యెహెజ్కేలు 18:1-9

యెహెజ్కేలు 18:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరల యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనని మీరు చెప్పుచు వచ్చెదరే; ఇశ్రాయేలీయుల దేశమునుగూర్చి ఈ సామెత మీ రెందుకు పలికెదరు? నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మనుష్యులందరు నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశములో ఉన్నారు; పాపముచేయువాడెవడో వాడే మరణము నొందును. ఒకడు నీతిపరుడై నీతిన్యాయములను అనుసరించువాడైయుండి పర్వతములమీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహములతట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టయైనదానిని కూడకయు, ఎవనినైనను బాధపెట్టకయు, ఋణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారముచేత ఎవనికైనను నష్టము కలుగజేయకయునుండు వాడై, ఆకలిగలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి వడ్డికి అప్పియ్యకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధుల ననుసరించుచుండినయెడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రదుకును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

షేర్ చేయి
Read యెహెజ్కేలు 18

యెహెజ్కేలు 18:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా వాక్కు మళ్ళీ నాకు వినిపించింది. “తండ్రులు ద్రాక్షలు తిన్నప్పుడు పిల్లల పళ్లు పులిశాయి” అనే సామెత మీరు ఇశ్రాయేలు ప్రదేశం విషయంలో వాడినప్పుడు, దాని అర్థం ఏంటి? నా జీవం తోడు, ఈ సామెత ఇశ్రాయేలీయుల్లో ఇంక మీరు పలకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. “చూడు! ప్రతివాడూ నావాడే. తండ్రులూ, కొడుకులూ, అందరి ప్రాణాలూ నావే! పాపం చేసినవాడు చస్తాడు! ఒకడు నీతిమంతుడుగా ఉండి, నీతిన్యాయాలు జరిగించేవాడై ఉండి, పర్వతాల మీద భోజనాలు చెయ్యకుండా, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహాలవైపు చూడకుండా, తన పొరుగువాడి భార్యను చెరపకుండా, ఋతుస్రావంలో ఉన్న స్త్రీతో లైంగికంగా కలవకుండా, అప్పు తీసుకున్నవాడికి అతని తాకట్టు వస్తువు తిరిగి ఇచ్చేస్తూ, బలవంతంగా ఎవరికీ నష్టం చెయ్యక, ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఇచ్చి, బట్టలు లేని వాడికి బట్టలిచ్చి, వడ్డీకి అప్పు ఇవ్వకుండా, అధిక లాభం తీసుకోకుండా, అన్యాయం చెయ్యకుండా, పక్షపాతం లేకుండా న్యాయం తీర్చి, నమ్మకంగా నా ఆదేశాలు పాటిస్తూ, నా శాసనాల ప్రకారం నడుస్తూ ఉంటే, వాడే నీతిమంతుడు. అతడు నిజంగా బ్రతుకుతాడు” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

షేర్ చేయి
Read యెహెజ్కేలు 18

యెహెజ్కేలు 18:1-9 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు: “మీరీ సామెత వల్లిస్తూ ఉంటారు: ‘తల్లిదండ్రులు పుల్లని ద్రాక్ష తింటే పిల్లలపండ్లు పులిశాయి!’ అని. ఇలా మీరెందుకు అంటూ వుంటారు? మీరు పాపంచేస్తే, మీ బదులు భవిష్యత్తులో మరెవ్వడో శిక్షింపబడతాడని మీరనుకుంటున్నారు.” కాని నా ప్రభువైన యెహోవా చెబుతున్నదేమంటే, “నా జీవ ప్రమాణంగా ఇశ్రాయేలు ప్రజలు ఈ సామెత ఇక మీదట నిజమని నమ్మరని నేను మీకు ఖచ్చితంగా చెబుతున్నాను! నేను ప్రతి వ్యక్తినీ ఒకే రకంగా చూస్తాను. ఆ వ్యక్తి తండ్రిగాని, బిడ్డగాని కావచ్చు. పర్వాలేదు. ఎవరైతే పాపం చేశారో ఆ వ్యక్తులే చనిపోతారు! “మంచి మనిషి ఎవరైనా వుంటే, ఆ వ్యక్తి జీవిస్తాడు! ఆ మంచి వ్యక్తి ప్రజలయెడల నీతిగా న్యాయంగా వుంటాడు. ఆ సజ్జనుడు పర్వతాలమీదికి వెళ్లి, అక్కడ బూటకపు దేవతలకు అర్పించిన నైవేద్యాలను తినడు. అతడు ఇశ్రాయేలులో నెలకొల్పిన రోత విగ్రహాలను ప్రార్థించడు. అతడు తన పొరుగువాని భార్యతో వ్యభిచరించే పాపానికి ఒడిగట్టడు. తన భార్య ముట్టయినప్పుడు ఆమెతో సంభోగించడు. ఆ సజ్జనుడు ప్రజల మంచితనాన్ని ఆసరాగా తీసుకోడు, ఎవ్వరేగాని అతని వద్దకు అప్పుకు వచ్చినప్పుడు, మంచి వ్యక్తి వస్తువులను తాకట్టు పెట్టుకొని డబ్బు ఇస్తాడు. అప్పు తీసుకొన్నవాడు తిరిగి చెల్లించినప్పుడు, సజ్జనుడు తన డబ్బు తీసుకొని తాకట్టు వస్తువులను ఇచ్చివేస్తాడు. ఆకలిగొన్న వారికి సజ్జనుడు అన్నం పెడతాడు. కట్టు బట్టలు లేక బాధపడేవారికి అతడు వస్త్రదానం చేస్తాడు. అప్పు కోరి అతనిని ఆశ్రయిస్తే మంచి వ్యక్తి ఆ వచ్చిన వానికి డబ్బు ఇస్తాడు. కాని అతడా ఋణానికి వడ్డీ తీసుకోడు. మంచివాడు కపటంగా ప్రవర్తించటానికి నిరాకరిస్తాడు. అతడు ప్రతి మనిషి పట్ల ఎల్లప్పుడూ ఉదారంగా ప్రవర్తిస్తాడు. ప్రజలతనిని నమ్మవచ్చు. అతడు నా కట్టడలను అనుసరిస్తాడు. అతడు నా నిర్ణయాలను గురించి ఆలోచించి, ధర్మవర్తనుడై నమ్మదగినవాడుగా వుండటం నేర్చుకుంటాడు. అతడు సజ్జనుడు. అందుచేత అతడు జీవిస్తాడు.

షేర్ చేయి
Read యెహెజ్కేలు 18

యెహెజ్కేలు 18:1-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: “ఇశ్రాయేలు దేశం గురించి మీరు చెప్పే ఈ సామెతకు అర్థం ఏంటి? “ ‘తల్లిదండ్రులు పుల్లని ద్రాక్షలు తింటే పిల్లల పళ్లు పులిసాయి.’ “నా జీవం తోడు, ఇశ్రాయేలీయుల మధ్య ఈ సామెత మళ్ళీ వినపడదు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నా వారే, తండ్రులైనా పిల్లలైనా ఇద్దరూ నా వారే. పాపం చేసేవాడు చనిపోతాడు. “ఒక నీతిమంతుడు ఉంటే అతడు నీతిని న్యాయాన్ని జరిగిస్తాడు. అతడు పర్వత క్షేత్రాల మీద భోజనం చేయడు, ఇశ్రాయేలీయుల విగ్రహాలవైపు చూడడు, తన పొరుగువాని భార్యను అపవిత్రం చేయడు, బహిష్టులో ఉన్న స్త్రీతో లైంగికంగా కలవడు, ఎవరిని బాధించడు, అప్పుకు తాకట్టుగా పెట్టిన దానిని తిరిగి ఇచ్చేస్తాడు, ఎవరినీ దోచుకోడు కాని ఆకలితో ఉన్నవారికి తన ఆహారాన్ని ఇచ్చి దిగంబరికి బట్టలు ఇస్తాడు. వడ్డీకి అప్పు ఇవ్వడు వారి నుండి లాభం తీసుకోడు. తప్పు చేయకుండా జాగ్రత్తపడతాడు సత్యంగా న్యాయం తీరుస్తాడు. అతడు నా శాసనాలను అనుసరించి నా ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడు. ఇలాంటి వాడే నీతిమంతుడు; అతడు నిజంగా బ్రతుకుతాడు, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

షేర్ చేయి
Read యెహెజ్కేలు 18