ఆదికాండము 15:1-5
ఆదికాండము 15:1-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ సంగతులు జరిగిన తరువాత యెహోవా దూత అబ్రాముకు దర్శనమిచ్చాడు. “అబ్రామూ, భయపడకు! నేనే నీకు డాలును, గొప్ప బహుమానాన్ని” అన్నాడు. అబ్రాము “ప్రభూ యెహోవా, నాకేం ఇస్తావు? నేను సంతానం లేనివాడిగా ఉండిపోతున్నాను కదా. దమస్కు వాడైన ఎలీయెజెరే నా ఆస్తికి వారసుడు అవుతాడు కదా! నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు గనుక, చూడు, నా సేవకుల్లో ఒకడు నాకు వారసుడు అవుతాడు” అన్నాడు. యెహోవా వాక్కు అతని దగ్గరికి వచ్చి “ఇతడు నీ వారసుడు కాడు. నీ ద్వారా నీకు పుట్టబోయేవాడే నీ వారసుడు అవుతాడు” అన్నాడు. ఆయన అతణ్ణి బయటకు తీసుకువచ్చి “నువ్వు ఆకాశం వైపు చూసి, ఆ నక్షత్రాలు లెక్కపెట్టడం నీకు చేతనైతే లెక్కపెట్టు” అని చెప్పి “నీ సంతానం కూడా అలా అవుతుంది” అని చెప్పాడు.
ఆదికాండము 15:1-5 పవిత్ర బైబిల్ (TERV)
ఈ సంగతులన్నీ జరిగాక, ఒక దర్శనంలో అబ్రాముకు యెహోవా వాక్కు వచ్చి, “అబ్రామా, భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. నేను నీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాను” అని దేవుడు అన్నాడు. అయితే అబ్రాము అన్నాడు: “యెహోవా దేవా, నన్ను సంతోష పెట్టగలిగేందుకు నీవు ఇవ్వగలిగింది ఏదీ లేదు. ఎందుచేతనంటే నాకు కుమారుడు లేడు. కనుక నేను చనిపోయిన తర్వాత, నా సేవకుడును దమస్కువాడైన ఎలీయెజెరు నా ఆస్తి అంతటికి వారసుడు అవుతాడు. చూడు దేవా, నాకు నీవు కుమారుణ్ణి ఇవ్వలేదు. కనుక నా ఇంటిలో పుట్టిన సేవకుడు నాకు ఉన్న ఆస్తి అంతా దక్కించుకొంటాడు,” అప్పుడు అబ్రాముతో యెహోవా మాట్లాడాడు: “నీకు ఉన్నవాటన్నింటిని పొందేవాడు నీ సేవకుడు కాదు. నీకు ఒక కుమారుడు కలుగుతాడు. నీకు ఉన్నవాటన్నింటిని నీ కుమారుడు పొందుతాడు.” అంతట దేవుడు అబ్రామును గుడారము బయటకు తీసుకొని వెళ్లి, ఇలా చెప్పాడు: “ఆకాశం చూడు, అక్కడ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చూడు. అవి చాలా ఉన్నాయి. నీవు లెక్కపెట్టలేవు. భవిష్యత్తులో నీ కుటుంబం అలాగే ఉంటుంది.”
ఆదికాండము 15:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇవి జరిగినతరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి–అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము–ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా మరియు అబ్రాము–ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి –ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి–నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి–నీ సంతానము ఆలాగవునని చెప్పెను.
ఆదికాండము 15:1-5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఈ సంఘటనల తర్వాత దర్శనంలో యెహోవా వాక్కు అబ్రాము వద్దకు వచ్చి: “అబ్రామూ, భయపడకు, నేను నీకు డాలును, నీ గొప్ప బహుమానాన్ని.” అయితే అబ్రాము, “ప్రభువైన యెహోవా, నాకు సంతానం లేదు కదా మీరు నాకేమిచ్చినా ఏం లాభం? నా ఆస్తికి వారసుడు దమస్కువాడైన ఎలీయెజెరే కదా” అని అన్నాడు. ఇంకా అబ్రాము దేవునితో, “మీరు నాకు సంతానం ఇవ్వలేదు, కాబట్టి నా ఇంటి పనివారిలో ఒకడు నా వారసుడవుతాడు” అని అన్నాడు. అప్పుడు యెహోవా వాక్కు అతని వద్దకు వచ్చింది: “ఈ మనుష్యుడు నీకు వారసుడు కాడు, కాని నీ రక్తమాంసాలను పంచుకుని పుట్టేవాడే నీకు వారసుడు.” దేవుడు అబ్రామును బయటకు తీసుకువచ్చి, “పైన ఆకాశాన్ని చూసి నీకు చేతనైతే నక్షత్రాలను లెక్కబెట్టు. నీ సంతానం అలా ఉంటుంది” అని చెప్పారు.