నిర్గమకాండము 8:1-32

నిర్గమకాండము 8:1-32 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అప్పుడు యెహోవా మోషేతో, “నీవు ఫరో దగ్గరకు వెళ్లి అతనితో, ‘యెహోవా చెప్పిన మాట ఇదే: నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు. నీవు వారిని వెళ్లనివ్వకపోతే నేను నీ దేశమంతట కప్పలు పంపించి బాధిస్తాను. నైలు నది కప్పలతో నిండిపోతుంది. అవి నీ రాజభవనం లోనికి నీ పడకగదిలోనికి, నీ పడక మీదికి, నీ అధికారుల ఇళ్ళలోనికి, నీ ప్రజలమీదికి, మీ పొయ్యిల్లోనికి, పిండి పిసికే తొట్టెల్లోనికి వస్తాయి. ఆ కప్పలు నీ మీదికి నీ ప్రజలమీదికి నీ అధికారుల మీదికి వస్తాయి అని చెప్పు’ అని అన్నారు.” అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు అహరోనుతో, ‘ప్రవాహాలు, కాలువలు, చెరువులపై నీ కర్రతో నీ చేయిని చాచి, ఈజిప్టు భూమిపై కప్పలు పైకి వచ్చేలా చేయి’ అని చెప్పు.” అహరోను ఈజిప్టు జలాల మీద తన చేతిని చాపినప్పుడు కప్పలు వచ్చి ఆ దేశాన్ని కప్పివేశాయి. అయితే మంత్రగాళ్ళు కూడా తమ మంత్రవిద్యతో అవే చేసి ఈజిప్టు దేశం మీదికి కప్పలు వచ్చేలా చేశారు. ఫరో మోషే అహరోనులను పిలిపించి, “నా నుండి నా ప్రజల నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాకు ప్రార్థించండి, అప్పుడు యెహోవాకు బలి అర్పించడానికి నీ ప్రజలను వెళ్లనిస్తాను” అని అన్నాడు. అందుకు మోషే ఫరోతో, “నైలు నదిలో మిగిలి ఉన్న కప్పలు తప్ప, మిమ్మల్ని, మీ ఇళ్ళను కప్పలు వదిలి వెళ్లేలా, మీ కోసం మీ ప్రజల కోసం, మీ అధికారుల కోసం ప్రార్థించడానికి సమయం నిర్ణయించే గౌరవాన్ని నేను మీకే ఇస్తున్నాను” అన్నాడు. అందుకు ఫరో, “రేపే” అన్నాడు. అందుకు మోషే అన్నాడు, “మా దేవుడైన యెహోవా వంటి వారెవరు లేరని నీవు తెలుసుకునేలా నీవన్నట్టే జరుగుతుంది. కప్పలు మిమ్మల్ని, మీ ఇళ్ళను, మీ అధికారులను, మీ ప్రజలను వదిలివేస్తాయి; అవి నైలు నదిలో మాత్రమే ఉంటాయి.” మోషే అహరోనులు ఫరో దగ్గరనుండి వెళ్లిన తర్వాత, యెహోవా ఫరో మీదికి రప్పించిన కప్పల గురించి మోషే ఆయనకు మొరపెట్టాడు. మోషే అడిగినట్టే యెహోవా చేశారు. ఇళ్ళలో ఆవరణాల్లో పొలాల్లో ఉన్న కప్పలు చనిపోయాయి. ఈజిప్టు ప్రజలు వాటిని కుప్పలుగా వేసినప్పుడు నేల కంపుకొట్టింది. కప్పల నుండి ఉపశమనం కలిగిందని చూసిన ఫరో యెహోవా చెప్పిన ప్రకారమే తన హృదయాన్ని కఠినం చేసుకుని మోషే అహరోనుల మాట వినలేదు. అప్పుడు యెహోవా మోషేతో, “నీవు అహరోనుతో, ‘నీ కర్రను చాపి నేలమీది ధూళిని కొట్టు’ అని చెప్పు, అప్పుడు ఈజిప్టు దేశమంతటా ఆ ధూళి చిన్న దోమలుగా మారుతుంది” అని అన్నారు. వారు అలాగే చేశారు, అహరోను కర్ర పట్టుకుని తన చేతిని చాచి నేలమీది ధూళిని కొట్టినప్పుడు మనుష్యుల మీదికి జంతువుల మీదికి చిన్న దోమలు వచ్చాయి. ఈజిప్టు దేశంలోని ధూళి అంతా చిన్న దోమలుగా మారింది. అయితే మంత్రగాళ్ళు తమ మంత్రవిద్యతో చిన్న దోమలను పుట్టించడానికి ప్రయత్నించారు, కాని వారు చేయలేకపోయారు. చిన్న దోమలు మనుష్యుల మీద జంతువుల మీద వాలాయి, మంత్రగాళ్ళు ఫరోతో, “ఇది దేవుని వ్రేలు చేసిన పనే” అని చెప్పారు. అయినా యెహోవా చెప్పిన ప్రకారమే ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుని వారి మాట వినలేదు. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు ప్రొద్దుటే లేచి ఫరో నదికి వెళ్తున్నప్పుడు అతనికి ఎదురై అతనితో ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పిన మాట ఇదే: నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు. నీవు నా ప్రజలను వెళ్లనివ్వకపోతే నేను నీ మీదికి నీ అధికారుల మీదికి నీ ప్రజలమీదికి నీ ఇళ్ళలోనికి ఈగల గుంపులను పంపిస్తాను, అప్పుడు ఈజిప్టువారి ఇల్లు ఈగలతో నిండిపోతాయి; చివరికి నేల కూడా వాటితో నిండిపోతుంది. “ ‘అయితే ఆ దినాన నా ప్రజలు నివసించే గోషేను దేశంలో మాత్రం ఏ ఈగల గుంపు ఉండదు; అప్పుడు యెహోవానైన నేను ఈ దేశంలో ఉన్నానని నీవు తెలుసుకుంటావు; నీ ప్రజలకు నా ప్రజలకు మధ్య భేదాన్ని చూపిస్తాను. ఈ సూచన రేపే కనబడుతుంది.’ ” ఇది యెహోవా చేశారు. బాధించే ఈగల గుంపులు ఫరో రాజభవనం లోనికి అతని సేవకుల ఇళ్ళలోనికి వచ్చి పడ్డాయి; ఈగల గుంపుల వలన ఈజిప్టు దేశమంతటా నేల నాశనమైంది. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, “మీరు వెళ్లి ఈ దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుకోండి” అన్నాడు. అందుకు మోషే, “అది సరికాదు. మా దేవుడైన యెహోవాకు మేము బలి అర్పించడం ఈజిప్టువారికి అసహ్యం కలిగించవచ్చు. వారి కళ్ళకు అసహ్యమైన బలిని మేము అర్పించినప్పుడు వారు మమ్మల్ని రాళ్లతో కొట్టరా? మేము అరణ్యంలో మూడు రోజులు ప్రయాణం చేసి మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన ప్రకారం మేము అక్కడే బలి అర్పించాలి” అన్నాడు. అందుకు ఫరో, “మీ దేవుడైన యెహోవాకు అరణ్యంలో బలులు అర్పించడానికి నేను మిమ్మల్ని పంపిస్తాను కాని మీరు ఎక్కువ దూరం వెళ్లకూడదు. ఇప్పుడు నా కోసం ప్రార్థించండి” అన్నాడు. అందుకు మోషే, “నేను నీ దగ్గర నుండి వెళ్లిన వెంటనే యెహోవాకు మొరపెడతాను, రేపు ఫరో దగ్గర నుండి అతని అధికారుల దగ్గర నుండి అతని ప్రజల దగ్గర నుండి ఈగల గుంపులు వెళ్లిపోతాయి. అయితే యెహోవాకు బలి అర్పించడానికి ప్రజలను వెళ్లనివ్వకుండ ఫరో మరలా మోసపూరితంగా ప్రవర్తించకుండ చూసుకోవాలి” అని చెప్పాడు. మోషే ఫరో దగ్గరనుండి వెళ్లి యెహోవాకు మొరపెట్టాడు. మోషే అడిగినట్టే యెహోవా చేశారు. ఈగలు ఫరోను అతని సేవకులను అతని ప్రజలను విడిచిపోయాయి. ఒక్క ఈగ కూడా మిగల్లేదు. అయితే ఫరో మరలా తన హృదయం కఠినం చేసుకుని ప్రజలను వెళ్లనివ్వలేదు.

నిర్గమకాండము 8:1-32 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా మోషేతో “నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పు, ‘నన్ను ఆరాధించి సేవించడానికి నా ప్రజలను పంపించు. నువ్వు వాళ్ళను వెళ్ళనీయకపోతే నేను నీ సరిహద్దులన్నిటినీ కప్పలతో బాధ పెడతాను. నదిలో కప్పలు విపరీతంగా పుట్టుకొస్తాయి. అవి నీ ఇంట్లోకి, నీ పడక గదిలోకి, నీ మంచం పైకి, నీ సేవకుల పైకి, నీ ప్రజల పైకి, నీ పొయ్యిల్లో నీ పిండి పిసికే పాత్రల్లోకి ఎక్కివస్తాయి. ఆ కప్పలు నీపై, నీ ప్రజలపై, నీ సేవకులందరి పై దాడి చేస్తాయి’ అని యెహోవా చెబుతున్నాడు.” యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు. “నువ్వు అహరోనుతో ‘నీ కర్ర పట్టుకుని నది పాయల మీద, కాలవల మీద, చెరువుల మీద నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం పైకి కప్పలను రప్పించు’ అని చెప్పు” అన్నాడు. అహరోను ఐగుప్తు దేశం లోని నీళ్ళ మీద తన చెయ్యి చాపాడు. అప్పుడు కప్పలు పుట్టుకొచ్చి ఐగుప్తు దేశాన్ని కప్పివేశాయి. ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తులు ఉపయోగించి ఐగుప్తు దేశం అంతటా కప్పలను రప్పించారు. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. “నా దగ్గర నుండి, నా ప్రజల దగ్గర నుండి ఈ కప్పలు తొలగిపోయేలా చేయమని యెహోవాను ప్రాధేయపడండి. కప్పలు తొలగిపోతే యెహోవాకు బలులు అర్పించడానికి ఈ ప్రజలను పంపిస్తాను” అని చెప్పాడు. అందుకు మోషే “ఈ కప్పలు మీ మీద, మీ ఇళ్ళలో ఉండకుండాా చచ్చి మిగిలినవన్నీ నదిలోనే ఉండిపోయేలా నీ కోసం, నీ సేవకుల కోసం నేను దేవుణ్ణి ఎప్పుడు ప్రాధేయపడాలో నన్ను అడిగే అవకాశం నీదే” అన్నాడు. అప్పుడు ఫరో “రేపే ఆ పని చెయ్యి” అని బదులిచ్చాడు. అందుకు మోషే “మా దేవుడు యెహోవా లాంటి వాడు ఎవ్వరూ లేడు అని నువ్వు గ్రహించేలా నువ్వు కోరుకున్నట్టు జరుగుతుంది. కప్పలు మీ నుండి, మీ ఇళ్ళ నుండి, నీ సేవకుల, నీ ప్రజల ఇళ్ళనుండి తొలగిపోయి నదిలోకి చేరుకుంటాయి” అన్నాడు. మోషే అహరోనులు ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళారు. యెహోవా ఫరో మీదికి రప్పించిన కప్పల విషయం మోషే ఆయనకు మొరపెట్టాడు. యెహోవా మోషే మాట ఆలకించాడు. ఇళ్ళలో, బయటా, పొలాల్లో ఎక్కడా కప్పలు మిగలకుండా చనిపోయాయి. ప్రజలు వాటిని కుప్పలుగా పడవేసినప్పుడు నేలంతా దుర్వాసన వచ్చింది. ఇబ్బంది నుండి ఉపశమనం కలిగింది. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని వారి మాట లక్ష్యపెట్టలేదు. అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు నీ కర్రను చాపి ఈ దేశంలో ఉన్న దుమ్మును కొట్టు. ఆ దుమ్ము ఐగుప్తు దేశమంతా చిన్న దోమల్లాగా అలుముకుంటుంది అని అహరోనుతో చెప్పు” అన్నాడు. అప్పుడు వారిద్దరూ ఆ విధంగా చేశారు. అహరోను తన కర్రను చాపి ఆ దేశపు దుమ్మును కొట్టినప్పుడు మనుష్యుల మీద, జంతువుల మీద చిన్న దోమలు వచ్చాయి. ఐగుప్తు దేశంలోని దుమ్ము అంతా రేగి దోమల్లాగా వ్యాపించాయి. మాంత్రికులు కూడా చిన్నదోమలు పుట్టించాలని తమ మంత్రాలు ప్రయోగించారు గానీ వారి వల్ల కాలేదు. మనుష్యుల మీదా, జంతువుల మీదా చిన్న దోమలు నిలిచి ఉన్నప్పుడు మాంత్రికులు “ఇది దేవుడైన యెహోవా వేలు” అని ఫరోతో చెప్పారు. అయినప్పటికీ యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినం కావడం వల్ల అతడు వారి మాట వినలేదు. కాబట్టి యెహోవా మోషేతో “నువ్వు ఉదయాన్నే లేచి నది దగ్గర ఉన్న ఫరో ఎదుట నిలిచి అతనితో, నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు. నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో నేను నీ మీదికీ, నీ సేవకుల మీదికీ, నీ ప్రజలందరి మీదికీ మీ ఇళ్ళలోకీ ఈగల గుంపులను పంపుతాను. ఐగుప్తీయుల ఇళ్ళూ వారు ఉండే ప్రదేశాలూ ఈగల గుంపులతో నిండిపోతాయి. భూమిపై నేనే యెహోవాను అని నువ్వు తెలుసుకొనేలా ఆ రోజు నేను నా ప్రజలు నివసిస్తున్న గోషెను దేశాన్ని దీని నుండి మినహాయిస్తాను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరుస్తాను. రేపే ఈ అద్భుత కార్యం జరుగుతుంది అని యెహోవా సెలవిచ్చాడు అని చెప్పు” అన్నాడు. యెహోవా ఆ విధంగా జరిగించాడు. బాధ కలిగించే ఈగల గుంపులు ఫరో ఇంట్లోకి, అతని సేవకుల ఇళ్ళలోకి, ఐగుప్తు దేశమంతా వ్యాపించాయి. ఈగల గుంపులమయమై ఆ దేశమంతా పాడై పోయింది. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. “మీరు వెళ్లి మన దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుకోండి” అని వాళ్ళతో చెప్పాడు. అందుకు మోషే “అలా చేయడం వీలు కాదు. మా దేవుడు యెహోవాకు మేము అర్పించే బలులు ఐగుప్తీయులకు అసహ్యమైనవి. వాళ్లకు అసహ్యమైన బలులు వాళ్ళ కళ్ళ ఎదుటే అర్పిస్తే వాళ్ళు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపరా. అందుకేమా దేవుడు యెహోవా మాకు సెలవిచ్చినట్టు మేము ఎడారిలోకి మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి అక్కడ బలులు అర్పిస్తాం” అని చెప్పాడు. ఫరో “మీరు ఎడారిలో మీ దేవుడు యెహోవాకు బలులు అర్పించడానికి మిమ్మల్ని వెళ్ళనిస్తాను. అయితే దూరం వెళ్ళవద్దు. ఇంకా నా కోసం కూడా మీ దేవుణ్ణి వేడుకోండి” అన్నాడు. అందుకు మోషే “నేను నీ దగ్గర నుండి వెళ్లి రేపటి రోజున ఈ ఈగల గుంపులు మీ దగ్గర నుండి, మీ సేవకుల దగ్గర నుండి, నీ ప్రజల దగ్గర నుండి తొలగిపోయేలా యెహోవాను వేడుకొంటాను. అయితే యెహోవాకు బలి అర్పించడానికి ప్రజలను వెళ్ళనీయకుండా ఇకపై మోసం చేయవద్దు” అని చెప్పి ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్లి యెహోవాను ప్రార్థించాడు. యెహోవా మోషే కోరినట్టు జరిగించాడు. ఈగల గుంపులు ఫరో దగ్గర నుండి, అతని సేవకుల దగ్గర నుండి, ప్రజల దగ్గర నుండి ఒక్కటి కూడా మిగలకుండా తొలగిపోయాయి. అయితే అప్పుడు కూడా ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు.

నిర్గమకాండము 8:1-32 పవిత్ర బైబిల్ (TERV)

మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “ఫరో దగ్గరకు వెళ్లి, ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు, అని యెహోవా చెబుతున్నాడని అతనితో చెప్పు. వారు వెళ్లడానికి ఫరో నిరాకరిస్తే నేను ఈజిప్టును కప్పలతో నింపేస్తాను నైలు నది కప్పలతో నిండిపోతుంది. అవి నదిలోనుంచి వచ్చి మీ ఇళ్లలో దూరుతాయి. అవి మీ పడక గదుల్లో పడకల మీద వుంటాయి. మీ అధికారుల ఇళ్లలో, మీ వంట పాత్రల్లో, నీళ్ల బానల్లో కప్పలే ఉంటాయి. నీవు, నీ ప్రజలు, నీ అధికారులు అందరి మీదికీ కప్పలు వచ్చేస్తాయి.’” అప్పుడు మోషేతో యెహోవా, “కాలువలు, నదులు, చెరువులు, అన్నింటి మీదికీ తన చేతి కర్రను ఎత్తమని అహరోనుతో చెప్పు. కప్పలు బయటకు వచ్చి ఈజిప్టు అంతటా నిండుతాయి” అని చెప్పాడు. కనుక ఈజిప్టు జలాలపై అహరోను తన చేయి ఎత్తగా నీళ్లలో నుండి కప్పలు బయటకు వచ్చి, ఈజిప్టు దేశమంతా నిండిపోవటం మొదలయింది. మాయలు చేసే ఈజిప్టు మాంత్రికులు కూడా అలాగే చేసారు, కనుక ఈజిప్టు మీదికి ఇంకా ఎక్కువ కప్పలు వచ్చాయి. మోషే, అహరోనులను ఫరో పిలిపించాడు, “నా దగ్గర్నుండి, నా ప్రజల దగ్గర్నుండి కప్పలను తీసివేయుమని యెహోవాను అడగండి. యెహోవాకు బలులు అర్పించేందుకు ప్రజల్ని నేను వెళ్లనిస్తాను” అన్నాడు ఫరో. ఫరోతో మోషే ఇలాగు చెప్పాడు, “కప్పలు ఎప్పుడు పోవాలనుకుంటున్నావో నాతో చెప్పు, నీ కోసం, నీ ప్రజల కోసం, నీ అధికారుల కోసం నేను ప్రార్థన చేస్తాను. అప్పుడే కప్పలు మిమ్మల్ని, మీ ఇళ్లను విడిచిపెట్టి నదిలోనే ఉండిపోతాయి. (కప్పలు ఎప్పుడు నిన్ను వదిలి పోవాలనుకొంటున్నావు?)” “రేపే” అన్నాడు ఫరో. మోషే అన్నాడు: “నీవు చెప్పినట్టే జరుగుతుంది. మా దేవుడైన, యెహోవాలాంటి దేవుడు ఇంకెవ్వరూ లేరని నీవు తెలుసుకొంటావు. నిన్ను, నీ ఇంటిని, నీ అధికారుల్ని, నీ ప్రజల్ను కప్పలు విడిచిపోతాయి. ఆ కప్పలు నదిలోనే ఉండిపోతాయి.” మోషే, అహరోను ఫరో దగ్గర్నుండి వెళ్లిపోయారు. ఫరో మీదికి ఆయన పంపిన కప్పల్నిగూర్చి మోషే యెహోవాకు మొరపెట్టాడు. మోషే అడిగిన ప్రకారం దేవుడు చేసాడు. ఇళ్లలో, వాకిళ్లలో, పొలాల్లో కప్పలు చచ్చాయి. అవి కుళ్లిపోయి దేశమంతా కంపు కొట్టడం మొదలయింది. కప్పల బాధ వదలిపోవడం చూచి ఫరో మళ్లీ మొండికెత్తాడు. అతను ఏమి చెయ్యాలని మోషే అహరోనులు అడిగారో, అలా చేయలేదు. ఇదంతా సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది. యెహోవా మోషేతో ఇలా అన్నాడు “నీ కర్ర పై కెత్తి నేలమీద దుమ్మును కొట్టు ఈజిప్టుదేశ వ్యాప్తంగా దుమ్ము పేలు అవుతాయి. అని అహరోనుతో చెప్పు.” వారు అలా చేసారు. అహరోను తన చేతి కర్ర పై కెత్తి నేలమీద దుమ్మును కొట్టాడు. ఈజిప్టు అంతటా దుమ్ము పేలు అయింది. మనుష్యుల మీద జంతువుల మీద పేలు ఎక్కేసాయి. ఈజిప్టు మాంత్రికులు వారి మాయల్ని ప్రయోగించి వారు కూడ అలా చేయాలని ప్రయత్నం చేసారు. కానీ దుమ్ము నుండి పేలు వచ్చేటట్టు చేయలేక పోయారు. జంతువుల మీద, మనుష్యుల మీద పేలు అలాగే ఉండిపోయాయి. కనుక ఇది యెహోవా శక్తివల్లే జరిగిందని మాంత్రికులు ఫరోతో చెప్పారు. కాని ఫరో వారు చెప్పింది ఒప్పుకోలేదు. ఇదీ సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది. యెహోవా మోషేతో ఇలా అన్నాడు, “ఉదయాన్నే లేచి ఫరో దగ్గరకు వెళ్లు. ఫరో నదికి వెళ్తాడు. ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజల్ని వెళ్లనివ్వు’ అని యెహోవా అంటున్నాడని అతనితో చెప్పు. ‘నీవు నా ప్రజల్ని వెళ్లనివ్వక పోతే, నీ ఇండ్లలోకి ఈగలు వచ్చేస్తాయి, నీ మీద, నీ అధికారుల మీద ఈగలు పట్టేస్తాయి. ఈజిప్టు గృహాలన్నీ ఈగలతో నిండిపోతాయి. ఈజిప్టు దేశమంతా ఈగలతో నిండిపోతుంది.’ అయితే ఈజిప్టు ప్రజలను చూచినట్టు మాత్రం ఇశ్రాయేలు ప్రజల్ని నేను చూడను. నా ప్రజలు నివసిస్తున్న గోషెనులో మాత్రం ఈగలు ఉండవు. ఈ విధంగా నేను అంటే యెహోవాను ఈ భూమి మీద ఉన్నానని నీవు తెలుసుకొంటావు. కనుక రేపు నా ప్రజల్ని నీ ప్రజల కంటే వేరుగా చూస్తాను. అదే నా రుజువు.” అందుచేత యెహోవా అలాగే చేసాడు. ఈజిప్టు మీదికి విస్తారంగా ఈగలు వచ్చేసాయి. ఫరో ఇంట్లోను, అతని అధికారుల ఇండ్లన్నింటిలోను ఈగలు ఉన్నాయి. ఈజిప్టు అంతటా ఈగలు ముసురుకొన్నాయి. ఈగలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి. కనుక మోషే అహరోనుల్ని ఫరో పిలిపించాడు. “ఈ దేశంలోనే ఇక్కడే మీ దేవునికి బలులు అర్పించండి” అని ఫరో వాళ్లతో చెప్పాడు. కానీ మోషే అన్నాడు, “అలా చేయటం సరికాదు. మా దేవుడైన యెహోవాకు బలులు అర్పించటం చాలా భయంకర విషయం అని ఈజిప్టు వాళ్లు అనుకొంటారు. ఈజిప్టు వాళ్లకు కనబడేటట్టు మేము గనుక ఇలా చేస్తే, ఈజిప్టు వాళ్లు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారు. మూడు రోజుల ప్రయాణమంత దూరం మమ్మల్ని అరణ్యంలోకి వెళ్లనిచ్చి, అక్కడ మా యెహోవా దేవునికి బలులు అర్పించనివ్వు. యెహోవా మమ్మల్ని ఇలాగే చేయమన్నాడు.” అందుకు ఫరో, “మీరు వెళ్లి అరణ్యంలో మీ యెహోవా దేవునికి బలులు అర్పించనిస్తాను. కానీ మీరు మాత్రం మూడు రోజుల ప్రయాణమంత దూరంకంటే ఎక్కువ దూరం వెళ్లకూడదు. ఇక పోయి నాకోసం ప్రార్థించు.” అని మోషేతో అన్నాడు. “సరే రేపు నీ నుండి, నీ ప్రజలనుండి, నీ అధికారుల దగ్గర్నుండి ఈగలను తొలిగించమని నేను పోయి యెహోవాను వేడుకొంటాను. కాని, ప్రజలు బలులు అర్పించకుండా నీవు మాత్రం ఆపు చేయకూడదు” అన్నాడు మోషే. కనుక మోషే ఫరో దగ్గర్నుండి వెళ్లిపోయి యెహోవాకు ప్రార్థన చేసాడు. మోషే కోరినట్టు యెహోవా చేసాడు. ఫరోనుండి, అతని ప్రజలనుండి అధికారుల నుండి ఈగలను యెహోవా తొలగించాడు. ఈగలు ఒక్కటి కూడా మిగుల లేదు. అయితే ఫరో మళ్లీ మొండికెత్తి ప్రజలను వెళ్ల నివ్వలేదు.

నిర్గమకాండము 8:1-32 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా ఏటిని కొట్టి యేడు దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఫరో యొద్దకు వెళ్లి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము; నీవు వారిని పోనియ్యనొల్లనియెడల ఇదిగో నేను నీ పొలి మేరలన్నిటిని కప్పలచేత బాధించెదను. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును; అవి నీ యింట నీ పడకగదిలోనికి నీ మంచముమీదికి నీ సేవకులయిండ్లలోనికి నీ జనులమీదికి నీ పొయిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును; ఆ కప్పలు నీ మీదికి నీ జనులమీదికి నీ సేవకులందరిమీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు అహరోనును చూచి–నీ కఱ్ఱ పట్టుకొని యేటిపాయలమీదను కాలువలమీదను చెరువులమీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశముమీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా అహరోను ఐగుప్తు జలములమీద తన చెయ్యి చాపెను; అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శకునగాండ్రు కూడ తమ మంత్రములవలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి–నా యొద్దనుండి నా జనులయొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడు కొనుడి, అప్పుడు యెహోవాకుబలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదననెను. అందుకు మోషే–నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ యిండ్లలోను ఉండకుండ చంపబడునట్లును నీ కొరకును నీ సేవకులకొరకును నీ ప్రజలకొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనెను. అందుకతడు–మా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు అని నీవు తెలిసికొనునట్లు నీ మాటచొప్పున జరుగును; అనగా కప్పలు నీ యొద్ద నుండియు నీ యిండ్లలోనుండియు నీ సేవకులయొద్ద నుండియు నీ ప్రజలయొద్దనుండియు తొలగిపోవును; అవి యేటిలోనే ఉండుననెను. మోషే అహరోనులు ఫరో యొద్దనుండి బయలు వెళ్లినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతనికొరకు మొఱ పెట్టగా యెహోవా మోషే మాటచొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండ చచ్చిపోయెను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపుకొట్టెను. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినక పోయెను. అందుకు యెహోవా మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కఱ్ఱను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యులమీదను జంతువులమీదను ఉండెను; ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. శకునగాండ్రు కూడ పేలను పుట్టించవలెనని తమ మంత్రములచేత అట్లు చేసిరిగాని అది వారివలన కాకపోయెను. పేలు మనుష్యులమీదను జంతువులమీదను ఉండగా శకునగాండ్రు –ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారిమాట వినకపోయెను. కాబట్టి యెహోవా మోషేతో –నీవు ప్రొద్దున లేచి ఫరో యెదుట నిలువుము, ఇదిగో అతడు ఏటియొద్దకు పోవును. నీవు అతని చూచి–నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనియ్యని యెడల చూడుము నేను నీ మీదికిని నీ సేవకులమీదికిని నీ ప్రజలమీదికిని నీ యిండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను; ఐగుప్తీయులయిండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలిసికొనునట్లు, ఆ దినమున నేను నా ప్రజలు నివసించు చున్న గోషెనుదేశమును వినాయించెదను, అక్కడ ఈగలగుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజలనుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెననెను. యెహోవా ఆలాగు చేసెను. బాధకరమైన ఈగలగుంపులు ఫరో యింటిలోనికిని అతని సేవకుల యిండ్లలోనికిని వచ్చి ఐగుప్తు దేశమంతట వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపులవలన చెడిపోయెను. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి–మీరు వెళ్లి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా మోషే– అట్లు చేయతగదు; మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల యెదుట అర్పించినయెడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా. మేము అరణ్యములోనికి మూడుదినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి నర్పించుదు మనెను. అందుకు ఫరో–మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మును పోనిచ్చెదనుగాని దూరము పోవద్దు; మరియు నాకొరకు వేడు కొనుడనెను. అందుకు మోషే–నేను నీ యొద్దనుండి వెళ్లి రేపు ఈ యీగల గుంపులు ఫరో యొద్దనుండియు అతని సేవకుల యొద్దనుండియు అతని జనులయొద్ద నుండియు తొలగి పోవునట్లు యెహోవాను వేడుకొందును గాని, యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనియ్యక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాటచొప్పునచేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండియు అతని సేవకులయొద్ద నుండియు అతని ప్రజల యొద్దనుండియు తొలగిపోయెను; ఒక్కటియైనను నిలువలేదు. అయితే ఫరో ఆ సమయమున కూడ తన హృదయమును కఠినపరచుకొని జనులను పోనియ్యడాయెను.