నిర్గమకాండము 3:7-15

నిర్గమకాండము 3:7-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా ఇలా చెప్పాడు. “ఐగుప్తులో ఉంటున్న నా ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు. కఠినమైన పనులు చేయిస్తూ వారిని బాధపెడుతున్న వారిని బట్టి వారు పెడుతున్న మొర నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలుసు. కనుక ఐగుప్తీయుల చేతిలో నుండి నా ప్రజలను విడిపించి, ఆ దేశం నుండి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు యెబూసీయులు నివసిస్తున్న చాలా సారవంతమైన, విశాలమైన మంచి దేశానికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను. నిజంగా ఇశ్రాయేలు ప్రజల మొర నేను విన్నాను. ఐగుప్తీయులు వారి పట్ల జరిగిస్తున్న హింసాకాండను చూశాను. నువ్వు సిద్ధపడు. నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించాలి.” అప్పుడు మోషే దేవునితో “ఫరో దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించడానికి నేను ఏపాటి వాణ్ణి?” అని అన్నాడు. దేవుడు “నువ్వు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకు వచ్చిన తరువాత మీరు ఈ కొండపై దేవుణ్ణి ఆరాధిస్తారు. కచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను పంపించాను అని చెప్పడానికి ఇదే సూచన” అన్నాడు. మోషే “నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లి వారితో మీ పూర్వీకుల దేవుడు మీ దగ్గరికి నన్ను పంపించాడని చెప్పినప్పుడు వారు ‘ఆయన పేరేమిటి?’ అని అడిగితే వారితో నేనేం చెప్పాలి?” అని దేవుణ్ణి అడిగాడు. అందుకు దేవుడు “ నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి , అనే పేరు గల వాణ్ణి. ఉన్నవాడు అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు, అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు” అని మోషేతో చెప్పాడు. దేవుడు మోషేతో ఇంకా “మీ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు యెహోవా మీ దగ్గరికి నన్ను పంపించాడు అని నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి. చిరకాలం నిలిచి ఉండే, తరతరాలకు జ్ఞాపకముండే నా పేరు ఇదే.

నిర్గమకాండము 3:7-15 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా “ఈజిప్టులో నా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు నేను చూశాను. ఈజిప్టు వాళ్లు నా ప్రజల్ని బాధపెట్టినప్పుడు వారు మొర పెట్టడం నేను విన్నాను. వారి బాధ నాకు తెలుసు ఈజిప్టు వాళ్ల బారినుండి నా ప్రజల్ని రక్షించేందుకు ఇక నేను దిగి వస్తాను. ఆ దేశం నుండి వాళ్లను బయటకు తెచ్చి, మరో మంచి దేశానికి నడిపిస్తాను. అక్కడ వాళ్లు ఏ కష్టాలూ లేకుండా స్వేచ్ఛగా ఉంటారు. అది మంచి మంచి వాటితో నిండిన చాలా మంచి దేశం. కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు, రకరకాల మనుష్యులు అక్కడ నివసిస్తున్నారు. ఇశ్రాయేలీయుల మొరలు నేను విన్నాను. వాళ్ల జీవితాన్ని ఈజిప్టు వాళ్లు ఎంత కష్టతరం చేసారో నేను చూశాను. అందుచేత నేను ఇప్పుడు ఫరో దగ్గరకు నిన్ను పంపిస్తున్నాను. వెళ్లు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుంచి బయటకు తీసుకువెళ్లు” అని చెప్పాడు. అయితే మోషే, “నేనేమీ అంతగొప్ప వాణ్ణి కాదే. ఫరో దగ్గరకు వెళ్లేందుకుగాని, ఈజిప్టు నుండి ఇశ్రాయేలీయులను బయటకు నడిపించేందుకుగాని నేను ఎంతటివాణ్ణి?” అంటూ దేవుణ్ణి అడిగాడు. “నేను నీకు తోడుగా ఉంటాను గనుక నీవు చేయగలవు. నేనే నిన్ను పంపిస్తున్నాను అనేందుకు రుజువు ఏమిటంటే, నీవు ఈ ప్రజల్ని ఈజిప్టు నుండి బయటికి నడిపించిన తర్వాత నీవు మళ్లీ వచ్చి ఈ కొండమీదనే నన్ను ఆరాధిస్తావు!” అని దేవుడు చెప్పాడు. దానికి మోషే, “నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి ‘మీ పూర్వీకుల దేవుడు నన్ను మీ దగ్గరకు పంపించాడు’ అని చెబితే, ‘ఆ దేవుడి పేరేమిటి’ అని వాళ్లు నన్ను అడుగుతారు గదా! మరి నేనేమని చెప్పాలి,” అని దేవుణ్ణి అడిగాడు. “‘నేను ఉన్నవాడను’ (అని వారితో చెప్పు) అన్నాడు దేవుడు మోషేతో. ఇశ్రాయేలీయుల దగ్గరకు నీవు వెళ్లినప్పుడు, ‘ఉన్నవాడను,’ అనువాడు నన్ను మీ దగ్గరకు పంపించాడు అని చెప్పు” అన్నాడు దేవుడు మోషేతో. దేవుడు మోషేతో ఇలా చెప్పాడు: “మీ పూర్వీకులు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఎల్లప్పుడూ నా పేరు యెహోవాగానే ఉంటుంది. తరతరాల ప్రజలు ఆ పేరుతోనే నన్ను తెలుసుకొంటారు. ‘యెహోవా నన్ను మీ దగ్గరకు పంపించాడు’ అని వాళ్లతో చెప్పు.

నిర్గమకాండము 3:7-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు యెహోవా యిట్లనెను–నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారినిపెట్టు చున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను. అందుకు మోషే–నేను ఫరో యొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులోనుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడనని దేవునితో అనగా ఆయన–నిశ్చయముగా నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను. మోషే–చిత్తగించుము; నేను ఇశ్రాయేలీయులయొద్దకు వెళ్లి వారిని చూచి–మీపితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు–ఆయన పేరేమి అని అడిగినయెడల వారితో నే నేమి చెప్పవలెనని దేవుని నడిగెను. అందుకు దేవుడు –నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన–ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. మరియు దేవుడు మోషేతో నిట్లనెను–మీపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.

నిర్గమకాండము 3:7-15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అప్పుడు యెహోవా, “నేను ఈజిప్టులో ఉన్న నా ప్రజల బాధను చూశాను. వారిచేత వెట్టిచాకిరి చేయిస్తున్న అధికారులను గురించి వారు నాకు చేసిన మొరను నేను విన్నాను, వారి శ్రమల గురించి నాకు తెలుసు. కాబట్టి ఈజిప్టువారి చేతిలో నుండి వారిని విడిపించడానికి ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలోనికి, అనగా కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల దేశమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకెళ్లడానికి నేను దిగి వచ్చాను. ఇశ్రాయేలీయుల మొర నాకు చేరింది, ఈజిప్టువారు వారినెలా అణచివేస్తున్నారో నేను చూశాను. కాబట్టి ఇప్పుడు, వెళ్లు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈజిప్టు బయటకు తీసుకురావడానికి నేను నిన్ను ఫరో దగ్గరకు పంపుతున్నాను” అని అన్నారు. అయితే మోషే, “ఫరో దగ్గరకు వెళ్లడానికి ఇశ్రాయేలీయులను ఈజిప్టులో నుండి బయటకు తీసుకురావడానికి నేను ఎంతటివాన్ని?” అని దేవునితో అన్నాడు. అప్పుడు దేవుడు, “ఖచ్చితంగా నేను నీకు తోడై ఉంటాను. నేను నిన్ను పంపాను అనడానికి ఇది ఒక అసాధారణ గుర్తుగా ఉంటుంది: మీరు ఈజిప్టు నుండి ప్రజలను బయటకు తీసుకువచ్చినప్పుడు, మీరూ ఈ పర్వతం మీద దేవుని ఆరాధిస్తారు” అని చెప్పారు. అప్పుడు మోషే, “నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి వారితో, ‘మీ పితరుల దేవుడు నన్ను మీ దగ్గరకు పంపారు’ అని చెప్పినప్పుడు వారు, ‘ఆయన పేరు ఏమిటి?’ అని నన్ను అడుగుతారు, అప్పుడు నేను వారికి ఏమి చెప్పాలి?” అని దేవుని అడిగాడు. అందుకు దేవుడు మోషేతో, “నేను నేనైయున్నాను. నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాలి: ‘నేనైయున్నాను అనేవాడు నన్ను మీ దగ్గరకు పంపాడు.’ ” దేవుడు మోషేతో, “నీవు ఇశ్రాయేలీయులతో, ‘మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను మీ దగ్గరకు పంపారు’ అని చెప్పాలి. “ఇదే నా నిత్యమైన పేరు, తరతరాల వరకు మీరు జ్ఞాపకముంచుకోవలసిన పేరు ఇదే.