నిర్గమకాండము 15:22-27

నిర్గమకాండము 15:22-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మోషే నాయకత్వంలో ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తరువాత మూడు రోజులు ప్రయాణించి షూరు ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వాళ్ళకు తాగడానికి నీళ్లు దొరకలేదు. తరువాత మారాకు చేరుకున్నారు. మారాలో ఉన్న నీళ్ళు చేదుగా ఉన్నాయి కనుక ఆ నీళ్లు తాగలేకపోయారు. అందువల్ల దానికి మారా అనే పేరు వచ్చింది. ప్రజలు మోషే మీద సణుగుతూ “మేమేమీ తాగాలి?” అన్నారు. మోషే యెహోవాను వేడుకున్నాడు. అప్పుడు యెహోవా మోషేకు ఒక చెట్టును చూపించాడు. దాన్ని ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు తియ్యగా మారిపోయాయి. అక్కడ ఆయన వాళ్లకు ఒక కట్టుబాటును, శాసనాన్ని విధించాడు, “మీరు మీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టిలో న్యాయం జరిగించి, ఆయన ఆజ్ఞలకు విధేయత కనపరచి వాటి ప్రకారం నడుచుకుంటే ఐగుప్తు వాళ్ళకు కలిగించిన ఎలాంటి జబ్బూ మీకు రానియ్యను. యెహోవా అనే నేనే మిమ్మల్ని బాగుచేసేవాణ్ణి.” తరువాత వాళ్ళు ఏలీముకు చేరుకున్నారు. అక్కడ పన్నెండు నీటి ఊటలు, డెబ్భై ఈత చెట్లు ఉన్నాయి. నీళ్ళు ఉన్న ఆ ప్రాంతంలో వాళ్ళు విడిది చేశారు.

నిర్గమకాండము 15:22-27 పవిత్ర బైబిల్ (TERV)

మోషే మాత్రం ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం నుండి దూరంగా నడిపిస్తూనే ఉన్నాడు. ప్రజలు షూరు ఎడారిలోకి వెళ్లారు. ఎడారిలో మూడు రోజులు వాళ్లు ప్రయాణం చేసారు. ప్రజలకు నీళ్లు ఏవీ దొరకలేదు. మూడురోజుల తర్వాత ప్రజలు మారాకు ప్రయాణమై వెళ్లారు. మారాలో నీళ్లున్నాయి గాని అవి త్రాగలేకపోయారు. ఆ నీళ్లు త్రాగలేనంత చేదుగా ఉన్నాయి. అందుకే ఆ స్థలానికి మారా అని పేరు. ప్రజలు మోషేకు ఫిర్యాదు చేయటం మొదలు బెట్టారు, “ఇప్పుడు మేము ఏమి త్రాగాలి?” అన్నారు ప్రజలు. మోషే యెహోవాకు మొర పెట్టాడు. యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. మోషే ఆ చెట్టును నీళ్లలో వేసాడు. అతను యిలా చేయగానే ఆ నీళ్లు తాగే మంచి నీళ్లయ్యాయి. ఆ స్థలంలో ప్రజలకు యెహోవా తీర్పు తీర్చి వారికి ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఆ ప్రజల విశ్వాసాన్ని కూడ యెహోవా పరీక్షించాడు. “మీ యెహోవా దేవునికి మీరు విధేయులు కావాలి. ఆయన ఏవి సరైనవని చెబతాడో వాటిని మీరు చేయాలి. యెహోవా ఆజ్ఞలకు, చట్టానికి మీరు విధేయులైతే, ఈజిప్టు వాళ్లలా మీరు రోగులు అవ్వరు. నేను, యెహోవాను, ఈజిప్టు వాళ్ల మీదకు పంపిన రోగాలు ఏవీ మీ మీదకు పంపించను. నేనే యెహోవాను. మిమ్మల్ని స్వస్థపరచేవాడ్ని నేనే.” అప్పుడు ప్రజలు ఏలీమునకు ప్రయాణమయ్యారు. ఏలీములో 12 నీటి ఊటలు ఉన్నాయి. ఇంకా అక్కడ 70 ఈత చెట్లు ఉన్నాయి. అందుచేత ఆ నీళ్ల దగ్గర వారు బసను ఏర్పాటు చేసుకొన్నారు.

నిర్గమకాండము 15:22-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మోషే ఎఱ్ఱసముద్రమునుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో మూడుదినములు నడిచిరి; అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు–మేమేమి త్రాగుదుమని మోషేమీద సణగు కొనగా అతడు యెహోవాకు మొఱపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురము లాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, అక్కడ వారిని పరీక్షించి, –మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి; అక్కడ పండ్రెండు నీటి బుగ్గలును డెబ్బది యీతచెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్లయొద్ద దిగిరి.

నిర్గమకాండము 15:22-27 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

తర్వాత మోషే ఎర్ర సముద్రం నుండి ఇశ్రాయేలీయులను నడిపించగా వారు షూరు ఎడారిలోనికి వెళ్లి మూడు రోజులు దానిలో ప్రయాణం చేశారు. అక్కడ వారికి నీరు దొరకలేదు. అప్పుడు వారు మారాకు వచ్చారు. అయితే మారా నీళ్లు చేదుగా ఉండడంతో వారు ఆ నీటిని త్రాగలేకపోయారు. (అందువల్ల ఆ చోటికి మారా అనే పేరు వచ్చింది.) కాబట్టి ప్రజలు, “మేమేమి త్రాగాలి?” అని మోషే మీద సణిగారు. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టగా యెహోవా అతనికి ఒక చెట్టు కొమ్మను చూపించారు. అతడు దానిని నీటిలో వేయగా ఆ నీరు తియ్యగా మారాయి. అక్కడే యెహోవా వారికి ఒక శాసనాన్ని నియమించి వారిని పరీక్షించారు. ఆయన వారితో, “మీ దేవుడైన యెహోవా స్వరాన్ని మీరు సరిగ్గా విని, ఆయన దృష్టికి న్యాయమైన వాటిని చేసి, మీరు ఆయన ఆజ్ఞలకు జాగ్రత్తగా లోబడి ఆయన శాసనాలన్నిటిని అనుసరిస్తే, నేను ఈజిప్టువారి మీదికి రప్పించిన తెగుళ్ళలో ఏదీ మీ మీదికి రాదు, మిమ్మల్ని స్వస్థపరచే యెహోవాను నేనే” అన్నారు. తర్వాత వారు ఎలీముకు వచ్చారు. అక్కడ పన్నెండు నీటి ఊటలు డెబ్బై తాటి చెట్లు ఉన్నాయి. వారు ఆ నీటి దగ్గరే బస చేశారు.