నిర్గమకాండము 18:14-19
నిర్గమకాండము 18:14-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మోషే ప్రజలకు చేస్తున్న వాటన్నిటిని అతని మామ చూసినప్పుడు, అతడు, “నీవు ఈ ప్రజలకు చేస్తున్నది ఏమిటి? ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ ప్రజలందరు నీ చుట్టూ నిలబడి ఉండగా, న్యాయాధిపతిగా నీవు ఒక్కడివే ఎందుకు కూర్చున్నావు?” అని అడిగాడు. అందుకు మోషే అతనితో, “ఎందుకంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రజలు నా దగ్గరకు వస్తారు. వారికెప్పుడు ఏ వివాదం ఉన్నా, అది నా దగ్గరకు తేబడుతుంది, నేను వారి మధ్య నిర్ణయించిన దేవుని శాసనాలను, సూచనలను వారికి తెలియజేస్తాను” అని చెప్పాడు. అందుకు మోషే మామ, “నీవు చేస్తున్నది సరియైనది కాదు. నీవు, నీ దగ్గరకు వస్తున్న ఈ ప్రజలు అలసిపోతారు. ఈ పని నీకు చాలా భారంగా ఉంది; నీవు ఒక్కడివే దీనిని చేయలేవు. ఇప్పుడు నా మాట విను, నేను నీకొక సలహా ఇస్తాను, దేవుడు నీకు తోడుగా ఉండును గాక. నీవు దేవుని ఎదుట ప్రజల ప్రతినిధిగా ఉండి, వారి వివాదాలను ఆయన దగ్గరకు తీసుకురావాలి.
నిర్గమకాండము 18:14-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రజల విషయంలో మోషే చేస్తున్నదంతా యిత్రో చూశాడు. అతడు మోషేతో “నువ్వు ఈ ప్రజలకు చేస్తున్నదేమిటి? ఉదయం నుండి సాయంత్రం దాకా నువ్వొక్కడివే తీర్పరిగా కూర్చుని ఉంటే మిగిలిన వాళ్ళంతా నీ చుట్టూ నిలబడి ఉండడం ఏమిటి?” అని అడిగాడు. మోషే “దేవుని నిర్ణయం ఏమిటో తెలుసుకోవడం కోసం వాళ్ళు నా దగ్గరికి వస్తారు. వాళ్ళ మధ్య ఏవైనా గొడవలు వస్తే వాటి పరిష్కారం కోసం నా దగ్గరికి వస్తారు. నేను వారికి తీర్పు తీర్చి, దేవుని చట్టాలను, ఆయన ధర్మశాస్త్ర నియమాలను వారికి తెలియజేస్తాను” అని తన మామతో చెప్పాడు. అందుకు మోషే మామ అతనితో “నీవు చేస్తున్న పని మంచిది కాదు. ఇలా చేస్తే నువ్వూ నీతో ఉన్న ఈ ప్రజలూ నలిగిపోయి నీరసించి పోతారు. నువ్వొక్కడివే ఈ పని చెయ్యలేవు. ఇది నీకు చాలా కష్టంగా ఉంటుంది. నా మాట విను. నేను నీకొక ఆలోచన చెబుతాను. దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు దేవుని ఎదుట ఈ ప్రజల ప్రతినిధిగా నిలబడి వారి వ్యవహారాలు దేవుని సముఖానికి తీసుకురావాలి.
నిర్గమకాండము 18:14-19 పవిత్ర బైబిల్ (TERV)
ప్రజలకు మోషే న్యాయం తీర్చడం యిత్రో చూసాడు, “నీవు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుచేత నీవు ఒక్కడివే న్యాయమూర్తిగా ఉన్నావు? ప్రజలు రోజంతా నీ దగ్గరకు రావడం ఏమిటి?” అన్నాడు అతను. అప్పుడు మోషే తన మామతో ఇలా చెప్పాడు: “ప్రజలు వారి సమస్యల విషయంలో దేవుని నిర్ణయం ఏమిటో నేను అడిగి తెలుసుకోవాలని నన్ను అడిగేందుకు నా దగ్గరకు వస్తారు. ఎవరిది సరిగ్గా ఉందో నేను నిర్ణయిస్తాను. ఈ విధంగా దేవుడి చట్టాన్ని, ఆయన ప్రబోధాల్ని నేను ప్రజలకు ప్రబోధిస్తాను.” అయితే మోషే మామ అతనితో ఇలా అన్నాడు: “నీవు చేస్తున్న ఈ పని బాగుండలేదు. నీవు ఒక్కడివే చెయ్యాలంటే, ఇది చాలా పెద్ద పని. దీనివల్ల నీవు అలసిపోతావు. ఇది ప్రజలు కూడ అలసిపొయ్యేటట్టు చేస్తుంది. ఈ పని నీవు ఒక్కడివీ చేయలేవు. నీకు నేను సలహా ఇస్తాను, ఏమి చేయాలో నీకు చెబుతాను, దేవుడు నీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తాను. (నీవు చేయాల్సింది ఇది) ప్రజల సమస్యలను గూర్చి నీవు వింటూ ఉండాల్సిందే. ఈ విషయాలను గూర్చి నీవు దేవునితో చెబుతూ ఉండాల్సిందే.
నిర్గమకాండము 18:14-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి–నీవు ఈ ప్రజలకు చేయుచున్న యీ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలమువరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరు నీయొద్ద నిలిచి యుండనేల అని అడుగగా మోషే–దేవుని తీర్పు తెలిసి కొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. వారికి వ్యాజ్యెము ఏదైనను కలిగినయెడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి, దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్రవిధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను. అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు; నీవును నీతో నున్న యీ ప్రజలును నిశ్చయముగా నలిగిపోవుదురు; ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయచాలవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడై యుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యెములను దేవుని యొద్దకు తేవలెను.