గలతీయులకు 3:6-11
గలతీయులకు 3:6-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచ బడెను. కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి– నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతోకూడ ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా– ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది. ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా– నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.
గలతీయులకు 3:6-11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అలాగే మన పూర్వికుడైన అబ్రాహాము గురించి వ్రాయబడినట్లుగా, “దేవుని నమ్మినందుకు దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు.” కనుక మీరు అర్థం చేసుకోవలసింది ఏంటంటే ఎవరైతే విశ్వాసం కలిగినవారు అబ్రాహాముకు పిల్లలవుతారు. దేవుడు యూదేతరులను వారి విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీరుస్తారని లేఖనంలో ముందుగానే చెప్పబడింది, “నిన్ను బట్టి జనములన్నీ ఆశీర్వదించబడతాయి” అని చెప్పడం ద్వారా అబ్రాహాముకు ముందుగానే సువార్త ప్రకటించబడింది. అందువల్ల విశ్వాసంపై ఆధారపడే ప్రతీ ఒక్కరు విశ్వాస పురుషుడైన అబ్రాహాముతో పాటు ధన్యులవుతారు. ధర్మశాస్త్ర క్రియలపై ఆధారపడే వారందరూ శాపగ్రస్తులు, ఎలాగంటే లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం: “ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రతీదానిని పాటించనివారు శాపగ్రస్తులు.” ధర్మశాస్త్రం మీద ఆధారపడే ఏ ఒక్కడూ దేవుని ముందు నీతిమంతునిగా తీర్చబడడు, ఎందుకంటే “నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు.”
గలతీయులకు 3:6-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అబ్రాహాము, “దేవుని నమ్మాడు, అదే అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది.” కాబట్టి, నమ్మకముంచే వారే అబ్రాహాము సంతానమని మీరు తెలుసుకోవాలి. విశ్వాసం ద్వారా దేవుడు యూదేతరులను నీతిమంతులుగా తీరుస్తాడని లేఖనం ముందుగానే ప్రవచించింది. “ప్రపంచంలోని ప్రజా సమూహాలన్నీ నీలో దీవెనలు పొందుతాయి.” అని అబ్రాహాముకు సువార్త ముందుగానే ప్రకటించడం జరిగింది. కాబట్టి విశ్వాసముంచిన అబ్రాహాముతో బాటు విశ్వాస సంబంధులనే దేవుడు దీవిస్తాడు. ధర్మశాస్త్రం విధించిన క్రియలపై ఆధారపడి జీవించే వాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే, “ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న విధులన్నిటినీ చేయడంలో నిలకడగా ఉండని ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది. ధర్మశాస్త్రం వలన దేవుడు ఎవరినీ నీతిమంతునిగా తీర్చడు అనే విషయం స్పష్టం. ఎందుకంటే, “నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు.”
గలతీయులకు 3:6-11 పవిత్ర బైబిల్ (TERV)
అబ్రాహామును పరిశీలించండి. “అతడు దేవుణ్ణి విశ్వసించాడు. కనుక దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు.” కనుక విశ్వాసమున్న వాళ్ళే అబ్రాహాము కుమారులని గ్రహించండి. యూదులు కానివాళ్ళను దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా నిర్ణయిస్తాడని లేఖనాలు వ్రాసినవాళ్ళు దివ్యదృష్టితో చూసి చెప్పారు. ఈ విషయాన్ని దేవుడు అబ్రాహాముతో, “అన్ని జనముల వారు నీ కారణంగా ధన్యులౌతారు!” అని ముందే చెప్పాడు. కనుక అబ్రాహాము విశ్వసించి ధన్యుడయ్యాడు. అదే విధంగా అతని వలె విశ్వసించిన వాళ్ళు కూడా ధన్యులౌతారు. ధర్మశాస్త్రంపై ఆధారపడిన వాళ్ళందరి మీద శాపం ఉంది. “ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని అన్ని వేళలా ఆచరిస్తూ జీవించని వాడు దేవుని శాపానికి గురి ఔతాడు” అని వ్రాయబడి ఉంది. ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఎవ్వరినీ నీతిమంతునిగా చెయ్యడని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే, “విశ్వాసం ద్వారా నీతిమంతుడైనవాడు అనంతజీవితం పొందుతాడు” అని ప్రవచనంలో వ్రాయబడి ఉంది.
గలతీయులకు 3:6-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అలాగే మన పూర్వికుడైన అబ్రాహాము కూడా, “దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది.” కాబట్టి మీరు అర్థం చేసుకోవలసింది ఏంటంటే విశ్వాసం కలిగినవారే అబ్రాహాముకు పిల్లలవుతారు. దేవుడు యూదేతరులను వారి విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీరుస్తారని లేఖనంలో ముందుగానే చెప్పబడింది. “నిన్ను బట్టి సర్వ జనులు దీవించబడతారు” అని చెప్పడం ద్వారా అబ్రాహాముకు ముందుగానే సువార్త ప్రకటించబడింది. అందువల్ల విశ్వాసంపై ఆధారపడే ప్రతి ఒక్కరూ విశ్వాస పురుషుడైన అబ్రాహాముతో పాటు ధన్యులవుతారు. ధర్మశాస్త్ర క్రియలపై ఆధారపడే వారందరూ శాపగ్రస్తులు, ఎలాగంటే లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం: “ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటన్నిటిని పాటించనివారు శాపగ్రస్తులు.” ధర్మశాస్త్రం మీద ఆధారపడే ఏ ఒక్కడూ దేవుని ముందు నీతిమంతునిగా తీర్చబడడు, ఎందుకంటే “నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు.”