గలతీయులకు 3:10-29

గలతీయులకు 3:10-29 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

ధర్మశాస్త్ర క్రియలపై ఆధారపడే వారందరూ శాపగ్రస్తులు, ఎలాగంటే లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం: “ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రతీదానిని పాటించనివారు శాపగ్రస్తులు.” ధర్మశాస్త్రం మీద ఆధారపడే ఏ ఒక్కడూ దేవుని ముందు నీతిమంతునిగా తీర్చబడడు, ఎందుకంటే “నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు.” ధర్మశాస్త్రం విశ్వాసం మీద ఆధారపడి లేదు గాని; దానికి విరుద్ధంగా, “వీటిని చేసేవాడు వాటి వల్లనే జీవిస్తాడు” అని వ్రాయబడి ఉంది. ధర్మశాస్త్రం వల్ల వచ్చే శాపం నుండి మనలను విమోచించడానికి క్రీస్తు మన కొరకు శాపగ్రస్తుడయ్యారు. ఎందుకంటే, లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం “మ్రానుపై వ్రేలాడదీయబడిన ప్రతీ ఒక్కరు శాపగ్రస్తులే.” విశ్వాసం ద్వారా దేవుని ఆత్మను గురించిన వాగ్దానాన్ని మనం పొందుకొనేలా అబ్రాహాముకు ఇవ్వబడిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కూడా రావాలని ఆయన మనల్ని విమోచించారు. సహోదరీ సహోదరులారా, అనుదిన జీవితం నుండి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మనుష్యుల ద్వారా సరిగ్గా స్థాపించబడిన ఒడంబడికను ఎవరూ పెట్టలేరు దానికేమి చేర్చలేరు, ఈ విషయంలో కూడా అంతే. అబ్రాహాముకు అతని సంతానానికి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. లేఖనం, అనేకులను ఉద్దేశించి “సంతానాలకు” అని చెప్పడం లేదు, గాని ఒక్క వ్యక్తిని ఉద్దేశించి, “సంతానానికి” అని చెప్తుంది, ఆ సంతానం క్రీస్తే. నేను చెప్పేదేంటంటే, 430 సంవత్సరాల తరువాత ఇవ్వబడిన ధర్మశాస్త్రం దేవునిచే ముందుగానే స్థాపించబడిన ఒడంబడికను ప్రక్కన పెట్టివేయదు అలాగే దేవుని వాగ్దానాన్ని నిరర్ధకం చేయదు. ఎందుకంటే ఒకవేళ ఆ వారసత్వం ధర్మశాస్త్రం మీద ఆధారపడి వుంటే, ఇక వాగ్దానం మీద ఆధారపడదు, అయితే దేవుడు అబ్రాహాముకు ఆ వారసత్వాన్ని తన కృపలో వాగ్దానం ద్వారా ఇచ్చారు. అలాంటప్పుడు, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? వాగ్దానం ఎవరికి వర్తింస్తుందో ఆ సంతానం వచ్చే వరకు అతిక్రమాలను చూపడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం దూతల ద్వారా ఇవ్వబడి మధ్యవర్తికి అప్పగించబడింది. అయినప్పటికి మధ్యవర్తి ఒక్క గుంపు ఒక పక్షం కన్నా ఎక్కువ అని సూచిస్తుంది, కానీ దేవుడు ఒక్కడే. అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? ఎన్నటికి కాదు! ఇవ్వబడిన ధర్మశాస్త్రం మనకు జీవాన్ని ఇచ్చివుంటే, తప్పకుండా ధర్మశాస్త్రం వల్లనే మనం నీతిమంతులుగా తీర్చబడి ఉండేవారం. అయితే వాగ్దానం చేయబడినది, యేసుక్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా, ఆయనను నమ్మేవారికి ఇవ్వబడాలని, పాప వశంలో ఉన్న వాటన్నిటినీ లేఖనం బంధించింది. ఈ విశ్వాసం గురించి తెలియక ముందు, రావలసియుండిన విశ్వాసం బయలుపరచబడే వరకు మనం బంధింపబడి, ధర్మశాస్త్రం అదుపులో ఉంచబడ్డాము. అందువల్ల మనం విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడేలా క్రీస్తు వచ్చేవరకు ధర్మశాస్త్రం మనకు ఒక సంరక్షకునిగా ఉండింది. అయితే ఇప్పుడు ఈ విశ్వాసం మనకు బయలుపరచబడింది కనుక మనం సంరక్షకుని ఆధీనంలో ఉండే అవసరం లేదు. కనుక మీరందరు యేసుక్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా దేవుని కుమారులై యున్నారు. క్రీస్తులో బాప్తిస్మం పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొని యున్నారు. ఇందులో యూదులని గ్రీసు దేశస్థులని, దాసులని స్వతంత్రులని, పురుషుడని స్త్రీ అని ఏ భేదం లేదు, క్రీస్తు యేసులో అందరు ఒక్కటే. మీరు క్రీస్తుకు చెందినవారైతే, మీరు అబ్రాహాము సంతానం, మరియు వాగ్దాన ప్రకారం వారసులు.

షేర్ చేయి
Read గలతీయులకు 3

గలతీయులకు 3:10-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ధర్మశాస్త్రం విధించిన క్రియలపై ఆధారపడి జీవించే వాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే, “ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న విధులన్నిటినీ చేయడంలో నిలకడగా ఉండని ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది. ధర్మశాస్త్రం వలన దేవుడు ఎవరినీ నీతిమంతునిగా తీర్చడు అనే విషయం స్పష్టం. ఎందుకంటే, “నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు.” ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, “దాని విధులను ఆచరించే వాడు వాటి వల్లనే జీవిస్తాడు.” ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం ద్వారా మనకు లభించేలా, అబ్రాహాము పొందిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కలగడానికి, క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడై మనలను ధర్మశాస్త్ర శిక్ష నుంచి విమోచించాడు. అందుకే, “మాను మీద వేలాడిన ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది. సోదరులారా, మానవరీతిగా మాట్లాడుతున్నాను. మనుషుల ఒడంబడికే అయినా అది స్థిరపడిన తరువాత దానినెవరూ కొట్టివేయరు, దానికి ఇంకేమీ కలపరు. అబ్రాహాముకూ అతని సంతానానికీ దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆయన అనేకులను గురించి అన్నట్టు, “నీ సంతానాలకు” అని అనలేదు గానీ ఒకడి గురించి అన్నట్టుగా, “నీ సంతానానికి” అన్నాడు. ఆ సంతానం క్రీస్తే. నేను చెప్పేది ఏంటంటే, 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు ముందుగానే స్థిరపరచిన నిబంధనను కొట్టివేయదు. దాని వాగ్దానాన్ని వ్యర్థం చేయదు. ఆ వారసత్వం ధర్మశాస్త్రం వలన అయిందంటే ఇక ఏ మాత్రం వాగ్దానం వలన అయ్యేది కానట్టే. అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం వల్లనే వారసత్వాన్ని ఇచ్చాడు. అలాగైతే ధర్మశాస్త్రమెందుకు? అతిక్రమాలను బట్టి దేవుడు దాన్ని కలిపాడు. ఎవరి గూర్చి ఆ వాగ్దానం చేశాడో ఆ సంతానం వచ్చే వరకూ అది అమలులో ఉంది. దాన్ని మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా దేవుడు నియమించాడు. మధ్యవర్తి ఉన్నాడంటే ఒక్కడి కోసమే ఉండడు, కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? కానే కాదు. ఒకవేళ ధర్మశాస్త్రం బతికించగలిగేలా ఉంటే, ధర్మశాస్త్రం వల్లనే నీతి కలిగి ఉండేది. యేసు క్రీస్తులో విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించే వారికి దేవుడు అనుగ్రహించేలా, లేఖనం అందరినీ పాపంలో బంధించింది. మనం విశ్వాసం ఉంచక ముందు విశ్వాసం ప్రత్యక్షమయ్యే వరకూ, మనం ధర్మశాస్త్రానికి మాత్రమే పరిమితమై దాని చెరలో ఉన్నాము. కాబట్టి దేవుడు మనలను విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి క్రీస్తు దగ్గరికి మనలను నడిపించడానికి ధర్మశాస్త్రం మనకు ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ఉంది. అయితే విశ్వాసం వెల్లడయింది కాబట్టి మనం ఇక ప్రాథమిక ఉపాధ్యాయుని కింద లేము. యేసు క్రీస్తులో మీరంతా విశ్వాసం ద్వారా దేవుని కుమారులు. క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరంతా క్రీస్తును ధరించుకున్నారు. ఇందులో యూదుడు-గ్రీసుదేశస్థుడనీ దాసుడు-స్వతంత్రుడనీ పురుషుడు-స్త్రీ అనీ తేడా లేదు. యేసు క్రీస్తులో మీరంతా ఒక్కటిగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే, అబ్రాహాము సంతానంగా ఉండి, వాగ్దానం ప్రకారం వారసులు.

షేర్ చేయి
Read గలతీయులకు 3

గలతీయులకు 3:10-29 పవిత్ర బైబిల్ (TERV)

ధర్మశాస్త్రంపై ఆధారపడిన వాళ్ళందరి మీద శాపం ఉంది. “ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని అన్ని వేళలా ఆచరిస్తూ జీవించని వాడు దేవుని శాపానికి గురి ఔతాడు” అని వ్రాయబడి ఉంది. ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఎవ్వరినీ నీతిమంతునిగా చెయ్యడని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే, “విశ్వాసం ద్వారా నీతిమంతుడైనవాడు అనంతజీవితం పొందుతాడు” అని ప్రవచనంలో వ్రాయబడి ఉంది. ధర్మశాస్త్రానికి విశ్వాసం పునాది కాదు. పైగా, “ధర్మశాస్త్రం చెప్పినట్లు అన్నీ చేసినవాడు మాత్రమే అనంత జీవితం పొందుతాడు” అని వ్రాయబడి ఉంది. “చెట్టుకు వ్రేలాడవేయబడిన ప్రతి ఒక్కడూ శాపగ్రస్తుడు!” అని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. కనుక మనకు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విముక్తి కలిగించాలని క్రీస్తు ఆ శాపానికి గురి అయ్యాడు. దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం తన ద్వారా యూదులు కానివాళ్ళకు కూడా లభించాలని క్రీస్తు మనకు విముక్తి కలిగించాడు. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మనకు విశ్వాసం ద్వారా లభించాలని ఆయన ఉద్దేశ్యం. సోదరులారా! ఇక మన నిత్యజీవితం నుండి ఒక ఉదాహరణ తీసుకొంటాను. అంగీకరించిన ఒడంబడికను మనం రద్దు చెయ్యలేము, లేక మార్చలేము. ఈ విషయం కూడా అలాంటిదే. అబ్రాహాముకు, అతని వారసునికి దేవుడు వాగ్దానం చేసాడు. కాని ధర్మశాస్త్రంలో, “వారసులకు” అని వ్రాయబడలేదు. కాని “అనేకులు” అని అర్థం రాకుండా “ఒకనికి” అనే అర్థం వచ్చేటట్లు వ్రాయబడి ఉంది. ఆయనే క్రీస్తు. నేను చెప్పేది ఏమిటంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టబడిన ధర్మశాస్త్రం గతంలో దేవుడు చేసిన ఒడంబడికను ప్రక్కకు త్రోసి ఆయన చేసిన వాగ్దానాన్ని రద్దు చెయ్యలేదు. అయితే వారసత్వం ధర్మశాస్త్రంపై ఆధారపడలేక అది వాగ్దానంపై ఆధారపడి వుందన్న మాట. ఆ రీతిగా దేవుడు ఆ వారసత్వాన్ని వాగ్దానం ద్వారా అబ్రాహాముకు యిచ్చాడు. మరి అలాగైతే ధర్మశాస్త్రం ఉండటంలో ఉద్దేశ్యమేమిటి? పాపాన్ని ఎత్తి చూపటమే దాని ఉద్దేశ్యం. వాగ్దానం చెయ్యబడిన అబ్రాహాము వంశీయుడు వచ్చే వరకే దాని ఉపయోగం. దేవదూతల ద్వారా ఒక మధ్యవర్తి చేత ధర్మశాస్త్రం మనకు అందజేయబడింది. కాని వాగ్దానం విషయంలో దేవుడు ఒక్కడే కనుక మధ్యవర్తి అవసరం కలుగలేదు. రెండు పక్షాలుంటే కదా మధ్యవర్తి కావాలి. మరి అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు విరుద్ధమా? ఎన్నటికీ కాదు. ధర్మశాస్త్రానికి అనంత జీవితాన్నిచ్చే శక్తి ఉండి ఉంటే దాని ద్వారా నీతిమంతులం అయ్యేవాళ్ళం. కాని లేఖనాల్లో, “ప్రపంచం పాపాల్లో చిక్కుకు పోయింది.” అని వ్రాయబడి ఉంది. ఇలా ఎందుకైందంటే యేసుక్రీస్తు పట్ల ఉన్న విశ్వాసం వల్ల వాగ్దానం చెయ్యబడిన వరము విశ్వాసం ఉన్నవాళ్ళకే యివ్వబడుతుంది. విశ్వాసం లేకముందు మనం ధర్మశాస్త్రం యొక్క ఖైదీలము. విశ్వాసం మనకు బయలు పడేదాకా మనము ఖైదీలుగా ఉన్నాము. మనము విశ్వాసం ద్వారా నీతిమంతులం కావటానికి, మనల్ని క్రీస్తు దగ్గరకు పిలుచుకు వెళ్ళటానికి ఈ ధర్మశాస్త్రం నియమింపబడింది. ఇప్పుడు ఆ విశ్వాసం వచ్చింది. కనుక ధర్మశాస్త్రానికి మనపై ఇక ఏ మాత్రం అధికారం లేదు. యేసుక్రీస్తులో మీకు విశ్వాసం వుండటం వల్ల మీరంతా దేవుని పుత్రులయ్యారు. ఎందుకంటే క్రీస్తులో బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తులో యూదుడని, యూదుడుకానివాడని, బానిసని, యజమాని అని, ఆడ అని, మగ అని వ్యత్యాసం లేదు. క్రీస్తు యేసులో మీరందరు సమానం. మీరు క్రీస్తుకు చెందితే అబ్రాహాము సంతానంగా పరిగణింపబడతారు. దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం ప్రకారం దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులమౌతాం.

షేర్ చేయి
Read గలతీయులకు 3

గలతీయులకు 3:10-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా– ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది. ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా– నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాససంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును. ఆత్మ నుగూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమో చించెను; ఇందునుగూర్చి– మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది. సహోదరులారా, మనుష్యరీతిగా మాటలాడుచున్నాను; మనుష్యుడుచేసిన ఒడంబడికయైనను స్థిరపడిన తరువాత ఎవడును దాని కొట్టివేయడు, దానితో మరే మియు కలుపడు. అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులనుగూర్చి అన్నట్టు–నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే–నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పునదేమనగా–నాలుగువందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము, వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవునిచేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రమూలముగా కలిగినయెడల ఇక వాగ్దానమూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానమువలననే దానిని అనుగ్రహించెను. ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు? ఎవనికి ఆ వాగ్దా నము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతి క్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి యున్నయెడల వాస్తవముగా నీతిధర్మశాస్త్రమూలముగానే కలుగును గాని యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి అనుగ్రహింపబడునట్లు, లేఖనము అందరిని పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడికాకమునుపు, ఇక ముందుకు బయలు పరచబడబోవు విశ్వాసమవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకు డాయెను. అయితే విశ్వాసము వెల్లడియాయెను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థు డని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.

షేర్ చేయి
Read గలతీయులకు 3

గలతీయులకు 3:10-29 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ధర్మశాస్త్ర క్రియలపై ఆధారపడే వారందరూ శాపగ్రస్తులు, ఎలాగంటే లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం: “ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటన్నిటిని పాటించనివారు శాపగ్రస్తులు.” ధర్మశాస్త్రం మీద ఆధారపడే ఏ ఒక్కడూ దేవుని ముందు నీతిమంతునిగా తీర్చబడడు, ఎందుకంటే “నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు.” ధర్మశాస్త్రం విశ్వాసానికి సంబంధించింది కాదు పైగా “వీటిని చేసేవారు వాటి వల్లనే జీవిస్తారు” అని అది చెప్తుంది. ధర్మశాస్త్రం వల్ల వచ్చే శాపం నుండి మనల్ని విమోచించడానికి క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడయ్యారు. ఎలాగంటే, లేఖనాల్లో, “మ్రానుపై వ్రేలాడదీయబడిన ప్రతి ఒక్కరూ శాపగ్రస్తులే” అని వ్రాయబడిన దాని ప్రకారం. విశ్వాసం ద్వారా దేవుని ఆత్మను గురించిన వాగ్దానాన్ని మనం పొందుకునేలా అబ్రాహాముకు ఇవ్వబడిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కూడా వర్తించాలని ఆయన మనల్ని విమోచించారు. సహోదరీ సహోదరులారా, అనుదిన జీవితం నుండి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మనుష్యులు చేసిన ఒడంబడికే అయినా దాన్ని స్థిరపరచిన తర్వాత దాన్ని ఎవరూ కొట్టివేయలేరు దానికి ఏమి కలపలేరు. ఇది కూడా అంతే. అబ్రాహాముకు అతని సంతానానికి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. లేఖనంలో అనేకులను ఉద్దేశించి “సంతానాలకు” అని చెప్పడం లేదు, గాని ఒక్క వ్యక్తిని ఉద్దేశించి, “నీ సంతానానికి” అని చెప్పారు, ఆ సంతానం క్రీస్తు. నేను చెప్పేదేంటంటే, 430 సంవత్సరాల తర్వాత ఇవ్వబడిన ధర్మశాస్త్రం దేవునిచే ముందుగానే స్థిరపరచబడిన ఒడంబడికను ప్రక్కన పెట్టదు అలాగే దేవుని వాగ్దానాన్ని నిరర్ధకం చేయదు. ఎందుకంటే ఒకవేళ ఆ వారసత్వం ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉంటే, ఇక వాగ్దానం మీద ఆధారపడదు, అయితే దేవుడు అబ్రాహాముకు ఆ వారసత్వాన్ని తన కృపలో వాగ్దానం ద్వారా ఇచ్చారు. అలాంటప్పుడు, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? వాగ్దానం ఎవరికి వర్తిస్తుందో ఆ సంతానం వచ్చేవరకు అతిక్రమాలను చూపడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం దూతల ద్వారా ఇవ్వబడి మధ్యవర్తికి అప్పగించబడింది. అయినప్పటికీ మధ్యవర్తి ఒక్కరికే కాదు, కానీ దేవుడు ఒక్కడే. అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? ఎన్నటికి కాదు! ఇవ్వబడిన ధర్మశాస్త్రం మనకు జీవాన్ని ఇచ్చి ఉంటే, తప్పకుండా ధర్మశాస్త్రం వల్లనే నీతి కలిగి ఉండేది. అయితే యేసు క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా కలిగిన వాగ్దానం ఆయనను నమ్మేవారికి ఇవ్వబడాలని, లేఖనం సమస్తాన్ని అందరిని పాపంలో బంధించింది. ఈ విశ్వాసం గురించి తెలియక ముందు, విశ్వాసం బయలుపరచబడే వరకు మనం బంధింపబడి ధర్మశాస్త్రం అదుపులో ఉంచబడ్డాము. అందువల్ల మనం విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడేలా క్రీస్తు వచ్చేవరకు ధర్మశాస్త్రం మనకు ఒక సంరక్షకునిగా ఉండింది. అయితే ఇప్పుడు ఈ విశ్వాసం మనకు బయలుపరచబడింది కాబట్టి మనం సంరక్షకుని ఆధీనంలో ఉండే అవసరం లేదు. కాబట్టి మీరందరు యేసు క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులో బాప్తిస్మం పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదులని గ్రీసు దేశస్థులని, దాసులని స్వతంత్రులని, పురుషుడని స్త్రీ అని ఏ భేదం లేదు, క్రీస్తు యేసులో అందరు ఒక్కటే. మీరు క్రీస్తుకు చెందినవారైతే, మీరు అబ్రాహాము సంతానంగా ఉండి వాగ్దాన ప్రకారం వారసులు.

షేర్ చేయి
Read గలతీయులకు 3