నిర్గమకాండము 2:11-15

నిర్గమకాండము 2:11-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మోషే పెద్దవాడైన తరువాత తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వారు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు చూశాడు. ఆ సమయంలో తన సొంత జాతి వాడైన హెబ్రీయుల్లో ఒకణ్ణి ఒక ఐగుప్తీయుడు కొట్టడం చూశాడు. అటూ ఇటూ చూసి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఐగుప్తీయుణ్ణి కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టాడు. తరువాతి రోజు మోషే అటుగా వెళ్తుంటే అక్కడ ఇద్దరు హెబ్రీయులు గొడవ పడుతున్నారు. అప్పుడు మోషే తప్పు చేసిన వ్యక్తితో “నువ్వెందుకు నీ సోదరుణ్ణి కొడుతున్నావు?” అని అడిగాడు. అందుకు అతడు “మా మీద నిన్ను అధికారిగా, తీర్పు తీర్చేవాడిగా ఎవరు నియమించారు? నువ్వు ఆ ఐగుప్తీయుణ్ణి చంపినట్టు నన్ను కూడా చంపుదామనుకుంటున్నావా?” అన్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని మోషే భయపడ్డాడు. ఆ సంగతి విన్న ఫరో మోషేను చంపించాలని చూశాడు. మోషే ఫరో దగ్గరనుండి నుండి మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు.

నిర్గమకాండము 2:11-15 పవిత్ర బైబిల్ (TERV)

మోషే పెరిగి పెద్దవాడయ్యాడు. తన ప్రజలు అంటే, హీబ్రూవారు బలవంతంగా చాలా కష్టపడి పని చేయాల్సి ఉన్నట్టు మోషే గ్రహించాడు. ఒకరోజు ఈజిప్టు వాడొకడు హీబ్రూవాడ్ని కొట్టడం మోషే చూసాడు. ఎవరైనా గమనిస్తున్నారేమోనని మోషే అటు ఇటు చూసాడు. తర్వాత మోషే ఆ ఈజిప్టువాడ్ని చంపేసి ఇసుకలో పాతిపెట్టాడు. మర్నాడు హీబ్రూవాళ్లే ఇద్దరు పోట్లాడుకోవడం మోషే చూసాడు. వారిలో ఒకడిది తప్పని తెలుసుకొని “అతనితో ఎందుకిలా మీవాడ్ని కొడుతున్నావు?” అని అన్నాడు. దానికి అతను జవాబిస్తూ, “మామీద నీవు అధికారివనిగాని, న్యాయమూర్తివనిగాని ఎవరయినా నియమించారా? నిన్న నీవు ఆ ఈజిప్టువాడ్ని చంపినట్టు నన్నూ చంపుతావా?” అన్నాడు. అప్పుడు మోషే భయపడిపోయాడు. “అలాగైతే నేను చేసిన ఆ పని ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందని” మోషే తనలో తాను అనుకొన్నాడు. మోషే చేసినదాన్ని గూర్చి విని ఫరో మోషేను చంపెయ్యాలనే నిర్ణయానికొచ్చాడు! కానీ ఫరో దగ్గర్నుండి మోషే పారిపోయాడు.

నిర్గమకాండము 2:11-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనులయొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి యెవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి యిసుకలో వాని కప్పి పెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్లుచుండగా హెబ్రీయులైన మనుష్యులిద్దరు పోట్లాడుచుండిరి. అప్పుడతడు అన్యాయము చేసినవాని చూచి–నీ వేల నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా అతడు–మామీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే–నిశ్చయముగా ఈ సంగతి బయలు పడెననుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెనుగాని, మోషే ఫరో యెదుటనుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచి పోయి యొక బావియొద్ద కూర్చుండెను.

నిర్గమకాండము 2:11-15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

కొన్ని సంవత్సరాల తర్వాత, మోషే పెద్దవాడైన తర్వాత ఒక రోజు అతడు తన సొంత ప్రజలు ఉన్న చోటికి వెళ్లి వారి దుస్థితిని చూశాడు. అప్పుడు అతడు తన సొంత ప్రజల్లో ఒకడైన ఒక హెబ్రీయున్ని ఒక ఈజిప్టువాడు కొట్టడం చూశాడు. మోషే అటు ఇటు తిరిగి ఎవరూ లేకపోవడం చూసి ఆ ఈజిప్టువాన్ని చంపి ఇసుకలో దాచిపెట్టాడు. మరునాడు అతడు బయటకు వెళ్లినప్పుడు ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుకోవడం చూశాడు. అతడు వారిలో తప్పు చేసినవానితో, “నీ తోటి హెబ్రీయున్ని ఎందుకు కొడుతున్నావు?” అని అడిగాడు. అందుకు అతడు, “మామీద అధికారిగా న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించారు? ఆ ఈజిప్టువాన్ని చంపినట్లు నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావా?” అన్నాడు. అప్పుడు మోషే, “నేను చేసిన పని అందరికి తెలిసిపోయింది” అని అనుకుని భయపడ్డాడు. ఫరో ఈ సంగతి విన్నప్పుడు, అతడు మోషేను చంపడానికి ప్రయత్నించాడు, కాని మోషే ఫరో దగ్గరనుండి పారిపోయి మిద్యానులో జీవించడానికి వెళ్లాడు, అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు.