ఆదికాండము 1:1-27

ఆదికాండము 1:1-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు. భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు. దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది. ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగునూ చీకటినీ వేరు చేశాడు. దేవుడు వెలుగుకు పగలు అనీ చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. సాయంత్రం అయింది, ఉదయం వచ్చింది, మొదటి రోజు. దేవుడు “మహా జలరాశి మధ్యలో ఒక విశాల ప్రదేశం కలుగు గాక. అది నీళ్ళనుండి నీళ్ళను వేరు చేయు గాక” అన్నాడు. దేవుడు ఆ విశాలమైన ప్రదేశాన్ని చేసి, దాని పైన ఉన్న జలాలను, కింద ఉన్న జలాలను వేరు చేసాడు. అది అలాగే జరిగింది. దేవుడు ఆ విశాల ప్రదేశానికి “ఆకాశం” అని పేరు పెట్టాడు. రాత్రి అయింది, ఉదయం వచ్చింది, రెండవ రోజు. దేవుడు “ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది. దేవుడు ఆరిన నేలకు “భూమి” అని పేరు పెట్టాడు. కూర్చి ఉన్న జలాలకు “సముద్రాలు” అని పేరు పెట్టాడు. అది ఆయనకు మంచిదిగా అనిపించింది. దేవుడు “వృక్ష జాలాన్ని, విత్తనాలుండే చెట్లను, భూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించాలి” అన్నాడు. అలాగే జరిగింది. వృక్ష జాతిని, విత్తనాలుండే చెట్లను, భూమిమీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించింది. అది ఆయనకు మంచిదిగా కనబడింది. రాత్రి అయింది, ఉదయం వచ్చింది-మూడవ రోజు. దేవుడు “రాత్రి నుంచి పగలును వేరు చెయ్యడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. కాలాలకు, రోజులకు, సంవత్సరాలకు అవి సూచనలుగా ఉండాలి. భూమికి వెలుగు ఇవ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా అవి ఉండాలి” అన్నాడు. అలాగే జరిగింది. దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు. భూమికి వెలుగు ఇవ్వడానికీ, పగటినీ రాత్రినీ పాలించడానికీ, వెలుగునూ చీకటినీ వేరు చెయ్యడానికీ, దేవుడు ఆకాశ విశాలంలో వాటిని అమర్చాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-నాలుగో రోజు. దేవుడు “చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి. భూమిపై ఉన్న ఆకాశవిశాలంలో పక్షులు ఎగరాలి” అన్నాడు. దేవుడు బ్రహ్మాండమైన జలచరాలనూ, చలించే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపి వేసేలా సృష్టించాడు. ఇంకా వాటి వాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షినీ సృష్టించాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. దేవుడు “మీరు ఫలించి వృద్ధి పొందండి. సముద్ర జలాలను నింపండి. పక్షులు భూమి మీద విస్తరించాలి” అని వాటిని దీవించాడు. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఐదో రోజు. దేవుడు “వాటి వాటి జాతుల ప్రకారం ప్రాణం గలవాటిని, అంటే వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించాలి” అన్నాడు. అలాగే జరిగింది. దేవుడు, వాటి వాటి జాతుల ప్రకారం అడవి జంతువులనూ వాటి వాటి జాతుల ప్రకారం పశువులనూ, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగునూ చేశాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు. దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 1

ఆదికాండము 1:1-27 పవిత్ర బైబిల్ (TERV)

మొట్ట మొదట దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు. భూమి మొత్తం శూన్యంగా ఉండెను. భూమిమీద ఏమీ ఉండలేదు. మహా సముద్రాన్ని చీకటి ఆవరించి ఉండెను. దేవుని ఆత్మ నీళ్లమీద సంచరిస్తూ ఉండెను. అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక!” అన్నాడు. వెలుగు ప్రకాశించటం మొదలయింది. దేవుడు ఆ వెలుగును చూశాడు. ఆయనకు అది చక్కగా కనబడింది. అప్పుడు దేవుడు ఆ వెలుగును చీకటి నుండి వేరు చేశాడు. వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని దేవుడు పేరు పెట్టాడు. అస్తమయము అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది మొదటి రోజు. అప్పుడు దేవుడు, “జలములను రెండు భాగములుగా చేయుటకు అంతరిక్షం ఉండును గాక!” అన్నాడు. కనుక దేవుడు అంతరిక్షాన్ని చేసి, నీళ్లను వేరుపర్చాడు. కొంత నీరు అంతరిక్షం పైగాను, కొంత నీరు అంతరిక్షం క్రిందను ఉంది. దేవుడు ఆ అంతరిక్షానికి “ఆకాశం” అని పేరు పెట్టాడు. అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది రెండవ రోజు. అప్పుడు దేవుడు, “పొడి నేల కనబడునట్లు, ఆకాశం క్రింద ఉండే నీరు ఒక్క చోట చేరునుగాక!” అన్నాడు. అలాగే జరిగింది. ఆ పొడి నేలకు “భూమి” అని దేవుడు పేరు పెట్టాడు. మరియు ఒక్క చోట చేరిన నీటికి “సముద్రాలు” అని దేవుడు పేరు పెట్టాడు. ఆయనకు ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది. అప్పుడు దేవుడు, “భూమి గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను, ఫలవృక్షాలను మొలిపించును గాక, ఫలవృక్షాలు విత్తనాలుగల పండ్లను పండిస్తాయి. మరియూ ప్రతి మొక్క తన స్వంత రకం విత్తనాన్ని రూపొందిస్తుంది. ఈ మొక్కలు భూమిమీద పెరుగును గాక” అన్నాడు. అలాగే జరిగింది. గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను భూమి మొలిపించింది. మరియు అది విత్తనాలుగల పండ్ల చెట్లను మొలిపించింది. ప్రతి మొక్క తన స్వంత రకం విత్తనాలను రూపొందించింది. దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది. అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది మూడవ రోజు. అప్పుడు, “ఆకాశంలో జ్యోతులు ఉండును గాక. ఈ జ్యోతులు రాత్రి నుండి పగలును వేరు చేస్తాయి. జ్యోతులు ప్రత్యేక సంకేతాలను, ప్రత్యేక సమావేశాల ప్రారంభాన్ని సూచించేందుకు ఉపయోగించబడతాయి. మరియు రోజులను సంవత్సరాలను తెలుపుటకు అవి ఉపయోగించబడతాయి. భూమి మీద వెలుగును ప్రకాశింప చేయుటకు ఈ జ్యోతులు ఆకాశంలో ఉంటాయి” అని దేవుడు అన్నాడు. అలాగే జరిగింది. కనుక ఆ రెండు పెద్ద జ్యోతులను దేవుడు చేశాడు. పగటి వేళను ఏలుటకు దేవుడు పెద్ద జ్యోతిని చేశాడు. రాత్రి వేళను ఏలుటకు ఆయన చిన్న జ్యోతిని చేశాడు. దేవుడు నక్షత్రాలను కూడా చేశాడు. భూమి మీద ప్రకాశించుటకు ఈ జ్యోతులను దేవుడు ఆకాశంలో ఉంచాడు. పగటిని, రాత్రిని ఏలుటకు ఈ జ్యోతులను ఆకాశంలో ఉంచాడు. ఈ జ్యోతులు చీకటి నుండి వెలుగును వేరు చేశాయి. దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది. అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది నాలుగవ రోజు. అప్పుడు, “నీళ్లు అనేక ప్రాణులతో నిండి పోవును గాక. మరియు భూమికి పైగా గాలిలో ఎగురుటకు పక్షులు ఉండును గాక!” అని దేవుడు అన్నాడు. కనుక దేవుడు సముద్రపు పెద్ద జంతువులను చేశాడు. సముద్రంలో సంచరించే ప్రతి ప్రాణిని దేవుడు చేశాడు. సముద్ర జంతువులు ఎన్నో రకాలు ఉన్నాయి. వాటన్నిటినీ దేవుడు చేశాడు. ఆకాశంలో ఎగిరే ప్రతి రకం పక్షిని కూడ దేవుడు చేశాడు. మరియు ఇది చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది. ఈ జంతువులను దేవుడు ఆశీర్వదించాడు. అవి అనేక పిల్లల్ని పెట్టి, సముద్రాలు నిండిపోవాలని దేవుడు వాటితో చెప్పాడు. అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది ఐదవ రోజు. అప్పుడు దేవుడు, “భూమి అనేక ప్రాణులను చేయును గాక. అనేక రకాల జంతువులు ఉండును గాక. పెద్ద జంతువులు, ప్రాకే అన్ని రకాల పురుగులు, చిన్న జంతువులు ఉండును గాక! మరియు ఈ జంతువులన్నీ యింకా వాటి రకపు జంతువుల్ని ఎక్కువగా వృద్ధి చేయునుగాక” అని దేవుడు అన్నాడు. ఈ సంగతులు అన్నీ జరిగాయి. కనుక దేవుడు ప్రతి రకపు జంతువును చేశాడు. క్రూర జంతువులను, సాధు జంతువులను, ప్రాకుచుండు చిన్న వాటన్నింటినీ దేవుడు చేశాడు. మరియు ఇది చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది. అప్పుడు, “ఇప్పుడు మనం మనిషిని చేద్దాం. మనం మన పోలికతో మనుష్యుల్ని చేద్దాం. మనుష్యులు మనలా ఉంటారు. సముద్రంలోని చేపలన్నింటి మీద, గాలిలోని పక్షులన్నింటి మీద వారు ఏలుబడి చేస్తారు. భూమి మీద పెద్ద జంతువులన్నింటి మీదను, ప్రాకు చిన్న వాటన్నింటిమీదను వారు ఏలుబడి చేస్తారు” అని చెప్పాడు. కనుక దేవుడు తన స్వంత రూపంలో మనుష్యుల్ని చేశాడు. తన ప్రతిరూపంలో దేవుడు మనుష్యుల్ని చేశాడు. దేవుడు వారిని మగ, ఆడ వారిగా చేశాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 1

ఆదికాండము 1:1-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు–వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు–జలములమధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవదినమాయెను. దేవుడు–ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు– గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆప్రకార మాయెను. భూమి గడ్డిని తమతమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. దేవుడు–పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలు గిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను. దేవుడు–జీవముకలిగి చలించువాటిని జలములు సమృ ద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృ ద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు–మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను. దేవుడు–వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆప్రకారమాయెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను. దేవుడు–మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశపక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.

షేర్ చేయి
Read ఆదికాండము 1

ఆదికాండము 1:1-27 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఆదిలో దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించారు. భూమి ఆకారం లేనిదిగా శూన్యంగా ఉంది; అగాధజలాల మీద చీకటి ఆవరించి ఉంది, దేవుని ఆత్మ నీళ్ల మీద అల్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక” అని అనగా వెలుగు కలిగింది. దేవుడు ఆ వెలుగు బాగుందని చూసి, వెలుగును చీకటిని వేరుచేశారు. దేవుడు వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని పేరు పెట్టారు. సాయంకాలం గడిచి ఉదయం వచ్చింది. అది మొదటి రోజు. దేవుడు, “ఆకాశ జలాలను భూ జలాలను వేరు చేయడానికి జలాల మధ్య విశాలం కలుగును గాక” అన్నారు. అలాగే జరిగింది. దేవుడు విశాలాన్ని చేసి ఆ విశాలం క్రింది జలాలను విశాలం మీది జలాలను వేరుచేశారు. దేవుడు ఆ విశాలానికి “ఆకాశం” అని పేరు పెట్టారు. సాయంకాలం గడిచి ఉదయం వచ్చింది. అది రెండవ రోజు. దేవుడు, “ఆకాశం క్రింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడును గాక” అని అనగా అలాగే జరిగింది. దేవుడు ఆరిన నేలకు “భూమి” అని, ఒకే చోట సమకూడిన జలాలకు “సముద్రం” అని పేరు పెట్టారు. అది మంచిదని దేవుడు చూశారు. అప్పుడు దేవుడు, “భూమి వృక్ష సంపదను అనగా విత్తనాలు ఉత్పత్తి చేసే మొక్కలు, వాటి వాటి జాతుల ప్రకారం విత్తనాలతో ఉన్న ఫలమిచ్చే చెట్లను భూమి మొలిపించును గాక” అని అన్నారు. అలాగే జరిగింది. భూమి వృక్ష సంపదను ఉత్పత్తి చేసింది అంటే, వాటి వాటి జాతుల ప్రకారం విత్తనాలు గల మొక్కలు, వాటి వాటి జాతుల ప్రకారం విత్తనాలతో ఉన్న ఫలమిచ్చే చెట్లు మొలిపించింది. అది మంచిదని దేవుడు చూశారు. సాయంకాలం గడిచి ఉదయం రాగా అది మూడవ రోజు. దేవుడు, “పగలు రాత్రులను వేరు చేయడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుండాలి, అవి రుతువులను రోజులను సంవత్సరాలను సూచించే అసాధారణ గుర్తులుగా ఉండాలి. ఆకాశ విశాలంలో భూమికి వెలుగునిచ్చే జ్యోతులుండును గాక” అని అన్నారు, అలాగే జరిగింది. దేవుడు పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని అలా రెండు గొప్ప జ్యోతులను అలాగే నక్షత్రాలను కూడా చేశారు. భూమికి వెలుగునివ్వడానికి, పగటిని రాత్రిని పాలించడానికి, చీకటిని వెలుగును వేరు చేయడానికి, దేవుడు వాటిని ఆకాశ విశాలంలో అమర్చారు. అది మంచిదని దేవుడు చూశారు. సాయంకాలం గడిచి ఉదయం రాగా అది నాలుగవ రోజు. దేవుడు, “నీటిలో జలజీవులు విస్తరించాలి, భూమిపై నుండి పక్షులు ఆకాశ విశాలంలో ఎగురును గాక” అని అన్నారు. కాబట్టి దేవుడు సముద్రపు గొప్ప జీవులను, వాటి వాటి జాతుల ప్రకారం నీటిలో ఉండి నీటిలో తిరిగే ప్రతి జీవిని, వాటి వాటి జాతి ప్రకారం రెక్కలు గల పక్షులను సృష్టించారు. అది మంచిదని దేవుడు చూశారు. దేవుడు, “ఫలించి, వృద్ధి చెంది, సముద్ర జలాల్లో నిండిపోవాలి, అలాగే భూమి మీద పక్షులు విస్తరించును గాక” అని వాటిని ఆశీర్వదించారు. అలా సాయంకాలం గడిచి ఉదయం రాగా అది అయిదవ రోజు. దేవుడు, “భూమి వాటి వాటి జాతి ప్రకారం జీవులను పుట్టించాలి అంటే, పశువులను, నేల మీద ప్రాకే జీవులను, అడవి మృగాలను, వాటి వాటి జాతుల ప్రకారం పుట్టించును గాక” అని అన్నారు, అలాగే జరిగింది. దేవుడు వాటి వాటి జాతుల ప్రకారం అడవి మృగాలను, వాటి వాటి జాతుల ప్రకారం పశువులను, వాటి వాటి జాతుల ప్రకారం నేల మీద ప్రాకే జీవులను చేశారు. అది మంచిదని దేవుడు చూశారు. అప్పుడు దేవుడు, “మనం మన స్వరూపంలో, మన పోలికలో నరులను చేద్దాము. వారు సముద్రంలోని చేపలను, ఆకాశంలో ఎగిరే పక్షులను, పశువులను, అడవి మృగాలను భూమిపై ప్రాకే జీవులన్నిటిని ఏలుతారు” అని అన్నారు. కాబట్టి దేవుడు తన స్వరూపంలో నరులను సృజించారు, దేవుని స్వరూపంలో వారిని సృజించారు; వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించారు.

షేర్ చేయి
Read ఆదికాండము 1