ఆదికాండము 2:1-25

ఆదికాండము 2:1-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీపూర్తి అయ్యాయి. ఏడవ రోజు దేవుడు తాను చేసిన పని ముగించాడు. కాబట్టి తాను చేసిన పని అంతటి నుంచీ ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు ఆ ఏడవ రోజును ఆశీర్వదించి పవిత్రం చేశాడు. ఆయన తాను చేసిన సృష్టి కార్యం అంతటినుంచీ విశ్రాంతి తీసుకున్న కారణంగా ఆ రోజును పవిత్రపరిచాడు. దేవుడైన యెహోవా భూమిని ఆకాశాలను చేసినప్పుడు, ఆకాశాల సంగతి, భూమి సంగతి ఈ విధంగా ఉన్నాయి, భూమి మీద అంతకుముందు ఆరుబయట ఏ పొదలూ లేవు, ఏ చెట్లూ మొలవలేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా భూమి మీద వర్షం కురిపించ లేదు. నేలను సేద్యం చెయ్యడానికి ఏ మనిషీ లేడు. కాని, భూమిలోనుంచి నీటి ప్రవాహాలు పొంగి నేలంతా తడిపేది గనక భూతలం అంతటా నీళ్ళు ఉండేవి. దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకుని మనిషిని చేసి అతని ముక్కుపుటాల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది. దేవుడైన యెహోవా తూర్పువైపున ఏదెనులో ఒక తోట వేసి తాను చేసిన మనిషిని అందులో ఉంచాడు. దేవుడైన యెహోవా కళ్ళకు అందమైన, ఆహారానికి మంచిదైన ప్రతి చెట్టునూ అక్కడ నేలలోనుంచి మొలిపించాడు. ఇంకా ఆ తోట మధ్యలో జీవవృక్షాన్నీ, ఏది మంచో, ఏది చెడో తెలిపే వృక్షాన్నీ కూడా నేలలోనుంచి మొలిపించాడు. ఆ తోటను తడపడానికి ఏదెనులో నుంచి ఒక నది బయలుదేరి అక్కడ నుంచి చీలిపోయి నాలుగు పాయలు అయ్యింది. మొదటిదాని పేరు పీషోను. అది బంగారం ఉన్న హవీలా దేశమంతటా ప్రవహిస్తున్నది. ఆ దేశంలో దొరికే బంగారం ప్రశస్తమైనది. అక్కడ ముత్యాలు, గోమేధిక మణులు కూడా దొరుకుతాయి. రెండో నది పేరు గీహోను. అది ఇతియోపియా దేశమంతటా ప్రవహిస్తున్నది. మూడో నది పేరు హిద్దెకెలు. అది అష్షూరుకు తూర్పు వైపు ప్రవహిస్తున్నది. నాలుగో నది యూఫ్రటీసు. దేవుడైన యెహోవా ఏదెను తోట సాగు చెయ్యడానికీ దాన్ని చూసుకోడానికీ మనిషిని అక్కడ పెట్టాడు. దేవుడైన యెహోవా “ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్నీ నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు. కాని, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్నరోజున కచ్చితంగా చచ్చిపోతావు” అని మనిషికి ఆజ్ఞాపించాడు. దేవుడైన యెహోవా “మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సరిపడిన తోడును అతని కోసం చేస్తాను” అనుకున్నాడు. దేవుడైన యెహోవా, ప్రతి భూజంతువునూ ప్రతి పక్షినీ నేలలోనుంచి చేసి, ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడడానికి అతని దగ్గరికి వాటిని రప్పించాడు. జీవం ఉన్న ప్రతిదానికీ ఆదాము ఏ పేరు పెట్టాడో, ఆ పేరు దానికి ఖాయం అయ్యింది. అప్పుడు ఆదాము పశువులన్నిటికీ, ఆకాశపక్షులన్నిటికీ, భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. కాని ఆదాముకు మాత్రం సరిజోడు లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. అతడు నిద్రలో ఉండగా అతని పక్కటెముకల్లో నుంచి ఒకదాన్ని తీసి ఆ ఖాళీని మాంసంతో పూడ్చివేశాడు. ఆ తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుంచి తీసిన పక్కటెముకతో స్త్రీని తయారుచేసి ఆదాము దగ్గరికి తీసుకువచ్చాడు. ఆదాము “ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. మనిషిలోనుంచి బయటకు తీసినది గనుక ఈమె పేరు మానుషి” అన్నాడు. ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు. అప్పుడు ఆదాము, అతని భార్య ఇద్దరూ నగ్నంగా ఉన్నారు. వాళ్ళకు సిగ్గు తెలియదు.

షేర్ చేయి
Read ఆదికాండము 2

ఆదికాండము 2:1-25 పవిత్ర బైబిల్ (TERV)

కనుక భూమి, ఆకాశం, వాటిలోని ప్రతిదీ పూర్తయింది. దేవుడు తాను చేస్తున్న పని ముగించాడు. కనుక ఏడవ రోజున దేవుడు తన పని నుండి విశ్రాంతి తీసుకొన్నాడు. ఏడవ రోజును దేవుడు ఆశీర్వదించి, దానిని పవిత్ర దినంగా చేశాడు. దేవుడు ప్రపంచాన్ని చేసేటప్పుడు జరిగించిన పని అంతటి నుండి ఆ రోజున విశ్రాంతి తీసుకొన్నాడు గనుక, ఆ రోజును ఆయన ప్రత్యేకమైనదిగా చేశాడు. ఇదే భూమి, ఆకాశం చరిత్ర. భూమిని, ఆకాశాన్ని దేవుడు చేసినప్పుడు జరిగిన సంగతుల విషయం ఇది. భూమి మీద మొక్కలు ఏమీ లేవు. పొలాల్లో ఏమీ పెరగటం లేదు. అప్పటికి యింకా ఎక్కడా మొక్కలు మొలవలేదు. అప్పటికి భూమిమీద యింకా వర్షం యెహోవా కురిపించలేదు. మొక్కలను గూర్చి జాగ్రత్త తీసుకొనే ఏ మనిషి అప్పటికి లేడు. భూమి నుండి ఆవిరి ఉబికి నేల అంతటిని తడిపింది. అప్పుడు యెహోవా దేవుడు నేలనుండి మట్టి తీసుకొని మనిషిని చేశాడు. మనిషి నాసికా రంధ్రాలలో జీవ వాయువును దేవుడు ఊదగా మనిషి సజీవుడు అయ్యాడు. అప్పుడు తూర్పున ఏదెను అను చోట ఒక తోటను యెహోవా వేశాడు. యెహోవా దేవుడు తాను చేసిన మనిషిని ఆ తోటలో ఉంచాడు. అప్పుడు చూచుటకు అందంగా కనబడే చెట్లన్నింటినీ, మరియు ఆహారానికి మంచివైన చెట్లు అన్నింటినీ భూమి పుట్టించునట్లు దేవుడు చేశాడు. జీవ వృక్షమును, మంచి చెడుల తెలివిని ఇచ్చే వృక్షమును ఆ తోట మధ్యలో ఉన్నాయి. ఏదెనులో నుండి ఒక నది ప్రవహిస్తూ ఆ తోటకు నీటిని ఇస్తుంది. ఆ నది పాయలై నాలుగు చిన్న నదులయింది. మొదటి నది పేరు పీషోను. ఇది హవీలా దేశం అంతటా ప్రవహించే నది. (ఆ దేశంలో బంగారం ఉంది, ఆ బంగారం చాలా మంచిది. ఆ దేశంలో బోళం, గోమేధికము కూడా ఉన్నాయి). రెండవ నది పేరు గీహోను. ఆ నది కూషు దేశమంతటా ప్రవహిస్తుంది. మూడో నది పేరు హిద్దెకెలు. ఆ నది అష్షూరు తూర్పు దిక్కున ప్రవహిస్తుంది. నాలుగో నది యూఫ్రటీసు. మనిషిని ఏదెను తోటలో యెహోవా దేవుడు ఉంచాడు. మొక్కలు నాటి తోటనుగూర్చి శ్రద్ధ తీసుకోవడం మనిషి పని. యెహోవా దేవుడు మనిషికి ఈ ఆజ్ఞ యిచ్చాడు: “ఈ తోటలోని ఏ చెట్టు ఫలమునైనా నీవు తినవచ్చు. అయితే మంచి, చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలమును నీవు తినకూడదు. ఆ చెట్టు పండు నీవు తిన్న రోజున తప్పక చస్తావు.” అప్పుడు యెహోవా దేవుడు, “పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అతనికి సాటియైన సహకారిణిని నేను చేస్తాను. మరియు ఆ సహకారిణి అతనికి సహాయం చేస్తుంది” అనుకొన్నాడు. పొలాల్లోని ప్రతి జంతువును, గాలిలోని ప్రతి పక్షిని నేలనుండి యెహోవా దేవుడు చేశాడు. ఈ జంతువులన్నింటిని యెహోవా దేవుడు మనిషి దగ్గరకు రప్పించాడు, మనిషి ప్రతిదానికి పేరు పెట్టాడు. సాధు జంతువులన్నింటికీ, ఆకాశ పక్షులన్నింటికి, అడవి క్రూర జంతువులన్నింటికి మనిషి పేర్లు పెట్టాడు. ఎన్నెన్నో జంతువుల్ని, పక్షుల్ని మనిషి చూశాడు. అయితే తనకు సరిపోయే సహాయంగా ఏదీ అతనికి కనబడలేదు. అందుచేత ఆ పురుషుడు గాఢనిద్ర పోయేటట్లు చేశాడు యెహోవా దేవుడు. అతడు నిద్రపోతూ ఉండగా, అతని శరీరంలోని ప్రక్క ఎముకలలో ఒకదాన్ని తీశాడు. ప్రక్క ఎముకను తీసిన చోటును అతని మాంసముతో యెహోవా దేవుడు పూడ్చి వేశాడు. స్త్రీని చేసేందుకు, అతని ప్రక్క ఎముకను యెహోవా దేవుడు ఉపయోగించాడు. అప్పుడు ఆ స్త్రీని ఆ పురుషుని దగ్గరకు యెహోవా దేవుడు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు: “ఇప్పుడు, ఇది నావంటి మనిషే. ఆమె ఎముక నా ఎముకల్లోనుంచి వచ్చింది. ఆమె శరీరం నా శరీరంలోనుంచి వచ్చింది. ఆమె నరునిలోనుండి తీయబడింది గనుక ఆమెను నారి అంటాను.” ఇందువల్ల పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి, తన భార్యను హత్తుకొంటాడు. వాళ్లిద్దరు ఏకమవుతారు. ఆ తోటలో ఆ పురుషుడు, అతని భార్యా నగ్నంగా ఉన్నారు. కాని వారికి సిగ్గు తెలియదు.

షేర్ చేయి
Read ఆదికాండము 2

ఆదికాండము 2:1-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పనియంతటినుండి యేడవదినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే. అదివరకు పొలమందలి యే పొదయు భూమిమీద నుండలేదు. పొలమందలి యే చెట్టును మొలవలేదు; ఏలయనగా దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడులేడు; అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలుదేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను. మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికములును దొరుకును. రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేపుడైన యెహోవా–ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా–నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశపక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను – నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి; అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి.

షేర్ చేయి
Read ఆదికాండము 2

ఆదికాండము 2:1-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఆ విధంగా ఆకాశం భూమి వాటిలో సమస్తం సంపూర్తి చేయబడ్డాయి. ఏడవ రోజు నాటికి దేవుడు తాను చేస్తున్న పనంతా ముగించారు; కాబట్టి ఏడవ రోజున తన పని అంతటి నుండి విశ్రాంతి తీసుకున్నారు. ఆ రోజున సృష్టి క్రియ అంతటి నుండి దేవుడు విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి ఆయన ఆ రోజును దీవించి పరిశుద్ధపరిచారు. యెహోవా దేవుడు భూమిని సృజించినప్పుడు, భూమ్యాకాశాల సృష్టి జరిగిన విధానం ఇదే. భూమి మీద ఏ పొద కనిపించలేదు, మొక్క మొలవలేదు, ఎందుకంటే యెహోవా దేవుడు భూమి మీద వాన కురిపించలేదు, భూమిని సేద్యం చేయడానికి నరులు లేరు, అయితే భూమిలో నుండి నీటిబుగ్గలు వచ్చి అంతా పారుతూ నేలను తడిపేవి. యెహోవా దేవుడు నేల మట్టితో మనుష్యుని చేసి, అతని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవి అయ్యాడు. యెహోవా దేవుడు తూర్పు దిక్కున ఏదెనులో తోట నాటి, అందులో తాను రూపించిన నరుని ఉంచారు. యెహోవా దేవుడు నేల నుండి కంటికి అందంగా కనిపించే ఆహారానికి సరియైన అన్ని రకాల చెట్లను మొలిపించారు. అలాగే ఆ తోట మధ్యలో జీవవృక్షం, మంచి చెడ్డల తెలివినిచ్చే జ్ఞాన వృక్షం ఉన్నాయి. ఏదెను నుండి ఒక నది పారుతూ తోటను తడిపేది; అది అక్కడినుండి నాలుగు పాయలుగా చీలిపోయింది. ఈ నదులలో మొదటి దాని పేరు పీషోను; ఇది బంగారం ఉన్న హవీలా దేశం చుట్టూ పారుతుంది. ఆ దేశ బంగారం ఉండేది; సువాసనగల గుగ్గిలం లేతపచ్చ రాళ్లు కూడా అక్కడ ఉండేవి. రెండవ నది పేరు గిహోను, అది కూషు దేశమంతటా పారుతుంది. మూడవ నది పేరు టైగ్రీసు, అది అష్షూరు ప్రాంతానికి తూర్పున ప్రవహిస్తుంది. నాలుగవ నది యూఫ్రటీసు. ఏదెను తోటను సాగుచేయడానికి దానిని, జాగ్రత్తగా చూసుకోడానికి యెహోవా దేవుడు నరుని దానిలో ఉంచారు. యెహోవా దేవుడు ఆ నరునితో, “ఈ తోటలోని చెట్ల పండ్లన్నీ నీవు తినవచ్చు; కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం తినకూడదు. అది తిన్న రోజున నీవు తప్పక చస్తావు” అని ఆజ్ఞాపించారు. యెహోవా దేవుడు, “నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతనికి తగిన తోడును చేస్తాను” అని అనుకున్నారు. యెహోవా దేవుడు నేల మట్టితో ప్రతి విధమైన అడవి జంతువులను, ఆకాశ పక్షులను చేసి, ఆ మనుష్యుని దగ్గరకు తెచ్చి వాటికి అతడు ఏ పేర్లు పెడతాడో అని చూశారు; అతడు ఒక్కొక్క జీవికి ఏ పేరైతే పెట్టాడో అదే ఆ జీవికి పేరు అయ్యింది. ఆ మనుష్యుడు పశువులన్నిటికి, ఆకాశపక్షులకు, అడవి జంతువులన్నిటికి పేర్లు పెట్టాడు. అయితే మనుష్యునికి తగిన తోడు దొరకలేదు. కాబట్టి యెహోవా దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలిగించి, అతని ప్రక్కటెముకల్లో ఒకటి తీసి, ఆ స్థలాన్ని మాంసంతో పూడ్చి వేశారు. అప్పుడు యెహోవా దేవుడు మనుష్యుని నుండి తీసిన ప్రక్కటెముకతో స్త్రీని చేసి అతని దగ్గరకు తెచ్చారు. అప్పుడు ఆ మనుష్యుడు ఇలా అన్నాడు: “ఈమె నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం; ఈమె నరుని నుండి వచ్చింది కాబట్టి ఈమె ‘నారీ’ అని పిలువబడుతుంది.” అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరు ఏకశరీరం అవుతారు. ఆదాము, అతని భార్య, ఇద్దరు నగ్నంగా ఉన్నారు, కానీ వారికి సిగ్గు అనిపించలేదు.

షేర్ చేయి
Read ఆదికాండము 2