ఆదికాండము 1:27-31
ఆదికాండము 1:27-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు. దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు. దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి. భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది. దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఆరవ రోజు.
ఆదికాండము 1:27-31 పవిత్ర బైబిల్ (TERV)
కనుక దేవుడు తన స్వంత రూపంలో మనుష్యుల్ని చేశాడు. తన ప్రతిరూపంలో దేవుడు మనుష్యుల్ని చేశాడు. దేవుడు వారిని మగ, ఆడ వారిగా చేశాడు. దేవుడు, వారిని “ఇంకా అనేక మంది ప్రజలు ఉండునట్లు పిల్లలను కనండి. భూమిమీద నిండిపోయి, దానిని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపల మీద, గాలిలో పక్షుల మీద ఏలుబడి చేయండి. భూమి మీద సంచరించే ప్రతి ప్రాణిమీద ఏలుబడి చేయండి” అని ఆశీర్వదించాడు. “ఆహార ధాన్యపు మొక్కలన్నింటిని, ఫలవృక్షాలు అన్నింటిని నేను మీకు ఇస్తున్నాను. ఆ చెట్లు విత్తనాలు గల పండ్లను పండిస్తాయి. ఈ ఆహార ధాన్యం, పండ్లు మీ ఆహారం అవుతుంది. మరియు పచ్చ మొక్కలు అన్నింటిని జంతువులకు నేను ఇస్తున్నాను. ఆ పచ్చ మొక్కలు వాటికి ఆహారం అవుతాయి. భూమిమీద ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి, భూమిమీద ప్రాకుచుండు చిన్న ప్రాణులు అన్నీ ఆ ఆహారాన్ని తింటాయి” అని దేవుడు చెప్పాడు. ఈ సంగతులు అన్నీ జరిగాయి. దేవుడు తాను చేసినది అంతా చూశాడు. అది అంతా చాలా చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది. అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది ఆరవ రోజు.
ఆదికాండము 1:27-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా–మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు– ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీ కిచ్చియున్నాను; అవి మీ కాహారమగును. భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగు నని పలికెను. ఆప్రకారమాయెను. దేవుడు తాను చేసి నది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.
ఆదికాండము 1:27-31 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి దేవుడు తన స్వరూపంలో నరులను సృజించారు, దేవుని స్వరూపంలో వారిని సృజించారు; వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించారు. దేవుడు వారితో, “మీరు ఫలించి, వృద్ధి చెంది, భూలోకమంతా విస్తరించి, దానిని లోబరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, నేలపై ప్రాకే ప్రతి జీవిని ఏలండి” అని చెప్పి ఆశీర్వదించారు. అప్పుడు దేవుడు, “భూమిపై విత్తనాలు ఇచ్చే ప్రతి మొక్కను, విత్తనాలు గల ఫలమిచ్చే ప్రతి చెట్టును మీకు ఆహారంగా ఇస్తున్నాను. భూమిపై ఉన్న మృగాలన్నిటికి, ఆకాశ పక్షులన్నిటికి, నేలపై ప్రాకే జీవులన్నిటికి, జీవం ఉన్న ప్రతీ దానికి ప్రతి పచ్చని మొక్కను ఆహారంగా ఇస్తున్నాను” అని అన్నారు. అలాగే జరిగింది. దేవుడు తాను చేసిందంతా చూశారు. అది చాలా బాగుంది. సాయంకాలం గడిచి ఉదయం రాగా అది ఆరవరోజు.