ఆదికాండము 1:14-19
ఆదికాండము 1:14-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుడు “రాత్రి నుంచి పగలును వేరు చెయ్యడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. కాలాలకు, రోజులకు, సంవత్సరాలకు అవి సూచనలుగా ఉండాలి. భూమికి వెలుగు ఇవ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా అవి ఉండాలి” అన్నాడు. అలాగే జరిగింది. దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు. భూమికి వెలుగు ఇవ్వడానికీ, పగటినీ రాత్రినీ పాలించడానికీ, వెలుగునూ చీకటినీ వేరు చెయ్యడానికీ, దేవుడు ఆకాశ విశాలంలో వాటిని అమర్చాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-నాలుగో రోజు.
ఆదికాండము 1:14-19 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు, “ఆకాశంలో జ్యోతులు ఉండును గాక. ఈ జ్యోతులు రాత్రి నుండి పగలును వేరు చేస్తాయి. జ్యోతులు ప్రత్యేక సంకేతాలను, ప్రత్యేక సమావేశాల ప్రారంభాన్ని సూచించేందుకు ఉపయోగించబడతాయి. మరియు రోజులను సంవత్సరాలను తెలుపుటకు అవి ఉపయోగించబడతాయి. భూమి మీద వెలుగును ప్రకాశింప చేయుటకు ఈ జ్యోతులు ఆకాశంలో ఉంటాయి” అని దేవుడు అన్నాడు. అలాగే జరిగింది. కనుక ఆ రెండు పెద్ద జ్యోతులను దేవుడు చేశాడు. పగటి వేళను ఏలుటకు దేవుడు పెద్ద జ్యోతిని చేశాడు. రాత్రి వేళను ఏలుటకు ఆయన చిన్న జ్యోతిని చేశాడు. దేవుడు నక్షత్రాలను కూడా చేశాడు. భూమి మీద ప్రకాశించుటకు ఈ జ్యోతులను దేవుడు ఆకాశంలో ఉంచాడు. పగటిని, రాత్రిని ఏలుటకు ఈ జ్యోతులను ఆకాశంలో ఉంచాడు. ఈ జ్యోతులు చీకటి నుండి వెలుగును వేరు చేశాయి. దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది. అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది నాలుగవ రోజు.
ఆదికాండము 1:14-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవుడు–పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలు గిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.
ఆదికాండము 1:14-19 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
దేవుడు, “పగలు రాత్రులను వేరు చేయడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుండాలి, అవి రుతువులను రోజులను సంవత్సరాలను సూచించే అసాధారణ గుర్తులుగా ఉండాలి. ఆకాశ విశాలంలో భూమికి వెలుగునిచ్చే జ్యోతులుండును గాక” అని అన్నారు, అలాగే జరిగింది. దేవుడు పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని అలా రెండు గొప్ప జ్యోతులను అలాగే నక్షత్రాలను కూడా చేశారు. భూమికి వెలుగునివ్వడానికి, పగటిని రాత్రిని పాలించడానికి, చీకటిని వెలుగును వేరు చేయడానికి, దేవుడు వాటిని ఆకాశ విశాలంలో అమర్చారు. అది మంచిదని దేవుడు చూశారు. సాయంకాలం గడిచి ఉదయం రాగా అది నాలుగవ రోజు.