నిర్గమకాండము 11:1-10
నిర్గమకాండము 11:1-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “ఫరో మీదికి ఈజిప్టు మీదికి నేను మరొక తెగులును తీసుకువస్తాను. దాని తర్వాత అతడు మిమ్మల్ని వెళ్లనిస్తాడు. అతడు మిమ్మల్ని వెళ్లనిచ్చినప్పుడు అతడు ఇక్కడినుండి మిమ్మల్ని పూర్తిగా వెళ్లగొడతాడు. పురుషులు స్త్రీలు తమ పొరుగువారి నుండి వెండి బంగారు వస్తువులను అడిగి తీసుకోవాలని ప్రజలకు చెప్పు.” యెహోవా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఈజిప్టువారికి కనికరం కలిగేలా చేశారు, అంతేకాక మోషే ఈజిప్టు దేశంలో ఫరో అధికారులచేత ప్రజలచేత గొప్పగా గౌరవించబడ్డాడు. మోషే ఫరోతో, “యెహోవా చెప్పిన మాట ఇదే: ‘మధ్యరాత్రి నేను ఈజిప్టు దేశం గుండా వెళ్తాను. అప్పుడు ఈజిప్టులోని ప్రతి మొదటి సంతానం చస్తారు, సింహాసనం మీద కూర్చునే ఫరో మొదటి సంతానం మొదలుకొని తిరగలి విసిరే దాసి మొదటి సంతానం వరకు, పశువుల్లో కూడా మొదట పుట్టినవి చస్తాయి. అప్పుడు ఈజిప్టు దేశమంతటా పెద్ద రోదన ఉంటుంది. అటువంటి రోదన గతంలో ఎప్పుడూ లేదు ఇకముందు ఉండదు. అయితే ఇశ్రాయేలీయులలో ఏ వ్యక్తిని చూసి కానీ లేదా జంతువును చూసి గాని ఒక కుక్క కూడా మొరుగదు.’ అప్పుడు యెహోవా ఈజిప్టు, ఇశ్రాయేలు మధ్య భేదం చూపించారని మీకు తెలుస్తుంది. అప్పుడు మీ అధికారులైన వీరందరు నా దగ్గరకు వచ్చి నా ఎదుట తలవంచి, ‘నీవు, నిన్ను అనుసరించే ప్రజలందరు వెళ్లండి’ అని చెప్తారు. అప్పుడు నేను వెళ్తాను” అని చెప్పి మోషే తీవ్రమైన కోపంతో ఫరో దగ్గర నుండి వెళ్లిపోయాడు. అప్పుడు యెహోవా మోషేతో, “ఈజిప్టు దేశంలో నా అద్భుతాలు అధికమయ్యేలా ఫరో నీ మాట వినడం తృణీకరిస్తాడు” అన్నారు. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ అద్భుతాలన్నిటిని చేశారు, కాని యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచారు కాబట్టి అతడు ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి బయటకు వెళ్లనివ్వలేదు.
నిర్గమకాండము 11:1-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “ఫరో మీదికీ ఐగుప్తు మీదికీ మరొక తెగులు రప్పించబోతున్నాను. దాని తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని వెళ్ళనిస్తాడు. ఎవ్వరూ మిగలకుండా శాశ్వతంగా అతడు మిమ్మల్ని దేశం నుండి పంపించి వేస్తాడు. కాబట్టి ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఐగుప్తు జాతి వాళ్ళైన తమ పొరుగువాళ్ళ దగ్గర నుండి వెండి, బంగారు నగలు అడిగి తీసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి.” యెహోవా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఐగుప్తీయులకు కనికరం కలిగేలా చేశాడు. అంతేకాక ఐగుప్తు దేశవాసులు, ఫరో సేవకులు మోషేను చాలా గొప్పగా ఎంచారు. మోషే ఫరోతో ఇలా అన్నాడు “యెహోవా చెప్పింది ఏమిటంటే, అర్థరాత్రి నేను బయలుదేరి ఐగుప్తు దేశంలోకి వెళ్తాను. ఐగుప్తు దేశంలో మొదట పుట్టిన సంతానమంతా చనిపోతారు. సింహాసనంపై ఉన్న ఫరో మొదటి సంతానం మొదలుకుని తిరగలి విసిరే పనిమనిషి మొదట పుట్టిన సంతానం దాకా, పశువుల్లో కూడా మొదట పుట్టినవన్నీ చనిపోతాయి. అప్పుడు ఐగుప్తు దేశంలో ప్రతి చోటా గొప్ప విలాపం ఉంటుంది. అలాంటి ఏడుపు ఇంతవరకూ ఎన్నడూ పుట్టలేదు, ఇకపై ఎన్నడూ పుట్టదు. యెహోవా ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకపరుస్తాడని మీరు తెలుసుకొనేలా ఇశ్రాయేలు ప్రజలపై గానీ జంతువులపై గానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరి మీదా కుక్క అయినా నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరంతా నా దగ్గరికి వస్తారు. నా ఎదుట సాష్టాంగపడి, ‘నువ్వు, నిన్ను అనుసరించే వాళ్ళంతా ఈ దేశం విడిచి బయలుదేరండి’ అని చెబుతారు. అప్పుడు నేను నా ప్రజలతో వెళ్ళిపోతాను” అని చెప్పి మోషే మండిపడుతూ ఫరో దగ్గరనుండి వెళ్ళిపోయాడు. అప్పుడు యెహోవా “ఐగుప్తు దేశంలో నేను చేసే అద్భుత క్రియలు అధికం అయ్యేలా ఫరో మీ మాట వినడు” అని మోషేతో చెప్పాడు. మోషే అహరోనులు ఫరో సమక్షంలో ఈ అద్భుతాలు చేశారు. అయినప్పటికీ యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనియ్యలేదు.
నిర్గమకాండము 11:1-10 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఫరో మీదికి, ఈజిప్టు మీదికి నేను ఇంకా ఒక నాశనం తీసుకు రావల్సి ఉంది. దాని తర్వాత అతడు మిమ్మల్ని ఈజిప్టు నుండి పంపించి వేస్తాడు. వాస్తవానికి మీరు ఈ దేశం వదలి వెళ్లిపోవాలని అతడు మిమ్మల్ని బలవంతం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఈ సందేశం మీరు చెప్పాలి, ‘మీరు స్త్రీలు పురుషులు అందరూ మీ చుట్టు ప్రక్కల వాళ్ల దగ్గరకు వెళ్లి, వారి వెండి, బంగారు వస్తువులన్నీ మీకు ఇమ్మని అడగాలి. ఈజిప్టు వాళ్లకు మీపై దయ కలిగేటట్టు యెహోవా చేస్తాడు.’” అప్పటికే ఈజిప్టు ప్రజలు మరియు ఫరో అధికారులు కూడా మోషేను ఒక మహాత్మునిగా ఎంచుతున్నారు. మోషే ప్రజలతో ఇలా చెప్పాడు: “ఈ వేళ మధ్యరాత్రి మరణదూత ఈజిప్టులో తిరుగుతాడు. ఫరో పెద్ద కుమారుడు మొదలు ధాన్యం తిరుగలి విసరుతున్న బానిసయొక్క, పెద్ద కుమారుడు వరకు ఈజిప్టులో ప్రతి పెద్ద కుమారుడు మరణిస్తాడు. అలాగే జంతువుల్లో మొదట పుట్టినవన్నీ చస్తాయి. గతంలోకంటె, భవిష్యత్తులోకంటె, ఇప్పుడు ఈజిప్టులోవినబడే ఏడ్పులు మరీ దారుణంగా ఉంటాయి. కాని ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరికీ హాని కలుగదు. కనీసం వారిపై ఒక కుక్క కూడ మొరగడం ఉండదు. ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరుగాని, వారి జంతువుల్లో ఏ ఒక్కటిగాని బాధపడవు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు వాళ్లకంటె, ప్రత్యేకంగా నేను చూశానని మీరు తెలుసుకొంటారు. అప్పుడు మీ బానిసలు (ఈజిప్టు వాళ్లు) సాష్టాంగపడి నన్ను ఆరాధిస్తారు. ‘మీ ప్రజలందరినీ తీసుకొని మీరు వెళ్లిపోండి’ అని వాళ్లే అప్పుడు చెబతారు. అప్పుడు నేను కోపంగా ఫరోను విడిచి వెళ్తాను.” యెహోవా మోషేతో, “నీ మాట ఎందుచేత ఫరో వినలేదు? ఈజిప్టులో నా మహత్తర శక్తిని నేను చూపించ గలిగేందుకే” అని చెప్పాడు. ఆ కారణం చేతనే ఫరో యెదుట మోషే, అహరోనులు ఈ మహా అద్భుతాలన్నీ చేసారు. అందుకే ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని తన దేశం నుండి వెళ్లనియ్యకుండా అంత మొండికెత్తేటట్టు యెహోవా చేసాడు.
నిర్గమకాండము 11:1-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–ఫరో మీదికిని ఐగుప్తుమీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటుతరువాత అతడు ఇక్కడనుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడనుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టును. కాబట్టి తన చెలికానియొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తెయొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసికొనుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను; అదిగాక ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను. మోషే ఫరోతో ఇట్లనెను–యెహోవా సెలవిచ్చిన దేమనగా–మధ్యరాత్రి నేను ఐగుప్తుదేశములోనికి బయలు వెళ్లెదను. అప్పుడు సింహాసనముమీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్లవరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలందరును చచ్చెదరు; జంతు వులలోను తొలిపిల్లలన్నియు చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందంతట మహా ఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇకమీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు, మనుష్యులమీదగాని జంతు వులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకు లైన వీరందరు నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి–నీవును, నిన్ను ఆశ్రయించియున్న యీ ప్రజలందరును బయలు వెళ్లుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్లుదుననెను. మోషే ఆలాగు చెప్పి ఫరో యొద్దనుండి అత్యాగ్రహముతో వెళ్లిపోయెను. అప్పుడు యెహోవా–ఐగుప్తుదేశములో నా మహ త్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. మోషే అహరోనులు ఫరో యెదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్య డాయెను.