నిర్గమకాండము 12:14-51 - Compare All Versions
నిర్గమకాండము 12:14-51 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఈ రోజును మీరు స్మారకోత్సవం జరుపుకోవాలి; ఎందుకంటే రాబోయే తరాలకు దీనిని ఒక నిత్య కట్టుబాటుగా మీరు యెహోవాకు పండుగగా జరుపుకోవాలి. ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి. మొదటి రోజు మీ ఇండ్ల నుండి పులిసిన దాన్ని తీసివేయాలి, ఎందుకంటే మొదటి రోజు నుండి ఏడవ రోజు వరకు పులిసిన దానితో చేసిన రొట్టెలు ఎవరు తిన్నా, వారు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడాలి. మొదటి రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, ఏడవ రోజు మరొకటి నిర్వహించాలి. ఈ రోజుల్లో ప్రతిఒక్కరు తినడానికి ఆహారం సిద్ధం చేయడం తప్ప పనులేవీ చేయకూడదు. “పులియని రొట్టెల పండుగ మీరు జరుపుకోవాలి, ఎందుకంటే ఈ రోజునే నేను మీ విభాగాలను ఈజిప్టులో నుండి బయటకు తీసుకువచ్చాను. ఈ రోజును మీరు రాబోయే తరాలకు ఒక నిత్య కట్టుబాటుగా జరుపుకోవాలి. మొదటి నెల పద్నాలుగవ రోజు సాయంత్రం నుండి ఇరవై ఒకటవ రోజు సాయంత్రం వరకు మీరు పులియని రొట్టెలు తినాలి. ఎందుకంటే ఏడు రోజులు మీ ఇళ్ళలో పులిసినదేది ఉండకూడదు. విదేశీయులు గాని స్వదేశీయులు గాని పులిసినదేదైనా తింటే వారిని ఇశ్రాయేలు సమాజం నుండి కొట్టివేయబడాలి. పులిసినదేది మీరు తినకూడదు. మీరుండే అన్ని చోట్లలో పులియని రొట్టెలు మాత్రమే మీరు తినాలి.” అప్పుడు మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇలా చెప్పాడు, “మీరు వెంటనే వెళ్లి మీ కుటుంబాల కోసం మందలో నుండి గొర్రెపిల్లను ఎంచుకుని పస్కా గొర్రెపిల్లను వధించండి. హిస్సోపు కొమ్మను తీసుకుని, పళ్ళెంలో ఉన్న రక్తంలో దానిని ముంచి ద్వారబంధపు పైకమ్మికి, రెండు నిలువు కమ్మీలకు పూయాలి. ఉదయం వరకు మీలో ఎవరూ మీ ఇంటి ద్వారం నుండి బయటకు రాకూడదు. యెహోవా ఈజిప్టువారిని హతం చేయడానికి దేశమంతా సంచరిస్తూ, ద్వారబంధపు పైకమ్మికి రెండు నిలువు కమ్మీలకు పూయబడిన రక్తాన్ని చూసి ఆయన ఆ ద్వారాన్ని దాటి వెళ్తారు. సంహారకుడు మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని చంపడానికి ఆయన అనుమతించడు. “మీకు మీ వారసులకు ఒక నిత్య కట్టుబాటుగా నా ఈ ఆదేశాలను పాటించాలి. యెహోవా వాగ్దానం చేసినట్లుగా ఆయన మీకు ఇస్తానన్న దేశంలోనికి మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీనిని ఆచరించాలి. ‘ఈ వేడుకకు అర్థమేంటి?’ అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు వారితో, ‘ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఈజిప్టువారిని చంపుతున్నప్పుడు ఈజిప్టులో ఉన్న ఇశ్రాయేలీయుల ఇళ్ళను ఆయన ఏమీ చేయకుండా దాటి వెళ్లారు’ అని చెప్పాలి.” అప్పుడు ప్రజలు తలలు వంచి ఆరాధించారు. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించిన విధంగానే ఇశ్రాయేలీయులు చేశారు. అర్థరాత్రి సమయంలో సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదటి సంతానం మొదలుకొని చెరసాలలోని ఖైదీ యొక్క మొదటి సంతానం వరకు ఈజిప్టులోని మొదటి సంతానమంతటిని పశువుల మొదటి సంతానాన్ని యెహోవా హతం చేశారు. ఆ రాత్రి సమయంలో ఫరో అతని అధికారులందరు, ఈజిప్టువారందరు లేచారు, ఈజిప్టులో గొప్ప రోదన వినబడింది, ఎందుకంటే మరణం సంభవించని ఇల్లు ఒకటి కూడా లేదు. ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, “లేవండి! మీరు ఇశ్రాయేలు ప్రజలు వెంటనే బయలుదేరి నా ప్రజలను వదిలి వెళ్లిపొండి! మీరు కోరినట్లే వెళ్లి యెహోవాను ఆరాధించండి. మీరు చెప్పినట్లే మీ పశువులను గొర్రెలను తీసుకుని వెళ్లండి. అలాగే నన్ను దీవించండి” అని చెప్పాడు. ఈజిప్టువారు ప్రజలను తొందరపెట్టి దేశం విడిచి వెళ్లాలని కోరారు. వారు, “లేకపోతే, మనమందరం చనిపోతాము!” అని అనుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు తమ పిండిముద్దను తీసుకుని అది పులియకముందే దానిని పిండి పిసికే తొట్లలో వేసి బట్టలో మూట కట్టుకుని తమ భుజాలమీద మోసుకొనిపోయారు. ఇశ్రాయేలీయులు మోషే సూచించిన ప్రకారమే చేసి ఈజిప్టువారి దగ్గర నుండి వెండి బంగారు వస్తువులను వస్త్రాలను అడిగి తీసుకున్నారు. యెహోవా ఈజిప్టువారికి ఇశ్రాయేలీయుల పట్ల దయ పుట్టించారు కాబట్టి వారు తమను అడిగి వాటన్నిటిని వారికి ఇచ్చారు. ఆ విధంగా వారు ఈజిప్టువారిని దోచుకున్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమై వెళ్లారు. వారిలో స్త్రీలు పిల్లలు కాకుండా కాలినడకన ఉన్నవారు ఆరు లక్షలమంది పురుషులు. వారితో పాటు అనేకమంది ఇతర ప్రజలు ఉన్నారు అంతేకాక గొర్రెలు పశువుల పెద్ద మందలు కూడా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి తెచ్చిన పిండితో పులియని రొట్టెలు చేసి కాల్చారు. వారు ఈజిప్టు నుండి వెళ్లగొట్టబడినప్పుడు తమ కోసం ఆహారం సిద్ధపరచుకోవడానికి సమయం లేదు కాబట్టి ఆ పిండి పులియలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో నివసించిన కాలం 430 సంవత్సరాలు. సరిగ్గా 430 సంవత్సరాలు గడిచిన రోజునే యెహోవా సేనలన్ని ఈజిప్టు దేశం నుండి బయలుదేరి వెళ్లిపోయాయి. ఈజిప్టు నుండి బయటకు తీసుకురావడానికి ఆ రాత్రి యెహోవా మెళకువగా ఉన్నందున, ప్రతి సంవత్సరం ఈ రాత్రి ఇశ్రాయేలీయులందరు రాబోయే తరాల కోసం ప్రభువును గౌరవించడానికి మెలకువగా ఉండాలి. యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు, “పస్కాను ఆచరించడానికి పాటించవలసిన నియమాలు ఇవే: “విదేశీయులెవరు దీనిని తినకూడదు. మీరు వెండి పెట్టి కొన్న బానిసకు మీరు సున్నతి చేసిన తర్వాత అతడు దీనిని తినవచ్చు, తాత్కాలిక నివాసులు కాని కూలికి వచ్చినవారు కాని దీనిని తినకూడదు. “దీనిని ఒక ఇంటి లోపలే తినాలి; దాని మాంసంలో దేన్ని ఇంటి బయటకు తీసుకెళ్లకూడదు. దాని ఎముకల్లో ఒక్కటి కూడా విరువకూడదు. ఇశ్రాయేలీయుల సమాజమంతా దీనిని ఆచరించాలి. “మీ మధ్య నివసించే విదేశీయులు యెహోవా పస్కాను ఆచరించాలనుకుంటే అతని ఇంట్లోని మగవారందరు సున్నతి పొందాలి. అప్పుడు వారు దేశంలో పుట్టినవారిలా దానిలో పాల్గొనవచ్చు. సున్నతి పొందని మగవారు దీనిని తినకూడదు. దీని గురించి స్వదేశీయులకు మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకు ఒకే నియమం వర్తిస్తుంది.” యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించిన ప్రకారమే ఇశ్రాయేలీయులందరు చేశారు. అదే రోజు యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి విభజనల ప్రకారం ఈజిప్టు నుండి బయటకు రప్పించారు.
నిర్గమకాండము 12:14-51 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి ఈ రోజు మీకు స్మారక దినంగా ఉంటుంది. ఈ రోజును యెహోవా పండగ దినంగా తరతరాలుగా మీరు ఆచరించాలి. ఎందుకంటే ఇది యెహోవా నియమించిన శాశ్వతమైన కట్టుబాటు. ఏడు రోజులపాటు మీరు పొంగకుండా కాల్చిన రొట్టెలు తినాలి. మొదటి రోజున మీ ఇళ్ళలో పొంగ జేసే పదార్ధమంటూ ఏదీ లేకుండా చెయ్యాలి. మొదటి రోజు నుంచి ఏడవ రోజు వరకూ పొంగ జేసే పిండితో చేసిన రొట్టెలు తింటే ఆ వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజల్లో లేకుండా చేయాలి. ఆ మొదటి రోజు మీరు నా కోసం పరిశుద్ధ సమాజంగా సమకూడాలి. ఏడవ రోజున అలాటి సమావేశమే జరగాలి. ఆ రెండు రోజుల్లో అందరూ తినడానికి భోజనం సిద్ధం చేసుకోవడం తప్ప ఏ పనీ చేయకూడదు. మీరు చేయగలిగిన పని అదొక్కటే. ఈ పొంగని రొట్టెల పండగను మీరు ఆచరించాలి. ఎందుకంటే నేను మిమ్మల్నందరినీ ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకు వచ్చే రోజు అదే. కాబట్టి మీరు, మీ రాబోయే తరాలన్నీ ఈ రోజును ఆచరించాలి. ఇది మీకు శాశ్వతమైన కట్టుబాటుగా ఉంటుంది. మొదటి నెల 14 వ రోజు సాయంత్రం మొదలు అదే నెల 21 వ రోజు సాయంత్రం దాకా మీరు పొంగని పిండితో చేసిన రొట్టెలు తినాలి. ఏడు రోజులపాటు మీ ఇళ్ళలో పొంగజేసే పదార్ధమేదీ కనబడ కూడదు. పొంగజేసే పదార్ధంతో చేసిన దాన్ని మీలో ఎవరైనా తింటే అతడు విదేశీయుడైనా దేశంలో పుట్టిన వాడైనా ఇశ్రాయేలు ప్రజల సమాజంలో లేకుండా చేయాలి. మీరు పొంగజేసే పదార్థంతో చేసిన దేనినీ తినకూడదు. మీకు చెందిన అన్ని ఇళ్ళలో పొంగకుండా కాల్చిన రొట్టెలు మాత్రమే తినాలి.” అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దలను పిలిపించాడు. వాళ్ళతో ఇలా చెప్పాడు. “మీరు మీ కుటుంబాల కోసం మందలోనుండి మేకపిల్లను గానీ గొర్రెపిల్లను గానీ తీసుకుని పస్కా బలి అర్పించండి. తరువాత హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి, గుమ్మాల పైకమ్మికీ రెండు నిలువు కమ్ములకూ పూయాలి. మీలో ఎవ్వరూ తెల్లవారే వరకూ మీ ఇళ్ళ గుమ్మాల గుండా బయటకు వెళ్ళకండి. యెహోవా ఐగుప్తీయులను హతమార్చడానికి తిరుగుతూ ఇంటి గుమ్మం పైకమ్మి మీదా రెండు నిలువు కమ్ముల మీదా ఉన్న రక్తాన్ని చూసి ఆ ఇంటిని దాటిపోతాడు. సంహారం చేసే దూతను మీ ఇళ్ళలోకి ప్రవేశించడానికి మిమ్మల్ని సంహరించడానికి ఆయన అనుమతి ఇయ్యడు. అందుచేత మీరు దీన్ని ఆచరించాలి. ఇది మీకు, మీ సంతతికి శాశ్వతమైన చట్టంగా ఉంటుంది. యెహోవా వాగ్దానం చేసినట్టు ఆయన మీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఒక ఆచార క్రియగా పాటించాలి. మీ కొడుకులు ‘మీరు జరిగిస్తున్న ఈ ఆచారం ఎందుకోసం?’ అని మిమ్మల్ని అడిగితే, ‘ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను సంహరించే సమయంలో వారి మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజల ఇళ్ళను దాటి ఐగుప్తులో మనల్ని కాపాడాడు’ అని చెప్పాలి” అన్నాడు. అప్పుడు సమకూడిన ప్రజలంతా అది విని తమ తలలు వంచి దేవుణ్ణి ఆరాధించారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విధేయులై యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్టు చేశారు. ఆ అర్థరాత్రి సమయంలో ఏం జరిగిందంటే, ఐగుప్తు దేశంలో ఉన్న మొదటి సంతానమంతటినీ యెహోవా హతమార్చాడు. సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకుని, చెరసాలలోని ఖైదీల వరకూ వాళ్ళకు పుట్టిన మొదటి పిల్లలు మరణించారు. పశువుల తొలిచూలు పిల్లలు చనిపోయాయి. ఆ రాత్రి గడిచిన తరువాత మరణం సంభవించని ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఐగుప్తు దేశంలో తీవ్రమైన మరణ రోదన చెలరేగింది. ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. వాళ్ళతో “మీరూ ఇశ్రాయేలు ప్రజలూ త్వరగా నా దేశం నుండి, నా ప్రజల మధ్యనుండి వెళ్ళిపొండి. మీరు కోరుకున్నట్టు వెళ్లి యెహోవాను ఆరాధించండి. మీ ఇష్టప్రకారం మీ మందలనూ పశువులనూ తోలుకు వెళ్ళండి. నన్ను దీవించండి కూడా” అన్నాడు. ఐగుప్తీయులు మేము కూడా చనిపోతాం అనుకుని ఆత్రంగా ఇశ్రాయేల్ ప్రజను తమ దేశం నుండి వెళ్ళిపొమ్మని తొందర పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు పొంగజేసే పదార్థం కలపని తమ పిండి ముద్దలు, పిండి పిసికే గిన్నెలు మూటగట్టుకుని భుజాలపై మోసుకు పోయారు. అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు మోషే చెప్పిన మాట ప్రకారం ఐగుప్తీయుల దగ్గర నుండి వెండి, బంగారం నగలు, దుస్తులు అడిగి తీసుకున్నారు. ఐగుప్తీయులకు ఇశ్రాయేలు ప్రజల పట్ల యెహోవా జాలి గుణం కలిగించడం వల్ల వారు ఇశ్రాయేలు ప్రజలు అడిగినవన్నీ ఇచ్చారు. ఆ విధంగా వారు ఐగుప్తీయులను దోచుకున్నారు. తరువాత ఇశ్రాయేలు ప్రజలు రామెసేసు నుండి సుక్కోతు వరకూ ప్రయాణం సాగించారు. వారిలో పిల్లలు కాక, కాలి నడకన బయలుదేరిన పురుషులు ఆరు లక్షల మంది. అంతేకాక వేరువేరు జాతుల మనుషులు చాలా మంది వారితో వచ్చారు. గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులతో కూడిన గొప్ప మందలు కూడా వాళ్ళతో కలసి బయలుదేరాయి. తరువాత వాళ్ళు ఐగుప్తు నుండి తెచ్చిన పిండి ముద్దలతో పొంగని రొట్టెలు కాల్చారు. ఆ పిండి ముద్ద పులియలేదు. వాళ్ళు ఐగుప్తునుండి బయలు దేరే ముందు సమయం లేకపోవడం వల్ల తమ కోసం వేరే ఆహారం సిద్ధం చేసుకోలేక పోయారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాలు ముగిసిన రోజునే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి తరలి వెళ్లాయి. ఆయన ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి రప్పించిన ఆ రాత్రి యెహోవా కోసం కేటాయించి ఇశ్రాయేలు ప్రజలంతా తరతరాలకూ ఆ రాత్రి యెహోవా కోసం జాగారం చెయ్యాలి. తరువాత యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు. “ఇది పస్కా పండగను గూర్చిన నియమం. వేరే జాతికి చెందిన వాడెవడూ దాన్ని తినకూడదు. మీలో ఎవరైనా డబ్బిచ్చి కొనుక్కున్న దాసుడు సున్నతి పొందితే అలాంటి వాడు దాన్ని తినవచ్చు. వేరే దేశాలకు చెందిన వాళ్ళు, కూలి పనికి వచ్చిన సేవకులు దాన్ని తినకూడదు. ఏ ఇంట్లో వారు ఆ ఇంట్లో మాత్రమే దాన్ని తినాలి. దాని మాంసంలో కొంచెం కూడా ఇంట్లో నుండి బయటికి తీసుకు వెళ్ళకూడదు. వధించిన జంతువులోని ఒక్క ఎముకను కూడా మీరు విరగ్గొట్టకూడదు. ఇశ్రాయేలు ప్రజల సమాజం అంతా పండగ ఆచరించాలి. మీ దగ్గర నివసించే ఎవరైనా విదేశీయులు యెహోవా పస్కాను ఆచరించాలని కోరుకుంటే వాళ్ళ కుటుంబంలోని ప్రతి మగవాడూ సున్నతి పొందాలి. అప్పుడు వాళ్ళు సమాజంతో కలసి పస్కా ఆచరింపవచ్చు. వాళ్ళు మీ దేశంలో పుట్టిన వాళ్ళతో సమానం అవుతారు. సున్నతి పొందనివాడు దాన్ని తినకూడదు. స్వదేశీయుడికీ మీతో కలసి నివసించే విదేశీయుడికీ ఈ విషయంలో ఒకే నియమం ఉండాలి.” యెహోవా మోషే అహరోనులకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలందరూ చేశారు. ఆ రోజే యెహోవా ఇశ్రాయేలు ప్రజలను వారి వారి సేనల క్రమం ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటకు నడిపించాడు.
నిర్గమకాండము 12:14-51 TERV (పవిత్ర బైబిల్)
“కనుక ఈ రాత్రిని మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటారు. మీకు అది ఒక ప్రత్యేక పండుగ రోజుగా ఉంటుంది. మీ తర్వాత మీ సంతానము శాశ్వతంగా ఈ పండుగను ఆచరించి యెహోవాను ఘనపర్చాలి. ఈ పండుగనాడు ఏడు రోజుల పాటు పొంగని రొట్టెలు మీరు తినాలి. ఈ పండుగ మొదటి రోజున పులిసే పదార్థాన్ని మీ ఇండ్లలోనుంచి తీసివేయాలి. ఈ పండుగ జరిగే మొత్తం ఏడు రోజుల్లోనూ పులిసిన పదార్థాన్ని ఏ ఒక్కరూ తినకూడదు. ఎవరైనా సరే పులిసే పదార్థం తింటే, ఆ వ్యక్తిని ఇశ్రాయేలు వాళ్లనుండి మీరు వేరుచేయాలి. పండుగలో మొదటి రోజున, చివరి రోజున పరిశుద్ధ సమావేశాలు ఉంటాయి. ఈ రోజుల్లో మీరు ఏ పనీ చేయకూడదు. ఇలాంటి రోజుల్లో మీరు భోంచేయటానికి అవసరమైన భోజనాన్ని సిద్ధం చేసుకోవడం ఒక్కటే మీరు చెయ్యొచ్చు. పులియని పిండితో చేసే రొట్టెల పండుగను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుచేతనంటే, సరిగ్గా ఈ రోజే మీ వంశాలన్నింటినీ ఈజిప్టు నుండి నేను బయటకు నడిపిన రోజు. అందుచేత మీ తర్వాత మీ సంతానమంతా ఈ రోజును జ్ఞాపకం చేసుకోవాలి. ఇది శాశ్వతంగా ఉండిపోయే చట్టం. కనుక మొదటి నెల (నిసాను) 14వ రోజు సాయంత్రం నుండి మీరు పులియని రొట్టెలు తినడం మొదలు పెట్టాలి. అదే నెల 21 రోజు సాయంత్రం వరకు అలాంటి రొట్టెలే మీరు తినాలి. ఏడు రోజుల పాటు మీ ఇళ్లలో ఎక్కడా పులిసిన పదార్థం ఉండకూడదు. ఇశ్రాయేలు పౌరుడేకాని, విదేశీయుడేగాని ఏ వ్యక్తిగాని ఈ సందర్భంలో పులిసిన పదార్థం తింటే, మిగిలిన ఇశ్రాయేలీయులందరినుండి ఆ వ్యక్తి వేరు చేయబడాలి. ఈ పండుగ సమయంలో మీరు పులిసిన పదార్థం తినకూడదు. మీరు ఎక్కడ ఉన్నాసరే, పులియని రొట్టెలు మాత్రమే మీరు తినాలి.” కనుక పెద్దలందర్నీ మోషే పిలిచి, “మీ కుటుంబాల కోసం గొర్రెపిల్లల్ని తెచ్చుకొని, పస్కా పండుగకు ఆ గొర్రెపిల్లల్ని తీసుకోండి. హిస్సోపు కొమ్మలు తీసుకొని రక్తంతో నింపిన పాత్రల్లో వాటిని ముంచండి. ద్వారబంధాల నిలువు కమ్ముల మీద, పై కమ్మి మీద ఆ రక్తాన్ని పూయండి. తెల్లారేవరకు ఎవరూ తమ ఇండ్లు విడిచి వెళ్ల కూడదు. ఈజిప్టులో జ్యేష్ఠ సంతానాన్ని చంపడానికి యెహోవా సంచరించే సమయంలో, ద్వారబంధాల నిలువు కమ్ముల మీద పైకమ్మి మీద రక్తాన్ని ఆయన చూస్తాడు. అప్పుడు యెహోవా ఆ ఇంటిని కాపాడుతాడు నాశనకారుడ్ని యెహోవా మీ ఇంట్లోకి రానివ్వడు. మిమ్మల్ని బాధింపనియ్యడు. ఈ ఆజ్ఞ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ చట్టం మీకు, మీ సంతానానికి శాశ్వతంగా ఉంటుంది. యెహోవా మీకు ఇచ్చే దేశానికి వెళ్లిన తర్వాత కూడ మీరు దీన్ని చేయటం జ్ఞాపకం ఉంచుకోవాలి. ‘ఈ ఆచారం మనం ఎందుకు పాటిస్తున్నాము?’ అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు ‘యెహోవాను ఘనపర్చడం కోసమే ఈ పస్కా పండుగ. ఎందుచేతనంటే, మనం ఈజిప్టులో ఉన్నప్పుడు యెహోవా ఇశ్రాయేలు గృహాలను దాటిపోయాడు యెహోవా ఈజిప్టు వాళ్లను చంపేసాడు. కానీ మన ఇళ్లల్లో వారిని ఆయన రక్షించాడు. అందుచేత ఇప్పుడు ప్రజలు సాష్టాంగపడి యెహోవాను ఆరాధిస్తున్నారు’ అని మీరు చెప్పాలి.” అని అన్నాడు. మోషే అహరోనులకు యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చాడు. అందుచేత యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు చేసారు. అర్ధరాత్రి వేళ ఫరో (ఈజిప్టు రాజ్యపాలకుడు) ఇంట పెద్ద కుమారుడు మొదలుకొని చెరసాలలో కూర్చొన్న ఖైదీ పెద్ద కుమారుని వరకు ఈజిప్టులో పెద్ద కుమారులందర్నీ యెహోవా చంపేసాడు. అలాగే జంతువుల్లో మొదటి సంతానం అన్నీ చచ్చాయి. ఆ రాత్రి ఈజిప్టులో ప్రతీ ఇంటా ఎవరో ఒకరు చనిపోయారు. ఫరో, అతని అధికారులు, ఈజిప్టులోని ప్రజలంతా ఘోల్లున ఏడ్వడం మొదలు పెట్టారు. కనుక ఆ రాత్రి మోషే, అహరోనులను ఫరో పిలిపించాడు. “మీరు వెంటనే నా ప్రజల్ని విడిచి వెళ్లండి. మీరు చెప్పినట్టే మీరూ, మీ ప్రజలూ చెయ్యండి. వెళ్లి యెహోవాను ఆరాధించండి. మీరు చెప్పినట్టే మీ గొర్రెలను, పశువులను, అన్నింటినీ మీతోబాటు తీసుకొనిపోవచ్చు. వెళ్లండి. నన్నుకూడ ఆశీర్వదించండి.” అని వారితో ఫరో అన్నాడు. వాళ్లను త్వరగా విడిచిపొమ్మని ఈజిప్టు ప్రజలు కూడ వారిని అడిగారు ఎందుకంటే, “మీరు వెళ్లకపోతే మేమందరం చస్తాము” అని వాళ్లు చెప్పారు. తమ రొట్టెల్లో పులిసిన పదార్థం వేసుకొనేంత సమయం ఇశ్రాయేలు ప్రజలకు లేదు. పిండి ముద్దలున్న పాత్రలను బట్టలో కట్టుకొని వారు వారి భుజాన వేసుకొని మోసుకుపోయారు. అప్పుడు మోషే వారిని ఏమి చేయమని చెప్పాడో అలాగే ఇశ్రాయేలు ప్రజలు చేసారు. వారు వారి పక్క ఇండ్ల వారి దగ్గరకు వెళ్లి బట్టలు, వెండి, బంగారు వస్తువులు ఇమ్మని అడిగారు. ఈజిప్టువారు ఇశ్రాయేలు ప్రజల మీద దయ చూపించేటట్టు యెహోవా చేసాడు. అందుచేత ఈజిప్టు వాళ్లు వారి ఐశ్వర్యాలను ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం కట్టి రామసేసునుండి సుక్కోతుకి వెళ్లారు. వారు పురుషులే సుమారు 6,00,000 మంది. ఇందులో పిల్లల సంఖ్యలేదు. గొర్రెలు, పశువులు, ఇతర సామగ్రి చాల విస్తారంగా ఉన్నాయి. వారితో బాటు చాల మంది రకరకాల ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. వీళ్లు ఇశ్రాయేలీయులు కారు, గాని వారితో కలిసి వెళ్లారు. అయితే ప్రజలకు మాత్రం వారి రొట్టెల్లో పులిసిన పదార్థం వేసుకొనే సమయం లేదు. వారు తమ ప్రయాణం కోసం ప్రత్యేకమైన భోజనం ఏదీ సిద్ధం చేసుకోలేదు. కనుక పులవని పిండితోనే వారు రొట్టెలు చేసుకోవాల్సి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో 430 సంవత్సరాలు జీవించారు. నాలుగువందల ముప్పై సంవత్సరాల తర్వాత ఆరోజే మొత్తం యెహోవా సైన్యాలన్నీ ఈజిప్టు దేశాన్ని విడిచి వెళ్లిపోయాయి. కనుక యెహోవా చేసిన దానిని ప్రజలు జ్ఞాపకం చేసుకొంటారు. అది చాల ప్రత్యేకమైన రాత్రి కనుక తరతరాలవరకు జ్ఞాపకం చేసుకొంటారు. ఇశ్రాయేలు ప్రజలంతా ఆ రాత్రిని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటారు. మోషే అహరోనులతో యెహోవా యిలా చెప్పాడు: “పస్కా పండుగకు నియమాలు ఇవి. పస్కా భోజనం విదేశీయుడెవరూ తినకూడదు. ఒకడు బానిసను కొంటే, ఆ బానిసకు అతడు సున్నతి చేస్తే అప్పుడు ఆ బానిస పస్కా పండుగ భోజనం చెయ్యవచ్చు. అయితే, ఒక వ్యక్తి కేవలం మీ దేశంలో ఉంటున్నా, లేక మీకోసం పని చేసేందుకు కూలికి కుదుర్చుకొన్నా, అలాంటి వ్యక్తి పస్కా పండుగ భోజనం చెయ్యకూడదు. (పస్కా పండుగ ఇశ్రాయేలీయులకు మాత్రమే)” “ప్రతి కుటుంబము ఒకే ఇంటిలో భోజనం చేయాలి. భోజనాన్ని ఎవ్వరూ ఇంటి బయట తినకూడదు. మీరు గొర్రెమాంసము తిని దాని ఎముకను విరువకూడదు. ఇశ్రాయేలు ప్రజలందరు ఈ పండుగను ఆచరించాలి. ఇశ్రాయేలు సమాజంలో సభ్యుడు కాని ఏ వ్యక్తి అయినా మీతోబాటు నివసిస్తూ ఉండి యెహోవా పస్కా పండుగలో అతడు పాల్గొనాలనుకొంటే, అతనికి సున్నతి చేయాలి. అప్పుడు అతను కూడ ఇశ్రాయేలు పౌరుడుగా ఆ భోజనంలో పాల్గొనవచ్చు. కాని ఒకడు సున్నతి చేసుకోకపోతే అతను పస్కా పండుగ భోజనంలో పాల్గొన కూడదు. అందరికీ ఇవే నియమాలు వర్తిస్తాయి. మీ దేశంలో నివసిస్తున్న వ్యక్తి పౌరుడైనా సరే, విదేశీయుడైనా సరే యివే నియమాలు వర్తిస్తాయి.” మోషే అహరోనులకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలకు ప్రజలంతా విధేయులయ్యారు. కనుక అదే రోజు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఈజిప్టు దేశం నుండి యెహోవా బయటకు నడిపించాడు. ప్రజలు గుంపులుగా బయల్దేరారు.
నిర్గమకాండము 12:14-51 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచరింపవలెను. ఏడుదినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటిదినమున మీ యిండ్లలోనుండి పొంగినది పార వేయవలెను. మొదటి దినము మొదలుకొని యేడవ దినమువరకు పులిసినదానిని తిను ప్రతిమనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, ఏడవదినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును; అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియనిరొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము నాచరింపవలెను; ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల పదునాలుగవదినము సాయంకాలము మొదలుకొని ఆ నెల యిరువది యొకటవదినము సాయంకాలమువరకు మీరు పులియనిరొట్టెలను తినవలెను. ఏడు దినములు మీ యిండ్లలో పొంగినదేదియును ఉండకూడదు, పులిసిన దానిని తినువాడు అన్యుడేగాని దేశములో పుట్టినవాడేగాని ఇశ్రాయేలీయుల సమాజములో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోను పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దల నందరిని పిలిపించి వారితో ఇట్లనెను–మీరు మీ కుటుంబముల చొప్పున మందలోనుండి పిల్లను తీసికొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములోనున్న రక్తములో దాని ముంచి, ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయమువరకు తన యింటి ద్వారమునుండి బయలు వెళ్లకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారముచేయుచు, ద్వారబంధపు పైకమ్మిమీదను రెండు నిలువు కమ్ములమీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును; మిమ్ము హతము చేయుటకు మీ యిండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీ కిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీని నాచరింపవలెను. మరియు మీ కుమారులు–మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు మీరు–ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీ యులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయులయిండ్లను విడిచి పెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారముచేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి ఆలాగుచేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీయొక్క తొలిపిల్లవరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లల నందరిని పశువుల తొలిపిల్లలనన్నిటిని యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో –మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజలమధ్యనుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొని పోవుడి; నన్ను దీవించుడని చెప్పెను. ఐగుప్తీయులు–మనమందరము చచ్చిన వారమనుకొని, తమ దేశములోనుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతముచేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండిముద్దను తీసికొని, అది పులియకమునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూటకట్టుకొని, తమ భుజములమీద పెట్టుకొనిపోయిరి. ఇశ్రాయేలీయులు మోషే మాటచొప్పున చేసి ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి. యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లువారు ఐగుప్తీయులను దోచుకొనిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కో తుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు. అనేకులైన అన్యజనుల సమూహమును, గొఱ్ఱెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్పమందయును వారితోకూడ బయలుదేరెను. వారు ఐగుప్తులోనుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలుచేసి కాల్చిరి. వారు ఐగుప్తులోనుండి వెళ్లగొట్టబడి తడవుచేయ లేకపోయిరి గనుక అది పులిసి యుండలేదు, వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని యుండలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు. ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తుదేశములోనుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరు తమతమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి యిదే. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను–ఇది పస్కాపండుగనుగూర్చిన కట్టడ; అన్యుడెవడును దాని తినకూడదుగాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును. పరదేశియు కూలికివచ్చిన దాసుడును దాని తినకూడదు. మీరు ఒక్క యింటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలోనుండి బయటికి తీసికొని పోకూడదు, దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువకూడదు. ఇశ్రాయేలీయుల సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీయొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరినయెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను; తరువాత అతడు సమాజములోచేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిగూర్చి ఒకటే విధి యుండవలెననెను. ఇశ్రాయేలీయులందరు ఆలాగు చేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇశ్రాయేలీయులను వారివారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెను.