ఆదికాండము 1:1-5
ఆదికాండము 1:1-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు. భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు. దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది. ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగునూ చీకటినీ వేరు చేశాడు. దేవుడు వెలుగుకు పగలు అనీ చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. సాయంత్రం అయింది, ఉదయం వచ్చింది, మొదటి రోజు.
ఆదికాండము 1:1-5 పవిత్ర బైబిల్ (TERV)
మొట్ట మొదట దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు. భూమి మొత్తం శూన్యంగా ఉండెను. భూమిమీద ఏమీ ఉండలేదు. మహా సముద్రాన్ని చీకటి ఆవరించి ఉండెను. దేవుని ఆత్మ నీళ్లమీద సంచరిస్తూ ఉండెను. అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక!” అన్నాడు. వెలుగు ప్రకాశించటం మొదలయింది. దేవుడు ఆ వెలుగును చూశాడు. ఆయనకు అది చక్కగా కనబడింది. అప్పుడు దేవుడు ఆ వెలుగును చీకటి నుండి వేరు చేశాడు. వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని దేవుడు పేరు పెట్టాడు. అస్తమయము అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది మొదటి రోజు.
ఆదికాండము 1:1-5 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు–వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
ఆదికాండము 1:1-5 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఆదిలో దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించారు. భూమి ఆకారం లేనిదిగా శూన్యంగా ఉంది; అగాధజలాల మీద చీకటి ఆవరించి ఉంది, దేవుని ఆత్మ నీళ్ల మీద అల్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక” అని అనగా వెలుగు కలిగింది. దేవుడు ఆ వెలుగు బాగుందని చూసి, వెలుగును చీకటిని వేరుచేశారు. దేవుడు వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని పేరు పెట్టారు. సాయంకాలం గడిచి ఉదయం వచ్చింది. అది మొదటి రోజు.