నిర్గమకాండము 14:10-31

నిర్గమకాండము 14:10-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఫరో, అతని సైన్యం తమను తరుముతూ రావడం చూసిన ఇశ్రాయేలు ప్రజలు హడలిపోయారు. కేకలు వేస్తూ యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు వాళ్ళు మోషేతో “ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఈ ఎడారిలో చనిపోవడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకువచ్చి ఈ విధంగా చేస్తావా? మేము ఐగుప్తీయులకు బానిసలుగానే ఉంటాం, మా జోలికి రావద్దు అని ఐగుప్తులో ఉన్నప్పుడే చెప్పింది ఇందుకే గదా. మేము ఈ ఎడారిలో చనిపోవడం కంటే ఐగుప్తులో బానిసలుగా బతకడమే మంచిది” అని నిష్టూరంగా మాట్లాడారు. అందుకు మోషే “భయపడకండి, ఈ రోజు యెహోవా మీకు కలిగించే రక్షణను అలా నిలబడి చూడండి. మీరు ఈ రోజు చూసిన ఐగుప్తీయులను ఇకపై ఎన్నడూ చూడరు. మీరు ఊరికే నిలబడి ఉండండి. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు” అని ప్రజలతో చెప్పాడు. యెహోవా మోషేతో “నువ్వెందుకు నాకు మొర పెడుతున్నావు? ‘ముందుకు కొనసాగండి’ అని ప్రజలతో చెప్పు. నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని రెండు పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన పొడి నేల మీద నడిచి వెళ్తారు. చూడు, నేను ఐగుప్తీయుల హృదయాలను కఠినం చేస్తాను. వాళ్ళు మీ వెంటబడి తరుముతారు. నేను ఫరో ద్వారా, అతని సైన్యం అంతటి ద్వారా, అతని రథాల, గుర్రపు రౌతుల ద్వారా ఘనత తెచ్చుకొంటాను. నేను ఫరో ద్వారా, సైన్యం ద్వారా, అతని రథాల, గుర్రపు రౌతుల ద్వారా ఘనత పొందడం వల్ల నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.” అప్పటి వరకూ ఇశ్రాయేలు ప్రజల ముందు నడిచిన దేవదూత వాళ్ళ వెనక్కి వెళ్ళాడు. మేఘస్తంభం కూడా వాళ్ళ వెనక్కి వచ్చి నిలిచింది. అది ఐగుప్తు సేనలకూ ఇశ్రాయేలు ప్రజల సమూహనికీ మధ్య నిలిచింది. ఆ మేఘం ఆ రాత్రంతా ఐగుప్తు సైన్యానికి చీకటి కమ్మేలా, అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉండేలా చేసింది. మోషే సముద్రంపై తన చెయ్యి చాపాడు. యెహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలి వీచేలా చేసి, సముద్రం పాయలుగా చీలి మధ్యలో ఆరిపోయి పొడి నేల ఏర్పడేలా చేశాడు. సముద్రం నీళ్లు రెండుగా విడిపోగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచి వెళ్ళారు. ఆ నీళ్లు వారి కుడి పక్కన, ఎడమ పక్కన గోడల్లాగా నిలబడ్డాయి. ఫరో సైన్యం, గుర్రాలు, రథాలు, రౌతులు వారిని తరుముకుంటూ సముద్రం మధ్యకు చేరుకున్నారు. తెల్లవారుతుండగా యెహోవా ఆ అగ్ని స్తంభం నుండీ మేఘ స్తంభం నుండీ ఐగుప్తు సైన్యాన్ని చూసి వాళ్ళను కలవరానికి గురి చేశాడు. ఆయన వాళ్ళ రథచక్రాలు ఊడిపోయేలా చేసినప్పుడు వాళ్ళు అతి కష్టంగా రథాలు తోలవలసి వచ్చింది. అప్పుడు ఐగుప్తువాళ్ళు “రండి, మనం ఇశ్రాయేలు ప్రజల ఎదుట నుండి పారిపోదాం. యెహోవా వారికి తోడుగా ఉండి వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు. యెహోవా మోషేతో “ఐగుప్తు సైన్యం మీదికి, వాళ్ళ రథాల, రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చేలా సముద్రం పైకి నీ చెయ్యి చాపు” అని చెప్పాడు. మోషే సముద్రం పైకి తన చెయ్యి చాపాడు. సాయంత్రం అయ్యేటప్పటికి సముద్రం వడిగా మళ్ళీ కలిసిపోయింది. అది చూసిన ఐగుప్తు సైన్యం వెనక్కి పారిపోవాలని చూశారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యలో ఐగుప్తు సైన్యం నాశనమయ్యేలా చేశాడు. నీళ్లు వేగంగా ప్రవహించి ఆ రథాలను, రౌతులను, వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో సైన్యం మొత్తాన్నీ ముంచివేశాయి. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలకుండా అంతా తుడిచిపెట్టుకు పోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచినప్పుడు ఆ నీళ్లు వారికి కుడి, ఎడమ పక్కల గోడల్లాగా నిలబడ్డాయి. ఆ రోజున యెహోవా ఐగుప్తు సైన్యం నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఐగుప్తు వాళ్ళను ఇశ్రాయేలు ప్రజలు చూశారు. తమ కోసం యెహోవా ఐగుప్తు వాళ్ల పట్ల చేసిన ఈ గొప్ప కార్యం చూసిన ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా అంటే భయభక్తులు కలిగాయి. ఆ ప్రజలు యెహోవా మీదా, ఆయన సేవకుడు మోషే మీదా నమ్మకముంచారు.

నిర్గమకాండము 14:10-31 పవిత్ర బైబిల్ (TERV)

ఫరో, అతని సైన్యం తమవైపే రావడం ఇశ్రాయేలు ప్రజలు చూసారు. ప్రజలు చాల భయపడ్డారు. సహాయం చేయమని వారు యెహోవాకు మొరపెట్టారు. మోషేతో వాళ్లు యిలా అన్నారు, “అసలు ఈజిప్టు నుండి నీవు మమ్మల్నెందుకు బయటకు తీసుకొచ్చావు? చావడానికి నీవు మమ్మల్ని ఈ ఎడారిలోకి తీసుకురావడం ఎందుకు? మేము హాయిగా ఈజిప్టులోనే చచ్చేవాళ్లం అక్కడ ఈజిప్టులో కావాల్సినన్ని సమాధులున్నాయి. ఇలా జరుగుతుందని మేము నీతో చెప్పాము. ‘దయచేసి మమ్మల్ని విసిగించకు. మమ్మల్ని ఇక్కడే ఉండనిచ్చి, ఈజిప్టు వాళ్లకు సేవ చేయనియ్యి అని ఈజిప్టులోనే మేము చెప్పాము.’ ఇలా బయటకు వచ్చి ఈఎడారిలో చావడంకంటె ఈజిప్టులోనే ఉండిపోయి బానిసలంగా ఉంటేనే యింకా బాగుండేది మాకు.” కానీ మోషే జవాబు ఇలా చెప్పాడు: “భయ పడకండి! పారిపోకండి! యెహోవా ఈనాడు మిమ్మల్ని రక్షించటం వేచి చూడండి. ఈ ఈజిప్టు వారిని ఈరోజు తర్వాత మళ్లీ ఎన్నడూ మీరు చూడరు! మీరు ఊరకనే మౌనంగా ఉండటం తప్ప చేయాల్సిందేమీ లేదు. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు.” అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “ఇంకా నీవెందుకు నాకు మొర పెడుతున్నావు? ఇశ్రాయేలు ప్రజల్ని ముందడుగు వేయమని ఆజ్ఞాపించు నీ చేతిలో కర్రను ఎర్రసముద్రం మీదకు చాపు, ఎర్రసముద్రం రెండుగా విడిపోతుంది. అప్పుడు ప్రజలు ఆరిపోయిన నేలమీద సముద్రంలోనుంచి నడిచి వెళ్లిపోవచ్చు. ఈజిప్టు వాళ్లను ధైర్యంగల వాళ్లుగా నేను చేస్తాను. ఇలా చేసినందువల్ల వారు మిమ్మల్ని తరుముతారు. అయితే ఫరోకంటె, అతని అశ్వదళాలు, రథాలు, అన్నిటికంటె నేను ఎక్కువ శక్తిగలవాడ్ని అని మీకు తెలియజేస్తాను. నేనే యెహోవానని ఈజిప్టు అప్పుడు తెలుసు కొంటుంది. ఫరోను, అతని అశ్వ దళాలను, రథాలను నేను ఓడించినప్పుడు వాళ్లు నన్ను గౌరవిస్తారు.” ఆ సమయంలో యెహోవా దూత ప్రజల వెనక్కు వెళ్లడం జరిగింది. (సాధారణంగా యెహోవా దూత ప్రజలకు ముందర ఉండి వారిని నడిపించడం జరుగుతుంది) కనుక ఎత్తైన మేఘం ప్రజల ముందర నుండి కదలిపోయి, ప్రజల వెనక్కు వెళ్లింది ఈ విధంగా ఈజిప్టు వాళ్లకు, ఇశ్రాయేలీయులకు మధ్య ఆ మేఘం నిలిచింది. ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉంది. కానీ ఈజిప్టు వారికి అంతా చీకటి. అందుచేత ఆరాత్రి ఈజిప్టు వాళ్లు ఇశ్రాయేలు ప్రజల సమీపానికి రాలేకపోయారు. మోషే ఎర్ర సముద్రం మీదికి తన చేయి ఎత్తగానే తూర్పునుండి ఒక బలమైన గాలి వీచేటట్టు యెహోవా చేసాడు. ఆ గాలి రాత్రి అంతా వీచింది. సముద్రం రెండుగా విడిపోయింది. ఆ గాలి నేలను ఆరిపోయ్యేటట్టు చేసింది. ఇశ్రాయేలు ప్రజలు సముద్రంలో పొడినేల మీద వెళ్లారు. వాళ్లకు కుడిప్రక్క, ఎడమప్రక్క నీళ్లు గోడలా నిలిచాయి. అప్పుడు ఫరో రథాలు, అశ్వదళాలు అన్నీ వాళ్ల వెంట సముద్రంలో ప్రవేశించాయి. ఆ ఉదయం ఎత్తయిన మేఘం నుండి అగ్ని స్తంభం నుండి యెహోవా ఈజిప్టు సైన్నాన్ని చూచాడు. యెహోవా వాళ్లను ఎదుర్కొని ఓడించాడు. రథచక్రాలు బిగిసిపోయి కదలడం లేదు. రథాలను అదుపుచెయ్యడం చాలా కష్టతరంగా ఉంది. “మనం ఇక్కడ్నుంచి పారిపోదాం రండి! యెహోవా మనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులకోసం యుద్ధం చేస్తున్నాడు.” అంటూ ఈజిప్టు వాళ్లు కేకలు వేసారు. అప్పుడు యెహోవా మోషేతో, “నీ చేయి సముద్రం మీదికి ఎత్తు, నీళ్లు పడిపోయి ఈజిప్టు రథాలను, అశ్వదళాలను ముంచేస్తాయి.” అని చెప్పాడు. కనుక తెల్లవారు ఝామున మోషే తన చేతిని సముద్రం మీదికి ఎత్తాడు. నీళ్లు యధాస్థానానికి వచ్చి పడ్డాయి. ఈజిప్టు వాళ్లు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈజిప్టు వాళ్లు సముద్రంలో కొట్టుకుపోయేటట్టు యెహోవా చేసాడు. నీళ్లు యధాస్థానానికి మళ్లీ రావడం చేత రథాలను, అశ్వదళాలను కప్పేశాయి. ఇశ్రాయేలు ప్రజలను తరుముకొచ్చిన ఫరో సైన్యాలన్నీ నాశనం చేయబడ్డాయి. వాళ్లలో ఒక్కడూ బతకలేదు. అయితే ఇశ్రాయేలు ప్రజలు మాత్రం పొడినేల మీద సముద్రాన్ని దాటిపోయారు. వారి కుడి ఎడమ ప్రక్కల్లో నీళ్లు ఒక గోడలా నిలిచిపోయాయి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టువాళ్లు చేతినుండి యెహోవాయే రక్షించాడు. ఎర్రసముద్ర తీరాన ఈజిప్టువాళ్ల శవాలను ఇశ్రాయేలు ప్రజలు చూచారు. యెహోవా ఈజిప్టు వాళ్లను ఓడించినప్పుడు ఆయన మహత్తర శక్తిని ఇశ్రాయేలు ప్రజలు చూశారు. అందుచేత ప్రజలు యెహోవాకు భయపడి ఆయనను ఘనపర్చారు. యెహోవాను, ఆయన సేవకుడైన మోషేను నమ్మారు.

నిర్గమకాండము 14:10-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమవెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొఱపెట్టిరి. అంతట వారు మోషేతో–ఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పినమాట యిదే గదా; మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటె ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే–భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగ జేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో–నీవేల నాకు మొఱ పెట్టుచున్నావు? –సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రముమధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు. ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరుచుదును. వారు వీరిని తరుముదురు; నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను అతని రథముల వలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను నాకు మహిమ తెచ్చు కొందును. నేను ఫరోవలనను అతని రథములవలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను మహిమ తెచ్చుకొనునప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొల గించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింప బడగా ఇశ్రాయేలీయులు సముద్రముమధ్యను ఆరిన నేలమీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను. ఐగుప్తీయులును ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండువైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడునట్లుచేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు –ఇశ్రాయేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవావారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో–ఐగుప్తీయులమీదికిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిననేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను గోడవలె నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్రతీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మకముంచిరి.

నిర్గమకాండము 14:10-31 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఫరో దగ్గరగా వస్తుండగా, ఇశ్రాయేలీయులు పైకి చూసినప్పుడు ఈజిప్టువారు తమ వెనుక రావడం చూశారు. వారు భయపడి యెహోవాకు మొరపెట్టారు. వారు మోషేతో, “ఈజిప్టులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చావడానికి మమ్మల్ని తీసుకువచ్చావా? ఈజిప్టులో నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చి మాకు నీవు చేసిందేంటి? మమ్మల్ని వదిలిపెట్టు, మేము ఈజిప్టువారికి సేవచేసుకుంటామని ఈజిప్టులో మేము నీతో చెప్పలేక? ఈ ఎడారిలో చావడం కంటే ఈజిప్టువారికి సేవచేసుకోవడం మాకు మేలు కదా!” అన్నారు. అందుకు మోషే ప్రజలతో అన్నాడు, “భయపడకండి. స్థిరంగా నిలబడి యెహోవా ఈ రోజు మీకు కలుగజేసే విడుదలను చూడండి. ఈ రోజు మీరు చూస్తున్న ఈజిప్టువారు మరలా మీరెప్పుడూ చూడరు. యెహోవా మీ కోసం యుద్ధం చేస్తారు; మీరు మౌనంగా ఉంటే చాలు.” అప్పుడు యెహోవా మోషేతో అన్నారు, “నీవెందుకు నాకు మొరపెడుతున్నావు? ముందుకు సాగిపొమ్మని ఇశ్రాయేలీయులకు చెప్పు. నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేతిని చాపి దానిని పాయలుగా చేయి అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం గుండా ఆరిన నేలమీద నడిచివెళ్తారు. నేను ఈజిప్టువారి హృదయాలను కఠినం చేస్తాను కాబట్టి వారు వీరి వెనుక వస్తారు. ఫరోను బట్టి అతని సైన్యమంతటిని బట్టి అతని రథాలు గుర్రపురౌతులను బట్టి నాకు మహిమ కలుగుతుంది. ఫరోను బట్టి అతని రథాలు గుర్రపురౌతులను బట్టి నాకు మహిమ కలిగినప్పుడు నేనే యెహోవానై యున్నానని ఈజిప్టువారు తెలుసుకుంటారు.” అప్పుడు ఇశ్రాయేలీయుల సైన్యానికి ముందు నడుస్తున్న దేవదూత వారి వెనుకకు వెళ్లాడు. మేఘస్తంభం కూడా వారి ఎదుట నుండి కదిలి వారి వెనుకకు వెళ్లి, ఈజిప్టువారి సైన్యానికి ఇశ్రాయేలీయుల సైన్యానికి మధ్య నిలబడింది. ఆ రాత్రంతా ఆ మేఘం ఈజిప్టువారికి చీకటి కలిగించింది కాని ఇశ్రాయేలీయులకు వెలుగునిచ్చింది కాబట్టి ఈజిప్టువారు వీరిని సమీపించలేదు. మోషే సముద్రం వైపు తన చేతిని చాపగా యెహోవా ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలిచేత సముద్రాన్ని పాయలుగా చేసి దానిని ఆరిన నేలగా చేశారు. నీళ్లు రెండుగా విడిపోయాయి, ఇశ్రాయేలీయులు సముద్రం గుండా ఆరిన నేల మీద నడిచివెళ్లారు. వారి కుడి ఎడమల వైపు నీళ్లు గోడల వలె నిలబడ్డాయి. ఈజిప్టువారు వారిని వెంటపడ్డారు; ఫరో గుర్రాలు రథాలు, గుర్రపురౌతులు అన్ని సముద్రం మధ్యలో వారిని వెంటాడాయి. తెల్లవారుజామున యెహోవా అగ్ని మేఘస్తంభం నుండి ఈజిప్టువారి సైన్యాన్ని చూసి ఆయన వారిని కలవరానికి గురి చేశారు. ఆయన వారి రథచక్రాలను ఇరక్కుపోయేలా చేయడంతో వాటిని నడపడం వారికి కష్టంగా ఉంది. అప్పుడు ఈజిప్టువారు, “ఇశ్రాయేలీయుల దగ్గర నుండి పారిపోదాం రండి! వారి పక్షంగా యెహోవా ఈజిప్టువారికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు” అని చెప్పుకున్నారు. అప్పుడు యెహోవా మోషేతో, “ఈజిప్టువారి మీదికి వారి రథాల మీదికి వారి గుర్రపురౌతుల మీదికి నీళ్లు వచ్చేలా నీ చేయి సముద్రం మీద చాపు” అన్నారు. మోషే సముద్రం మీద తన చేయి చాపగా సూర్యోదయ సమయంలో సముద్రం తన స్థానంలోనికి తిరిగి వచ్చేసింది. ఈజిప్టువారు దాని నుండి పారిపోతున్నారు కాని యెహోవా వారిని సముద్రంలో ముంచివేసారు. నీళ్లు వెనుకకు ప్రవహించి సముద్రంలో ఇశ్రాయేలీయులను తరుముతున్న ఫరో సైన్యమంతటిని అంటే రథాలను గుర్రపురౌతులను కప్పివేశాయి. వారిలో ఒక్కరు కూడా బ్రతికి బయటపడలేదు. అయితే ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో ఆరిన నేలమీద వెళ్తున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల గోడల వలె నిలబడ్డాయి. ఆ రోజు యెహోవా ఈజిప్టువారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించారు. ఇశ్రాయేలీయులు సముద్రతీరాన చచ్చిపడివున్న ఈజిప్టువారిని చూశారు. ఈజిప్టువారికి వ్యతిరేకంగా పని చేసిన యెహోవా బలమైన హస్తాన్ని ఇశ్రాయేలీయులు చూచారు కాబట్టి ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా మీద ఆయన సేవకుడైన మోషే మీద నమ్మకముంచారు.