నిర్గమకాండము 31:1-6

నిర్గమకాండము 31:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, “యూదా గోత్రానికి చెందిన బెసలేలును నేను నియమించుకున్నాను. అతడు ఊరీ కొడుకు, హూరు మనుమడు. అతనికి నేను అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, సమస్త జ్ఞానం, నేర్పరితనం ప్రసాదించాను. అతణ్ణి నా ఆత్మతో నింపాను. అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి. రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కను కోసి నునుపు చేయడంలో నిపుణుడు. నేను ప్రసాదించిన సమస్త జ్ఞానం, వివేకాలతో అతడు పనులు జరిగిస్తాడు. దాను గోత్రానికి చెందిన అహీసామాకు కొడుకు అహోలీయాబు అతనికి సహాయంగా ఉంటాడు. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ తయారు చేయగల నిపుణులందరి హృదయాల్లో నా జ్ఞానం ఉంచుతాను.

నిర్గమకాండము 31:1-6 పవిత్ర బైబిల్ (TERV)

అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “యూదా గోత్రంలో ఊరు కుమారుడైన బెసలేలును నేను ఏర్పరచుకొన్నాను (హూరు కుమారుడు ఊరు). బెసలేలును నేను దేవుని ఆత్మతో నింపాను. అన్ని రకాల వస్తువులు చేసేందుకు జ్ఞానం, నైపుణ్యం నేను అతనికి ఇచ్చాను. నమూనాలు గీయటంలో బెసలేలు చాల ప్రజ్ఞ గలవాడు. బంగారు, వెండి, ఇత్తడితో అతడు వస్తువులు చేయగలడు. బెసలేలు అందమైన నగలను చెక్కి, పొదుగగలడు. అతడు చెక్క పని చేయగలడు. బెసలేలు అన్ని రకాల పనులు చేయగలడు. అతనితో పని చేయటానికి అహూలీయాబును కూడ నేను ఏర్పరచుకొన్నాను. అహూలీయాబు దాను గోత్రపు అహీసామాకు కుమారుడు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేయగలిగేటట్టు మిగిలిన పనివాళ్లందరికీ నేను నైపుణ్యం యిచ్చాను.

నిర్గమకాండము 31:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు యెహోవా మోషేతో ఇట్లనెను –చూడుము; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసియున్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీ సామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసితిని. నేను నీకాజ్ఞాపించినవన్నియు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను.

నిర్గమకాండము 31:1-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

యెహోవా మోషేతో ఇలా అన్నారు, “చూడు, నేను యూదా గోత్రానికి చెందిన ఊరి కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును ఏర్పరచుకొని, నేను అతన్ని దేవుని ఆత్మతో జ్ఞానంతో సామర్థ్యంతో అన్ని రకాల నైపుణ్యతలతో నింపాను. అతడు బంగారం వెండి ఇత్తడితో కళాత్మక నమూనాలను తయారుచేస్తాడు. ఇంకా అతడు రాళ్లను చెక్కి అమర్చడం, చెక్క పని చేయడం, అలా అన్ని రకాల చేతిపనులు చేస్తాడు. అంతేకాక అతనికి సహాయం చేయడానికి దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన ఒహోలీయాబును నేను నియమించాను. “నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేయడానికి నైపుణ్యం కలిగిన పనివారందరికి నేను సామర్థ్యాన్ని ఇచ్చాను