ఎజ్రా 9:5-15

ఎజ్రా 9:5-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

తర్వాత, సాయంత్రపు బలి అర్పించే సమయానికి నేను నా అవమానం నుండి లేచి, చినిగిన చొక్కా పై వస్ర్తంతోనే మోకాళ్లమీద పడి, నా దేవుడైన యెహోవా వైపు చేతులెత్తి ఇలా ప్రార్థించాను: “నా దేవా, నా ముఖాన్ని మీ వైపు ఎత్తడానికి నాకు చాలా సిగ్గుగా, అవమానంగా ఉంది. మా పాపాలు మా తల కన్న ఎత్తుగా ఉన్నాయి, మా అపరాధం ఆకాశాన్ని అంటింది. మా పూర్వికుల రోజులనుండి నేటివరకు మేము చాలా ఘోరమైన అపరాధాలు చేశాము. మా పాపం కారణంగా ఈ రోజు ఉన్నట్లు మేము, మా రాజులు, యాజకులు పరాయి రాజుల చేతి అప్పగించబడి ఖడ్గానికి, బానిసత్వానికి, దోపిడికి, అవమానానికి గురైయ్యాము. “అయితే ఇప్పుడు, మా దేవుడైన యెహోవా ప్రార్థనకు జవాబుగా మా కళ్ళకు వెలుగిచ్చి మా బానిసత్వం నుండి కొంత ఉపశమనం కలిగేలా మాలో కొందరిని తప్పించి, తన పరిశుద్ధాలయంలో స్థిరమైన స్థలాన్ని ఇచ్చి, మా దేవుడు కొంతమట్టుకు మా పట్ల దయ చూపించారు. మేము బానిసలుగా ఉన్నప్పటికీ, మా దేవుడు మా దాస్యంలో మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన పర్షియా రాజుల ఎదుట మామీద దయ చూపించారు. దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి, దానికి మరమ్మత్తు చేయడానికి, ఆయన మాకు నూతన జీవాన్ని ఇచ్చారు. యూదాలో, యెరూషలేములో ఆయన మాకు రక్షణ గోడగా ఉన్నారు. “అయితే ఇప్పుడు, మా దేవా, ఇంత జరిగిన తర్వాత మేము ఏమి చెప్పగలము? మీ సేవకులైన ప్రవక్తల ద్వారా మీరు ఇచ్చిన ఆజ్ఞలను విడిచిపెట్టాము. వారు, ‘మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం అక్కడి ప్రజల అపవిత్రత వలన కలుషితమైపోయింది. తమ అసహ్యకరమైన ఆచారాలతో వారు దేశాన్ని ఆ చివర నుండి ఈ చివర వరకు నింపేశారు. కాబట్టి మీ కుమార్తెలకు వారి కుమారులతో గాని, మీ కుమారులకు వారి కుమార్తెలతో గాని పెళ్ళి చేయవద్దు. ఎప్పటికీ వారితో స్నేహ ఒప్పందం కోరవద్దు, అప్పుడు మీరు బలవంతులుగా ఉండి, ఆ దేశంలోని మంచి వాటిని తిని, మీ పిల్లలకు శాశ్వతమైన వారసత్వంగా దానిని అప్పగిస్తారు’ అని చెప్పారు. “మేము చేసిన చెడు పనులకు, మా గొప్ప అపరాధానికి ఫలితంగా ఇలా మాకు జరిగింది. అయినప్పటికీ, మా దేవుడవైన మీరు మా దోషాలకు తగిన పూర్తి శిక్షను మాకు విధించకుండా ఈ విధంగా కొంతమందిని దాస్యం నుండి తప్పించారు. ఇంత జరిగాక, మేము మరలా మీ ఆజ్ఞలు పాటించకుండా ఇలాంటి అసహ్యకరమైన ఆచారాలు పాటించే ప్రజలతో వియ్యమందుతామా? మాలో ఒక్కరు తప్పించుకుని మిగిలిపోకుండ మీరు మమ్మల్ని నాశనం చేసేంతగా కోప్పడతారు గదా? యెహోవా, ఇశ్రాయేలు దేవా, మీరు నీతిమంతులు! ఈ రోజున మేము కొద్ది మందిమి మిగిలాము. మేము మీ ముందు నిలబడడానికి మేమెవరం అర్హులం కాకపోయిన, మీ ఎదుట మా అపరాధంలో నిలబడ్డాము.”

షేర్ చేయి
చదువండి ఎజ్రా 9

ఎజ్రా 9:5-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సాయంత్రం బలి అర్పించే సమయానికి నేను కృంగిన స్థితి నుంచి తేరుకుని లేచాను. నా దుప్పటి, అంగీ చిరిగిపోయి ఉన్న స్థితిలోనే మోకరించి, నా దేవుడైన యెహోవా వైపు చేతులు పైకెత్తి ఇలా ప్రార్ధించాను, “నా దేవా నా దేవా, నా ముఖం నీ వైపు ఎత్తి చూపలేక సిగ్గుతో కృంగిపోయి ఉన్నాను. మా దోషాలు మా తలల కంటే పైగా పెరిగిపోయాయి, మా నేరాలు ఆకాశమంత ఎత్తుగా పెరిగిపోయాయి. మా పూర్వీకులతో మొదలు ఇప్పటివరకూ మేమంతా ఘోరమైన అపరాధాలు చేస్తూ వచ్చాం. మేము చేసిన దోషాలను బట్టి ఈ రోజు ఉన్నట్టుగా మేమూ, మా రాజులూ, యాజకులూ అన్యదేశపు రాజుల స్వాధీనంలో, చావుకూ చెరకూ దోపిడీకీ గురై ఉండడం వలన ఎంతో అవమానభారంతో సిగ్గుపడుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు మా దేవుడైన యెహోవా మా కళ్ళను వెలిగించి, మా బానిసత్వం నుండి మేము సేదదీరేలా, మాలో కొందరిని జీవించి ఉండేలా చేసి, ఆయన పరిశుద్ధ స్థలం లో మేము స్థిర నివాసం ఏర్పరచుకొనేలా కొంతవరకూ మా విషయంలో దయ చూపించాడు. నిజంగా మేము దాసులమైనప్పటికీ మా దేవుడివైన నువ్వు మమ్మల్ని ఆ దాస్యంలోనే ఉండనియ్యలేదు. పర్షియా దేశపు రాజుల ముందు మా పట్ల దయ చూపించావు. మేము సేదదీరేలా మా దేవుని ఆలయం నిలబెట్టావు. యూదా దేశంలోని యెరూషలేము పట్టణంలో పాడైపోయిన స్థలాలను తిరిగి బాగుచేయడానికి, మాకు ఒక ఆశ్రయం కల్పించడానికి నీ కృప అనుగ్రహించావు. మా దేవా, ఇంత కనికరం పొందిన మేము ఇంకేం చెప్పగలం? నీ దాసులైన ప్రవక్తల ద్వారా నువ్వు మాకిచ్చిన ఆజ్ఞలను అనుసరించలేకపోయాం. ప్రవక్తలు మాతో చెబుతూనే వచ్చారు-మీరు స్వతంత్రించుకోబోయే దేశం అక్కడి ప్రజల హేయ కృత్యాలతో, మలినకార్యాలతో అపవిత్రం అయిపోయింది. వారు చేసిన అసహ్యమైన పనులు దేశం నాలుగు దిక్కులకు వ్యాపించాయి. అందువల్ల మీరు మీ కూతుళ్ళను వారి కొడుకులకు, వారి కూతుళ్ళను మీ కొడుకులకు ఇచ్చి పుచ్చుకోకండి. వాళ్లకు క్షేమం, సుఖ సౌఖ్యాలు కలగాలని ఎన్నడూ కోరుకోవద్దు. ఇలా చేసినట్టైతే మీరు స్థిరంగా నిలిచి, ఆ దేశ సుఖాలు అనుభవించి, మీ పిల్లలకు శాశ్వతంగా నిలిచి ఉండే వారసత్వం అప్పగిస్తారు. మా చెడ్డ పనులు, ఘోరమైన అపరాధం కారణంగా ఈ బాధలన్నీ మాపైకి వచ్చాయి. మా దేవుడవైన నువ్వు మా దోషాలకు రావలసిన శిక్షను తగ్గించి మాకు ఈ విధంగా విడుదల కలిగించావు. అయితే మేము నీ ఆజ్ఞలు అతిక్రమించి అసహ్యకరమైన పనులు చేసే ఈ ప్రజలతో సాంగత్యం చేసినప్పుడు, తప్పించుకొనే మార్గం లేని విధంగా మాలో ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ నాశనం చెయ్యాలన్నంత కోపం నీకు వస్తుంది గదా. యెహోవా, ఇశ్రాయేలు దేవా, నువ్వు నీతిపరుడివి. కాబట్టి ఈనాటి వరకూ మిగిలిన మేము కొద్దిమందిమే. ఇదిగో, మేము నీ సన్నిధిలో అపరాధులం. నీ సన్నిధిలో నిలబడడానికి ఎవ్వరికీ అర్హత లేదు.”

షేర్ చేయి
చదువండి ఎజ్రా 9

ఎజ్రా 9:5-15 పవిత్ర బైబిల్ (TERV)

సాయంత్రపు బలివేళ అవడంతో, నేను లేచి నిలబడ్డాను. నా అంగీ, పై వస్త్రమూ చీలికలు పేలికలైవున్నాయి. యెహోవా దేవునివైపు చేతులు చాపి ప్రార్థిస్తూ, మోకరిల్లాను. అప్పుడు నేనిలా ప్రార్థించాను: “ఓ దేవా, ఎక్కువ సిగ్గుచేత, కలవరపాటుచేత నేను నీవైపు ముఖము ఎత్తలేకపోతున్నాను. మా పాపాలు, దోషాలు మా తలల ఎత్తును మీరిపోయి ఆకాశాన్ని అంటుతున్నాయి. మా పూర్వీకుల నాటినుంచి నేటి మా తరందాకా మేము అనేకానేక పాపాలు చేశాము. అందుకే మా రాజులూ, యాజకులూ శిక్షింపబడ్డారు. విదేశాల రాజులు మా పైన దాడి చేసి మా ప్రజలను బందీలుగా తీసుకుపోయారు. ఆ రాజులు మా సంపదను కొల్లగొట్టి, మమ్మల్ని అవమానానికి గురిచేశారు. ఈ నాటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. “చివరికి ఇప్పుడు, దేవా, నీవు మాపట్ల దయ చూపావు. మాలో కొద్దిమంది చెరనుంచి తప్పించుకొని ఈ పవిత్ర ప్రాంతంలో నివసించడాన్ని సాధ్యంచేశావు. ప్రభువా, నీవు మాకు కొత్త జీవితం, దాస్యములో నుంచి విముక్తి ప్రసాదించావు. మేము బానిసలుగా వున్నమాట నిజమే, కాని, నీవు మమ్మల్మి శాశ్వతంగా బానిసలుగా ఉండనియ్యవు. నీవు మాపట్ల దయ చూపావు. పారసీక ప్రభువులు మాపట్ల దయ చూపేలా నీవు చేశావు. నీ దేవాలయం ధ్వంసం చేయబడింది. కాని, నీవు మాకు నూతన జీవితం ప్రసాదించి, మేము నీ ఆలయాన్ని తిరిగి నిర్మించి, దాన్ని సరికొత్తదానిలా మలచగలిగే అవకాశం మాకు కల్పించావు. దేవా! యూదా, యెరూషలేములకు రక్షణగా ప్రాకారం కట్టేందుకు నీవు మాకు తోడ్పడ్డావు. “ఇప్పుడు దేవా, నీకు మేము చెప్పగలిగింది ఏముంది? మేము మళ్లీ నీ మాట పాటించడం మానేశాం! దేవా, నీవు నీ సేవకులైన నీ ప్రవక్తల ద్వారా ఆ ఆదేశాలను మాకు ఇచ్చావు. నీవు ఇలా అన్నావు, ‘మీరు స్వంతం చేసుకొని, నివసించబోయే ప్రాంతం అపవిత్రమైన భూమి. అక్కడ నివసిస్తూ వచ్చిన మనుష్యులు చేసిన చెడ్డపనుల మూలంగా అది అపవిత్రమైనది. వాళ్లు ఈ దేశంలో అన్నిచోట్లా ఇలాంటి చెడ్డపనులు చాలా చేశారు. వాళ్లు తమ పాపాలతో ఈ దేశాన్ని అపవిత్రం చేశారు. అందుకని, ఇశ్రాయేలీయులారా, మీ బిడ్డలు వారి బిడ్డలను పెళ్లి చేసుకోకుండా చూడండి. మీరు వాళ్లతో కలవకండి! నా ఆదేశాలను పాటించండి, వారితో శాంతి ఒప్పందం చేయకండి. అప్పుడు మీరు శక్తి కలిగి, దేశంలోని మంచి వాటిని ఆనందంగా అనుభవించగలుగుతారు. అప్పుడు మీరు ఈ దేశాన్ని నిలుపుకొని, దాన్ని మీ బిడ్డలకు సంక్రమింప జేయగలుగుతారు.’ “మనకి వాటిల్లిన కష్టాలకు మన చెడ్డక్రియలే కారణం. మనం పాపాలు చేశాం, మన దోషాలు అనేకమైనవి. అయితే, ఓ దేవా, నీవు మమ్ముల్ని శిక్షించ వలసినంతగా శిక్షించలేదు. మేము ఘోరమైన పాపాలు ఎన్నో చేశాము. మమ్మల్ని నీవు ఇంకెంతో కఠినంగా శిక్షించియుండవలసింది. మాలో కొందర్ని దాస్యంలో సహితం తప్పించుకోనిచ్చావు. నీ ఆదేశాలను భంగ పరచకూడదని మేము తెలుసుకున్నాము. మేము వాళ్లను పెళ్లి చేసుకోకూడదు. వాళ్లు చేసేవి చాలా చెడ్డ పనులు. దేవా, మేమా చెడ్డవాళ్లతో పెళ్లి కొనసాగించినట్లయితే, నీవు మమ్మల్ని నాశనం చేస్తావని మాకు తెలుసు! అప్పుడిక ఇశ్రాయేలీయుల్లో ఏ ఒక్కడూ ప్రాణాలతో మిగిలివుండడు. “యెహోవా, ఇశ్రాయేలు ప్రజల దేవా, నీవు నీతి మంతుడవై యున్నావు. మాలో కొందర్ని ప్రాణాలతో మిగిల్చావు. మా దోషం కారణంగా, మాలో ఒక్కడుకూడా నీ ముందు నిలిచేందుకు అర్హుడుకాడు.”

షేర్ చేయి
చదువండి ఎజ్రా 9

ఎజ్రా 9:5-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి, నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్లమీద పడి, నా దేవుడైన యెహోవాతట్టు చేతులెత్తి –నా దేవా నా దేవా, నా ముఖము నీవైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై యున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత యెత్తుగా పెరిగియున్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటివరకు మేము మిక్కిలి అపరాధులము; మా దోషములనుబట్టి మేమును మా రాజులును మా యాజకులును అన్యదేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటిదినముననున్నట్లు అప్పగింపబడుటచేత మిగుల సిగ్గునొందినవార మైతిమి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి, మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్ల జేయునట్లుగాను, మాలో ఒక శేషము ఉండ నిచ్చినట్లుగాను, తన పరిశుద్ధస్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను, మా దేవుడైన యెహోవా కొంతమట్టుకు మాయెడల దయ చూపియున్నాడు. నిజముగా మేము దాసులమైతిమి; అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మును విడువక, పారసీకదేశపు రాజులయెదుట మాకు దయ కనుపరచి, మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి, దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుటకును, యూదాదేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపించితివి. మా దేవా, యింత కృపనొందిన తరువాత మేమేమి చెప్ప గలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసులద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి గదా. వారు–మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అప విత్రతచేతను వారుచేయు అసహ్యమైన వాటిచేతను అపవిత్రమాయెను, వారు జరిగించిన అసహ్యమైన వాటిచేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయెను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకియ్యకుడి. వారి కుమార్తెలను మీ కుమారులకొరకు పుచ్చుకొనకుడి. మరియు వారికి క్షేమభాగ్యములు కలుగవలెనని మీరు ఎన్నటికిని కోరకుండినయెడల, మీరు బలముగానుండి, ఆ దేశముయొక్క సుఖమును అనుభవించి, మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాని నప్పగించెదరని చెప్పిరి. అయితే మా దుష్క్రియలనుబట్టియు మా గొప్ప అపరాధములనుబట్టియు ఈ శ్రమలన్నియు మామీదికి వచ్చిన తరువాత, మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మామీద ఉంచి, మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్యకార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసికొనినయెడల, మేము నాశనమగువరకు శేషమైననులేకుండునట్లును, తప్పించుకొనుటకు సాధనమైననులేకుండునట్లును, నీవు కోపపడుదువు గదా. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై యున్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము; మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థనచేసితిని.

షేర్ చేయి
చదువండి ఎజ్రా 9

ఎజ్రా 9:5-15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)