ఆదికాండము 18:9-14

ఆదికాండము 18:9-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

వారు అతణ్ణి “నీ భార్య ఎక్కడ?” అని అడిగారు. అతడు “అదిగో, గుడారంలో ఉంది” అన్నాడు. అప్పుడు ఆయన “తిరిగి వసంతకాలంలో నేను మళ్ళీ నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. విను, అప్పటికి నీ భార్య శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు. శారా ఆయన వెనుక ఉన్న గుడారం ద్వారం దగ్గర ఉండి ఈ మాటలు వింటూ ఉంది. అప్పటికి అబ్రాహాము శారాలు వయసు ఉడిగిపోయి ముసలివాళ్ళయ్యారు. శారాకు పిల్లలను కనే వయసు దాటిపోయింది. శారా “నా బలమంతా పోయింది. ఈ సుఖం నాకెలా కలుగుతుంది? నా యజమాని అయిన నా భర్త కూడా ముసలివాడయ్యాడు కదా” అనుకుని తనలో తాను నవ్వుకుంది. అప్పుడు యెహోవా అబ్రాహాముతో “శారా ‘ముసలిదాన్ని అయిన నేను నిజంగా బిడ్డను కనగలనా’ అనుకుని ఎందుకు నవ్వింది? యెహోవాకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? నేను నిర్ణయించిన కాలంలో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 18

ఆదికాండము 18:9-14 పవిత్ర బైబిల్ (TERV)

“నీ భార్య శారా ఎక్కడ?” అంటూ ఆ ముగ్గురు అబ్రాహామును అడిగారు. “ఆమె అక్కడ గుడారంలో ఉంది” అని అబ్రాహాము అన్నాడు. అప్పుడు యెహోవా, “మళ్లీ వసంతకాలంలో నేను వస్తాను. అప్పటికి నీ భార్య శారాకు ఒక కుమారుడు కలిగి ఉంటాడు” అని అన్నాడు. గుడారం లోపల శారా ఈ విషయాలు విన్నది. అబ్రాహాము శారాలు చాలా ముసలివాళ్లు. స్త్రీలు పిల్లలను కనగల వయస్సు శారాకు దాటిపోయింది. అందుచేత తాను విన్న మాటలను శారా నమ్మలేదు. “ఇప్పుడు నేను ముసలిదాన్ని, నా భర్త ముసలివాడు. నాకు కొడుకు పుట్టటానికి నేను మరీ ముసలిదాన్ని కదా” అనుకొంది తనలో తాను. అప్పుడు అబ్రాహాముతో యెహోవా ఇలా అన్నాడు: “నేను చెప్పింది శారా నమ్మటం లేదు. ఆమె నవ్వింది. ‘నాకు కొడుకు పుట్టటానికి నేను మరీ ముసలిదాన్ని కదా!’ అంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నేను వస్తానని చెప్పిన వసంతకాలంలో మళ్లీ వస్తాను, అప్పుడు నీ భార్య శారాకు కుమారుడు ఉంటాడు.”

షేర్ చేయి
Read ఆదికాండము 18

ఆదికాండము 18:9-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు–అదిగో గుడారములోనున్నదని చెప్పెను. అందుకాయన–మీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు విను చుండెను. అబ్రాహామును శారాయును బహుకాలము గడచిన వృద్ధులై యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచి పోయెను గనుక శారా–నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడుగదా అని తనలో నవ్వు కొనెను. అంతట యెహోవా అబ్రాహాముతో–వృద్ధు రాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల? యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.

షేర్ చేయి
Read ఆదికాండము 18

ఆదికాండము 18:9-14 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

“నీ భార్య శారా ఎక్కడ?” అని వారు అడిగారు. “అదిగో ఆ గుడారంలో ఉంది” అని అబ్రాహాము జవాబిచ్చాడు. అప్పుడు వారిలో ఒకరు, “వచ్చే సంవత్సరం ఈ సమయానికి తప్పకుండా నేను నీ దగ్గరకు తిరిగి వస్తాను, అప్పటికి నీ భార్య శారా ఒక కుమారున్ని కలిగి ఉంటుంది” అని అన్నారు. శారా అతని వెనుక ఉన్న గుడార ద్వారం దగ్గర నిలబడి వింటుంది. అబ్రాహాము శారా అప్పటికే చాలా వృద్ధులు, శారా పిల్లలు కనే వయస్సు దాటిపోయింది. శారా తనలో తాను నవ్వుకుని, “నేను బలం ఉడిగిన దానిని, నా భర్త కూడా వృద్ధుడు కదా ఇప్పుడు నాకు ఈ భాగ్యం ఉంటుందా?” అని అనుకుంది. అప్పుడు యెహోవా అబ్రాహాముతో, “శారా ఎందుకలా నవ్వుకుంది, ‘ముసలిదాన్ని నేను కనగలనా అని ఎందుకు అనుకుంది?’ యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? వచ్చే సంవత్సరం నియమించబడిన సమయానికి నేను నీ దగ్గరకు తిరిగి వస్తాను, అప్పటికి శారా ఒక కుమారున్ని కంటుంది” అని అన్నారు.

షేర్ చేయి
Read ఆదికాండము 18