నిర్గమకాండము 37:1-9

నిర్గమకాండము 37:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

బెసలేలు తుమ్మకర్రతో మందసాన్ని తయారుచేశాడు. దాని పొడవు రెండు మూరలు, దాని వెడల్పు, ఎత్తు మూరన్నర, దాని లోపల, బయటా స్వచ్ఛమైన బంగారం రేకు పొదిగించాడు. దాని చుట్టూ బంగారంతో అలంకరించాడు. దానికి బంగారంతో నాలుగు గుండ్రని కొంకీలు చేసి, ఒక పక్క రెండు కమ్మీలు, ముందు భాగంలో రెండు గుండ్రని కమ్మీలు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాడు. అతడు తుమ్మకర్రతో మందసాన్ని మోసే కర్రలు సిద్ధం చేసి వాటికి బంగారం రేకులు పొదిగించాడు. మందసాన్ని మోయడానికి వీలుగా దాని చుట్టూ ఉన్న గుండ్రని కమ్మీలలో ఆ మోసే కర్రలు ఉంచాడు. అతడు స్వచ్ఛమైన బంగారంతో కరుణా స్థానం మూత చేశాడు. దాని పొడవు, వెడల్పు మూరన్నర. బంగారంతో రెండు కెరూబు ఆకారాలను చేశాడు. కరుణా స్థానం రెండు అంచులను బంగారు రేకులతో అలంకరించాడు. రెండు కొనలకు రెండు కెరూబు ఆకారాలను జత చేసి, అవి కరుణా స్థానం మూతకు ఏకాండంగా నిలిచేలా చేశాడు. ఆ రెండు కెరూబులు పైకి రెక్కలు విప్పి, కరుణా స్థానాన్ని వాటి రెక్కలతో కప్పాయి. కెరూబుల ముఖాలు కరుణా స్థానాన్ని కప్పుతూ ఒక దానికొకటి ఎదురెదురుగా నిలిచాయి.

నిర్గమకాండము 37:1-9 పవిత్ర బైబిల్ (TERV)

తుమ్మ కర్రతో పవిత్ర పెట్టెను బెసెలేలు చేసాడు. ఆ పెట్టె పొడవు 45 అంగుళాలు, వెడల్పు 27 అంగుళాలు. ఎత్తు 27 అంగుళాలు, పెట్టె లోపల, బయట స్వచ్ఛమైన బంగారంతో అతడు తాపడం చేసాడు. తర్వాత పెట్టె చుట్టూ బంగారు నగిషీబద్ద కట్టాడు. బంగారు ఉంగరాలు నాలుగు చేసి నాలుగు మూలలా వాటిని అమర్చాడు. పెట్టె మోయటానికి ఈ ఉంగరాలు ఉపయోగించబడ్డాయి. ఒక్కో ప్రక్క రెండేసి ఉంగరాలు ఉన్నాయి. తర్వాత పెట్టెను మోసేందుకు కర్రలను అతడు చేసాడు. తుమ్మ కర్రతో చేసి ఆ కర్రలకు స్వచ్ఛమైన బంగారం తాపడం చేసాడు. పెట్టెకు ఒక్కో ప్రక్క ఉంగరాల గుండా కర్రలను దూర్చిపెట్టాడు. తర్వాత స్వచ్ఛమైన బంగారంతో అతడు మూత చేసాడు. దాని పొడవు 45 అంగుళాలు, వెడల్పు 27 అంగుళాలు. తర్వాత బెసలేలు కొట్టబడ్డ బంగారంతో రెండు కెరూబులను చేసాడు. ఆ కెరూబులను మూత కొనల మీద ఉంచాడు. ఒక కొనమీద ఒక కెరూబును, మరో కొనమీద మరో కెరూబును ఉంచాడు. అంతా ఒకే భాగంలో ఉండేటట్టు ఆ కెరూబులు మూతతో కలిపి చేయబడ్డాయి. కెరూబుల రెక్కలు ఆకాశంవైపు విప్పబడ్డాయి. ఆ కెరూబుల రెక్కలు పెట్టెను కప్పి ఉంచాయి. కెరూబులు ఎదురెదురుగా మూతను చూస్తూ ఉన్నాయి.

నిర్గమకాండము 37:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు బెసలేలు తుమ్మకఱ్ఱతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర దాని యెత్తు మూరెడునర. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను. దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములును ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములుండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించెను. మరియు అతడు తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయుటకు దాని ప్రక్కలమీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను చొనిపెను. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర; మరియు రెండు బంగారు కెరూబులను చేసెను, కరుణాపీఠముయొక్క రెండు కొనలను వాటిని నకిషిపనిగా చేసెను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని రెండు కొనలమీద కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకివిప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒక దానికి ఒకటి ఎదురుగా ఉండెను; వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను.

నిర్గమకాండము 37:1-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

బెసలేలు తుమ్మకర్రతో మందసం తయారుచేశాడు. దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర, ఎత్తు ఒకటిన్నర మూర. అతడు దాని లోపల, బయట స్వచ్ఛమైన బంగారంతో పొదిగించి దాని చుట్టూ బంగారు అంచును తయారుచేశాడు. నాలుగు బంగారు ఉంగరాలు పోతపోయించి ఒకవైపు రెండు మరోవైపు రెండు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాడు. తర్వాత తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటిని బంగారంతో పొదిగించాడు. వాటిని మందసాన్ని మోయడానికి ఆ మోతకర్రలను మందసానికి ఇరుప్రక్కల ఉన్న ఉంగరాల్లో దూర్చాడు. అతడు స్వచ్ఛమైన బంగారంతో ప్రాయశ్చిత్త మూతను తయారుచేశాడు; దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉంది. తర్వాత అతడు సాగగొట్టిన బంగారంతో మూత చివర్లలో రెండు కెరూబులను తయారుచేశాడు. అతడు ఒక చివర ఒక కెరూబును మరోచివర రెండవ కెరూబును చేశాడు; మూత మీద దాని రెండు చివర్లలో కెరూబులతో పాటు దానంతటిని ఒకే ముక్కలా చేశాడు. ఆ కెరూబులు తమ రెక్కలను పైకి చాపి వాటితో ప్రాయశ్చిత్త మూతను కప్పుతూ ఉన్నాయి. కెరూబుల ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండి, ప్రాయశ్చిత్త మూతను చూస్తున్నట్లుగా ఉన్నాయి.