ఆదికాండము 16:1-4
ఆదికాండము 16:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అబ్రాముకు భార్య శారయి వల్ల పిల్లలు పుట్టలేదు. ఆమె దగ్గర ఈజిప్ట్ దేశానికి చెందిన ఒక దాసి ఉంది. ఆమె పేరు హాగరు. శారయి అబ్రాముతో “ఇదుగో, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. నువ్వు నా దాసి దగ్గరికి వెళ్ళు. ఒకవేళ ఆమె ద్వారా నాకు పిల్లలు పుట్టవచ్చేమో” అంది. అబ్రాము శారయి మాట విన్నాడు. అబ్రాము అప్పటికి కనాను దేశంలో పదేళ్ల నుండి నివాసముంటున్నాడు. అబ్రాము భార్య శారయి ఈజిప్టుకు చెందిన తన దాసి హాగరును తన భర్తకు భార్యగా ఉండటానికి ఇచ్చింది. అతడు హాగరుతో సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఆమె గర్భం ధరించింది. తాను గర్భం ధరించానని తెలుసుకున్న హాగరు తన యజమానురాలిని చులకనగా చూడటం ప్రారంభించింది.
ఆదికాండము 16:1-4 పవిత్ర బైబిల్ (TERV)
అబ్రాము భార్య శారయి. ఆమెకు, అబ్రాముకు పిల్లలు లేరు. శారయికి ఈజిప్టుకు చెందిన పని పిల్ల ఉంది. ఆమె పేరు హాగరు. శారయి అబ్రాముతో యిలా చెప్పింది: “చూడండి, నాకు పిల్లలు పుట్టకుండా చేశాడు యెహోవా. కనుక మీరు నా పనిమనిషితో పొండి. ఆమె ద్వారా పుట్టే శిశువును నా స్వంత శిశువుగా నేను స్వీకరిస్తాను.” తన భార్య శారయి మాట అబ్రాము విన్నాడు. కనాను దేశంలో అబ్రాము పది సంవత్సరాలు జీవించిన తర్వాత ఇది జరిగింది. హాగరును తన భర్త అబ్రాముకు శారయి యిచ్చింది. (హాగరు ఈజిప్టు నుండి వచ్చిన దాసి). అబ్రాము వల్ల హాగరు గర్భవతి అయింది. హాగరు ఇది గమనించినప్పుడు. ఆమె చాలా గర్వపడి, తన యజమానురాలైన శారయికంటే తాను గొప్పదాన్ని అని తలంచడం మొదలు పెట్టింది.
ఆదికాండము 16:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి యుండెను. కాగా శారయి–ఇదిగో నేను పిల్లలు కనకుండ యెహోవా చేసియున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము; ఒకవేళ ఆమెవలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను; అబ్రాము శారయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్యయైన శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయురాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతి నైతినని తెలిసికొనినప్పుడు దాని యజమానురాలు దానిదృష్టికి నీచమైనదాయెను.
ఆదికాండము 16:1-4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అబ్రాము భార్యయైన శారాయి వలన అతనికి పిల్లలు పుట్టలేదు. అయితే ఆమెకు ఈజిప్టు నుండి వచ్చిన దాసి ఉంది, ఆమె పేరు హాగరు; కాబట్టి శారాయి అబ్రాముతో, “యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశారు. నీవు వెళ్లి నా దాసితో లైంగికంగా కలువు; బహుశ ఆమె ద్వార నాకు సంతానం కలుగుతుందేమో” అని అన్నది. శారాయి చెప్పిన దానికి అబ్రాము అంగీకరించాడు. అబ్రాము కనానులో పది సంవత్సరాలు నివసించిన తర్వాత, శారాయి ఈజిప్టు నుండి దాసిగా తెచ్చుకున్న హాగరును తన భర్తకు భార్యగా ఇచ్చింది. అతడు హాగరును లైంగికంగా కలిశాడు, ఆమె గర్భవతి అయ్యింది. తాను గర్భవతినని ఆమె తెలుసుకున్నప్పుడు తన యజమానురాలైన శారాయిని చిన్న చూపు చూసింది.