ఆదికాండము 18:1-33
ఆదికాండము 18:1-33 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు మమ్రేదగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి –ప్రభువా, నీ కటాక్షము నామీద నున్నయెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను; దయచేసి కాళ్లు కడుగు కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చెదను; మీ ప్రాణములను బలపరచు కొనుడి; తరువాత మీరు వెళ్లవచ్చును; ఇందు నిమిత్తము గదా మీ దాసునియొద్దకు వచ్చితిరనెను. వారు–నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రాహాము గుడారములోనున్న శారాయొద్దకు త్వరగా వెళ్లి–నీవు త్వరపడి మూడు మానికల మెత్తనిపిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్ప గించెను.వాడు దాని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారియెదుట పెట్టి వారు భోజనముచేయుచుండగా వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను. వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు–అదిగో గుడారములోనున్నదని చెప్పెను. అందుకాయన–మీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు విను చుండెను. అబ్రాహామును శారాయును బహుకాలము గడచిన వృద్ధులై యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచి పోయెను గనుక శారా–నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడుగదా అని తనలో నవ్వు కొనెను. అంతట యెహోవా అబ్రాహాముతో–వృద్ధు రాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల? యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి–నేను నవ్వలేదని చెప్పగా ఆయన–అవును నీవు నవ్వితివనెను. అప్పుడా మనుష్యులు అక్కడనుండి లేచి సొదొమతట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితోకూడ వెళ్లెను. అప్పుడు యెహోవా–నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా? అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రాహామునుగూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటివారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను. మరియు యెహోవా–సొదొమ గొమొఱ్ఱాలనుగూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను. ఆ మనుష్యులు అక్కడనుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్లిరి. అబ్రాహాము ఇంక యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రాహాము సమీపించి యిట్లనెను–దుష్టులతోకూడ నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండినయెడల దానిలోనున్న యేబదిమంది నీతిమంతులనిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతోకూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా–సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారినిబట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను అందుకు అబ్రాహాము–ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువు తో మాటలాడ తెగించుచున్నాను. ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువై నందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన–అక్కడ నలుబదియైదు గురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను; అతడింక ఆయనతో మాటలాడుచు–ఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన–ఆ నలుబదిమందిని బట్టి నాశనముచేయక యుందునని చెప్పగా అతడు–ప్రభువు కోపపడనియెడల నేను మాటలాడెదను; ఒకవేళ అక్కడ ముప్పదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన–అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చేయననెను. అందుకతడు–ఇదిగో ప్రభువు తో మాటలాడ తెగించితిని; ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన –ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయకుందుననగా అతడు–ప్రభువు కోపపడనియెడల నే నింకొకమారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన–ఆ పదిమందినిబట్టి నాశనము చేయక యుందుననెను. యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను. అబ్రాహాము తన యింటికి తిరిగి వెళ్లెను.
ఆదికాండము 18:1-33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మమ్రే అనే ప్రాంతంలో సింధూర చెట్ల దగ్గర ఒక మధ్యాహ్నం వేళ అబ్రాహాము తన గుడారం వాకిట్లో కూర్చుని ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడు తలెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ముందు నిలబడి ఉన్నారు. అతడు వారిని చూసి తన గుడారం వదిలి వారిని కలుసుకోవడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. వారి ఎదుట నేల వరకూ వంగి ఇలా అన్నాడు. “ప్రభూ, నీ దాసుడనైన నాపై దయ చూపి నన్ను దాటి వెళ్ళకండి. నాతో రండి. నేను నీళ్ళు తెప్పిస్తాను. వాటితో మీ కాళ్ళు కడుక్కోండి. చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి. మీ దాసుడినైన నా దగ్గరికి వచ్చారు కదా, కొంచెం ఆహారం తీసుకు వస్తాను. దాన్ని తిని సేద దీర్చుకోండి. ఆ తరువాత మీ దారిన మీరు వెళ్ళవచ్చు.” అందుకు వారు “నువ్వు చెప్పినట్టే చెయ్యి” అన్నారు. అప్పుడు అబ్రాహాము వెంటనే గుడారంలో ఉన్న శారా దగ్గరికి వెళ్ళి “నువ్వు త్వరగా 21 కిలోల మెత్తటి పిండి తెచ్చి కలిపి రొట్టెలు చెయ్యి” అన్నాడు. తరువాత అబ్రాహాము పశువుల మంద దగ్గరికి పరుగెత్తి ఒక మంచి లేగ దూడను పట్టుకు వచ్చి ఒక పనివాడికి ఇచ్చాడు. వాడు త్వరత్వరగా దాన్నివధించి వండి సిద్ధం చేశాడు. తరువాత అతడు పెరుగూ, పాలూ వాటితోపాటు తాను వండించి సిద్ధం చేయించిన దూడ మాంసాన్ని తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళు భోజనం చేస్తుంటే అక్కడే ఆ చెట్టు కిందే నిలబడ్డాడు. వారు అతణ్ణి “నీ భార్య ఎక్కడ?” అని అడిగారు. అతడు “అదిగో, గుడారంలో ఉంది” అన్నాడు. అప్పుడు ఆయన “తిరిగి వసంతకాలంలో నేను మళ్ళీ నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. విను, అప్పటికి నీ భార్య శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు. శారా ఆయన వెనుక ఉన్న గుడారం ద్వారం దగ్గర ఉండి ఈ మాటలు వింటూ ఉంది. అప్పటికి అబ్రాహాము శారాలు వయసు ఉడిగిపోయి ముసలివాళ్ళయ్యారు. శారాకు పిల్లలను కనే వయసు దాటిపోయింది. శారా “నా బలమంతా పోయింది. ఈ సుఖం నాకెలా కలుగుతుంది? నా యజమాని అయిన నా భర్త కూడా ముసలివాడయ్యాడు కదా” అనుకుని తనలో తాను నవ్వుకుంది. అప్పుడు యెహోవా అబ్రాహాముతో “శారా ‘ముసలిదాన్ని అయిన నేను నిజంగా బిడ్డను కనగలనా’ అనుకుని ఎందుకు నవ్వింది? యెహోవాకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? నేను నిర్ణయించిన కాలంలో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు. అప్పుడు శారా భయపడి “నేను నవ్వలేదండీ” అంది. దానికి ఆయన “అలా అనకు, నువ్వు నవ్వావు” అని జవాబిచ్చాడు. అప్పుడు ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి లేచారు. లేచి సొదొమ పట్టణం వైపు చూసారు. వారిని సాగనంపడానికి అబ్రాహాము వారితో కలిసి వెళ్ళాడు. కానీ యెహోవా ఇలా అనుకున్నాడు. “అబ్రాహాము కచ్చితంగా ఒక బలమైన గొప్ప జాతి అవుతాడు. అతని మూలంగా భూమిపై అన్ని జాతులూ ఆశీర్వాదం పొందుతాయి. నేను చేయబోతున్న పనులను అబ్రాహాముకు తెలియకుండా ఎలా దాచగలను? అతని తరువాత అతని వారసులు నీతి న్యాయాలను జరిగించేలా వారికి యెహోవా మార్గాన్ని బోధించడానికీ తద్వారా అబ్రాహాముకు ఆయన చెప్పిన విషయాలన్నీ జరిగించడానికీ నేను అబ్రాహామును ఎన్నుకున్నాను.” అప్పుడు యెహోవా ఇలా అన్నాడు. “సొదొమ గొమొర్రాలను గూర్చిన విన్నపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే వాటి పాపం కూడా చాలా ఘోరం. కనుక నేను దిగి వెళ్ళి నాకు చేరిన ఆ విన్నపం ప్రకారం వాళ్ళు అంత దుర్మార్గులా కాదా అన్నది చూస్తాను. లేకపోతే నాకు తెలుస్తుంది.” ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. కానీ అబ్రాహాము ఇంకా యెహోవా సముఖంలోనే నిలబడి ఉన్నాడు. అప్పడు అబ్రాహాము వారిని సమీపించి ఇలా అడిగాడు. “దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? ఆ పట్టణంలో ఒకవేళ యాభైమంది నీతిమంతులు ఉంటే ఆ యాభైమంది నీతిమంతుల కోసం పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించలేవా? నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?” దానికి యెహోవా “సొదొమ పట్టణంలో యాభైమంది నీతిమంతులు నాకు కనిపిస్తే వాళ్ళ కోసం ఆ ప్రదేశాన్నంతా కాపాడతాను” అన్నాడు. అందుకు అబ్రాహాము “అయ్యా చూడు, నేను దుమ్ముతో, బూడిదతో సమానం. అయినా నేను ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. యాభై మంది నీతిమంతుల్లో ఒకవేళ ఐదుగురు తక్కువయ్యారనుకోండి. ఐదుగురు తక్కువయ్యారని ఆ పట్టణమంతటినీ నాశనం చేస్తావా?” అని మళ్ళీ అడిగాడు. అందుకాయన “అక్కడ నలభై ఐదుగురు కనిపిస్తే నాశనం చేయను” అన్నాడు. అతడు మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ “ఒకవేళ అక్కడ నలభై మందే కనిపిస్తారేమో” అన్నాడు. దానికి ఆయన “ఆ నలభై మంది కోసం నాశనం చేయను” అని చెప్పాడు. అతడు మళ్ళీ “ప్రభూ, నాపై కోప్పడనంటే నేను మాట్లాడతాను. ఒకవేళ ముప్ఫై మందే అక్కడ కనిపిస్తారేమో” అన్నాడు. అప్పుడాయన “ముప్ఫై మంది కనిపించినా నేను పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు. అందుకు అతడు “నా ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. ఒకవేళ ఇరవైమందే ఉంటారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “ఆ ఇరవైమంది కోసం నాశనం చేయను” అన్నాడు. చివరిగా అతడు “ప్రభూ, నాపై కోపగించకు. నేనింకా ఒక్కసారే మాట్లాడతాను. ఒకవేళ పదిమందే అక్కడ ఉన్నారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “పదిమంది కోసం నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు. అబ్రాహాముతో మాటలు ముగిసిన వెంటనే యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.
ఆదికాండము 18:1-33 పవిత్ర బైబిల్ (TERV)
తర్వాత మళ్లీ అబ్రాహాముకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. మమ్రేలోని సింధూర వనమునకు దగ్గర్లో అబ్రాహాము నివసిస్తున్నాడు. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం అబ్రాహాము తన గుడార ద్వారం దగ్గర కూర్చున్నాడు. అబ్రాహాము తలెత్తి చూడగా, తన ముందర నిలచిన ముగ్గురు మనుష్యులు కనబడ్డారు. అబ్రాహాము వాళ్లను చూడగానే అతడు వారి దగ్గరకు వెళ్లి, వారి ముందు వంగి, ఇలా అన్నాడు, “అయ్యలారా, మీ దాసుడనైన నా దగ్గర దయచేసి కొంత కాలం ఉండండి. మీ కాళ్లు కడుక్కొనేందుకు నేను నీళ్లు తెస్తాను. చెట్ల క్రింద మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. మీ కోసం నేను భోజనం తెస్తాను, కడుపు నిండా భోంచేయండి. తర్వాత మీ దారిన మీరు వెళ్లొచ్చు.” “చాలా బాగుంది, అలాగే కానీయి” అని ఆ ముగ్గురు మనుష్యులు అన్నారు. అబ్రాహాము తన గుడారము దగ్గరకు త్వరత్వరగా వెళ్లాడు. “మూడు రొట్టెలకు సరిపడె గోధుమలు త్వరగా తయారు చేయి” అని అబ్రాహాము శారాతో అన్నాడు. తర్వాత అబ్రాహాము తన పశువుల దగ్గరకు పరుగెత్తాడు. అబ్రాహాము చాలా మంచి లేత దూడను తీసుకొని తన సేవకునికి ఇచ్చాడు. త్వరగా ఆ దూడను వధించి, దానితో భోజనం సిద్ధం చేయమని అబ్రాహాము చెప్పాడు. ఆ మాంసాన్ని ఆ ముగ్గురు మనుష్యులు భోంచేసేందుకు అబ్రాహాము ఇచ్చాడు. అతడు పాలు, వెన్న కూడ వాళ్లకు ఇచ్చాడు. ఆ ముగ్గురు చెట్టు క్రింద భోజనం చేస్తూ ఉండగా అబ్రాహాము వారి దగ్గర నిలబడ్డాడు. “నీ భార్య శారా ఎక్కడ?” అంటూ ఆ ముగ్గురు అబ్రాహామును అడిగారు. “ఆమె అక్కడ గుడారంలో ఉంది” అని అబ్రాహాము అన్నాడు. అప్పుడు యెహోవా, “మళ్లీ వసంతకాలంలో నేను వస్తాను. అప్పటికి నీ భార్య శారాకు ఒక కుమారుడు కలిగి ఉంటాడు” అని అన్నాడు. గుడారం లోపల శారా ఈ విషయాలు విన్నది. అబ్రాహాము శారాలు చాలా ముసలివాళ్లు. స్త్రీలు పిల్లలను కనగల వయస్సు శారాకు దాటిపోయింది. అందుచేత తాను విన్న మాటలను శారా నమ్మలేదు. “ఇప్పుడు నేను ముసలిదాన్ని, నా భర్త ముసలివాడు. నాకు కొడుకు పుట్టటానికి నేను మరీ ముసలిదాన్ని కదా” అనుకొంది తనలో తాను. అప్పుడు అబ్రాహాముతో యెహోవా ఇలా అన్నాడు: “నేను చెప్పింది శారా నమ్మటం లేదు. ఆమె నవ్వింది. ‘నాకు కొడుకు పుట్టటానికి నేను మరీ ముసలిదాన్ని కదా!’ అంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నేను వస్తానని చెప్పిన వసంతకాలంలో మళ్లీ వస్తాను, అప్పుడు నీ భార్య శారాకు కుమారుడు ఉంటాడు.” అయితే శారా, “నేను నవ్వలేదు” అంది. (భయపడి ఆమె అలా అంది.) కాని యెహోవా, “కాదు, నీవు చెప్పేది నిజం కాదని నాకు తెలుసు. నీవు నవ్వావు” అన్నాడు. అప్పుడు ఆ మనుష్యులు వెళ్లటానికి లేచారు. వారు సొదొమ వైపు చూసి, ఆ దిశగా నడక ప్రారంభించారు. వారికి వీడ్కోలు చెప్పటానికి అబ్రాహాము వాళ్లతో కొంత దూరం నడిచాడు. యెహోవా తనలో తాను ఇలా అనుకొన్నాడు: “ఇప్పుడు నేను చేయబోతున్నది అబ్రాహాముకు నేను చెప్పాలా? అబ్రాహాము గొప్ప శక్తిగల జనానికి మూల పురుషుడు అవుతాడు. అతని మూలంగా భూమి మీది ప్రజలంతా ఆశీర్వదించబడుతారు. అబ్రాహాముతో నేను ఒక ప్రత్యేక ఒడంబడిక చేసుకున్నాను. అతని పిల్లలు, సంతానము యెహోవా ఇష్ట ప్రకారం జీవించేటట్లు అబ్రాహాము వారికి ఆజ్ఞాపించాలని నేను ఇలా చేశాను. సక్రమంగా న్యాయంగా వాళ్లు జీవించాలని నేను ఇలా చేశాను. అప్పుడు, యెహోవానైన నేను వాగ్దానం చేసిన వాటిని అతనికి ఇవ్వగలను.” మరల యెహోవా ఇలా అన్నాడు: “సొదొమ గొమొఱ్ఱాల అరుపులు చాలా పెద్దవి. వారి పాపం చాలా భయంకరమైనది అని నేను విన్నాను. కనుక నేను వెళ్లి, అక్కడి విషయాలు నేను విన్నంత చెడ్డగా ఉన్నాయేమో చూస్తాను. అప్పుడు నాకు నిశ్చయంగా తెలుస్తుంది.” అంచేత ఆ మనుష్యులు మళ్లీ సొదొమవైపు నడక ప్రారంభించారు. అయితే అబ్రాహాము యెహోవాతో అక్కడ ఉండిపోయాడు. అప్పుడు అబ్రాహాము యెహోవాను సమీపించి ఇలా అడిగాడు. “యెహోవా, నీవు దుష్టులను నాశనం చేసేటప్పుడు మంచివారిని కూడా నాశనం చేస్తావా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది మంచివాళ్లు ఉంటే ఎలా? ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తావా? అక్కడ నివసిస్తున్న 50 మంది మంచివాళ్ల కోసం తప్పక నీవు ఆ పట్టణాన్ని కాపాడు. ఆ పట్టణాన్ని నీవు అసలు నాశనం చేయనే చేయవు. చెడ్డవాళ్లను చంపడంకోసం 50 మంది మంచివాళ్లను నీవు నాశనం చేయవు. అలా గనుక జరిగితే మంచివాళ్లు చెడ్డవాళ్లు సమానమై, ఇద్దరూ శిక్షించబడుతారు. భూలోకమంతటికి నీవు న్యాయమూర్తివి. నిజంగా నీవు సరైనదే చేస్తావని నాకు తెలుసు.” అప్పుడు, “సొదొమ పట్టణంలో 50 మంది మంచివాళ్లు నాకు కనబడితే, నేను ఆ పట్టణం అంతటిని కాపాడుతాను” అన్నాడు యెహోవా. దానికి అబ్రాహాము ఇలా అన్నాడు: “ప్రభూ, నీతో పోల్చుకొంటే, నేను ధూళిని, బూడిదను మాత్రమే. అయినా నేను మరోసారి తెగించి ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఒకవేళ అయిదుగురు మంచివాళ్లు తప్పిపోయి, 45 మంది మంచివాళ్లు మాత్రమే ఆ పట్టణంలో ఉంటే ఎలా? కేవలం అయిదుగురు తక్కువ అయినందువల్ల మొత్తం పట్టణమంతటిని నాశనం చేస్తావా?” “అక్కడ 45 మంది మంచివాళ్లు గనుక నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను వదిలివేస్తాను” అన్నాడు యెహోవా. మరల అబ్రాహాము, “అక్కడ 40 మంది మంచివాళ్లు మాత్రమే నీకు కనబడినా, నీవు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా?” అని యెహోవాను అడిగాడు. “40 మంది మంచివాళ్లు నాకు కనబడితే, నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు యెహోవా. అందుకు అబ్రాహాము, “ప్రభూ, నా మీద కోపగించకు. మరొక్క మాట అడుగుతాను. ఆ పట్టణంలో 30 మంది మంచివాళ్లు మాత్రమే కనబడితే, నీవు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా?” అని అడిగాడు. అందుకు యెహోవా, “అక్కడ 30 మంది మంచివాళ్లు నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అని చెప్పాడు. అప్పుడు అబ్రాహాము, “నా ప్రభువుతో మరోసారి మాటలాడ తెగించితిని. ఒకవేళ అక్కడ 20 మంది మంచివాళ్లే ఉంటే” అన్నాడు. “20 మంది మంచివాళ్లు నాకు కనబడితే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అని జవాబిచ్చాడు యెహోవా. అప్పుడు అబ్రాహాము ఇలా అన్నాడు, “ప్రభూ, నాపై కోపగించకు, ఈ ఒక్కసారే చివరిగా నీతో మాటలాడ తెగిస్తున్నాను. పదిమంది మంచివాళ్లే గనుక అక్కడ నీకు కనబడితే, నీవేం చేస్తావు?” “పదిమంది మంచివాళ్లు గనుక అక్కడ నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అన్నాడు యెహోవా. యెహోవా అబ్రాహాముతో మాట్లాడటం అయిపోయింది గనుక యెహోవా వెళ్లిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి వెళ్లిపోయాడు.
ఆదికాండము 18:1-33 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అబ్రాహాము మమ్రేలో ఉన్న సింధూర వృక్షాల దగ్గర తన గుడార ద్వారం దగ్గర ఎండలో కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యారు. అబ్రాహాము కళ్ళెత్తి చూసినప్పుడు అతని ఎదుట ముగ్గురు మనుష్యులు నిలిచి ఉన్నారు. వారిని చూసిన వెంటనే తన గుడార ద్వారం నుండి వారిని కలవడానికి త్వరపడి వెళ్లి సాష్టాంగపడ్డాడు. అబ్రాహాము వారితో, “నా ప్రభువా, మీ దృష్టిలో నేను దయ పొందినట్లైతే, మీ దాసున్ని విడిచి వెళ్లకండి. నీళ్లు తెప్పిస్తాను, కాళ్లు కడుక్కుని ఈ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోండి. మీరు మీ సేవకుని దగ్గరకు వచ్చారు కాబట్టి మీరు తినడానికి ఆహారం తీసుకువస్తాను, మీ ఆకలి తీరిన తర్వాత వెళ్లవచ్చు” అని అన్నాడు. “మంచిది, అలాగే చేయి” అని వారు జవాబిచ్చారు. కాబట్టి అబ్రాహాము శారా గుడారంలోకి త్వరపడి వెళ్లి, “త్వరగా మూడు మానికెలు నాణ్యమైన పిండి తెచ్చి, బాగా పిసికి రొట్టెలు చేయి” అని చెప్పాడు. తర్వాత అబ్రాహాము పశువుల మంద దగ్గరకు పరుగెత్తి వెళ్లి, లేగదూడను తెచ్చి తన పనివానికి ఇచ్చాడు, ఆ పనివాడు త్వరగా దానిని వండి పెట్టాడు. తర్వాత అతడు కొంచెం వెన్న, పాలు, వండిన దూడ మాంసాన్ని వారి ముందు ఉంచాడు. వారు భోజనం చేస్తుండగా, వారి దగ్గర చెట్టు క్రింద అతడు నిలబడ్డాడు. “నీ భార్య శారా ఎక్కడ?” అని వారు అడిగారు. “అదిగో ఆ గుడారంలో ఉంది” అని అబ్రాహాము జవాబిచ్చాడు. అప్పుడు వారిలో ఒకరు, “వచ్చే సంవత్సరం ఈ సమయానికి తప్పకుండా నేను నీ దగ్గరకు తిరిగి వస్తాను, అప్పటికి నీ భార్య శారా ఒక కుమారున్ని కలిగి ఉంటుంది” అని అన్నారు. శారా అతని వెనుక ఉన్న గుడార ద్వారం దగ్గర నిలబడి వింటుంది. అబ్రాహాము శారా అప్పటికే చాలా వృద్ధులు, శారా పిల్లలు కనే వయస్సు దాటిపోయింది. శారా తనలో తాను నవ్వుకుని, “నేను బలం ఉడిగిన దానిని, నా భర్త కూడా వృద్ధుడు కదా ఇప్పుడు నాకు ఈ భాగ్యం ఉంటుందా?” అని అనుకుంది. అప్పుడు యెహోవా అబ్రాహాముతో, “శారా ఎందుకలా నవ్వుకుంది, ‘ముసలిదాన్ని నేను కనగలనా అని ఎందుకు అనుకుంది?’ యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? వచ్చే సంవత్సరం నియమించబడిన సమయానికి నేను నీ దగ్గరకు తిరిగి వస్తాను, అప్పటికి శారా ఒక కుమారున్ని కంటుంది” అని అన్నారు. శారా భయపడి, “నేను నవ్వలేదు” అని అబద్ధమాడింది. “లేదు, నీవు నవ్వావు” అని ఆయన అన్నారు. ఆ మనుష్యులు వెళ్లడానికి లేచి సొదొమ, గొమొర్రాల వైపు చూశారు, అబ్రాహాము వారిని పంపించడానికి వారితో పాటు వెళ్లాడు. అప్పుడు యెహోవా ఇలా అన్నారు, “నేను చేయబోతున్న దానిని అబ్రాహాముకు చెప్పకుండ ఎలా దాచగలను? అబ్రాహాము ఖచ్చితంగా గొప్ప శక్తిగల దేశం అవుతాడు, అతని ద్వారా భూమి మీద ఉన్న సర్వ దేశాలు దీవించబడతాయి. ఎందుకంటే నేను అతన్ని ఎంచుకున్నాను, అతడు తన పిల్లలను తన తర్వాత తన ఇంటివారిని యెహోవా మార్గంలో నీతి న్యాయాలు జరిగిస్తూ జీవించేలా నడిపిస్తాడు, తద్వారా యెహోవా అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జరిగిస్తారు.” అప్పుడు యెహోవా, “సొదొమ, గొమొర్రాల గురించిన మొర చాలా గొప్పది, వారి పాపం ఘోరమైనది. నేను అక్కడికి వెళ్లి నాకు చేరిన ఫిర్యాదు వలె వారి క్రియలు ఎంత చెడ్డగా ఉన్నాయో చూసి తెలుసుకుంటాను” అని అన్నారు. ఆ మనుష్యులు అక్కడినుండి సొదొమ వైపు వెళ్లారు, అయితే అబ్రాహాము యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు. అప్పుడు అబ్రాహాము ఆయనను సమీపించి, “దుష్టులతో పాటు నీతిమంతులను నిర్మూలం చేస్తారా? ఒకవేళ ఆ పట్టణంలో యాభైమంది నీతిమంతులుంటే ఎలా? ఆ యాభైమంది కోసమన్నా ఆ పట్టణాన్ని కాపాడకుండా నిజంగా దానిని నాశనం చేస్తారా? అలా నాశనం చేయడం మీకు దూరమవును గాక! దుష్టులతో పాటు నీతిమంతులను చంపడం, దుష్టులను నీతిమంతులను ఒకేలా చూడడము. మీ నుండి ఆ తలంపు దూరమవును గాక! సర్వలోక న్యాయాధిపతి న్యాయం చేయరా?” అని అన్నాడు. యెహోవా జవాబిస్తూ, “సొదొమలో యాభైమంది నీతిమంతులను నేను కనుగొంటే, వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాపాడతాను” అని అన్నారు. అబ్రాహాము మరలా మాట్లాడాడు: “నేను ధూళిని బూడిదను, అయినాసరే నేను ప్రారంభించాను కాబట్టి నేను ప్రభువుతో ఇంకా మాట్లాడతాను. ఒకవేళ యాభైమందిలో నీతిమంతులు అయిదుగురు తక్కువైతే అప్పుడు పట్టణం అంతటిని అయిదుగురు తక్కువ ఉన్నందుకు నాశనం చేస్తారా?” ఆయన, “నేను అక్కడ నలభై అయిదుగురు చూస్తే అప్పుడు దానిని నాశనం చేయను” అన్నారు. అబ్రాహాము, “ఒకవేళ నలభైమంది నీతిమంతులు ఉంటే?” అని మరలా అడిగాడు. “ఆ నలభైమంది కోసం దానిని నాశనం చేయను” అని దేవుడు అన్నారు. అప్పుడు అతడు, “ప్రభువు కోప్పడకండి, నన్ను మాట్లాడనివ్వండి. ఒకవేళ అక్కడ ముప్పైమంది నీతిమంతులు మాత్రమే ఉంటే?” అని అడిగాడు. ఆయన, “ముప్పైమందిని నేను కనుగొంటే నేను నాశనం చేయను” అని జవాబిచ్చారు. అబ్రాహాము, “నేను ప్రభువుతో మాట్లాడడానికి తెగించాను; ఒకవేళ అక్కడ ఇరవైమందే మాత్రమే ఉంటే?” అని అన్నాడు. ఆయన, “ఆ ఇరవైమంది కోసం దానిని నాశనం చేయను” అన్నారు. అప్పుడతడు, “ప్రభువా, కోప్పడకండి, నేను ఇంకొక్కసారి మాట్లాడతాను. ఒకవేళ అక్కడ పదిమందే ఉంటే?” అని అడిగాడు. ఆయన, “ఆ పదిమంది కోసం దానిని నాశనం చేయను” అని జవాబిచ్చారు. యెహోవా అబ్రాహాముతో సంభాషణ ముగించిన తర్వాత, ఆయన వెళ్లిపోయారు, అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్లాడు.