ఆదికాండము 15:6-18

ఆదికాండము 15:6-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అబ్రాము యెహోవాను నమ్మాడు, ఆయన దాన్ని అతనికి నీతిగా ఎంచారు. అంతేకాక దేవుడు అతనితో, “ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి నిన్ను కల్దీయుల ఊరు నుండి బయటకు తీసుకువచ్చిన యెహోవాను నేనే” అని చెప్పారు. అయితే అబ్రాము, “ప్రభువైన యెహోవా, దీనిని నేను స్వాస్థ్యంగా పొందుతానని నాకెలా తెలుస్తుంది?” అని అడిగాడు. అందుకు యెహోవా అతనితో, “ఒక దూడను, ఒక మేకను, ఒక పొట్టేలును, అన్నీ మూడు సంవత్సరాలవై ఉండాలి, వాటితో పాటు ఒక గువ్వను, ఒక పావురాన్ని నా దగ్గరకు తీసుకురా” అని చెప్పారు. అబ్రాము వాటన్నిటిని తెచ్చి, వాటిని సగానికి రెండు ముక్కలుగా కోసి, దేనికది ఎదురెదురుగా పేర్చాడు; అయితే అతడు పక్షులను మాత్రం సగం చేయలేదు. ఆ కళేబరాలపై వాలడానికి రాబందులు వచ్చాయి అయితే అబ్రాము వాటిని వెళ్లగొట్టాడు. సూర్యాస్తమయం అవుతుండగా అబ్రాముకు గాఢనిద్ర పట్టింది, భయంకరమైన కారుచీకటి అతని మీదుగా కమ్ముకుంది. అప్పుడు యెహోవా అబ్రాముతో ఇలా చెప్పారు, “నీవు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి; నీ వారసులు తమది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరాయివారిగా ఉంటారు, అక్కడ వారు బానిసలుగా ఉంటూ వేధించబడతారు. అయితే వారిని బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను, ఆ తర్వాత గొప్ప ఆస్తులతో వారు బయటకు వస్తారు. నీవైతే సమాధానంగా నీ పూర్వికుల దగ్గరకు చేరతావు, మంచి వృద్ధాప్యంలో పాతిపెట్టబడతావు. నీ సంతానంలో నాలుగవ తరం వారు ఇక్కడకు తిరిగి వచ్చేస్తారు, ఎందుకంటే ఇంకా అమోరీయుల పాపం పండలేదు.” సూర్యుడు అస్తమించి చీకటి కమ్మినప్పుడు పొగలేస్తున్న కుంపటి, మండుతున్న దివిటీ కనిపించి, ఆ ముక్కల మధ్యలో నుండి దాటి వెళ్లాయి. ఆ రోజు యెహోవా అబ్రాముతో నిబంధన చేసి, “నేను నీ సంతానానికి ఈజిప్టు వాగు నుండి యూఫ్రటీసు మహా నది వరకు అంటే

ఆదికాండము 15:6-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అతడు యెహోవాను నమ్మాడు. ఆ నమ్మకాన్నే ఆయన అతనికి నీతిగా పరిగణించాడు. యెహోవా “నీకు ఈ ప్రదేశాన్ని వారసత్వంగా ఇవ్వడానికి కల్దీయుల ఊర్ అనే పట్టణంలో నుంచి నిన్ను ఇవతలకు తీసుకువచ్చిన యెహోవాను నేనే” అని చెప్పినప్పుడు అతడు “ప్రభూ యెహోవా, ఇది నాకు సొంతం అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?” అన్నాడు. ఆయన “మూడేళ్ళ వయసు ఉన్న ఒక దూడ, ఒక మేక, ఒక పొట్టేలు, ఒక తెల్ల గువ్వ, ఒక పావురం పిల్లను నా దగ్గరికి తీసుకురా” అని అతనితో చెప్పాడు. అతడు వాటిని తీసుకుని వాటిని సగానికి రెండు ముక్కలుగా నరికి, రెండు సగాలను ఎదురెదురుగా పెట్టాడు. పక్షులను మాత్రం ఖండించలేదు. ఆ మృతదేహాల మీద గద్దలు వాలగా అబ్రాము వాటిని తోలివేశాడు. చీకటి పడుతున్నప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టింది. భయం కలిగించే చిమ్మచీకటి అతణ్ణి ఆవరించింది. ఆయన “దీన్ని కచ్చితంగా తెలుసుకో. నీ వారసులు తమది కాని దేశంలో పరదేశులుగా నివాసం ఉంటారు. ఆ దేశవాసులకు బానిసలుగా నాలుగు వందల సంవత్సరాలు అణచివేతకు గురి అవుతారు. వీళ్ళు దాసులుగా ఉన్న ఆ దేశానికి నేను తీర్పు తీరుస్తాను. ఆ తరువాత వాళ్ళు అపారమైన సంపదతో బయటకు వస్తారు. కాని, నువ్వు నీ తండ్రుల దగ్గరికి ప్రశాంతంగా చేరుకుంటావు. పండు ముసలితనంలో నువ్వు మరణించగా నిన్ను పాతిపెడతారు. అమోరీయుల అక్రమం ఇంకా హద్డు మీరలేదు గనుక, నీ నాలుగవ తరం మనుషులు ఇక్కడికి తిరిగి వస్తారని కచ్చితంగా తెలుసుకో” అని అబ్రాముతో చెప్పాడు. సూర్యుడు అస్తమించి చీకటి పడినప్పుడు, పొగ లేస్తున్న కొలిమి, మండుతున్న కాగడా దిగివచ్చి పేర్చిన మాంస ఖండాల మధ్యగా దాటుకుంటూ వెళ్ళాయి. ఆ రోజున యెహోవా “ఐగుప్తు నది నుంచి, పేరుగాంచిన యూఫ్రటీసు నది వరకూ ఉన్న ఈ ప్రదేశాన్ని నీ వారసులకు ఇస్తాను.

ఆదికాండము 15:6-18 పవిత్ర బైబిల్ (TERV)

అబ్రాము దేవుణ్ణి నమ్మాడు, అబ్రాముయొక్క విశ్వాసాన్ని దేవుడు నీతిగా అంగీకరించాడు. అబ్రాముతో దేవుడు ఇలా అన్నాడు, “కల్దీయుల ఊరు అను పట్టణము నుండి నిన్ను బయటకు నడిపించిన యెహోవాను నేనే. ఈ దేశాన్ని నీకు ఇచ్చేందుకు నేను అలా చేశాను. ఈ దేశం నీ స్వంతం అవుతుంది.” అయితే అబ్రాము, “యెహోవా, నా ప్రభువా, ఈ దేశం నాదే అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?” అన్నాడు. అబ్రాముతో దేవుడు అన్నాడు: “మనం ఒక ఒడంబడిక చేసుకొందాం. మూడు సంవత్సరాల ఆవు ఒకటి, మూడు సంవత్సరాల మేక ఒకటి, మూడు సంవత్సరాల పొట్టేలు ఒకటి తీసుకురా. ఇంకా నా కోసం ఒక పావురాన్ని, ఒక చిన్న పావురాన్ని తీసుకురా.” దేవుని కోసం వీటన్నిటిని అబ్రాము తెచ్చాడు. ఆ జంతువులన్నింటిని చంపి ఒక్కోదాన్ని రెండేసి ముక్కలు చేశాడు, తర్వాత అబ్రాము ఈ భాగాలను ఒకదానికొకటి ఎదురెదురుగా వేశాడు. పక్షులను రెండు భాగాలుగా అబ్రాము ఖండించలేదు. తర్వాత ఈ జంతువులను తినటానికి పెద్ద పక్షులు వచ్చి వాలాయి. కాని అబ్రాము వాటిని వెళ్లగొట్టేశాడు. తర్వాత ఆ రోజు సూర్యుడు అస్తమిస్తున్నాడు. అబ్రాముకు బాగా నిద్ర వచ్చి నిద్రపోయాడు. అతడు నిద్రపోతూ ఉండగా భయంకర గాఢ చీకటి కమ్మింది. అప్పుడు అబ్రాముతో యెహోవా ఇలా చెప్పాడు: “ఈ సంగతులు నీవు తెలుసుకోవాలి, నీ సంతానము విదేశీయులై, వారి స్వంతం కాని దేశంలో అపరిచితులుగా ఉంటారు. వారు అక్కడ బానిసలుగా ఉంటారు. ఇంకా, 400 సంవత్సరాలు కఠినంగా వాళ్లు శ్రమ పెట్టబడతారు. అయితే వాళ్లకు యజమానిగా ఉన్న దేశాన్ని, 400 సంవత్సారాల తరువాత నేను శిక్షిస్తాను. మరి నీ ప్రజలేమో ఆ దేశాన్ని విడిచిపెట్టేస్తారు. నీ ప్రజలు వెళ్లిపోయేటప్పుడు విస్తారమైన ఆస్తులను వారితో తీసుకొనిపోతారు. “నీవు మట్టుకు చాలా వృద్ధాప్యం వరకు జీవిస్తావు, మనశ్శాంతితో నీవు మరణిస్తావు. నీ వంశం వారితో నీవు పాతిపెట్టబడతావు. నాలుగు తరాల తర్వాత నీ ప్రజలు మరల ఈ దేశం వస్తారు. ఆ సమయంలో అమోరీ ప్రజలను నీ ప్రజలు ఓడిస్తారు. అక్కడ నివసిస్తోన్న అమోరీ ప్రజలను శిక్షించటానికి నీ ప్రజలను నేను వాడుకొంటాను. ఇది భవిష్యత్తులో జరుగుతుంది. ఎందుచేతనంటే, శిక్షకు తగినంత చెడుతనం ఇప్పుడు అమోరీ ప్రజల్లో లేదు.” సూర్యుడు అస్తమించాక, చాలా చీకటి పడింది, చచ్చిన జంతువులు రెండేసి ముక్కలుగా ఖండించబడి, ఇంకా అక్కడే నేలమీద పడి ఉన్నాయి. ఆ సమయంలో పొగమంటల వరుస చచ్చిన జంతువుల రెండేసి ముక్కల మధ్యగా సాగిపోయింది. దేవుడు అబ్రాముతో చేసుకొన్న ఒప్పందానికి ఇది ఒక “ముద్ర” లేక “సంతకం.” ఆ రోజుల్లో, కోయబడ్డ జంతువుల ముక్కల మధ్య నడవడం అనే ఒడంబడిక ఆ మనిషి యొక్క నిజాయితీని తెలుపుతుంది. “నేను ఈ ఒడంబడికను అనుసరించకపోతే ఇదే నాకు జరుగనీ” అన్నది దీని అర్థం. కనుక ఆనాడు ఒక వాగ్దానాన్ని, ఒక ఒడంబడికను అబ్రాముతో యెహోవా చేశాడు. యెహోవా అన్నాడు: “ఈ దేశాన్ని నీ సంతానమునకు నేను ఇస్తాను. ఈజిప్టు నదికి, యూఫ్రటీసు నదికి మధ్య ఉన్న దేశాన్ని నేను వారికి ఇస్తాను.

ఆదికాండము 15:6-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన–నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు–ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించుకొనెదనని నాకెట్లు తెలియుననగా ఆయన–మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్లగువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కళేబరములమీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగ్రుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్ర పట్టెను. భయంకరమైన కటికచీకటి అతని కమ్మగా ఆయన–నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయె దవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను. మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్నపొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండములమధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవా–ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా

ఆదికాండము 15:6-18

ఆదికాండము 15:6-18 TELUBSI