నిర్గమకాండము 10:1-29
నిర్గమకాండము 10:1-29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తర్వాత యెహోవా మోషేతో, “ఫరో దగ్గరకు వెళ్లు, ఎందుకంటే నేను అతని హృదయాన్ని అతని అధికారుల హృదయాలను కఠినం చేశాను తద్వార నేను ఈ నా సూచనలను వారి మధ్య ప్రదర్శించవచ్చు, అప్పుడు మీరు మీ పిల్లలకు మనవళ్ళకు నేను ఈజిప్టు వారితో ఎలా కఠినంగా వ్యవహరించానో, వారి మధ్య నా సూచనలను ఎలా కనుపరిచానో చెప్పగలరు, నేను యెహోవానై ఉన్నాను అని మీరు తెలుసుకుంటారు” అన్నారు. కాబట్టి మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లి అతనితో అన్నారు, “నేను యెహోవాను, హెబ్రీయుల దేవుడు ఇలా చెప్పారు: ‘ఎంతకాలం నిన్ను నీవు నా ఎదుట తగ్గించుకోకుండ ఉంటావు? నన్ను సేవించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు. నీవు వారిని వెళ్లనివ్వకపోతే రేపు నేను నీ దేశం మీదికి మిడతలను రప్పిస్తాను. ఎవరు నేలను చూడలేనంతగా అవి నేలను కప్పివేస్తాయి. వడగండ్ల దెబ్బ నుండి తప్పించుకుని మీకు మిగిలిన కొద్ది దాన్ని కూడా అవి తినివేస్తాయి. మీ పొలంలో పెరుగుతున్న ప్రతి చెట్టును అవి తింటాయి. నీ ఇల్లు నీ అధికారులందరి ఇల్లు ఈజిప్టు వారందరి ఇల్లు వాటితో నిండిపోతాయి. మీ తల్లిదండ్రులు గాని మీ పూర్వికులు గాని వారు ఈ దేశంలో స్థిరపడినప్పటి నుండి ఇప్పటివరకు అటువంటి వాటిని ఎన్నడూ చూడలేదు.’ ” తర్వాత మోషే ఫరో దగ్గర నుండి తిరిగి వచ్చేశాడు. ఫరో అధికారులు అతనితో, “ఈ మనిషి ఎంతకాలం మనకి ఉరిగా ఉంటాడు? ఈ ప్రజలు తమ దేవుడైన యెహోవాను సేవించడానికి వారిని వెళ్లనివ్వు. ఈజిప్టు నాశనం చేయబడుతుందని నీవు గ్రహించవా?” అని అన్నారు. అప్పుడు మోషే అహరోనులను తిరిగి ఫరో దగ్గరకు తీసుకువచ్చినప్పుడు అతడు, “వెళ్లండి, మీ దేవుడైన యెహోవాను సేవించండి, కాని ఎవరు వెళ్తారో నాకు చెప్పండి” అని అన్నాడు. అందుకు మోషే, “మేము యెహోవాకు పండుగ జరుపుకోవాలి కాబట్టి మేము మాలో చిన్నవారిని పెద్దవారిని మా కుమారులను కుమార్తెలను మా గొర్రెలను పశువులను తీసుకెళ్తాము” అన్నాడు. అందుకు ఫరో, “యెహోవా మీతో ఉండును గాక! ఒకవేళ నేను మిమ్మల్ని మీ స్త్రీలు, పిల్లలతో సహా వెళ్లనిస్తే! మీ చెడు ఆలోచన నాకు తెలుసు. కాబట్టి కేవలం పురుషులు మాత్రమే వెళ్లి యెహోవాను సేవించండి; మీరు అడుగుతుంది ఇదే కదా” అని వారితో అన్నాడు. అప్పుడు వారు ఫరో ఎదుట నుండి తరిమివేయబడ్డారు. అప్పుడు యెహోవా మోషేతో, “ఈజిప్టు దేశమంతటిమీదికి మిడతల దండు వచ్చి పొలంలో పెరుగుతున్న ప్రతి మొక్కను, వడగండ్ల వలన పాడవని ప్రతిదాన్ని తినివేసేలా నీ చేతిని ఈజిప్టు మీద చాపు” అని చెప్పారు. మోషే తన కర్రను ఈజిప్టు మీద చాపినప్పుడు యెహోవా పగలంతా రాత్రంతా ఆ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశారు. ఉదయానికి ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చాయి. ఆ మిడతలు ఈజిప్టు దేశమంతటిని ఆక్రమించుకుని దేశంలోని ప్రతిచోట వాలాయి. అవి అసంఖ్యాకమైనవి. అటువంటి మిడతలు గతంలో ఎన్నడూ లేవు ఇకముందు ఉండవు. నల్లగా ఉండే వరకు అవి భూమి అంతా కప్పాయి. వడగళ్ళకు పాడవకుండ పొలాల్లో ఉన్నవాటిని చెట్లకున్న పండ్లను అవి తినివేశాయి. ఈజిప్టు దేశమంతా చెట్టు మీద గాని మొక్క మీద గాని పచ్చదనం మిగల్లేదు. ఫరో వెంటనే మోషే అహరోనులను పిలిపించి వారితో, “మీ దేవుడైన యెహోవాకు మీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. దయచేసి మరొకసారి నా పాపాన్ని క్షమించి మరణం కలిగించే ఈ తెగులును నా నుండి తొలగించమని మీ దేవుడైన యెహోవాకు ప్రార్థించండి” అని అన్నాడు. మోషే ఫరో దగ్గర నుండి వెళ్లి యెహోవాకు ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి బలమైన పడమటి గాలి వీచేలా చేసినప్పుడు ఆ గాలికి మిడతలు ఎర్ర సముద్రంలోకి కొట్టుకుపోయాయి. ఈజిప్టులో ఎక్కడ కూడా ఒక్క మిడత కూడా మిగల్లేదు. అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశారు కాబట్టి అతడు ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వలేదు. అప్పుడు యెహోవా మోషేతో, “ప్రతి ఒక్కరూ తడుముకునేంత కటిక చీకటి ఈజిప్టు దేశం మీద కమ్ముకునేలా నీ చేతిని ఆకాశం వైపు చాపు” అన్నారు. మోషే తన చేతిని ఆకాశం వైపు చాపినప్పుడు మూడు రోజులపాటు ఈజిప్టు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంది. ఆ మూడు రోజులు ఎవరూ ఎవరిని చూడలేకపోయారు తామున్న చోట నుండి లేవలేకపోయారు. అయినప్పటికీ ఇశ్రాయేలీయులు నివసిస్తున్న ప్రాంతాల్లో వెలుగు ఉంది. అప్పుడు ఫరో మోషేను పిలిపించి, “వెళ్లి యెహోవాను సేవించండి. మీ స్త్రీలు పిల్లలను కూడా మీతో వెళ్లవచ్చు; కాని మీ గొర్రెలు పశువులను ఇక్కడే వదిలేయండి” అన్నాడు. అందుకు మోషే, “మేము మా దేవుడైన యెహోవాకు బలులు, దహనబలులు అర్పించడానికి కావలసిన పశువులను నీవు మాకు ఇవ్వాలి. మా పశువులు కూడా మాతో రావాలి; ఒక్క డెక్క కూడా వదిలిపెట్టము. మా దేవుడైన యెహోవాను సేవించడానికి వాటిలో నుండే మేము తీసుకోవాలి, మేము అక్కడికి వెళ్లి మేము వేటితో యెహోవాను సేవించాలో మాకు తెలియదు” అన్నాడు. అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశారు కాబట్టి అతడు వారు వెళ్లడానికి ఒప్పుకోలేదు. అప్పుడు ఫరో మోషేతో, “నా ఎదుట నుండి వెళ్లిపో! మరలా నీవు నాకు కనపడకుండా చూసుకో! నీవు నా ముఖాన్ని చూసిన రోజునే నీవు మరణిస్తావు” అన్నాడు. అందుకు మోషే, “నీవన్నట్లే చేస్తాను, మళ్ళీ ఇంకెప్పుడు నీ ముందు కనబడను” అన్నాడు.
నిర్గమకాండము 10:1-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా మోషేతో “ఫరో దగ్గరికి తిరిగి వెళ్ళు. నేను చేసిన అద్భుత కార్యాలను వాళ్ళ మధ్య కనపరచాలని నేను అతడి గుండె, అతని సేవకుల గుండెలు బండబారిపోయేలా చేశాను. నేను ఐగుప్తీయుల పట్ల వ్యవహరించిన విధానాన్ని, యెహోవాను నేనేనని మీరు తెలుసుకొనేలా నేను చేస్తున్న అద్భుత కార్యాలను నువ్వు నీ కొడుకులకూ, మనవలకూ తెలియజేయాలి” అని చెప్పాడు. మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పారు. “హెబ్రీయుల దేవుడు యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ఎంతకాలం వరకూ నా మాట వినకుండా ఉంటావు? నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు. నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో రేపు నేను నీ దేశం మీదికి మిడతలను రప్పిస్తాను. నేల కనపడనంతగా అవి భూమిని కప్పివేస్తాయి. మీ దేశంలో మిగిలిన దాన్ని అంటే వడగండ్ల దెబ్బ నుండి తప్పించుకున్నదాన్ని, అంటే పొలాల్లో మొలకెత్తిన ప్రతి మొక్కనూ అవి తినేస్తాయి. మీ గృహాలూ మీ సేవకుల గృహాలూ ఐగుప్తీయుల ఇళ్ళన్నీ వాటితో నిండిపోతాయి. మీ తండ్రులు, పూర్వికులు ఈ దేశంలో ఉన్నప్పటి నుండి ఈనాటి వరకూ ఇలాంటి వాటిని చూసి ఉండలేదు” అని చెప్పి ఫరో దగ్గర నుండి వెళ్ళిపోయారు. అప్పుడు ఫరో సేవకులు ఫరోతో “ఎంతకాలం వరకూ ఈ మనిషి మనలను ఇబ్బందులకు గురిచేస్తాడు? వాళ్ళ దేవుడు యెహోవాను ఆరాధించడానికి ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వు. మన ఐగుప్తు దేశం పాడైపోతున్నదని నీకింకా తెలియడం లేదా?” అన్నారు. కాబట్టి మోషే అహరోనులను ఫరో దగ్గరికి తీసుకు వచ్చారు. ఫరో “మీరు వెళ్లి మీ దేవుడు యెహోవాను ఆరాధించుకోండి. ఈ పని కోసం ఎవరెవరు వెళ్తారు?” అని అడిగాడు. అందుకు మోషే “మేము యెహోవాకు మహోత్సవం జరిపించాలి. కాబట్టి మా కొడుకులను, కూతుళ్ళను, మందలను, పశువులను వెంటబెట్టుకుని మా పిల్లలతో, పెద్దలతో కలసి వెళ్తాం” అని బదులిచ్చాడు. అందుకు ఫరో “యెహోవా మీకు కావలిగా ఉంటాడా? నేను మిమ్మల్ని మీ పిల్లలతో సహా వెళ్ళనిస్తానా? చూడండి, మీలో దురుద్దేశం ఉంది. కాబట్టి పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాకు ఉత్సవం జరుపుకోండి. మీరు కోరుకున్నది అదే గదా” అన్నాడు. తరువాత వాళ్ళను ఫరో ఎదుట నుండి వెళ్ళగొట్టారు. అప్పుడు యెహోవా మోషేతో “మిడతల దండు వచ్చేలా ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపు. అవి ఐగుప్తు మీదకి వచ్చి ఈ దేశంలో ఉన్న పంటలన్నిటినీ అంటే వడగళ్ళ ద్వారా పాడవని పంటలన్నిటినీ తినివేస్తాయి” అని చెప్పాడు. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపాడు. యెహోవా ఆ పగలూ, రాత్రీ ఆ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశాడు. తెల్లవారేసరికి తూర్పు గాలికి ఎగిరే మిడతలు దండుగా వచ్చిపడ్డాయి. తీవ్రంగా హాని కలిగించే ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికీ వచ్చి ఐగుప్తు దేశంలోని అన్ని సరిహద్దుల్లో నిలిచి భూమి మొత్తాన్నీ కప్పివేశాయి. అంతకు ముందెప్పుడూ ఇలాంటి మిడతలు లేవు, ఇకముందు కూడా ఉండబోవు. ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఆ దేశంలో కూరగాయలన్నిటినీ వడగళ్ళు పాడు చేయని పంటలన్నిటినీ చెట్లనూ ఫలాలనూ అవి తినివేశాయి. ఐగుప్తు దేశమంతా చెట్లు గానీ పొలాల పంటలు గానీ పచ్చగా ఉండేది ఏదీ మిగలలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను వెంటనే పిలిపించాడు. “నేను మీ పట్లా మీ దేవుడు యెహోవా పట్లా తప్పిదం చేశాను. దయచేసి ఈ ఒక్కసారి మాత్రం నా తప్పు క్షమించండి. ఈ చావును తెచ్చే విపత్తును మాత్రం నా మీద నుండి తప్పించమని మీ దేవుడైన యెహోవాను వేడుకోండి” అన్నాడు. మోషే ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళి యెహోవాకు ప్రార్ధించాడు. అప్పుడు యెహోవా, గాలిని తిప్పి శక్తివంతమైన పడమటి గాలి విసిరేలా చేశాడు. ఆ గాలి తీవ్రతకు మిడతలు కొట్టుకుపోయి ఎర్ర సముద్రంలో పడిపోయాయి. ఐగుప్తు దేశమంతటిలో ఒక్క మిడత కూడా మిగలలేదు. అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు. అప్పుడు యెహోవా మోషేతో “ఆకాశం వైపు నీ చెయ్యి చాపు. ఐగుప్తు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంటుంది” అని చెప్పాడు. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా మూడు రోజులపాటు గాఢాంధకారం కమ్ముకుంది. ఆ మూడు రోజులు ఒకరికి ఒకరు కనబడలేదు. తామున్న చోటు నుండి ఎవ్వరూ లేచి కదలలేకపోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలందరి ఇళ్ళలో వెలుగు ఉంది. ఫరో మోషేను పిలిపించాడు. “మీరు వెళ్లి యెహోవాను ఆరాధించండి. అయితే మీ మందలూ, పశువులూ మాత్రం ఇక్కడే ఉండాలి. మీ బిడ్డలు మాత్రం మీతో వెళ్ళవచ్చు” అన్నాడు. అందుకు మోషే “మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన హోమ బలి అర్పణల కోసం నువ్వు మా పశువుల మందలను ఇవ్వ వలసి ఉంటుంది. మా పశువులు, మందలు మాతో కూడా రావాలి. మా పశువుల కాలి గిట్ట కూడా విడిచిపెట్టం. మేము వేటిని యెహోవాకు బలి అర్పించాలో అక్కడికి చేరే వరకూ మాకు తెలియదు. మా దేవుడైన యెహోవాను ఆరాధించే సమయంలో మా మందల్లోనుంచే వాటిని తీసుకోవాలి” అని చెప్పాడు. అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు వారిని వెళ్ళనియ్యలేదు. అప్పుడు ఫరో “బయటకు వెళ్ళు, జాగ్రత్త సుమా. ఇకపై నాకు కనిపించకు. నువ్వు నాకు ఎదురు పడిన రోజున తప్పకుండా చస్తావు” అన్నాడు. అందుకు మోషే “సరే నువ్వే అన్నావు గదా, ఇకపై నీ ముఖం చూడను” అన్నాడు.
నిర్గమకాండము 10:1-29 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా మోషేతో, “ఫరో దగ్గరకు వెళ్లు. నేనే అతణ్ణి అతని అధికారులని మొండిగా చేస్తాను. నా మహత్తర అద్భుతాలను నేను వాళ్లకు చూపించాలని నేనే ఇలా చేసాను. అలాగే ఈజిప్టులో నేను చేసిన అద్భుతాలు, ఇతర మహత్యాల విషయం మీరుకూడ మీ పిల్లలకు మీ పిల్లల పిల్లలకు చెప్పవచ్చని వీటిని చేసాను. అప్పుడు నేనే యెహోవానని మీరంతా తెల్సుకొంటారు” అని చెప్పాడు. మోషే, అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లారు. “‘ఎంత కాలం నీవు నాకు లోబడకుండా తిరస్కరిస్తావు? నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల యెహోవా దేవుడు అంటున్నాడు అని వారు అతనితో చెప్పారు. నీవు నా ప్రజలను వెళ్లనివ్వకపోతే, రేపు నీ దేశంలోకి మిడతలను తీసుకొస్తాను. నేల అంతా మిడతలతో నిండి పోతుంది. నీకు నేల కనబడనంత విస్తారంగా మిడతలు ఉంటాయి. వడగళ్ల వానలో మిగిలింది యింకేమైనా ఉంటే, దాన్ని కాస్తా మిడతలు తినేస్తాయి. పొలాల్లో చెట్ల ఆకులన్నిటినీ మిడతలు తినేస్తాయి. మీ ఇండ్లు మీ అధికారుల ఇండ్లు, ఈజిప్టులో ఉన్న మొత్తం ఇండ్లన్నీ మిడతలతో నిండిపోతాయి. మీ తల్లిదండ్రులు, తాతలు ఎన్నడైనా చూచిన వాటికంటే ఎక్కువ మిడతలు ఉంటాయి. ఈజిప్టులో మనుష్యులు నివాసం మొదలు పెట్టినప్పటినుండి ఎన్నడైనా ఉన్న మిడతల కంటె ఎక్కువ మిడతలు ఉంటాయి.’” తరువాత మోషే ఫరోను విడిచి, వెనుదిరిగాడు. “ఇంకెన్నాళ్లు ఈ మనుష్యులు మనల్ని చిక్కుల్లో పెడతారు. మగవాళ్లందర్నీ వారి యెహోవా దేవుడ్ని ఆరాధించుకొనేందుకు వెళ్లనివ్వు. నీవు వాళ్లను వెళ్లనియ్యకపోతే, నీవు గుర్తించక ముందే, ఈజిప్టు నాశనం అయిపోతుంది” అని ఫరో అధికారులు అతనితో చెప్పారు. కనుక మోషే అహరోనులను తన దగ్గరకు మళ్లీ తీసుకురమ్మని ఫరో తన అధికారులతో చెప్పాడు. “మీరు వెళ్లి మీ యెహోవా దేవుడ్ని ఆరాధించండి, అయితే ఎవరెవరు వెళ్లుచున్నది నాకు సరిగ్గా చెప్పండి?” అన్నాడు ఫరో. “మా ప్రజలలో పడుచువాళ్లు, వృద్ధులు వెళ్తారు! మాతోబాటు మా కుమారులు మా కుమార్తెలను, మా గొర్రెల్ని మా పశువుల్ని కూడ తీసుకుపోతాం. ఇది మా యెహోవా పండుగ గనుక మేమంతా వెళ్తాము” అని జవాబిచ్చాడు మోషే. ఫరో వాళ్లతో, “నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని వెళ్లనిచ్చే ముందు యెహోవా నిజంగా మీతో ఉండి తీరాలి. చూస్తోంటే, మీరేదో దుర్మార్గం తలపెట్టి నట్లుంది. మగాళ్లు వెళ్లి యెహోవాను ఆరాధించవచ్చు. అసలు మీరడిగింది అదే. అంతేగాని మీరంతా మొత్తం వెళ్లి పోయేందుకు వీల్లేదు” అని చెప్పి మోషే, అహరోనులను ఫరో పంపించి వేసాడు. యెహోవా మోషేతో “ఈజిప్టు మీద నీ చేయి ఎత్తు, మిడతలు వచ్చేస్తాయి. ఈజిప్టు మొత్తం నేలమీద మిడతలు ఆవరించేస్తాయి. వడగళ్లు నాశనం చేయకుండా మిగిలిన పంట అంతటినీ ఆ మిడతలు తినేస్తాయి” అని చెప్పాడు. కనుక మోషే ఈజిప్టు దేశం మీద తన కర్ర ఎత్తగా తూర్పు నుండి బలంగా గాలి వీచేటట్టు యెహోవా చేసాడు. ఆ రోజంతా, ఆ రాత్రి అంతా గాలి వీచింది. తెల్లవారేటప్పటికి ఈజిప్టు అంతటా మిడతల్ని తెచ్చి పడేసింది ఆ గాలి. మిడతలు ఈజిప్టు దేశంలోకి ఎగిరివచ్చి నేలమీదంతటా కమ్మాయి. ఈజిప్టులో ఇది వరకు ఎన్నడూ లేనన్ని మిడతలు వచ్చేసాయి. పూర్వం ఎన్నడూ అన్ని మిడతలు ఉండలేదు. నేల అంతా మిడతలు కమ్మేశాయి. దేశం అంతా చీకటి అయిపోయింది. వడగళ్లు నాశనం చేయకుండా మిగిల్చిన చెట్లలో ప్రతి ఫలాన్ని, నేలమీద ఉన్న ప్రతి మొక్కనూ మిడతలు తినేసాయి. మొత్తం ఈజిప్టులో ఎక్కడేగాని ఏ చెట్లకూ మొక్కలకూ ఒక్క ఆకు గూడ మిగల్లేదు. వెంటనే మోషే అహరోనులను పిలిపించాడు ఫరో, “మీకు, మీ యెహోవా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసాను. ఈ సారికి నా పాపాలు క్షమించండి. నా దగ్గర్నుండి ఈ మృత్యువును (మిడతలను) తీసివేయమని యెహోవాను అడగండి” అని చెప్పాడు ఫరో. మోషే ఫరో దగ్గరనుండి వెళ్లిపోయి యెహోవాను ప్రార్థించాడు. కనుక యెహోవా ఆ గాలిని మార్చేసాడు. పడమటినుండి గాలి బలంగా వీచేటట్టు చేసాడు. ఆ గాలి మిడతలన్నింటినీ ఎర్ర సముద్రంలోకి కొట్టేసింది. ఈజిప్టులో ఒక్క మిడతకూడ మిగల్లేదు. అయితే యెహోవా ఫరోను మాత్రం ఇంకా మొండిగా చేసాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో వెళ్లనివ్వలేదు. అప్పుడు యెహోవా, “నీ చెయ్యి పైకెత్తు, ఈజిప్టు చీకటిమయం అవుతుంది. చీకటిలో తడవులాడేటంత కటిక చీకటి కమ్ముతుంది” అని మోషేతో చెప్పాడు. కనుక మోషే తన చేతిని పైకి ఎత్తగానే ఒక చీకటి మేఘం ఈజిప్టును ఆవరించేసింది. ఈజిప్టులో మూడు రోజుల పాటు ఆ చీకటి ఉండిపోయింది. ఎవ్వరూ ఎవ్వర్నీ చూడలేక పోయారు. మూడు రోజుల వరకు ఎవ్వరూ వాళ్ల స్థానాలు విడిచి పెట్టలేదు. అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే ప్రదేశాలన్నింటిలో వెలుగు ఉంది. ఫరో మళ్లీ మోషేను పిలిపించి, “వెళ్లి యెహోవాను ఆరాధించండి. మీరు మీ పిల్లల్ని మీతో కూడా తీసుకొని వెళ్లొచ్చు. కాని మీ గొర్రెల్ని, పశువుల్ని మాత్రం ఇక్కడ విడిచి పెట్టిండి” అన్నాడు. “మా గొర్రెల్ని, పశువుల్ని మాతో కూడ తీసుకొని వెళ్లడమేకాదు, మేము వెళ్లేటప్పుడు మీరు కూడ కానుకలు, బలి అర్పణలు మాకు యివ్వాలి. మా యెహోవా దేవుడ్ని ఆరాధించడానికి ఈ బలులను మేము వాడుకొంటాము. యెహోవాను ఆరాధించేందుకు మా జంతువుల్ని కూడ మేము తీసుకొని వెళ్తాము. ఒక్క డెక్క కూడ ఇక్కడ విడిచి పెట్టబడదు. యెహోవాను ఆరాధించేందుకు ఏమేమి కావాలో సరిగ్గా మాకూ ఇంకా తెలియదు. మేము వెళ్తున్న చోటికి చేరిన తర్వాతే అది మాకు తెలుస్తుంది. అందుచేత యివన్నీ మేము తీసుకెళ్లాల్సిందే” అని మోషే అన్నాడు. యెహోవా ఫరోను ఇంకా మొండిగా చేసాడు. అందుచేత ఫరో ప్రజలను వెళ్లనివ్వలేదు. అప్పుడు ఫరో మోషేతో, “పో, నా దగ్గర్నుండి వెళ్లిపో! నీవు మళ్లీ ఇక్కడకు రాకూడదు. నన్ను కలుసుకోవాలని మరోసారి వస్తే, నీవు చస్తావు” అన్నాడు. “మోషే ఫరోతో, నీవు చెప్పింది నిజమే. నిన్ను చూడ్డానికి నేను మళ్లీ రాను” అని చెప్పాడు.
నిర్గమకాండము 10:1-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాగా యెహోవా మోషేతో – ఫరోయొద్దకు వెళ్లుము. నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లును, నేనుచేయు సూచకక్రియలను ఐగుప్తీయుల యెదుట కనుపరచుటకు, నేను వారియెడల జరిగించిన వాటిని వారి యెదుట కలుగజేసిన సూచకక్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును, నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరచితిననెను. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి, అతనిని చూచి యీలాగు చెప్పిరి– హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా– నీవు ఎన్నాళ్లవరకు నాకు లొంగనొల్లక యుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనియ్య నొల్లనియెడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించెదను. ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును, తప్పించుకొనిన శేషమును, అనగా వడగండ్లదెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును, పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును. మరియు అవి నీ యిండ్లలోను నీ సేవకులందరి యిండ్లలోను ఐగుప్తీయులందరి యిండ్లలోను నిండిపోవును. నీ పితరులుగాని నీ పితామహులుగాని యీ దేశములోనుండిన నాటనుండి నేటివరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో యెదుటనుండి బయలు వెళ్లెను. అప్పుడు ఫరో సేవకులు అతని చూచి– ఎన్నాళ్లవరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము; ఐగుప్తుదేశము నశించినదని నీకింకను తెలియదా అనిరి. మోషే అహరోనులు ఫరోయొద్దకు మరల రప్పింపబడగా అతడు–మీరు వెళ్లి మీ దేవుడైన యెహోవాను సేవించుడి; అందుకు ఎవరెవరు వెళ్లుదురని వారి నడిగెను. అందుకు మోషే–మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతోకూడ వెళ్లెదమనెను. అందుకతడు–యెహోవా మీకు తోడైయుండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు. పురుషులైన మీరు మాత్రము వెళ్లి యెహోవాను సేవించుడి; మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖమునుండి వారు వెళ్లగొట్టబడిరి. అప్పుడు యెహోవా మోషేతో–మిడతలు వచ్చునట్లు ఐగుప్తుదేశముమీద నీ చెయ్యి చాపుము; అవి ఐగుప్తుదేశముమీదకి వచ్చి యీ దేశపు పైరులన్నిటిని, అనగా వడగండ్లు పాడుచేయని వాటినన్నిటిని తినివేయునని చెప్పెను. మోషే ఐగుప్తుదేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసర జేసెను; ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి, అంతకుమునుపు అట్టి మిడతలు ఎప్పుడును ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను. ఆ దేశమున చీకటికమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడుచేయని వృక్షఫలములన్నిటిని అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతట చెట్లేగాని పొలముల కూరయేగాని పచ్చని దేదియు మిగిలియుండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి –నేను మీ దేవుడైన యెహోవాయెడలను మీ యెడలను పాపముచేసితిని. మీరు దయచేసి, యీసారి మాత్రమే నా పాపము క్షమించి, నా మీదనుండి యీ చావు మాత్రము తొల గించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా అతడు ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహా బలమైన పడమటిగాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎఱ్ఱసముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలువలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యడాయెను. అందుకు యెహోవా మోషేతో–ఆకాశమువైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తుదేశముమీద చీకటి చేతికి తెలియునంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశమువైపు తన చెయ్యి యెత్తినప్పుడు ఐగుప్తుదేశ మంతయు మూడుదినములు గాఢాంధకారమాయెను. మూడుదినములు ఒకని నొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటనుండి లేవలేక పోయెను; అయినను ఇశ్రాయేలీయులకందరికి వారి నివాసములలో వెలుగుండెను. ఫరో మోషేను పిలిపించి–మీరు వెళ్లి యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్లవచ్చుననగా మోషే–మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణలనిమిత్తమును నీవు మాకు పశువులనియ్యవలెను. మా పశువులును మాతోకూడ రావలెను. ఒక డెక్కయైనను విడువబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలోనుండి తీసికొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరకమునుపు మాకు తెలియదనెను. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనియ్య నొల్లక యుండెను. గనుక ఫరో–నా యెదుటనుండి పొమ్ము భద్రము సుమీ; నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను. అందుకు మోషే–నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడననెను.