గలతీయులకు 1:1-24
గలతీయులకు 1:1-24 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
పౌలు, అనే నేను మనుష్యుల నుండి గాని లేక ఒక వ్యక్తి వలన గాని పంపబడలేదు, కాని యేసు క్రీస్తు, ఆయనను మరణం నుండి తిరిగి లేపిన తండ్రియైన దేవుని వలన అపొస్తలునిగా పంపబడ్డాను. నేనూ, నాతో ఉన్న సహోదరీ సహోదరులందరం కలిసి, గలతీ ప్రాంతంలోని సంఘాలకు వ్రాయునది: మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగును గాక, క్రీస్తు మన తండ్రియైన దేవుని చిత్తానికి లోబడి, దుష్టత్వం ఏలుబడి చేసే ప్రస్తుత యుగం నుండి మనలను విడిపించడానికి, మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తంగా తనను తాను అర్పించుకున్నారు. ఆయనకే మహిమ నిరంతరం కలుగును గాక. ఆమేన్. మీ గురించి నేను ఆశ్చర్యపడుతున్నాను ఎందుకంటే, క్రీస్తు కృపలో బ్రతుకడానికి మిమ్మల్ని పిలిచిన వానిని మీరు ఇంత త్వరగా వదిలివేసి, వేరొక సువార్త వైపుకు తిరుగుతున్నారు. నిజానికి అది సువార్త కానే కాదు. అయితే కొందరు సువార్తను తారుమారు చేయాలని ప్రయత్నిస్తూ మిమ్మల్ని గందరగోళంలోనికి నెడుతున్నారు. అయితే మేమే గానీ పరలోకం నుండి వచ్చిన దేవదూతే గానీ, మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ప్రకటిస్తే, వారి మీదికి దేవుని శాపం వచ్చు గాక! మేము ఇప్పటికే చెప్పినట్లుగా, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా: మీరు అంగీకరించింది కాక ఎవరైనా ఒకవేళ సువార్త ప్రకటిస్తున్నట్లయితే, అలాంటివారి మీదికి దేవుని శాపం వచ్చు గాక! నేను ఇప్పుడు మనుషుల ఆమోదం పొందటానికి ప్రయత్నిస్తున్నానా, లేదా దేవుని ఆమోదమా? లేక నేను ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నానా? ఒకవేళ నేను ఇంకా ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే, నేను క్రీస్తుకు సేవకునిగా ఉండలేను. సహోదరీ సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మానవుని నుండి వచ్చింది కాదని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. నేను ఏ మానవుని నుండి పొందలేదు, లేదా బోధింపబడలేదు; కాని యేసు క్రీస్తు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ద్వారా పొందాను. నేను యూదా మతంలో జీవించిన నా గత జీవిత విధానాన్ని గురించి, అలాగే దేవుని సంఘాన్ని నాశనం చేయడానికి దాన్ని ఎంత క్రూరంగా నేను హింసించానో మీరు విన్నారు. నా స్వజనులలో నా వయస్సువారనేకుల కంటే యూదా మతవిషయంలో నేను ఎంతో ముందున్నాను, నా పూర్వీకుల ఆచారాలను పాటించడంలో నాకు అత్యాసక్తి ఉండేది. కాని తన కృప ద్వారా నన్ను నా తల్లి గర్భం నుండే ప్రత్యేకపరచుకొని నన్ను పిలిచిన దేవుడు, తన కుమారుని గురించి యూదేతరుల మధ్య నేను సువార్తను ప్రకటించేలా ఆయన తన కుమారున్ని నాలో బయలుపరచడానికి ఇష్టపడ్డారు, దానికి నా తక్షణ ప్రతిస్పందన ఏ మనుష్యుని సంప్రదించడం కాదు. అలాగే నా కంటే ముందు నుండి అపొస్తలులుగా ఉన్న వారిని సంప్రదించడానికి నేను యెరూషలేము వెళ్ళలేదు, కాని నేను అరేబియాకు వెళ్ళాను. తరువాత దమస్కుకు తిరిగి వచ్చాను. మూడు సంవత్సరాల తరువాత, కేఫాను పరిచయం చేసుకోవడానికి యెరూషలేముకు వెళ్ళి అక్కడ పదిహేను రోజులు అతనితో ఉన్నాను. ప్రభువు యొక్క సోదరుడైన యాకోబును తప్ప, ఇతర అపొస్తలుల్లో ఎవరిని నేను చూడలేదు. నేను మీకు వ్రాసేది అబద్ధం కాదని దేవుని ముందు రూఢిగా చెప్తున్నాను. ఆ తరువాత నేను సిరియాకు, కిలికియకు వెళ్ళాను. యూదయలోని క్రీస్తులో ఉన్న సంఘాలకు వ్యక్తిగతంగా నేను తెలియదు. వారు విన్నదల్లా: “ఇంతకు ముందు మనలను హింసించినవాడు, ఏ విశ్వాసాన్నైతే నాశనం చేయాలని ప్రయత్నించాడో, దానినే ఇప్పుడు ప్రకటిస్తున్నాడు” అని. కనుక వారు నన్ను బట్టి దేవుని స్తుతించారు.
గలతీయులకు 1:1-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మనుషుల ద్వారా కాకుండా ఏ వ్యక్తి వలనా కాకుండా కేవలం యేసుక్రీస్తు ద్వారానూ, ఆయనను చనిపోయిన వారిలోనుంచి సజీవుడిగా లేపిన తండ్రి అయిన దేవుని ద్వారానూ అపొస్తలుడుగా నియమితుడైన పౌలు అనే నేనూ, నాతో ఉన్న సోదరులంతా గలతీయ ప్రాంతంలో ఉన్న సంఘాలకు శుభాకాంక్షలతో రాస్తున్న విషయాలు. తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభు యేసు క్రీస్తు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలం నుంచి విమోచించాలని మన పాపాల కోసం తనను తాను అప్పగించుకున్నాడు. నిరంతరమూ దేవునికి మహిమ కలుగు గాక. ఆమేన్. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినవాణ్ణి విడిచిపెట్టి, భిన్నమైన సువార్త వైపు మీరింత త్వరగా తిరిగిపోవడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు వేరే సువార్త అనేది లేదు. క్రీస్తు సువార్తను వక్రీకరించి మిమ్మల్ని కలవరపరచే వారు కొంతమంది ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్తను మేము అయినా లేక పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినా సరే మీకు ప్రకటిస్తే, అతడు దేవుని శాపానికి గురౌతాడు గాక. మేము ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొకటి ఎవరైనా మీకు ప్రకటిస్తే, వాణ్ణి దేవుడు శపిస్తాడు గాక. ఇప్పుడు నేను మనుషుల ఆమోదం కోరుతున్నానా? లేకపోతే దేవుని ఆమోదం కోరుతున్నానా? నేను మనుషులను తృప్తి పరచాలనుకుంటున్నానా? నేనింకా మనుషులను తృప్తి పరచాలనుకుంటుంటే క్రీస్తు సేవకుణ్ణి కానే కాదు. సోదరులారా, నేను ప్రకటించిన సువార్త మానవమాత్రుని నుంచి వచ్చింది కాదని మీకు తెలియాలి. మనిషి నుంచి నేను దాన్ని పొందలేదు, నాకెవరూ దాన్ని బోధించ లేదు, యేసు క్రీస్తు స్వయంగా నాకు వెల్లడి పరిచాడు. నా గత యూదామత జీవితం గురించి మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని తీవ్రంగా హింసిస్తూ నాశనం చేస్తూ ఉండేవాణ్ణి. అప్పుడు నాకు నా పూర్వీకుల సంప్రదాయాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. యూదా మత నిష్ఠ విషయంలో నా స్వజాతీయుల్లో నా వయసు గల అనేకులను మించిపోయాను. అయినా తల్లిగర్భంలోనే నన్ను ప్రత్యేకపరచుకుని, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను యూదేతరులకు తన కుమారుణ్ణి ప్రకటించాలని ఆయనను నాలో వెల్లడి చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు వెంటనే నేను మనుషులతో సంప్రదించలేదు. నాకంటే ముందు అపొస్తలులైన వారి దగ్గరికి గానీ, యెరూషలేముకు గానీ వెళ్ళలేదు, అరేబియా దేశానికి వెళ్ళి ఆ తరువాత దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాను. మూడు సంవత్సరాలైన తరవాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేము వెళ్లి అతనితో పదిహేను రోజులున్నాను. అతనిని తప్ప అపొస్తలుల్లో మరి ఎవరినీ నేను చూడలేదు, ప్రభువు సోదరుడు యాకోబును మాత్రం చూశాను. నేను మీకు రాస్తున్న ఈ విషయాల గురించి దేవుని ముందు నేను చెపుతున్నాను. ఆ తరువాత సిరియా, కిలికియ ప్రాంతాలకు వచ్చాను. క్రీస్తులో ఉన్న యూదయ సంఘాల వారికి నా ముఖ పరిచయం లేదు గానీ “మునుపు మనలను హింసించిన వాడు తాను గతంలో నాశనం చేస్తూ వచ్చిన విశ్వాసాన్ని తానే ప్రకటిస్తున్నాడు” అనే విషయం మాత్రమే విని, వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమ పరిచారు.
గలతీయులకు 1:1-24 పవిత్ర బైబిల్ (TERV)
మనుష్యుని నుండియైనను, మనుష్యుని ద్వారానైనను కాక, యేసు క్రీస్తు ద్వారాను, ఆయనను మరణములో నుండి లేపిన తండ్రియైన దేవుని ద్వారాను అపొస్తలుడనైన పౌలు నుండియు, మరియు నాతో ఉన్న యితర సోదరుల నుండియు గలతీయలో ఉన్న సంఘాలకు: మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మిమ్మల్ని కనికరించి మీకు శాంతి ప్రసాదించుగాక! ప్రస్తుతం మనము అనుభవిస్తున్న చెడుతనం నుండి రక్షించటానికి మన పాపాలకోసం క్రీస్తు బలి అయ్యాడు. తద్వారా మన తండ్రియైన దేవుని యిచ్ఛను పూర్తి చేసాడు. దేవునికి మహిమ చిరకాలం ఉండుగాక! ఆమేన్. తనలో దయ వుండటం వల్ల దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరు ఆయన్ని యింత త్వరలో వదిలివేయటం, మరొక సువార్తవైపు మళ్ళటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త లేనేలేదు. కొందరు మిమ్మల్ని కలవరపెట్టటానికి క్రీస్తు సువార్తను మార్చటానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను గాని, లేక పరలోకం నుండి వచ్చిన దేవదూత గాని మేము ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను ప్రకటిస్తున్నట్లయితే అలాంటి వాడు నిత్యనాశనానికి గురియగుగాక. మేము యిదివరకు చెప్పినదాన్ని యిప్పుడు నేను మళ్ళీ చెపుతున్నాను. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొక సువార్తను ఎవడైనా మీకు భోధిస్తున్నట్లయితే వాడు నిరంతరము శాపగ్రస్తుడవును గాక! నేనిప్పుడు మానవుని మెప్పు పొందటానికి ప్రయత్నిస్తున్నానా లేక దేవుని మెప్పునా? మానవుణ్ణి నేను సంతోషపెట్టాలని చూస్తున్నానా? నేను ఇంకా మానవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నట్లయితే క్రీస్తు సేవకుణ్ణి కాదు. సోదరులారా! నేను ప్రకటించిన సువార్త మానవుడు కల్పించింది కాదు. అది మీరు గమనించాలి. నేను ఆ సువార్తను మానవుని ద్వారా పొందలేదు. దాన్ని నాకెవరూ బోధించనూ లేదు. దాన్ని నాకు యేసు క్రీస్తు తెలియచేసాడు. నేను యూదునిగా ఎట్లా జీవించానో మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించిన విషయం మీకు తెలుసు. దాన్ని ఏ విధంగా నాశనం చెయ్యాలని చూసానో మీకు తెలుసు. నేను యూదునిగా నా వయస్సులో ఉన్న వాళ్ళందరికన్నా చురుకైనవాడను. నా పూర్వికుల సాంప్రదాయాల విషయంలో నాకు చాలా పట్టుదల ఉంది. కాని దేవుడు తన దయతో నేను పుట్టినప్పుడే నన్ను ప్రత్యేకంగా ఉంచాడు. నన్ను పిలిచి తన కుమారుణ్ణి తెలియ చెయ్యటానికి నిశ్చయించుకొన్నాడు. నేను యూదులు కానివాళ్ళకు తన కుమారుని గూర్చిన సువార్తను బోధించాలని ఆయన ఉద్దేశ్యం. నేనీ విషయంలో మరొక వ్యక్తిని సంప్రదించ లేదు. నాకన్నా ముందునుండి అపొస్తలులుగా ఉన్నవాళ్ళను చూడటానికి నేను యెరూషలేము కూడా వెళ్ళలేదు. దానికి మారుగా నేను వెంటనే అరేబియా దేశానికి వెళ్ళి ఆ తర్వాత డెమాస్కసుకు తిరిగి వచ్చాను. మూడు సంవత్సరాలు గడిచాక పేతురును పరిచయం చేసుకోవటానికి యెరూషలేము వెళ్ళాను. అతనితో పదిహేను రోజులు గడిపాను. ఆ సమయంలో ప్రభువు సోదరుడైన యాకోబు తప్ప మిగతా అపొస్తలులెవరూ నాకు కనిపించలేదు. నేను అబద్ధం వ్రాయటంలేదని దేవునిపై ప్రమాణం చేసి చెపుతున్నాను. ఆ తర్వాత నేను సిరియ, కిలికియ దేశాలకు వెళ్ళాను. యూదయ ప్రాంతంలోని క్రీస్తు సంఘాలు నన్ను ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. “ఇదివరలో మనవాళ్ళను హింసించిన వ్యక్తి యిప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఒకప్పుడు అతడు సువార్తను నాశనం చెయ్యాలని చూసాడు” అని యితర్లు అనగా వాళ్ళు విన్నారు. మరియు నా గురించి వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు.
గలతీయులకు 1:1-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యునివలననైనను కాక, యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలోనుండి లేపిన తండ్రియైన దేవునివలనను అపొస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును, నాతోకూడనున్న సహోదరులందరును, గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పర లోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేమిదివరకు చెప్పినప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించినయెడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరు చున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచనప్రకారమైనది కాదని మీకు తెలియ జెప్పు చున్నాను. మనుష్యునివలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది. పూర్వమందు యూదమతస్థుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనముచేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గల వాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితినని నా నడవడినిగూర్చి మీరు వింటిరి. అయినను తల్లిగర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు. నాకంటె ముందుగా అపొస్తలు లైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని; పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితోకూడ పదునయిదు దినములుంటిని. అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు వ్రాయుచున్న యీ సంగతుల విషయమై, యిదిగో దేవుని యెదుట నేను అబద్ధమాడుట లేదు. పిమ్మట సిరియ, కిలికియ ప్రాంతములలోనికి వచ్చితిని. క్రీస్తునందున్న యూదయసంఘములవారికి నా ముఖపరిచయములేకుండెను గాని –మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతిమాత్రమే విని, వారు నన్నుబట్టి దేవుని మహిమపరచిరి.
గలతీయులకు 1:1-24 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
పౌలు అనే నేను మనుష్యుల ద్వారా గాని ఒక వ్యక్తి వలన గాని పంపబడలేదు, కాని యేసు క్రీస్తు, ఆయనను మరణం నుండి తిరిగి లేపిన తండ్రియైన దేవుని వలన అపొస్తలునిగా పంపబడ్డాను. నేనూ, నాతో ఉన్న సహోదరీ సహోదరులందరం కలిసి, గలతీ ప్రాంతంలోని సంఘాలకు వ్రాయునది: మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక. క్రీస్తు మన తండ్రియైన దేవుని చిత్తానికి లోబడి, దుష్టత్వం ఏలుబడి చేసే ప్రస్తుత యుగం నుండి మనల్ని విడిపించడానికి మన పాపాల కోసం ప్రాయశ్చిత్తంగా తనను తాను అర్పించుకున్నారు. ఆయనకే నిరంతరం మహిమ కలుగును గాక ఆమేన్. మీ గురించి నేను ఆశ్చర్యపడుతున్నాను ఎందుకంటే, క్రీస్తు కృపలో బ్రతకడానికి మిమ్మల్ని పిలిచిన వానిని మీరు ఇంత త్వరగా వదిలేసి, వేరొక సువార్త వైపుకు తిరుగుతున్నారు. నిజానికి అది సువార్త కానే కాదు. అయితే కొందరు సువార్తను తారుమారు చేయాలని ప్రయత్నిస్తూ మిమ్మల్ని గందరగోళంలోనికి నెడుతున్నారు. అయితే మేమే గాని పరలోకం నుండి వచ్చిన దేవదూతే గాని, మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ప్రకటిస్తే, వారి మీదికి దేవుని శాపం వచ్చును గాక! మేము ఇప్పటికే చెప్పినట్లుగా, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను: మీరు అంగీకరించిన సువార్త కాక ఎవరైనా వేరే సువార్త ప్రకటిస్తే వారి మీదికి దేవుని శాపం వచ్చును గాక! నేను ఇప్పుడు మనుష్యుల ఆమోదం పొందటానికి ప్రయత్నిస్తున్నానా, లేక దేవుని ఆమోదమా? నేను ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నానా? ఒకవేళ నేను ప్రజలను సంతోషపెట్టేవాడనైతే నేను క్రీస్తుకు సేవకునిగా ఉండలేను. సహోదరీ సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మానవుని నుండి వచ్చింది కాదని మీరు తెలుసుకోవాలి. నేను ఏ మానవుని నుండి దాన్ని పొందలేదు, నాకెవరూ బోధించలేదు; యేసు క్రీస్తు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ద్వారానే నేను పొందాను. నేను యూదా మతంలో జీవించిన నా గత జీవిత విధానాన్ని గురించి, అలాగే దేవుని సంఘాన్ని నాశనం చేయడానికి దాన్ని ఎంత క్రూరంగా నేను హింసించానో మీరు విన్నారు. నా స్వజనులలో నా వయస్సుగల అనేకుల కంటే యూదా మతవిషయంలో నేను ఎంతో ముందున్నాను, నా పూర్వికుల ఆచారాలను పాటించడంలో నాకు అత్యాసక్తి ఉండేది. కాని తన కృప ద్వారా నన్ను నా తల్లి గర్భం నుండే ప్రత్యేకపరచుకొని నన్ను పిలిచిన దేవుడు, తన కుమారుని గురించి యూదేతరుల మధ్య నేను సువార్తను ప్రకటించేలా ఆయన తన కుమారున్ని నాలో బయలుపరచడానికి ఇష్టపడ్డారు. దానికి నేను వెంటనే మనుష్యులను సంప్రదించలేదు. అలాగే నా కంటే ముందు నుండి అపొస్తలులుగా ఉన్నవారిని సంప్రదించడానికి నేను యెరూషలేము వెళ్లలేదు, కాని నేను అరేబియాకు వెళ్లాను. తర్వాత దమస్కుకు తిరిగి వచ్చాను. మూడు సంవత్సరాల తర్వాత, కేఫాను పరిచయం చేసుకోవడానికి యెరూషలేముకు వెళ్లి అక్కడ పదిహేను రోజులు అతనితో ఉన్నాను. ప్రభువు సోదరుడైన యాకోబును తప్ప ఇతర అపొస్తలుల్లో ఎవరిని నేను చూడలేదు. నేను మీకు వ్రాసేది అబద్ధం కాదని దేవుని ముందు రూఢిగా చెప్తున్నాను. ఆ తర్వాత నేను సిరియాకు, కిలికియకు వెళ్లాను. యూదయలోని క్రీస్తులో ఉన్న సంఘాలకు వ్యక్తిగతంగా నేను తెలియదు. వారు, “ఇంతకుముందు మనల్ని హింసించినవాడు, ఏ విశ్వాసాన్నైతే నాశనం చేయాలని ప్రయత్నించాడో దానినే ఇప్పుడు ప్రకటిస్తున్నాడు” అని మాత్రమే విన్నారు. కాబట్టి వారు నన్ను బట్టి దేవుని స్తుతించారు.