నిర్గమకాండము 16:9-16
నిర్గమకాండము 16:9-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంతట మోషే అహరోనుతో–యెహోవా సన్నిధికి సమీపించుడి; ఆయన మీ సణుగులను వినెనని నీవు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో చెప్పుమనెను. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను– నేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని నీవు–సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారముచేత తృప్తిపొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పుమనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాళెముచుట్టు పడియుండెను. పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగుమంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక–ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే–ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగా–ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరుచొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములోనున్నవారికొరకు కూర్చుకొనవలెననెను.
నిర్గమకాండము 16:9-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మోషే అహరోనులతో యెహోవా “ప్రజల సర్వ సమాజంతో ఇలా చెప్పు, ఆయన మీ సణుగులు విన్నాడు. సర్వ సమాజం అంతా యెహోవా సన్నిధికి రండి.” అహరోను ఇశ్రాయేలు సమాజమంతటితో మాట్లాడుతున్న సమయంలోనే ప్రజలు ఎడారి వైపు చూశారు. అప్పుడు మేఘంలో యెహోవా మహిమ వాళ్లకు కనిపించింది. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “నేను ఇశ్రాయేలు ప్రజల సణుగులు విన్నాను. వాళ్ళతో ఇలా చెప్పు. సాయంత్రం పూట మీరు మాంసం తింటారు, ఉదయం పూట తృప్తిగా ఆహారం తింటారు. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.” అలాగే జరిగింది. సాయంకాలం అయినప్పుడు పూరేడు పిట్టలు వచ్చి శిబిరం అంతా కమ్ముకున్నాయి. ఉదయమయ్యాక శిబిరం అంతా మంచు పడి ఉంది. నేలపై మంచు ఇంకిపోయాక నేలమీద సన్నని కణాలు పొరలుగా ఎడారి భూమి మీద కనబడ్డాయి. ఇశ్రాయేలీయులు దాన్ని చూసి, అది ఏమిటో తెలియక “ఇదేంటి?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మోషే వాళ్ళతో “ఇది తినడానికి యెహోవా మీకిచ్చిన ఆహారం. యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత మేరకు సేకరించుకోవాలి. తమ గుడారంలో ఉన్న వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికీ ఒక ఓమెరు చొప్పున తీసుకోవాలి.”
నిర్గమకాండము 16:9-16 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత మోషే అహరోనుతో, “నీవు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు: ‘యెహోవా, మీ ఫిర్యాదులు విన్నాడు గనుక ఆయన ఎదుట సమావేశం అవ్వండి’ అని వారితో చెప్పు అన్నాడు.” అహరోను ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడాడు. వాళ్లంతా ఒక్కచోట చేరారు. అహరోను మాట్లాడుతూ ఉండగా, ప్రజలంతా పక్కకు తిరిగి ఎడారిలోకి చూచారు. యెహోవా మహిమ ఒక మేఘంలా ప్రత్యక్షమవడం వారు చూశారు. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజల ఫిర్యాదులు నేను విన్నాను. కనుక నేను చెబుతున్న నా మాటలు వారికి చెప్పు. ‘రాత్రివేళ మాంసం మీరు తింటారు. ప్రతి ఉదయం మీకు కావాల్సినంత భోజనం మీరు తింటారు. అప్పుడు మీ యెహోవా దేవుణ్ణి నమ్ముకోవచ్చని మీరు తెలుసుకొంటారు.’” ఆ రాత్రి వారి బస అంతటా పూరేళ్లు (పిట్టలు) వచ్చాయి. (మాంసం కోసం ప్రజలు ఈ పిట్టల్ని పట్టుకొన్నారు) ప్రతి ఉదయం బసకు దగ్గర్లో నేలమీద మంచు కురిసింది. సూర్యోదయం కాగానే ఆ మంచు కరిగిపోయింది. అయితే మంచు పోగానే నేలమీద నూగుమంచు ఉండేది. ఇశ్రాయేలు ప్రజలు అది చూసి “అది ఏమిటి?” అంటూ ఒకళ్లనొకళ్లు ప్రశ్నించుకొన్నారు. ఈ పదార్థం ఏమిటో వారికి అర్థం కాలేదు కనుక వాళ్లు ఈ ప్రశ్న అడిగారు. మోషే వాళ్లతో చెప్పాడు: “మీరు భోజనంచేయడానికి యెహోవా మీకు ఇచ్చిన భోజనం ఇది. ప్రతి వ్యక్తి తనకు అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. మీ కుటుంబంలో ప్రతి వ్యక్తికీ 2 పావుల కొలత ప్రకారం మీలో ఒక్కొక్కరు తీసుకోవాలి అని యెహోవా చెబుతున్నాడు.”
నిర్గమకాండము 16:9-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
తర్వాత మోషే అహరోనుతో ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల సమాజమంతటికి ఇలా చెప్పు, ‘యెహోవా మీ సణుగుడు విన్నారు కాబట్టి ఆయన ఎదుటకు రండి.’ ” అహరోను ఇశ్రాయేలీయుల సమాజమంతటితో మాట్లాడుతున్నప్పుడు వారు అరణ్యం వైపు చూసినప్పుడు అక్కడ వారికి యెహోవా మహిమ మేఘంలో కనిపించింది. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నేను ఇశ్రాయేలీయుల సణుగులు విన్నాను. వారితో ఇలా చెప్పు, ‘సాయంకాలం మీరు మాంసాన్ని తింటారు, ఉదయకాలం ఆహారం తిని తృప్తిపొందుతారు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.’ ” ఆ సాయంకాలం పూరేళ్ళు వచ్చి శిబిరం స్థలాన్ని కప్పివేశాయి, ఉదయకాలం ఆ శిబిరం చుట్టూ మంచు పొర ఉంది. ఆ మంచు కరిగిపోయిన తర్వాత, ఆ ఎడారి నేలమీద మంచుకణాల వంటి సన్నని కణాలు కనిపించాయి. ఇశ్రాయేలీయులు వాటిని చూసి, అది ఏమిటో వారికి తెలియక, “ఇదేమిటి?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మోషే వారితో, “ఇది మీరు తినడానికి యెహోవా ఇచ్చిన ఆహారము. యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ఇదే: ‘ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత పోగుచేసుకోవాలి. మీ గుడారంలో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓమెరు చొప్పున పోగుచేసుకోవాలి.’ ”