ఆదికాండము 16:1-16

ఆదికాండము 16:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అబ్రాముకు భార్య శారయి వల్ల పిల్లలు పుట్టలేదు. ఆమె దగ్గర ఈజిప్ట్ దేశానికి చెందిన ఒక దాసి ఉంది. ఆమె పేరు హాగరు. శారయి అబ్రాముతో “ఇదుగో, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. నువ్వు నా దాసి దగ్గరికి వెళ్ళు. ఒకవేళ ఆమె ద్వారా నాకు పిల్లలు పుట్టవచ్చేమో” అంది. అబ్రాము శారయి మాట విన్నాడు. అబ్రాము అప్పటికి కనాను దేశంలో పదేళ్ల నుండి నివాసముంటున్నాడు. అబ్రాము భార్య శారయి ఈజిప్టుకు చెందిన తన దాసి హాగరును తన భర్తకు భార్యగా ఉండటానికి ఇచ్చింది. అతడు హాగరుతో సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఆమె గర్భం ధరించింది. తాను గర్భం ధరించానని తెలుసుకున్న హాగరు తన యజమానురాలిని చులకనగా చూడటం ప్రారంభించింది. అప్పుడు శారయి అబ్రాముతో “నా ఉసురు నీకు తగులుతుంది. ఇదంతా నీ వల్లే జరిగింది. నా దాసిని నేనే నీ చేతుల్లో పెట్టాను. ఆమె గర్భవతి అయింది. అది తెలిసిన దగ్గరనుండీ అది కన్నూమిన్నూ గానక నన్ను చులకనగా చూడటం మొదలు పెట్టింది. నీకూ నాకూ మధ్యన యెహోవా న్యాయం తీరుస్తాడు” అంది. అందుకు అబ్రాము “ఇలా చూడు, నీ దాసి నీ చెప్పుచేతల్లోనే ఉంది గదా. ఆమె విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో” అన్నాడు. శారయి తన దాసిని రాచి రంపాన పెట్టింది. దాంతో ఆమె శారయి దగ్గర నుండి పారిపోయింది. షూరుకు వెళ్ళే దారిలో అడవిలో నీటి ఊట దగ్గర యెహోవా దూత ఆమెను చూశాడు. ఆమెతో “శారయి దాసివైన హాగరూ, ఎక్కడ నుండి వస్తున్నావ్? ఎక్కడికి వెళ్తున్నావ్?” అని అడిగాడు. అందుకామె “నా యజమానురాలైన శారయి దగ్గరనుండి పారిపోతున్నాను” అంది. అప్పుడు యెహోవా దూత “నువ్వు మళ్ళీ నీ యజమానురాలి దగ్గరికి తిరిగి వెళ్ళు. ఆమెకు పూర్తిగా అణిగి మణిగి ఉండు” అన్నాడు. యెహోవా దూత ఇంకా ఇలా చెప్పాడు. “నీ సంతానానికి తప్పకుండా ఆధిక్యత కలిగిస్తాను. అది లెక్క పెట్టడానికి వీలు లేనంతగా అయ్యేలా చేస్తాను” అని ఆమెకు చెప్పాడు. తరువాత యెహోవా దూత “ఇలా చూడు, యెహోవా నీ మొర విన్నాడు. ఇప్పుడు నువ్వు గర్భవతిగా ఉన్నావు. నీకు కొడుకు పుడతాడు. అతనికి ఇష్మాయేలు అనే పేరు పెడతావు. అతడు అడవి గాడిదలా స్వేచ్ఛాజీవిగా ఉంటాడు. అందరూ అతనికి విరోధంగా ఉంటారు. అతడు ప్రతి ఒక్కరికీ తూర్పు దిక్కున నివసిస్తాడు. అతడు తన సోదరులకు వేరుగా నివసిస్తాడు” అని ఆమెకు చెప్పాడు. అప్పుడు ఆమె “నన్ను చూసినవాడు నాకు నిజంగా కనిపించాడు కదా!” అంది. అందుకనే తనతో మాట్లాడిన యెహోవాకు “నన్ను చూస్తున్న దేవుడివి నువ్వే” అనే పేరు పెట్టింది. దీన్ని బట్టి ఆ నీటి ఊటకి “బెయేర్‌ లహాయి రోయి” అనే పేరు వచ్చింది. అది కాదేషుకీ బెరెదుకీ మధ్యలో ఉంది. తరువాత హాగరు అబ్రాము కొడుక్కి జన్మనిచ్చింది. హాగరు ద్వారా పుట్టిన తన కుమారుడికి అబ్రాము ఇష్మాయేలు అనే పేరు పెట్టాడు. అబ్రాము కొడుకు ఇష్మాయేలుకు హాగరు జన్మనిచ్చినప్పుడు అబ్రాము వయస్సు ఎనభై ఆరేళ్ళు.

షేర్ చేయి
Read ఆదికాండము 16

ఆదికాండము 16:1-16 పవిత్ర బైబిల్ (TERV)

అబ్రాము భార్య శారయి. ఆమెకు, అబ్రాముకు పిల్లలు లేరు. శారయికి ఈజిప్టుకు చెందిన పని పిల్ల ఉంది. ఆమె పేరు హాగరు. శారయి అబ్రాముతో యిలా చెప్పింది: “చూడండి, నాకు పిల్లలు పుట్టకుండా చేశాడు యెహోవా. కనుక మీరు నా పనిమనిషితో పొండి. ఆమె ద్వారా పుట్టే శిశువును నా స్వంత శిశువుగా నేను స్వీకరిస్తాను.” తన భార్య శారయి మాట అబ్రాము విన్నాడు. కనాను దేశంలో అబ్రాము పది సంవత్సరాలు జీవించిన తర్వాత ఇది జరిగింది. హాగరును తన భర్త అబ్రాముకు శారయి యిచ్చింది. (హాగరు ఈజిప్టు నుండి వచ్చిన దాసి). అబ్రాము వల్ల హాగరు గర్భవతి అయింది. హాగరు ఇది గమనించినప్పుడు. ఆమె చాలా గర్వపడి, తన యజమానురాలైన శారయికంటే తాను గొప్పదాన్ని అని తలంచడం మొదలు పెట్టింది. అయితే శారయి అబ్రాముతో, “నా పనిమనిషి ఇప్పుడు నన్నే అసహ్యించుకొంటుంది. దీనికి నేను నిన్నే నిందిస్తాను. ఆమెను నేను నీకు ఇచ్చాను. ఆమె గర్భవతి అయింది. అయితే ఆమె నాకంటే గొప్పదని భావిస్తుంది. మనలో ఎవరు సరియైనవాళ్లో యెహోవాయే నిర్ణయించాలని నేను కోరుతున్నాను” అని అనింది. కాని అబ్రాము శారయితో, “హాగరుకు నీవు యజమానురాలివి, నీ యిష్టం వచ్చినట్లు నీవు ఆమెకు చేయవచ్చు” అన్నాడు. అందుచేత శారయి తన పనిమనిషిని చాలా చులకనగా చూసింది. ఆ పనిమనిషి పారిపోయింది. ఎడారిలో నీటి ఊట దగ్గర యెహోవా దూతకు ఆ పనిమనిషి కనబడింది. షూరు మార్గంలో ఆ ఊట ఉంది. “హాగరూ, నీవు శారయి పనిమనిషివి గదూ! ఇక్కడెందుకు ఉన్నావు? నీవు ఎక్కడికి వెళ్తున్నావు?” అని ఆ దూత అడుగగా, “నా యజమానురాలు శారయి నుండి పారిపోతున్నాను” అని చెప్పింది హాగరు. “నీ యజమానురాలి దగ్గరకు నీవు తిరిగి వెళ్లు, ఆమెకు లోబడి నడుచుకో” అని యెహోవా దూత ఆమెతో చెప్పడం జరిగింది. “నీలో నుండి అనేక జనములు వస్తారు. వారు చాలామంది ఉంటారు గనుక వాళ్లను లెక్కపెట్టడం కూడ కుదరదు” అని కూడ యెహోవా దూత చెప్పడం జరిగింది. ఇంకా యెహోవా దూత, “ఇప్పుడు నీవు గర్భవతివి, మరి నీకు ఒక కుమారుడు పుడ్తాడు. అతనికి ఇష్మాయేలు అని పేరు పెడతావు. ఎందుచేతనంటే, నీ కష్టాల్ని గూర్చి యెహోవా విన్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఇష్మాయేలు అడవి గాడిదలా అదుపులేక, స్వేచ్ఛగా ఉంటాడు అతడు అందరికి వ్యతిరేకమే ప్రతి ఒక్కరూ అతనికి వ్యతిరేకమే తన సోదరులకు దగ్గరగా అతడు నివసిస్తాడు కాని అతడు వారికి వ్యతిరేకంగా ఉంటాడు.” అని చెప్పాడు. ఆ పనిమనిషితో యెహోవా మాట్లాడాడు. దేవునికి ఆమె ఒక క్రొత్త పేరు ప్రయోగించింది. “నన్ను చూసే దేవుడవు నీవు” అని ఆయనతో చెప్పింది. “ఈ స్థలంలో కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, రక్షిస్తున్నాడు” అని అనుకొన్నందువల్ల ఆమె ఇలా చెప్పింది. కనుక ఆ బావి బెయేర్ లహాయిరోయి అని పిలువబడింది. కాదేషుకు బెరెదుకు మధ్య ఉంది ఆ బావి. హాగరు ఒక కుమారునికి జన్మనిచ్చింది. ఆ కుమారునికి ఇష్మాయేలు అని అబ్రాము పేరు పెట్టాడు. హాగరుకు ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రాము వయస్సు 86 సంవత్సరాలు.

షేర్ చేయి
Read ఆదికాండము 16

ఆదికాండము 16:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి యుండెను. కాగా శారయి–ఇదిగో నేను పిల్లలు కనకుండ యెహోవా చేసియున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము; ఒకవేళ ఆమెవలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను; అబ్రాము శారయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్యయైన శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయురాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతి నైతినని తెలిసికొనినప్పుడు దాని యజమానురాలు దానిదృష్టికి నీచమైనదాయెను. అప్పుడు శారయి– నా ఉసురు నీకు తగులును; నేనే నా దాసిని నీ కౌగిటి కిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలిసికొనినప్పుడు నేను దానిదృష్టికి నీచమైనదాననైతిని; నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము–ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది; నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్దనుండి అది పారిపోగా యెహోవాదూత అరణ్యములో నీటిబుగ్గయొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద, ఆమెను కనుగొని –శారయి దాసివైన హాగరూ, ఎక్కడనుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్లుచున్నావని అడిగినందుకు అది–నా యజమానురాలైన శారయియొద్దనుండి పారిపోవుచున్నాననెను. అప్పుడు యెహోవాదూత– నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవాదూత–నీ సంతానమును నిశ్చయముగా విస్త రింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవు నని దానితో చెప్పెను. మరియు యెహోవాదూత– ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు; అతడు అడవిగాడిదవంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా అది–చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటిబుగ్గకు బెయేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేషుకును బెరెదుకును మధ్య నున్నది. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము ఎనుబదియారు ఏండ్ల వాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 16

ఆదికాండము 16:1-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అబ్రాము భార్యయైన శారాయి వలన అతనికి పిల్లలు పుట్టలేదు. అయితే ఆమెకు ఈజిప్టు నుండి వచ్చిన దాసి ఉంది, ఆమె పేరు హాగరు; కాబట్టి శారాయి అబ్రాముతో, “యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశారు. నీవు వెళ్లి నా దాసితో లైంగికంగా కలువు; బహుశ ఆమె ద్వార నాకు సంతానం కలుగుతుందేమో” అని అన్నది. శారాయి చెప్పిన దానికి అబ్రాము అంగీకరించాడు. అబ్రాము కనానులో పది సంవత్సరాలు నివసించిన తర్వాత, శారాయి ఈజిప్టు నుండి దాసిగా తెచ్చుకున్న హాగరును తన భర్తకు భార్యగా ఇచ్చింది. అతడు హాగరును లైంగికంగా కలిశాడు, ఆమె గర్భవతి అయ్యింది. తాను గర్భవతినని ఆమె తెలుసుకున్నప్పుడు తన యజమానురాలైన శారాయిని చిన్న చూపు చూసింది. అప్పుడు శారాయి అబ్రాముతో, “నేను అనుభవించే బాధకు నీవే బాధ్యుడవు. నా దాసిని నీ చేతిలో పెట్టాను, ఇప్పుడు తాను గర్భవతి కాబట్టి నన్ను చిన్న చూపు చూస్తుంది. యెహోవా నీకు నాకు మధ్య తీర్పు తీర్చును గాక” అని అన్నది. అబ్రాము శారాయితో, “నీ దాసి నీ చేతిలో ఉంది, నీకు ఏది మంచిదనిపిస్తే అది తనకు చేయి” అన్నాడు. శారాయి హాగరును వేధించింది కాబట్టి ఆమె శారాయి దగ్గర నుండి పారిపోయింది. యెహోవా దూత హాగరు ఎడారిలో నీటిబుగ్గ దగ్గర ఉండడం చూశాడు; అది షూరు మార్గం ప్రక్కన ఉండే నీటిబుగ్గ. ఆ దూత, “శారాయి దాసియైన హాగరూ, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగాడు. ఆమె, “నా యజమానురాలైన శారాయి దగ్గర నుండి వెళ్లిపోతున్నాను” అని జవాబిచ్చింది. అప్పుడు యెహోవా దూత ఆమెతో, “నీ యజమానురాలి దగ్గరకు తిరిగివెళ్లి ఆమెకు లోబడి ఉండు” అని చెప్పాడు. యెహోవా దూత ఇంకా మాట్లాడుతూ, “నీ సంతానాన్ని లెక్కించలేనంత అధికం చేస్తాను” అని చెప్పాడు. యెహోవా దూత ఆమెతో ఇలా కూడా చెప్పాడు: “ఇప్పుడు నీవు గర్భవతివి నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు, యెహోవా నీ బాధ విన్నారు కాబట్టి అతనికి ఇష్మాయేలు అని నీవు పేరు పెడతావు. అతడు ఒక అడవి గాడిదలాంటి మనుష్యుడు; అందరితో అతడు విరోధం పెట్టుకుంటాడు, అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి, అతడు తన సోదరులందరితో శత్రుత్వం కలిగి జీవిస్తాడు.” ఆమె తనతో మాట్లాడిన యెహోవాకు ఈ పేరు పెట్టింది: “నన్ను చూస్తున్న దేవుడు మీరే.” ఆమె, “నన్ను చూస్తున్న దేవుని నేను వెనుక నుండి చూశాను” అని అన్నది. అందుకే ఆ బావికి బెయేర్-లహాయి-రోయి అని పేరు వచ్చింది; అది కాదేషు బెరెదు మధ్యలో ఇప్పటికి ఉంది. హాగరు అబ్రాముకు కుమారుని కన్నది, అబ్రాము అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టాడు. హాగరు ఇష్మాయేలుకు జన్మనిచ్చినప్పుడు అబ్రాము వయస్సు ఎనభై ఆరేళ్ళు.

షేర్ చేయి
Read ఆదికాండము 16