ఆదికాండము 13:1-4
ఆదికాండము 13:1-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అబ్రాము తనకు కలిగిన వాటినన్నిటినీ, తన భార్యనూ, తనతో ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుంచి నెగెబుకు వెళ్ళాడు. అబ్రాము చాలా ధనవంతుడు. అతనికి వెండి, బంగారం, పశువులు ఉన్నాయి. అతడు ప్రయాణం చేసి దక్షిణం నుంచి బేతేలు వరకూ అంటే బేతేలుకు, హాయికి మధ్య మొదట తన గుడారం ఉన్న స్థలానికి వెళ్ళాడు. అతడు మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చాడు. అక్కడ అబ్రాము యెహోవా పేరట ప్రార్థన చేశాడు.
ఆదికాండము 13:1-4 పవిత్ర బైబిల్ (TERV)
కనుక అబ్రాము ఈజిప్టును విడిచిపెట్టాడు. తన భార్యను, స్వంతంగా తనకు ఉన్నదంతా తీసుకొని, నెగెబుగుండా అబ్రాము ప్రయాణం చేశాడు. లోతు కూడా వాళ్లతో ఉన్నాడు. ఈ సమయానికి అబ్రాము చాలా ఐశ్వర్యవంతుడు. అతనికి చాలా విస్తారంగా పశువులు ఉన్నాయి. చాలా వెండి, బంగారం ఉన్నాయి. అబ్రాము చుట్టుప్రక్కల సంచరిస్తూనే ఉన్నాడు. నెగెబును విడిచిపెట్టి మళ్లీ వెనుకకు బేతేలుకు వెళ్లాడు. బేతేలు పట్టణానికి, హాయి పట్టణానికి మధ్యనున్న చోటుకు అతడు వెళ్లాడు. ఇంతకు ముందు అబ్రాము నివసించిన స్థలమే ఇది. అబ్రాము ఒక బలిపీఠాన్ని నిర్మించిన స్థలమిది. కనుక ఈ స్థలంలో అబ్రాము యెహోవాను ఆరాధించాడు.
ఆదికాండము 13:1-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతోకూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులోనుండి నెగెబునకు వెళ్లెను. అబ్రాము వెండి బంగారము పశువులుకలిగి బహు ధనవంతుడై యుండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణమునుండి బేతేలువరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమువరకు వెళ్లి తాను మొదట బలిపీఠమును కట్టినచోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను.
ఆదికాండము 13:1-4 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అబ్రాము తన భార్యను తనకున్న అంతటిని తీసుకుని ఈజిప్టు నుండి దక్షిణ దేశానికి వెళ్లాడు, లోతు అతనితో పాటు వెళ్లాడు. అబ్రాము పశువులు, వెండి బంగారాలతో ఎంతో ధనవంతుడయ్యాడు. దక్షిణం నుండి బయలుదేరి బేతేలుకు వచ్చేవరకు, అంటే బేతేలుకు హాయికి మధ్యలో తాను మొదట గుడారం వేసుకున్న చోటికి వెళ్లి, తాను మొదట బలిపీఠం కట్టిన చోటుకు చేరుకున్నాడు. అక్కడ అబ్రాము యెహోవాకు ప్రార్థన చేశాడు.