ఎజ్రా 8:21-23
ఎజ్రా 8:21-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని, మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నదిదగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. –మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తముతోడుగా ఉండునుగాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరిమీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులును రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతినిబట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను
ఎజ్రా 8:21-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు దేవుని సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుని మాకూ, మా సంతానానికి, మా ఆస్తిపాస్తులకు క్షేమకరమైన ప్రయాణం జరిగేలా దేవుణ్ణి వేడుకోవడానికి అహవా నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించాలని ప్రకటించాను. ఆయన్ను వేడుకునే వారికి క్షేమం కలిగించడానికి మన దేవుని హస్తం కాపుదలగా ఉంటుంది గానీ, ఆయనను తిరస్కరించే వారి పైకి ఆయన తీవ్రమైన కోపం రగులుకొంటుందని మేము రాజుతో చెప్పాం. అందువల్ల దారి మధ్యలో శత్రువుల బారి నుండి మమ్మల్ని కాపాడడానికి సైనికులను, గుర్రపు రౌతులను సహాయంగా పంపమని రాజును అడిగేందుకు నాకు సిగ్గు అనిపించింది. ఈ విషయాన్ని బట్టి మేము ఉపవాసం ఉండి దేవుని వేడుకొన్నప్పుడు ఆయన మా విన్నపం ఆలకించాడు.
ఎజ్రా 8:21-23 పవిత్ర బైబిల్ (TERV)
అక్కడ, ఆ అహవా నది దగ్గర నేను (ఎజ్రా) మనమందరం ఉపవాసం చెయ్యాలని ప్రకటించాను. మన దేవుని ముందు విధేయత చూపేందుకుగాను మనం ఉపవాసం చెయ్యాలి. మేమూ, మా పిల్లలూ, మాకున్న సమస్త వస్తువులూ క్షేమంగా యెరూషలేము చేరేలా దీవించుమని దేవుణ్ణి వేడు కోవాలనుకున్నాము. మా ప్రయాణ మార్గంలో మా రక్షణ కోసం సైనికుల్నీ, అశ్వికుల్నీ పంపమని అర్తహషస్త రాజుని అర్థించడం నాకు సిగ్గుగా తోచింది. మార్గంలో శత్రువులున్నారని నాకు తెలుసు. అయితే అర్తహషస్త రాజుకి మేమంతకు ముందు ఇలా చెప్పివున్నాము: “మా దేవుడు తనని నమ్మే ప్రతి ఒక్కరికీ తోడుగా ఉంటాడు. అయితే, దేవుడు తనకు ఎడముఖంగా వున్న ప్రతి ఒక్కనిపట్లా చాలా కోపంగా వుంటాడు.” అందుకని, మేము ఉపవాసం వుండి, మా ప్రయాణం గురించి మేము దేవుణ్ణి ప్రార్థించాము. ఆయన మా ప్రార్థనలకు జవాబిచ్చాడు.
ఎజ్రా 8:21-23 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు అక్కడ అహవా కాలువ దగ్గర, మనమందరం ఉపవాసం ఉండి, మన దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకుని మనకు మన పిల్లలకు మన ఆస్తి అంతటికి క్షేమకరమైన ప్రయాణాన్ని ఇవ్వమని వేడుకుందామని నేను ప్రకటించాను. మేము రాజుతో, “మా దేవున్ని వెదికే ప్రతి ఒక్కరిపై ఆయన కరుణాహస్తం ఉంటుంది. ఆయనను విడిచిపెట్టినవారి మీద ఆయన తీవ్రమైన కోపం కుమ్మరించబడుతుంది” అని చెప్పాము కాబట్టి, దారిలో ఎదురయ్యే శత్రువులు నుండి కాపాడడానికి సైనికులు, గుర్రపురౌతులను మాకు సహాయంగా పంపమని రాజును అడగడానికి నేను సిగ్గుపడ్డాను. కాబట్టి మేము ఉపవాసముండి, దీని గురించి మా దేవునికి మొరపెట్టగా, ఆయన మా ప్రార్థనకు జవాబిచ్చారు.