నిర్గమకాండము 12:31-51
నిర్గమకాండము 12:31-51 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. వాళ్ళతో “మీరూ ఇశ్రాయేలు ప్రజలూ త్వరగా నా దేశం నుండి, నా ప్రజల మధ్యనుండి వెళ్ళిపొండి. మీరు కోరుకున్నట్టు వెళ్లి యెహోవాను ఆరాధించండి. మీ ఇష్టప్రకారం మీ మందలనూ పశువులనూ తోలుకు వెళ్ళండి. నన్ను దీవించండి కూడా” అన్నాడు. ఐగుప్తీయులు మేము కూడా చనిపోతాం అనుకుని ఆత్రంగా ఇశ్రాయేల్ ప్రజను తమ దేశం నుండి వెళ్ళిపొమ్మని తొందర పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు పొంగజేసే పదార్థం కలపని తమ పిండి ముద్దలు, పిండి పిసికే గిన్నెలు మూటగట్టుకుని భుజాలపై మోసుకు పోయారు. అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు మోషే చెప్పిన మాట ప్రకారం ఐగుప్తీయుల దగ్గర నుండి వెండి, బంగారం నగలు, దుస్తులు అడిగి తీసుకున్నారు. ఐగుప్తీయులకు ఇశ్రాయేలు ప్రజల పట్ల యెహోవా జాలి గుణం కలిగించడం వల్ల వారు ఇశ్రాయేలు ప్రజలు అడిగినవన్నీ ఇచ్చారు. ఆ విధంగా వారు ఐగుప్తీయులను దోచుకున్నారు. తరువాత ఇశ్రాయేలు ప్రజలు రామెసేసు నుండి సుక్కోతు వరకూ ప్రయాణం సాగించారు. వారిలో పిల్లలు కాక, కాలి నడకన బయలుదేరిన పురుషులు ఆరు లక్షల మంది. అంతేకాక వేరువేరు జాతుల మనుషులు చాలా మంది వారితో వచ్చారు. గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులతో కూడిన గొప్ప మందలు కూడా వాళ్ళతో కలసి బయలుదేరాయి. తరువాత వాళ్ళు ఐగుప్తు నుండి తెచ్చిన పిండి ముద్దలతో పొంగని రొట్టెలు కాల్చారు. ఆ పిండి ముద్ద పులియలేదు. వాళ్ళు ఐగుప్తునుండి బయలు దేరే ముందు సమయం లేకపోవడం వల్ల తమ కోసం వేరే ఆహారం సిద్ధం చేసుకోలేక పోయారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాలు ముగిసిన రోజునే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి తరలి వెళ్లాయి. ఆయన ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి రప్పించిన ఆ రాత్రి యెహోవా కోసం కేటాయించి ఇశ్రాయేలు ప్రజలంతా తరతరాలకూ ఆ రాత్రి యెహోవా కోసం జాగారం చెయ్యాలి. తరువాత యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు. “ఇది పస్కా పండగను గూర్చిన నియమం. వేరే జాతికి చెందిన వాడెవడూ దాన్ని తినకూడదు. మీలో ఎవరైనా డబ్బిచ్చి కొనుక్కున్న దాసుడు సున్నతి పొందితే అలాంటి వాడు దాన్ని తినవచ్చు. వేరే దేశాలకు చెందిన వాళ్ళు, కూలి పనికి వచ్చిన సేవకులు దాన్ని తినకూడదు. ఏ ఇంట్లో వారు ఆ ఇంట్లో మాత్రమే దాన్ని తినాలి. దాని మాంసంలో కొంచెం కూడా ఇంట్లో నుండి బయటికి తీసుకు వెళ్ళకూడదు. వధించిన జంతువులోని ఒక్క ఎముకను కూడా మీరు విరగ్గొట్టకూడదు. ఇశ్రాయేలు ప్రజల సమాజం అంతా పండగ ఆచరించాలి. మీ దగ్గర నివసించే ఎవరైనా విదేశీయులు యెహోవా పస్కాను ఆచరించాలని కోరుకుంటే వాళ్ళ కుటుంబంలోని ప్రతి మగవాడూ సున్నతి పొందాలి. అప్పుడు వాళ్ళు సమాజంతో కలసి పస్కా ఆచరింపవచ్చు. వాళ్ళు మీ దేశంలో పుట్టిన వాళ్ళతో సమానం అవుతారు. సున్నతి పొందనివాడు దాన్ని తినకూడదు. స్వదేశీయుడికీ మీతో కలసి నివసించే విదేశీయుడికీ ఈ విషయంలో ఒకే నియమం ఉండాలి.” యెహోవా మోషే అహరోనులకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలందరూ చేశారు. ఆ రోజే యెహోవా ఇశ్రాయేలు ప్రజలను వారి వారి సేనల క్రమం ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటకు నడిపించాడు.
నిర్గమకాండము 12:31-51 పవిత్ర బైబిల్ (TERV)
కనుక ఆ రాత్రి మోషే, అహరోనులను ఫరో పిలిపించాడు. “మీరు వెంటనే నా ప్రజల్ని విడిచి వెళ్లండి. మీరు చెప్పినట్టే మీరూ, మీ ప్రజలూ చెయ్యండి. వెళ్లి యెహోవాను ఆరాధించండి. మీరు చెప్పినట్టే మీ గొర్రెలను, పశువులను, అన్నింటినీ మీతోబాటు తీసుకొనిపోవచ్చు. వెళ్లండి. నన్నుకూడ ఆశీర్వదించండి.” అని వారితో ఫరో అన్నాడు. వాళ్లను త్వరగా విడిచిపొమ్మని ఈజిప్టు ప్రజలు కూడ వారిని అడిగారు ఎందుకంటే, “మీరు వెళ్లకపోతే మేమందరం చస్తాము” అని వాళ్లు చెప్పారు. తమ రొట్టెల్లో పులిసిన పదార్థం వేసుకొనేంత సమయం ఇశ్రాయేలు ప్రజలకు లేదు. పిండి ముద్దలున్న పాత్రలను బట్టలో కట్టుకొని వారు వారి భుజాన వేసుకొని మోసుకుపోయారు. అప్పుడు మోషే వారిని ఏమి చేయమని చెప్పాడో అలాగే ఇశ్రాయేలు ప్రజలు చేసారు. వారు వారి పక్క ఇండ్ల వారి దగ్గరకు వెళ్లి బట్టలు, వెండి, బంగారు వస్తువులు ఇమ్మని అడిగారు. ఈజిప్టువారు ఇశ్రాయేలు ప్రజల మీద దయ చూపించేటట్టు యెహోవా చేసాడు. అందుచేత ఈజిప్టు వాళ్లు వారి ఐశ్వర్యాలను ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం కట్టి రామసేసునుండి సుక్కోతుకి వెళ్లారు. వారు పురుషులే సుమారు 6,00,000 మంది. ఇందులో పిల్లల సంఖ్యలేదు. గొర్రెలు, పశువులు, ఇతర సామగ్రి చాల విస్తారంగా ఉన్నాయి. వారితో బాటు చాల మంది రకరకాల ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. వీళ్లు ఇశ్రాయేలీయులు కారు, గాని వారితో కలిసి వెళ్లారు. అయితే ప్రజలకు మాత్రం వారి రొట్టెల్లో పులిసిన పదార్థం వేసుకొనే సమయం లేదు. వారు తమ ప్రయాణం కోసం ప్రత్యేకమైన భోజనం ఏదీ సిద్ధం చేసుకోలేదు. కనుక పులవని పిండితోనే వారు రొట్టెలు చేసుకోవాల్సి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో 430 సంవత్సరాలు జీవించారు. నాలుగువందల ముప్పై సంవత్సరాల తర్వాత ఆరోజే మొత్తం యెహోవా సైన్యాలన్నీ ఈజిప్టు దేశాన్ని విడిచి వెళ్లిపోయాయి. కనుక యెహోవా చేసిన దానిని ప్రజలు జ్ఞాపకం చేసుకొంటారు. అది చాల ప్రత్యేకమైన రాత్రి కనుక తరతరాలవరకు జ్ఞాపకం చేసుకొంటారు. ఇశ్రాయేలు ప్రజలంతా ఆ రాత్రిని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటారు. మోషే అహరోనులతో యెహోవా యిలా చెప్పాడు: “పస్కా పండుగకు నియమాలు ఇవి. పస్కా భోజనం విదేశీయుడెవరూ తినకూడదు. ఒకడు బానిసను కొంటే, ఆ బానిసకు అతడు సున్నతి చేస్తే అప్పుడు ఆ బానిస పస్కా పండుగ భోజనం చెయ్యవచ్చు. అయితే, ఒక వ్యక్తి కేవలం మీ దేశంలో ఉంటున్నా, లేక మీకోసం పని చేసేందుకు కూలికి కుదుర్చుకొన్నా, అలాంటి వ్యక్తి పస్కా పండుగ భోజనం చెయ్యకూడదు. (పస్కా పండుగ ఇశ్రాయేలీయులకు మాత్రమే)” “ప్రతి కుటుంబము ఒకే ఇంటిలో భోజనం చేయాలి. భోజనాన్ని ఎవ్వరూ ఇంటి బయట తినకూడదు. మీరు గొర్రెమాంసము తిని దాని ఎముకను విరువకూడదు. ఇశ్రాయేలు ప్రజలందరు ఈ పండుగను ఆచరించాలి. ఇశ్రాయేలు సమాజంలో సభ్యుడు కాని ఏ వ్యక్తి అయినా మీతోబాటు నివసిస్తూ ఉండి యెహోవా పస్కా పండుగలో అతడు పాల్గొనాలనుకొంటే, అతనికి సున్నతి చేయాలి. అప్పుడు అతను కూడ ఇశ్రాయేలు పౌరుడుగా ఆ భోజనంలో పాల్గొనవచ్చు. కాని ఒకడు సున్నతి చేసుకోకపోతే అతను పస్కా పండుగ భోజనంలో పాల్గొన కూడదు. అందరికీ ఇవే నియమాలు వర్తిస్తాయి. మీ దేశంలో నివసిస్తున్న వ్యక్తి పౌరుడైనా సరే, విదేశీయుడైనా సరే యివే నియమాలు వర్తిస్తాయి.” మోషే అహరోనులకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలకు ప్రజలంతా విధేయులయ్యారు. కనుక అదే రోజు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఈజిప్టు దేశం నుండి యెహోవా బయటకు నడిపించాడు. ప్రజలు గుంపులుగా బయల్దేరారు.
నిర్గమకాండము 12:31-51 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో –మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజలమధ్యనుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొని పోవుడి; నన్ను దీవించుడని చెప్పెను. ఐగుప్తీయులు–మనమందరము చచ్చిన వారమనుకొని, తమ దేశములోనుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతముచేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండిముద్దను తీసికొని, అది పులియకమునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూటకట్టుకొని, తమ భుజములమీద పెట్టుకొనిపోయిరి. ఇశ్రాయేలీయులు మోషే మాటచొప్పున చేసి ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి. యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లువారు ఐగుప్తీయులను దోచుకొనిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కో తుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు. అనేకులైన అన్యజనుల సమూహమును, గొఱ్ఱెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్పమందయును వారితోకూడ బయలుదేరెను. వారు ఐగుప్తులోనుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలుచేసి కాల్చిరి. వారు ఐగుప్తులోనుండి వెళ్లగొట్టబడి తడవుచేయ లేకపోయిరి గనుక అది పులిసి యుండలేదు, వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని యుండలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు. ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తుదేశములోనుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరు తమతమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి యిదే. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను–ఇది పస్కాపండుగనుగూర్చిన కట్టడ; అన్యుడెవడును దాని తినకూడదుగాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును. పరదేశియు కూలికివచ్చిన దాసుడును దాని తినకూడదు. మీరు ఒక్క యింటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలోనుండి బయటికి తీసికొని పోకూడదు, దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువకూడదు. ఇశ్రాయేలీయుల సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీయొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరినయెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను; తరువాత అతడు సమాజములోచేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిగూర్చి ఒకటే విధి యుండవలెననెను. ఇశ్రాయేలీయులందరు ఆలాగు చేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇశ్రాయేలీయులను వారివారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెను.
నిర్గమకాండము 12:31-51 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, “లేవండి! మీరు ఇశ్రాయేలు ప్రజలు వెంటనే బయలుదేరి నా ప్రజలను వదిలి వెళ్లిపొండి! మీరు కోరినట్లే వెళ్లి యెహోవాను ఆరాధించండి. మీరు చెప్పినట్లే మీ పశువులను గొర్రెలను తీసుకుని వెళ్లండి. అలాగే నన్ను దీవించండి” అని చెప్పాడు. ఈజిప్టువారు ప్రజలను తొందరపెట్టి దేశం విడిచి వెళ్లాలని కోరారు. వారు, “లేకపోతే, మనమందరం చనిపోతాము!” అని అనుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు తమ పిండిముద్దను తీసుకుని అది పులియకముందే దానిని పిండి పిసికే తొట్లలో వేసి బట్టలో మూట కట్టుకుని తమ భుజాలమీద మోసుకొనిపోయారు. ఇశ్రాయేలీయులు మోషే సూచించిన ప్రకారమే చేసి ఈజిప్టువారి దగ్గర నుండి వెండి బంగారు వస్తువులను వస్త్రాలను అడిగి తీసుకున్నారు. యెహోవా ఈజిప్టువారికి ఇశ్రాయేలీయుల పట్ల దయ పుట్టించారు కాబట్టి వారు తమను అడిగి వాటన్నిటిని వారికి ఇచ్చారు. ఆ విధంగా వారు ఈజిప్టువారిని దోచుకున్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమై వెళ్లారు. వారిలో స్త్రీలు పిల్లలు కాకుండా కాలినడకన ఉన్నవారు ఆరు లక్షలమంది పురుషులు. వారితో పాటు అనేకమంది ఇతర ప్రజలు ఉన్నారు అంతేకాక గొర్రెలు పశువుల పెద్ద మందలు కూడా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి తెచ్చిన పిండితో పులియని రొట్టెలు చేసి కాల్చారు. వారు ఈజిప్టు నుండి వెళ్లగొట్టబడినప్పుడు తమ కోసం ఆహారం సిద్ధపరచుకోవడానికి సమయం లేదు కాబట్టి ఆ పిండి పులియలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో నివసించిన కాలం 430 సంవత్సరాలు. సరిగ్గా 430 సంవత్సరాలు గడిచిన రోజునే యెహోవా సేనలన్ని ఈజిప్టు దేశం నుండి బయలుదేరి వెళ్లిపోయాయి. ఈజిప్టు నుండి బయటకు తీసుకురావడానికి ఆ రాత్రి యెహోవా మెళకువగా ఉన్నందున, ప్రతి సంవత్సరం ఈ రాత్రి ఇశ్రాయేలీయులందరు రాబోయే తరాల కోసం ప్రభువును గౌరవించడానికి మెలకువగా ఉండాలి. యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు, “పస్కాను ఆచరించడానికి పాటించవలసిన నియమాలు ఇవే: “విదేశీయులెవరు దీనిని తినకూడదు. మీరు వెండి పెట్టి కొన్న బానిసకు మీరు సున్నతి చేసిన తర్వాత అతడు దీనిని తినవచ్చు, తాత్కాలిక నివాసులు కాని కూలికి వచ్చినవారు కాని దీనిని తినకూడదు. “దీనిని ఒక ఇంటి లోపలే తినాలి; దాని మాంసంలో దేన్ని ఇంటి బయటకు తీసుకెళ్లకూడదు. దాని ఎముకల్లో ఒక్కటి కూడా విరువకూడదు. ఇశ్రాయేలీయుల సమాజమంతా దీనిని ఆచరించాలి. “మీ మధ్య నివసించే విదేశీయులు యెహోవా పస్కాను ఆచరించాలనుకుంటే అతని ఇంట్లోని మగవారందరు సున్నతి పొందాలి. అప్పుడు వారు దేశంలో పుట్టినవారిలా దానిలో పాల్గొనవచ్చు. సున్నతి పొందని మగవారు దీనిని తినకూడదు. దీని గురించి స్వదేశీయులకు మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకు ఒకే నియమం వర్తిస్తుంది.” యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించిన ప్రకారమే ఇశ్రాయేలీయులందరు చేశారు. అదే రోజు యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి విభజనల ప్రకారం ఈజిప్టు నుండి బయటకు రప్పించారు.