గలతీయులకు 5:19-24

గలతీయులకు 5:19-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

శరీర సంబంధమైన క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేమంటే: లైంగిక దుర్నీతి, అపవిత్రత, వేశ్యాలోలత్వము; విగ్రహారాధన, క్షుద్రవిద్య; ద్వేషం, విరోధం, అసూయ, అధికమైన ఆగ్రహం స్వార్థపూరిత ఆశలు, భేదాభిప్రాయాలు, విభేదాలు, ఓర్వలేనితనం, మద్యం మత్తు, పోకిరి ఆటలు మొదలైనవి. నేను గతంలో మిమ్మల్ని హెచ్చరించినట్లుగా ఇలాంటి జీవితాన్ని జీవించేవారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మళ్ళీ హెచ్చరిస్తున్నాను. అయితే ఆత్మ వలన కలిగే ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, మృదుత్వం, మనస్సును అదుపు చేసుకోవడం. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ నియమం లేదు. యేసు క్రీస్తుకు సంబంధించినవారు శరీరాన్ని దాని వాంఛలతో దురాశలతో సిలువ వేశారు.

గలతీయులకు 5:19-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు. క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.

గలతీయులకు 5:19-24 పవిత్ర బైబిల్ (TERV)

మానవ స్వభావం యొక్క పనులు మనకు బాగా తెలుసు. అవేవనగా వ్యభిచారము, అపవిత్రత, కామము, విగ్రహారాధన, మంత్రతంత్రాలు, ద్వేషము, కలహము, ఈర్ష్య, కోపము, స్వార్థము, విరోధము, చీలికలు, అసూయ, త్రాగుబోతుతనము, కామకేళీలు మొదలగునవి. వీటిని గురించి నేనిదివరకే వారించాను. మళ్ళీ వారిస్తున్నాను. ఈ విధంగా జీవించేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. కాని పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఫలాలు ప్రేమ, ఆనందం, శాంతం, సహనం, దయ, మంచితనం, విశ్వాసం, వినయం, ఆత్మ నిగ్రహం. వీటికి విరుద్ధంగా ఏ చట్టమూ లేదు. యేసుక్రీస్తుకు చెందినవాళ్ళు తమ శరీరాన్ని, దానికి చెందిన మోహాలను, కోరికలను సిలువకు వేసి చంపారు.

గలతీయులకు 5:19-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసి యున్నారు.