తన భార్య శారాను గురించి, “ఈమె నా చెల్లెలు” అని చెప్పాడు. అప్పుడు గెరారు రాజైన అబీమెలెకు శారాను తన రాజభవనం లోనికి రప్పించుకున్నాడు. అయితే ఆ రాత్రి కలలో దేవుడు అబీమెలెకుకు కనిపించి, “నీవు తీసుకున్న స్త్రీ కారణంగా నీవు చచ్చినట్టే ఎందుకంటే ఆమె ఇంకొకని భార్య” అని చెప్పారు. అబీమెలెకు ఆమెను సమీపించలేదు. కాబట్టి అతడు, “ప్రభువా, మీరు ఒక నిర్దోషులైన జనాన్ని నాశనం చేస్తారా? ‘ఆమె నా సోదరి’ అని అతడు చెప్పలేదా? ‘ఇతడు నా అన్న’ అని ఆమె కూడా చెప్పలేదా? నేను నిర్మలమైన మనస్సాక్షితో నిర్దోషిగా ఉండి దీన్ని చేశాను” అని అన్నాడు. అప్పుడు దేవుడు అతనితో కలలో ఇలా అన్నారు, “అవును, నీవు నిర్మలమైన మనస్సాక్షితో చేశావని నాకు తెలుసు, అందుకే నీవు పాపం చేయకుండా ఆపాను. అందుకే నీవామెను ముట్టుకోకుండా చేశాను. ఇప్పుడు ఆ మనుష్యుని భార్యను తనకు ఇవ్వు, అతడు ప్రవక్త కాబట్టి నీకోసం ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుతావు. ఒకవేళ ఆమెను తిరిగి ఇవ్వకపోతే, నీవు, నీకు సంబంధించిన వారందరు చస్తారు.” మర్నాడు వేకువజామున అబీమెలెకు తన అధికారులను పిలిపించి, వారితో ఏమి జరిగిందో చెప్పాడు, వారు ఎంతో భయపడ్డారు. అప్పుడు అబీమెలెకు అబ్రాహామును పిలిపించి, “నీవు మాకు చేసింది ఏంటి? నీ పట్ల నేను ఏ తప్పు చేశానని ఇంత గొప్ప అపరాధం నాపైన, నా రాజ్యం పైన తెచ్చావు? నీవు నా పట్ల చేసినవి ఎవరు చేయకూడనివి” అని అన్నాడు. అబీమెలెకు, “నీవు ఇలా చేయడానికి కారణమేంటి?” అని అబ్రాహామును అడిగాడు. అందుకు అబ్రాహాము అన్నాడు, “ఈ స్థలంలో దేవుని భయం లేదు, ‘నా భార్యను బట్టి వారు నన్ను చంపేస్తారు’ అని నాలో నేను అనుకున్నాను. అంతేకాదు, ఆమె నిజంగా నా సోదరి, నా తండ్రికి కుమార్తె కాని నా తల్లికి కాదు; ఆమె నా భార్య అయ్యింది. దేవుడు నన్ను నా తండ్రి ఇంటి నుండి తిరిగేలా చేసినప్పుడు, నేను ఆమెతో ఇలా చెప్పాను, ‘మనం వెళ్లే ప్రతిచోటా నా గురించి, “ఈయన నా సోదరుడు” అని చెప్పు, ఇది నా పట్ల నీ ప్రేమ.’ ” అప్పుడు అబీమెలెకు గొర్రెలను, పశువులను, దాసదాసీలను అబ్రాహాముకు ఇచ్చాడు. అబ్రాహాము భార్యయైన శారాను కూడా తిరిగి అప్పగించాడు. అబీమెలెకు, “నా దేశం నీ ఎదుట ఉన్నది; నీకు ఇష్టమైన చోట నీవు నివసించవచ్చు” అన్నాడు. అతడు శారాతో, “నీ అన్నకు వెయ్యి షెకెళ్ళ వెండి ఇస్తున్నాను, ఇది నీతో ఉన్న వారందరి ఎదుట నీకు విరోధంగా చేసిన దానికి నష్టపరిహారం; నీవు పూర్తిగా నిర్దోషివి” అన్నాడు. అప్పుడు అబ్రాహాము దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు అబీమెలెకును, అతని భార్య, అతని ఆడ దాసీలను స్వస్థపరచగా వారు తిరిగి పిల్లలు కన్నారు. ఎందుకంటే యెహోవా అబ్రాహాము భార్య శారాను బట్టి అబీమెలెకు ఇంట్లోని స్త్రీలందరిని పిల్లలు కనలేకుండా చేశారు.

ఆదికాండము 20:1-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అబ్రాహాము అక్కడ నుండి బయలుదేరి దక్షిణదేశానికి తరలి వెళ్ళాడు. అలా కాదేషుకూ, షూరుకూ మధ్య ఉన్న ప్రాంతంలో నివసించాడు. కొంతకాలం గెరారులో పరదేశిగా ఉన్నాడు. అక్కడ అబ్రాహాము తన భార్య శారాను గూర్చి “ఈమె నా చెల్లి” అని చెప్పాడు. కాబట్టి గెరారు రాజైన అబీమెలెకు శారా కోసం తన మనుషులను పంపించాడు. వాళ్ళు శారాను అబీమెలెకు ఇంట్లో చేర్చారు. కాని దేవుడు రాత్రి కలలో అబీమెలెకు దగ్గరికికు కనబడి అతనితో “చూడు, నువ్వు చచ్చినట్టే! ఎందుకంటే నువ్వు నీ ఇంట్లో పెట్టుకున్న స్తీ ఒక వ్యక్తికి భార్య” అని చెప్పాడు. అయితే అబీమెలెకు ఆమె దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి అతడు “ప్రభూ, ఇలాంటి నీతిగల జాతిని చంపివేస్తావా? ‘ఈమె నా చెల్లి’ అని నాతో అతడే చెప్పాడు కదా! ఆమె కూడా ‘అతడు నా అన్న’ అన్నది కదా. నేను నా చేతులతో ఏ దోషమూ చేయలేదు. నిజాయితీగానే ఈ పని చేశాను” అన్నాడు. అందుకు దేవుడు అతనికి కలలో కనబడి “అవును, నువ్వు యథార్థ హృదయంతోనే దీన్ని చేశావని నాకు తెలుసు. నువ్వు నాకు విరోధంగా పాపం చేయకుండా నిన్ను అడ్డుకున్నాను. అందుకే నేను నిన్ను ఆమెను తాకడానికి అనుమతించ లేదు. కాబట్టి ఆ వ్యక్తి భార్యను తిరిగి అతనికప్పగించు. ఎందుకంటే అతడు ప్రవక్త. నువ్వు బతికేలా అతడు నీ కోసం ప్రార్థిస్తాడు. ఒకవేళ నువ్వు ఆమెను తిరిగి అతనికి అప్పగించకపోతే నువ్వూ, నీకు చెందినవారూ తప్పక చనిపోతారు. ఈ సంగతి నువ్వు బాగా తెలుసుకో” అని చెప్పాడు. తెల్లవారకముందే అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించాడు. వారికి ఈ విషయాలన్నీ తెలియజేశాడు. వారంతా అది విని ఎంతో భయపడ్డారు. అబీమెలెకు అబ్రాహాముకు కబురు పెట్టి రప్పించాడు. అతనితో ఇలా అన్నాడు “నువ్వు మాకు చేసినదేమిటి? నాపైనా నా రాజ్యం పైనా ఇంత పెద్ద దోషం వచ్చేలా చేశావు. నేను నీకు చేసిన అపకారం ఏమిటి? నా పట్ల చేయకూడని పని చేశావు” అన్నాడు. అబీమెలెకు అబ్రాహామును చూసి “నువ్వు ఇలా చేయడానికి గల కారణాలేమిటి?” అని అడిగాడు. అబ్రాహాము “ఇక్కడ దేవుని భయం బొత్తిగా లేదు కాబట్టి నా భార్య కోసం నన్ను చంపుతారేమో అన్న భయంతోనే నేనిలా చేసాను అదీకాకుండా ఆమె నాకు చెల్లి అనే మాట కూడా నిజమే. ఆమె నా తండ్రి కూతురు. తల్లి కూతురు కాదు. అలా నాకు భార్య అయింది. దేవుడు నేను నా తండ్రి ఇంటిని వదిలి వివిధ ప్రదేశాలు ప్రయాణాలు చేసేలా పిలిచినప్పుడు నేను ఆమెతో ‘మనం వెళ్ళే ప్రతి స్థలం లోనూ నన్ను గూర్చి అతడు నా అన్న అని చెప్పు. నా కోసం నువ్వు చేయగలిగిన ఉపకారం ఇదే’ అని చెప్పాను” అన్నాడు. అబీమెలెకు గొర్రెలనూ ఎద్దులనూ దాసులనూ దాసీలనూ రప్పించి అబ్రాహాముకు ఇచ్చాడు. తరువాత అతని భార్య అయిన శారాను అతనికి అప్పగించేశాడు. తరువాత అబీమెలెకు “చూడు, నా దేశం అంతా నీ ఎదుట ఉంది. నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకో” అని అబ్రాహాముతో అన్నాడు. తరువాత అతడు శారాతో “చూడు, నీ అన్నకు నేను వెయ్యి వెండి నాణాలు ఇచ్చాను. నీవు నిర్దోషివని నీతో ఉన్నవారందరి ఎదుట ఈడబ్బు రుజువుగా ఉంటుంది. అందరి ఎదుటా నీకు న్యాయం జరిగింది” అన్నాడు. అప్పుడు అబ్రాహాము దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు అబీమెలెకునూ, అతని భార్యనూ అతని దాసీలనూ స్వస్థపరిచాడు. వారు పిల్లలను కనగలిగారు. ఎందుకంటే దేవుడైన యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాను బట్టి అబీమెలెకు ఇంట్లో స్త్రీలందరినీ పూర్తిగా గొడ్రాళ్ళనుగా చేశాడు.

ఆదికాండము 20:1-18 పవిత్ర బైబిల్ (TERV)

అబ్రాహాము ఆ చోటు విడిచి నెగెబుకు ప్రయాణం కట్టాడు. కాదేషుకు, షూరుకు మధ్యనున్న గెరారుకు అబ్రాహాము వెళ్లాడు. గెరారులో ఉన్నప్పుడు శారా తన సోదరి అని అబ్రాహాము ప్రజలతో చెప్పాడు. గెరారు రాజు అబీమెలెకు ఇది విన్నాడు. అబీమెలెకు శారాను ఇష్టపడి, ఆమెను తీసుకుని వచ్చేందుకు కొందరు సేవకుల్ని పంపించాడు. అయితే ఆ రాత్రి దర్శనంలో అబీమెలెకుతో దేవుడు మాట్లాడి, “చూడు, నీవు చస్తావు. నీవు తెచ్చుకొన్న ఆ స్త్రీ వివాహితురాలు” అని చెప్పాడు. కానీ అప్పటికి అబీమెలెకు శారాతో శయనించ లేదు. కనుక అబీమెలెకు, “ప్రభూ, నేను దోషిని కాను. నిర్దోషిని నీవు చంపుతావా? ‘ఈ స్త్రీ నా సోదరి’ అని అబ్రాహాము స్వయంగా నాతో చెప్పాడు. ఆ స్త్రీ కూడా ‘ఈ పురుషుడు నా సోదరుడు’ అని చెప్పింది. నేను నిర్దోషిని. నేను చేస్తున్నది ఏమిటో నాకు తెలియలేదు” అన్నాడు. ఆ దర్శనంలో అబీమెలెకుతో దేవుడు ఇలా చెప్పాడు: “అవును, నాకు తెలుసు, నీవు నిర్దోషివి. నీవు చేస్తున్నది ఏమిటో నీకు తెలియదు అని నాకు తెలుసు. నేను నిన్ను కాపాడాను. నాకు వ్యతిరేకంగా నిన్ను నేను పాపం చేయనీయలేదు. నీవు ఆమెతో శయనించకుండా చేసింది నేనే. కనుక అబ్రాహాము భార్యను తిరిగి అతనికి అప్పగించు. అబ్రాహాము ఒక ప్రవక్త. అతడు నీ కోసం ప్రార్థిస్తాడు, అప్పుడు నీవు బ్రతుకుతావు. కానీ శారాను నీవు తిరిగి అబ్రాహాముకు ఇవ్వకపోతే, నీవు మరణించడం తప్పదు. నీతోబాటు నీ కుటుంబం అంతా మరణిస్తుంది.” కనుక మర్నాడు వేకువనే, అబీమెలెకు తన సేవకులందరినీ పిల్చాడు. దర్శనంలో సంభవించిన సంగతులన్నీ అబీమెలెకు వారితో చెప్పాడు. సేవకులు చాలా భయపడ్డారు. అప్పుడు అబీమెలెకు అబ్రాహామును పిలిచి, అతనితో అన్నాడు: “నీవు మాకు ఎందుకు ఇలా చేశావు? నీకు నేను ఏమి అపకారం చేశాను? ఎందుకలా అబద్ధం చెప్పి, ఆమె నీ సోదరి అన్నావు? నా రాజ్యానికి నీవు చాలా చిక్కు తెచ్చిపెట్టావు. నాకు నీవు ఇలా చేయకుండా ఉండాల్సింది. నీవు దేనికి ఇలా చేశావు?” అందుకు అబ్రాహాము చెప్పాడు: “నేను భయపడ్డాను. దేవుడంటే ఇక్కడ ఎవరికీ భయము లేదని అనుకొన్నాను. శారాను పొందటం కోసం ఎవరైనా నన్ను చంపేస్తారు అనుకొన్నాను. ఆమె నా భార్య, అయితే నా సోదరి కూడాను. ఆమె నా తండ్రి కుమార్తె గాని, నా తల్లి కుమార్తె కాదు. నా తండ్రి ఇంటినుండి దేవుడు నన్ను బయటకు నడిపించాడు. అనేక చోట్ల సంచారం చేసేటట్లు దేవుడు నన్ను నడిపించాడు. అలా జరిగినప్పుడు, ‘నీవు నా సోదరివని ప్రజలతో మనం వెళ్లిన చోటల్లా చెప్పు, నాకు ఈ మేలు చేయి’ అని నేను శారాతో చెప్పాను.” అప్పుడు జరిగిందేమిటో అబీమెలెకు అర్థం చేసుకొన్నాడు. కనుక శారాను అబీమెలెకు తిరిగి అబ్రాహాముకు అప్పగించేశాడు. కొన్ని గొర్రెలు, పశువులు, కొందరు ఆడ, మగ బానిసలను కూడ అబీమెలెకు అబ్రాహాముకు ఇచ్చాడు. మరియు “నీ చుట్టూ చూడు. ఇది నా దేశం. నీకు ఇష్టం వచ్చిన చోట నీవు ఉండవచ్చు” అని అబీమెలెకు అన్నాడు. “చూడు, నీ సోదరుడైన అబ్రాహాముకు 1,000 వెండి నాణెములు ఇచ్చాను. జరిగినవాటి విషయమై నా పశ్చాత్తాపం వ్యక్తం చేయడానికి యిది చేశాను. నేను సక్రమంగా జరిగించినట్లు అందరూ చూడాలని నేను కోరుతున్నాను” అని అబీమెలెకు శారాతో చెప్పాడు. అబీమెలెకు కుటుంబంలోని స్త్రీలను గొడ్రాళ్లుగా చేశాడు యెహోవా. అబ్రాహాము భార్య శారాను అబీమెలెకు తీసుకొన్నందుచేత దేవుడు ఇలా చేశాడు. అయితే అబ్రాహాము ప్రార్థించగా అబీమెలెకును, అతని భార్యను మరియు అతని దాసీలను దేవుడు స్వస్థపరచాడు.

ఆదికాండము 20:1-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అక్కడనుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేషుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను. అప్పుడు అబ్రాహాము తన భార్యయైన శారానుగూర్చి–ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన యింట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి –నీవు నీ యింట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు–ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? –ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడ–అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితిననెను. అందుకు దేవుడు–అవును, యథార్థహృదయముతో దీని చేసితివని నేనెరుగుదును; మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని; అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకుదువు. నీవు ఆమెను అతని కప్పగించని యెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరిని పిలిపించి ఈ సంగతు లన్నియు వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి. అబీమెలెకు అబ్రాహామును పిలిపించి–నీవు మాకు చేసిన పని యేమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించునట్లు నేను నీయెడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను. మరియు అబీమెలెకు–నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రాహాము నడుగగా అబ్రాహాము–ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదు రనుకొని చేసితిని. అంతేకాక–ఆమె నా చెల్లెలనుమాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది. దేవుడు నన్ను నా తండ్రియిల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి–మనము పోవు ప్రతి స్థలమందు– ఇతడు నా సహోదరుడని నన్నుగూర్చి చెప్పుము; నీవు నాకు చేయవలసిన ఉపకారమిదేయని చెప్పితిననెను. అబీమెలెకు గొఱ్ఱెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి, అబ్రాహాముకిచ్చి అతని భార్యయైన శారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు–ఇదిగో నా దేశము నీ యెదుట నున్నది. నీకిష్టమైన స్థలమందు కాపురముండుమనెను. మరియు అతడు శారాతో– ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలిచ్చియున్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై యిది నీ పక్షముగా ఇచ్చియున్నాను. ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను. అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను; వారు పిల్లలుకనిరి. ఏలయనగా అబ్రాహాము భార్యయైన శారానుబట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను.