నిర్గమకాండము 33:1-17
నిర్గమకాండము 33:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నీవూ ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకు వచ్చిన ప్రజలూ బయలుదేరి, నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల సంతానానికి ఇస్తానని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళండి. నేను నీకు ముందుగా దూతను పంపుతాను. ఆ దూత కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను అక్కడినుండి వెళ్ళగొడతాడు. మీరు నాకు అవిధేయులయ్యారు కనుక నేను మీతో కలసి రాను. ఒకవేళ మార్గమధ్యంలో మిమ్మల్ని చంపేస్తానేమో.” ఆ దుర్వార్త విని ప్రజలు దుఃఖించారు. ధరించిన ఆభరణాలన్నీ పక్కనబెట్టారు. అప్పుడు యెహోవా మోషేతో “నీవు ఇశ్రాయేలు ప్రజలతో ‘మీరు అవిధేయులైన ప్రజలు. ఒక్క క్షణం నేను మీ మధ్యకు వచ్చినా మిమ్మల్ని హతం చేస్తాను. మీరు ధరించుకొన్న ఆభరణాలన్నీ తీసివెయ్యండి. అప్పుడు మిమ్మల్ని ఏం చెయ్యాలో చూస్తాను’ అని చెప్పు” అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు హోరేబు కొండ దగ్గర తమ నగలు తీసివేశారు. అప్పుడు మోషే శిబిరం బయటకు వెళ్లి అక్కడ ఒక గుడారం వేశాడు. దానికి సన్నిధి గుడారం అని పేరు పెట్టాడు. యెహోవాను కనుగొనాలనుకున్న ప్రతివాడూ శిబిరం బయట ఉన్న సన్నిధి గుడారానికి వచ్చాడు. మోషే ఆ గుడారానికి వెళ్తూ ఉన్నప్పుడల్లా తమ గుడారాల్లో ఉన్న ప్రజలు లేచి నిలబడి అతడు గుడారం లోకి వెళ్ళేదాకా అతని వైపు నిదానంగా చూస్తూ ఉండేవాళ్ళు. మోషే ఆ గుడారంలోకి వెళ్ళినప్పుడు స్తంభం లాంటి మేఘం దిగి వచ్చి ఆ గుడారం ద్వారం దగ్గర నిలిచేది. అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉండేవాడు. ఆ మేఘస్తంభం ఆ గుడారం ద్వారాన నిలవడం చూసిన ప్రజలందరూ తమ తమ గుడారాల ద్వారాల్లో లేచి నిలబడి నమస్కారం చేసేవారు. ఒక వ్యక్తి తన స్నేహితునితో మాట్లాడుతున్నట్టు యెహోవా మోషేతో ముఖాముఖీగా మాట్లాడేవాడు. తరువాత అతడు శిబిరంలోకి తిరిగి వచ్చేవాడు. అయితే మోషే సేవకుడు, నూను కొడుకు అయిన యెహోషువ అనే యువకుడు గుడారం నుండి బయటకు వచ్చేవాడు కాదు. మోషే యెహోవాతో ఇలా చెప్పాడు. “ఈ ప్రజలను వెంటబెట్టుకుని వెళ్ళమని నాకు చెబుతున్నావు గానీ నాతో ఎవరిని పంపుతున్నావో అది నాకు చెప్పలేదు. అదీగాక ‘నిన్ను నీ పేరుతో ఎరుగుదును. నిన్ను నేను కరుణించాను’ అని నాతో చెప్పావు కదా. అందువల్ల నాపై నీ దయ ఉంటే నీ విధానాలు నేను గ్రహించగలిగేలా దయచేసి నీ మార్గాలు నాకు చూపించు. అప్పుడు నేను నీ గురించి తెలుసుకుంటాను. అయ్యా, చూడు, ఈ జనమంతా నీ ప్రజలే గదా.” అందుకు ఆయన “నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నేను నీకు నెమ్మది కలుగజేస్తాను” అన్నాడు. మోషే “నీ సన్నిధి మాతో రాని పక్షంలో ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకు వెళ్ళకు. నా పట్ల, నీ ప్రజల పట్ల నువ్వు దయ చూపిస్తున్నావని మాకు దేని వల్ల తెలుస్తుంది? నువ్వు మాతో కలసి రావడం వల్లనే కదా. ఆ విధంగా మేము, అంటే నేను, నీ ప్రజలు భూమి మీద ఉన్న ప్రజల్లో నుండి ప్రత్యేకంగా గుర్తింపు పొందుతాం” అని ఆయనతో అన్నాడు. అప్పుడు యెహోవా “నీవు చెప్పినట్టు చేస్తాను. నీ మీద నాకు దయ కలిగింది. నీ పేరును బట్టి నిన్ను తెలుసుకున్నాను” అని మోషేతో చెప్పాడు.
నిర్గమకాండము 33:1-17 పవిత్ర బైబిల్ (TERV)
అయితే మోషేతో యెహోవా యిలా అన్నాడు: “ఈజిప్టు నుండి నీవు బయటకు తీసుకు వచ్చిన నీ ప్రజలూ, నీవూ ఇక్కడనుండి వెళ్లిపోవాలి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశానికి వెళ్లండి. నేను వాళ్లకు వాగ్దానం చేసాను. మీ సంతానమునకు ఆ దేశాన్ని ఇస్తానని నేను చెప్పాను. మీకు ముందు వెళ్లడానికి ఒక దూతను నేను పంపిస్తాను. కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను పెరిజ్జీయులను. హివ్వీయులను, యెబూసీయులను నేను ఓడిస్తాను. ఆ ప్రజలు మీ దేశాన్ని విడిచిపెట్టేసేటట్టు బలవంతం చేస్తాను. కనుక అనేక మంచి వాటితో నిండిన దేశానికి వెళ్లండి. కానీ నేను మీతో రాను. మీరు చాలా మొండివారు. నేను మీతో వస్తే మార్గంలో కోపంవచ్చి మిమ్మల్ని నేను నాశనం చేయవల్సి వస్తుందేమో.” ఈ దుర్వార్తను ప్రజలు విని చాలా విచారించారు. దీని తర్వాత ప్రజలు నగలు పెట్టుకోలేదు. “మీరు మొండివారు నేను మీతో కొంచెంసేపు ప్రయాణం చేసినా సరే నేను మిమ్మల్ని నాశనం చేయాల్సి వస్తుంది. కనుక మీ నగలన్నీ తీసి వేయండి. అప్పుడు మీ విషయం ఏమి చేయాలో నేను ఆలోచిస్తాను” అని మోషేతో యెహోవా చెప్పినందువల్ల వారు నగలు ధరించలేదు. కనుక హోరేబు కొండ దగ్గర ఇశ్రాయేలు ప్రజలు వారి నగలన్నీ తీసి వేసారు. గుడారాన్ని, నివాస డేరాలకు కొంత దూరం బయటకు జరిపాడు మోషే. “సన్నిధి గుడారం” అని మోషే దానికి పేరు పెట్టాడు. ఏ వ్యక్తిగాని యెహోవాను ఏదైనా అడగాలంటే, నివాస డేరాలకు వెలుపల ఉన్న సన్నిధి గుడారానికి వెళ్లాల్సి వచ్చింది. ఎప్పుడైనా సరే, బయటకు ఆ గుడారానికి మోషే వెళ్తే ప్రజలంతా అతన్ని గమనిస్తూ ఉండేవారు. ప్రజలంతా వారి గుడారపు ద్వారం దగ్గర నిలబడి మోషే సన్నిధి గుడారంలో ప్రవేశించేవరకు అతణ్ణి గమనించి చూస్తుండేవారు. మోషే సన్నిధి గుడారంలోకి వెళ్లినప్పుడల్లా స్తంభంలా నిలువుగా ఉన్న మేఘం నిలిచి ఉండేది. ఈ విధంగా మోషేతో యెహోవా మాట్లాడతాడు. సన్నిధి గుడారపు ద్వారం దగ్గర మేఘాన్ని చూడగానే ప్రజలు యెహోవాను ఆరాధించుటకు సాష్టాంగపడేవారు. మోషేతో ముఖాముఖీగా యెహోవా మాట్లాడాడు. ఒక మనిషి తన స్నేహితునితో మాట్లాడినట్లు మోషేతో యెహోవా మాట్లాడాడు. దేవునితో మాట్లాడిన తర్వాత, మోషే ఎప్పుడూ బసకు వెళ్లిపోయేవాడు. నూను కుమారుడైన యెహోషువ అనే ఒక యువకుడు మోషేకు సహాయకుడు. మోషే సన్నిధి గుడారం వదిలినప్పుడల్లా యెహోషువ సన్నిధి గుడారంలో నిలిచి ఉండేవాడు. యెహోవాతో మోషే ఇలా అన్నాడు: “ఈ ప్రజల్ని నడిపించమని నీవు చెప్పావు. నాతో ఎవర్ని నీవు పంపిస్తావో నీవు చెప్పలేదు. ‘నీవు నాకు బాగా తెలుసు. నిన్ను గూర్చి నేను ఆనందిస్తున్నాను.’ అని నీవు నాతో చెప్పావు. నిజంగా నేను నీకు ఆనందం కలిగించి ఉంటే, నీ మార్గాలు నాకు బోధించు. నేను నిన్ను వాస్తవంగా తెలుసుకోవాలని కోరుతున్నాను. అలాగైతే, నేను ఎల్లప్పుడూ నిన్ను సంతోషపెడ్తూ ఉండగలుగుతాను. వీళ్లంతా నీ ప్రజలని జ్ఞాపకం ఉంచుకో.” “నేను నీతో కూడా వస్తాను నేను మిమ్మల్ని నడిపిస్తాను” అని యెహోవా జవాబిచ్చాడు. అప్పుడు మోషే ఆయనతో అన్నాడు: “నీవు మాతో రాకపోతే మాత్రం, మమ్మల్ని యిక్కడ నుండి పంపించి వేయకు. మరియు నా విషయంలో, ఈ ప్రజల విషయంలో నీవు సంతోషిస్తున్నట్టు మాకెలా తెలుస్తుంది? నీవు మాతో కూడా వస్తే, అప్పుడు మాకు తెలుస్తుంది. నీవు మాతో రాకపోతే, ఈ భూమి మీద ఉన్న ఏ ఇతర ప్రజలకంటే నేను, ఈ ప్రజలు ప్రత్యేకం కాదు.” అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నీవు అడిగినట్టు నేను చేస్తాను. నీ పట్ల నాకు ఆనందం గనుక నేను ఇలా చేస్తాను. నీవు నాకు బాగా తెలుసు.”
నిర్గమకాండము 33:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవును నీవు ఐగుప్తుదేశమునుండి తోడుకొనివచ్చిన ప్రజలును బయలుదేరి, నేను అబ్రాహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణముచేసి–నీ సంతానమునకు దీని నిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపొండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను అమోరీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను వెళ్లగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతోకూడ రాను; త్రోవలో మిమ్మును సంహరించెదనేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి; ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఇశ్రాయేలీయులతో–మీరు లోబడనొల్లని ప్రజలు; ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియునట్లు మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండయొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దాని వేసి, దానికి ప్రత్యక్షపు గుడారమను పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్లుచు వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్లినప్పుడు ప్రజలందరును లేచి, ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి, అతడు ఆ గుడారములోనికి పోవువరకు అతని వెనుకతట్టు నిదానించి చూచు చుండెను. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను. ప్రజలందరు ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుటచూచి, లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యౌవనస్థుడు గుడారములోనుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లనెను–చూడుము–ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావుగాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు–నేను నీ పేరునుబట్టి నిన్ను ఎరిగియున్నాననియు, నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా యెడల కలిగినయెడల నీ కటాక్షము నాయెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును; చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలేగదా అనెను. అందుకు ఆయన–నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా మోషే–నీ సన్నిధి రానియెడల ఇక్కడనుండి మమ్మును తోడుకొని పోకుము. నాయెడలను నీ ప్రజలయెడలను నీకు కటాక్షము కలిగినదని దేనివలన తెలియబడును? నీవు మాతో వచ్చుటవలననే గదా? అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలును భూమిమీదనున్న సమస్త ప్రజలలోనుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. కాగా యెహోవా–నీవు చెప్పిన మాటచొప్పున చేసెదను; నీమీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరునుబట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా
నిర్గమకాండము 33:1-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు యెహోవా మోషేతో, “ఈ స్థలాన్ని విడిచి, నీవు, నీవు ఈజిప్టు నుండి తీసుకువచ్చిన ప్రజలు, నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు, ‘నేను దాన్ని మీ వారసులకు ఇస్తాను’ అని ప్రమాణం చేసిన దేశానికి వెళ్లండి. నేను నా దూతను మీకు ముందుగా పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్లగొడతాను. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్లండి. అయితే మీరు లోబడని ప్రజలు కాబట్టి నేను మీతో రాను, ఎందుకంటే మార్గం మధ్యలో నేను మిమ్మల్ని అంతం చేస్తానేమో” అన్నారు. ప్రజలు ఈ బాధ కలిగించే మాటలు విన్నప్పుడు, వారు దుఃఖించడం మొదలుపెట్టారు, ఎవరూ ఆభరణాలు ధరించలేదు. యెహోవా మోషేతో ఇలా అన్నారు, “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘మీరు లోబడని ప్రజలు. ఒకవేళ నేను ఒక్క క్షణం మీతో కలిసి వెళ్లినా, మిమ్మల్ని అంతం చేయవచ్చు. కాబట్టి మీ ఆభరణాలను తీసివేయండి మిమ్మల్ని ఏం చేయాలో నేను నిర్ణయిస్తాను.’ ” కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు పర్వతం దగ్గర నుండి తమ ఆభరణాలను ధరించలేదు. మోషే గుడారం తీసుకుని శిబిరం బయట కొంత దూరంలో దానిని వేసి, దానికి “సమావేశ గుడారం” అని పేరు పెట్టాడు. యెహోవా దగ్గర విచారణ చేసే ప్రతి ఒక్కరు శిబిరం బయట ఉన్న సమావేశ గుడారానికి వెళ్లేవారు. మోషే గుడారంలోకి వెళ్లినప్పుడెల్లా, ప్రజలంతా వారి గుడారపు ద్వారాల దగ్గర నిలబడి, మోషే ఆ గుడారం లోపలికి వెళ్లేవరకు కనిపెట్టుకుని ఉండేవారు. మోషే ఆ గుడారం లోపలికి వెళ్లగానే, మేఘస్తంభం దిగివచ్చి దాని ద్వారం దగ్గర నిలబడేది, అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడేవారు. ఆ గుడారపు ద్వారం దగ్గర మేఘస్తంభం నిలబడడం ప్రజలు చూసినప్పుడెల్లా, వారంతా లేచి నిలబడి, ప్రతిఒక్కరు తమ గుడారపు ద్వారం దగ్గర యెహోవాను ఆరాధించేవారు. ఒకరు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవారు. తర్వాత మోషే శిబిరానికి తిరిగి వచ్చేవాడు, కాని అతని సేవకుడు నూను కుమారుడైన యెహోషువ అనే యువకుడు ఆ గుడారాన్ని విడిచిపెట్టేవాడు కాదు. మోషే యెహోవాతో, “ ‘ఈ ప్రజలను నడిపించు’ అని మీరు నాకు చెప్తున్నారు, కాని నాతో ఎవరిని పంపుతారో నాకు చెప్పలేదు. ‘నీ పేరుతో సహా నీవు నాకు తెలుసు, నీవు నా దయను పొందావు’ అని మీరు అన్నారు. ఒకవేళ మీకు నా మీద దయ ఉంటే, నేను మిమ్మల్ని తెలుసుకొని మీ దయ పొందుతూ ఉండేలా మీ మార్గాలను నాకు బోధించండి. ఈ జనులు మీ ప్రజలేనని జ్ఞాపకముంచుకోండి” అని అన్నాడు. అందుకు యెహోవా, “నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతి ఇస్తాను” అన్నారు. అప్పుడు మోషే ఆయనతో, “మీ సన్నిధి మాతో పాటు రాకపోతే మమ్మల్ని ఇక్కడినుండి పంపవద్దు. మీరు మాతో రాకపోతే నా పట్ల మీ ప్రజల పట్ల మీరు కనికరం చూపించారని ఎవరికైనా ఎలా తెలుస్తుంది? ఈ భూమి మీద ఉన్న ఇతర ప్రజల నుండి నన్ను, మీ ప్రజలను ఏది ప్రత్యేకపరుస్తుంది?” అని అడిగాడు. అందుకు యెహోవా మోషేతో, “నీవడిగినట్టే నేను చేస్తాను, ఎందుకంటే నీ మీద నాకు దయ కలిగింది, నీ పేరుతో సహా నీవు నాకు తెలుసు” అని అన్నారు.