గలతీయులకు 3:19-29
గలతీయులకు 3:19-29 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అలాంటప్పుడు, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? వాగ్దానం ఎవరికి వర్తింస్తుందో ఆ సంతానం వచ్చే వరకు అతిక్రమాలను చూపడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం దూతల ద్వారా ఇవ్వబడి మధ్యవర్తికి అప్పగించబడింది. అయినప్పటికి మధ్యవర్తి ఒక్క గుంపు ఒక పక్షం కన్నా ఎక్కువ అని సూచిస్తుంది, కానీ దేవుడు ఒక్కడే. అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? ఎన్నటికి కాదు! ఇవ్వబడిన ధర్మశాస్త్రం మనకు జీవాన్ని ఇచ్చివుంటే, తప్పకుండా ధర్మశాస్త్రం వల్లనే మనం నీతిమంతులుగా తీర్చబడి ఉండేవారం. అయితే వాగ్దానం చేయబడినది, యేసుక్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా, ఆయనను నమ్మేవారికి ఇవ్వబడాలని, పాప వశంలో ఉన్న వాటన్నిటినీ లేఖనం బంధించింది. ఈ విశ్వాసం గురించి తెలియక ముందు, రావలసియుండిన విశ్వాసం బయలుపరచబడే వరకు మనం బంధింపబడి, ధర్మశాస్త్రం అదుపులో ఉంచబడ్డాము. అందువల్ల మనం విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడేలా క్రీస్తు వచ్చేవరకు ధర్మశాస్త్రం మనకు ఒక సంరక్షకునిగా ఉండింది. అయితే ఇప్పుడు ఈ విశ్వాసం మనకు బయలుపరచబడింది కనుక మనం సంరక్షకుని ఆధీనంలో ఉండే అవసరం లేదు. కనుక మీరందరు యేసుక్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా దేవుని కుమారులై యున్నారు. క్రీస్తులో బాప్తిస్మం పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొని యున్నారు. ఇందులో యూదులని గ్రీసు దేశస్థులని, దాసులని స్వతంత్రులని, పురుషుడని స్త్రీ అని ఏ భేదం లేదు, క్రీస్తు యేసులో అందరు ఒక్కటే. మీరు క్రీస్తుకు చెందినవారైతే, మీరు అబ్రాహాము సంతానం, మరియు వాగ్దాన ప్రకారం వారసులు.
గలతీయులకు 3:19-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అలాగైతే ధర్మశాస్త్రమెందుకు? అతిక్రమాలను బట్టి దేవుడు దాన్ని కలిపాడు. ఎవరి గూర్చి ఆ వాగ్దానం చేశాడో ఆ సంతానం వచ్చే వరకూ అది అమలులో ఉంది. దాన్ని మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా దేవుడు నియమించాడు. మధ్యవర్తి ఉన్నాడంటే ఒక్కడి కోసమే ఉండడు, కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? కానే కాదు. ఒకవేళ ధర్మశాస్త్రం బతికించగలిగేలా ఉంటే, ధర్మశాస్త్రం వల్లనే నీతి కలిగి ఉండేది. యేసు క్రీస్తులో విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించే వారికి దేవుడు అనుగ్రహించేలా, లేఖనం అందరినీ పాపంలో బంధించింది. మనం విశ్వాసం ఉంచక ముందు విశ్వాసం ప్రత్యక్షమయ్యే వరకూ, మనం ధర్మశాస్త్రానికి మాత్రమే పరిమితమై దాని చెరలో ఉన్నాము. కాబట్టి దేవుడు మనలను విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి క్రీస్తు దగ్గరికి మనలను నడిపించడానికి ధర్మశాస్త్రం మనకు ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ఉంది. అయితే విశ్వాసం వెల్లడయింది కాబట్టి మనం ఇక ప్రాథమిక ఉపాధ్యాయుని కింద లేము. యేసు క్రీస్తులో మీరంతా విశ్వాసం ద్వారా దేవుని కుమారులు. క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరంతా క్రీస్తును ధరించుకున్నారు. ఇందులో యూదుడు-గ్రీసుదేశస్థుడనీ దాసుడు-స్వతంత్రుడనీ పురుషుడు-స్త్రీ అనీ తేడా లేదు. యేసు క్రీస్తులో మీరంతా ఒక్కటిగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే, అబ్రాహాము సంతానంగా ఉండి, వాగ్దానం ప్రకారం వారసులు.
గలతీయులకు 3:19-29 పవిత్ర బైబిల్ (TERV)
మరి అలాగైతే ధర్మశాస్త్రం ఉండటంలో ఉద్దేశ్యమేమిటి? పాపాన్ని ఎత్తి చూపటమే దాని ఉద్దేశ్యం. వాగ్దానం చెయ్యబడిన అబ్రాహాము వంశీయుడు వచ్చే వరకే దాని ఉపయోగం. దేవదూతల ద్వారా ఒక మధ్యవర్తి చేత ధర్మశాస్త్రం మనకు అందజేయబడింది. కాని వాగ్దానం విషయంలో దేవుడు ఒక్కడే కనుక మధ్యవర్తి అవసరం కలుగలేదు. రెండు పక్షాలుంటే కదా మధ్యవర్తి కావాలి. మరి అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు విరుద్ధమా? ఎన్నటికీ కాదు. ధర్మశాస్త్రానికి అనంత జీవితాన్నిచ్చే శక్తి ఉండి ఉంటే దాని ద్వారా నీతిమంతులం అయ్యేవాళ్ళం. కాని లేఖనాల్లో, “ప్రపంచం పాపాల్లో చిక్కుకు పోయింది.” అని వ్రాయబడి ఉంది. ఇలా ఎందుకైందంటే యేసుక్రీస్తు పట్ల ఉన్న విశ్వాసం వల్ల వాగ్దానం చెయ్యబడిన వరము విశ్వాసం ఉన్నవాళ్ళకే యివ్వబడుతుంది. విశ్వాసం లేకముందు మనం ధర్మశాస్త్రం యొక్క ఖైదీలము. విశ్వాసం మనకు బయలు పడేదాకా మనము ఖైదీలుగా ఉన్నాము. మనము విశ్వాసం ద్వారా నీతిమంతులం కావటానికి, మనల్ని క్రీస్తు దగ్గరకు పిలుచుకు వెళ్ళటానికి ఈ ధర్మశాస్త్రం నియమింపబడింది. ఇప్పుడు ఆ విశ్వాసం వచ్చింది. కనుక ధర్మశాస్త్రానికి మనపై ఇక ఏ మాత్రం అధికారం లేదు. యేసుక్రీస్తులో మీకు విశ్వాసం వుండటం వల్ల మీరంతా దేవుని పుత్రులయ్యారు. ఎందుకంటే క్రీస్తులో బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తులో యూదుడని, యూదుడుకానివాడని, బానిసని, యజమాని అని, ఆడ అని, మగ అని వ్యత్యాసం లేదు. క్రీస్తు యేసులో మీరందరు సమానం. మీరు క్రీస్తుకు చెందితే అబ్రాహాము సంతానంగా పరిగణింపబడతారు. దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం ప్రకారం దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులమౌతాం.
గలతీయులకు 3:19-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు? ఎవనికి ఆ వాగ్దా నము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతి క్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి యున్నయెడల వాస్తవముగా నీతిధర్మశాస్త్రమూలముగానే కలుగును గాని యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి అనుగ్రహింపబడునట్లు, లేఖనము అందరిని పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడికాకమునుపు, ఇక ముందుకు బయలు పరచబడబోవు విశ్వాసమవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకు డాయెను. అయితే విశ్వాసము వెల్లడియాయెను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థు డని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.
గలతీయులకు 3:19-29 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అలాంటప్పుడు, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? వాగ్దానం ఎవరికి వర్తిస్తుందో ఆ సంతానం వచ్చేవరకు అతిక్రమాలను చూపడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం దూతల ద్వారా ఇవ్వబడి మధ్యవర్తికి అప్పగించబడింది. అయినప్పటికీ మధ్యవర్తి ఒక్కరికే కాదు, కానీ దేవుడు ఒక్కడే. అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? ఎన్నటికి కాదు! ఇవ్వబడిన ధర్మశాస్త్రం మనకు జీవాన్ని ఇచ్చి ఉంటే, తప్పకుండా ధర్మశాస్త్రం వల్లనే నీతి కలిగి ఉండేది. అయితే యేసు క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా కలిగిన వాగ్దానం ఆయనను నమ్మేవారికి ఇవ్వబడాలని, లేఖనం సమస్తాన్ని అందరిని పాపంలో బంధించింది. ఈ విశ్వాసం గురించి తెలియక ముందు, విశ్వాసం బయలుపరచబడే వరకు మనం బంధింపబడి ధర్మశాస్త్రం అదుపులో ఉంచబడ్డాము. అందువల్ల మనం విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడేలా క్రీస్తు వచ్చేవరకు ధర్మశాస్త్రం మనకు ఒక సంరక్షకునిగా ఉండింది. అయితే ఇప్పుడు ఈ విశ్వాసం మనకు బయలుపరచబడింది కాబట్టి మనం సంరక్షకుని ఆధీనంలో ఉండే అవసరం లేదు. కాబట్టి మీరందరు యేసు క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులో బాప్తిస్మం పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదులని గ్రీసు దేశస్థులని, దాసులని స్వతంత్రులని, పురుషుడని స్త్రీ అని ఏ భేదం లేదు, క్రీస్తు యేసులో అందరు ఒక్కటే. మీరు క్రీస్తుకు చెందినవారైతే, మీరు అబ్రాహాము సంతానంగా ఉండి వాగ్దాన ప్రకారం వారసులు.