ఆదికాండము 14:8-12
ఆదికాండము 14:8-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము, బెల (సోయరు) రాజులు బయలుదేరి సిద్దీము లోయలో ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు అనే నలుగురితో ఈ ఐదుగురు రాజులు యుద్ధం చేశారు. ఆ సిద్దీము లోయలో తారు బంక గుంటలు ఎక్కువగా ఉన్నాయి. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడ్డారు. మిగిలిన వాళ్ళు కొండలకు పారిపోయారు. అప్పుడు వాళ్ళు సొదొమ గొమొర్రాల ఆస్తి అంతటినీ వాళ్ళ భోజన పదార్ధాలన్నిటినీ దోచుకున్నారు. ఇంకా అబ్రాము సోదరుడి కొడుకు లోతు సొదొమలో కాపురం ఉన్నాడు గనుక అతణ్ణి, అతని ఆస్తిని కూడా దోచుకుని తీసుకుపోయారు.
ఆదికాండము 14:8-12 పవిత్ర బైబిల్ (TERV)
ఆ సమయంలో సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయీము రాజు, బెల రాజు (బెల అంటె సోయరు) కలసి వారి శత్రువుల మీద సిద్దీము లోయలో యుద్ధం చేయటానికి వెళ్లారు. ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు మీద వారు యుద్ధము చేశారు. అందుచేత ఈ నలుగురు రాజులు ఆ ఐదుగురితో యుద్ధం చేశారు. సిద్దీం లోయలో తారుతో నింపబడ్డ గుంటలు చాలా ఉన్నాయి. సొదొమ, గొమొర్రాల రాజులు వారి సైన్యాలు పారిపోయారు. చాలా మంది సైనికులు ఆ గుంటల్లో పడిపోయారు. అయితే మిగిలినవాళ్లు కొండల్లోకి పారిపోయారు. కనుక సొదొమ, గొమొర్రా ప్రజల ఆస్తినంతా వారి శత్రువులు తీసుకుపోయారు. వారి బట్టలు, భోజనం అంతా తీసుకొని వారు వెళ్లిపోయారు. అబ్రాము సోదరుని కుమారుడు లోతు సొదొమలో నివసిస్తుండగా శత్రువు అతణ్ణి బంధించాడు. అతని ఆస్తి మొత్తం తీసుకొని శత్రువు వెళ్లిపోయాడు.
ఆదికాండము 14:8-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు సొదొమ రాజును గొమొఱ్ఱా రాజును అద్మా రాజును సెబోయీము రాజును సోయరను బెల రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు గోయీయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ యైదుగురు రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొఱ్ఱాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించినవారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొఱ్ఱాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నియు పట్టుకొనిపోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొనిపోగా
ఆదికాండము 14:8-12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు సిద్దీం లోయలో సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయిము రాజు, బేల (సోయరు) రాజు తమ సైన్యాలతో, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీము రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, అంటే నలుగురు రాజులు అయిదుగురు రాజులతో యుద్ధం చేశారు. సిద్దీము లోయ అంతా కీలుమట్టి గుంటలు ఉన్నాయి. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోతూ ఉన్నప్పుడు, కొంతమంది వాటిలో పడిపోయారు మిగిలినవారు కొండల్లోకి పారిపోయారు. ఆ నలుగురు రాజులు సొదొమ గొమొర్రాల ఆస్తిపాస్తులను, భోజన పదార్థాలను అన్నిటిని దోచుకున్నారు; తర్వాత వారు వెళ్లిపోయారు. అబ్రాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో నివసిస్తున్నాడు కాబట్టి, అతన్ని కూడా అతని ఆస్తితో పాటు తీసుకెళ్లారు.