ఎస్తేరు 2:12-16
ఎస్తేరు 2:12-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆరు నెలల పాటు గోపరస తైలంతో, ఆరు నెలల పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో, మొత్తం పన్నెండు నెలలు సౌందర్య పోషణ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి అనేది ఆ స్త్రీలకు నియమించిన విధి. అప్పుడు రాజు దగ్గరికి పోయే వంతు ఒక్కొక్క అమ్మాయికీ వస్తుంది. రాణివాసం నుండి రాజు మందిరానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఒక్కొక్క అమ్మాయికి ఆమె ఏది కోరుకుంటే అది ఇస్తారు. సాయంత్రం వేళ ఆమె లోపలికి వెళ్లి మరునాడు ఉదయం రెండవ రాణివాసానికి తిరిగి వచ్చేది. అదంతా రాజు ఉంపుడుగత్తెల బాగోగులు చూసే షయష్గజు అనే రాజోద్యోగి పర్యవేక్షణలో ఉండేది. రాజుకు ఆమె బాగా నచ్చి అతడు ఆమెను పిలిపించుకుంటే తప్ప ఆమె రాజు దగ్గరికి ఇక వెళ్లకూడదు. మొర్దెకై తన స్వంత కూతురుగా చూసుకుంటున్న అతని బాబాయి అబీహాయిలు కూతురు అయిన ఎస్తేరుకు రాజు దగ్గరికి వెళ్ళడానికి వంతు వచ్చింది. స్త్రీల పర్యవేక్షకుడైన రాజోద్యోగి హేగే నిర్ణయించిన అలంకారం తప్ప ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె అంటే ఇష్టం కలిగింది. ఆ విధంగా అహష్వేరోషు రాజు పరిపాలనలో ఏడో సంవత్సరం టెబేతు అనే పదో నెలలో ఎస్తేరు రాజ మందిరంలో అతని దగ్గరికి పోయింది.
ఎస్తేరు 2:12-16 పవిత్ర బైబిల్ (TERV)
ఎవరైనా ఒక యువతి అహష్వేరోషు మహారాజు సన్నిధానానికి తీసుకుపోబడేందుకు ముందు ఆమె చేయవలసిన పనులు యివి: ఆమె తన పన్నెండు మాసాల సౌందర్యవర్ధక పక్రియను వూర్తి చేయాలి. అంటే, ఆమె ఆరునెలలు పాటు గోపరస తైలాన్ని వాడి, తదుపరి ఆరునెలలు పరిమళ ద్రవ్యాలను, భిన్న భిన్న మైన అలంకరణ సామగ్రులను వాడాలి. మహారాజు సముఖానికి తీసుకుపోబడేందుకు ఇదీ పద్దతి. ఆ అమ్మాయికి ఏది కావాలన్నా అంతఃపురం నుంచి ఇవ్వబడుతుంది. ఆ యువతి రాజ భవనానికి సాయంత్రమందు చేరుకుంటుంది. ఆ మరుసటి ఉదయం ఆమె అంతఃవుర స్త్రీలు నివసించే మరో చోటికి తిరిగి వెళ్తుంది. అప్పుడామె అక్కడ షయష్గజు అనే నపుంసకుని అజమాయిషీలో ఉంచబడుతుంది. షయష్గజు నపుంసకుడు మహారాజు ఉంపుడుగత్తెల పర్యవేక్షకుడు. మహారాజుకు ఆమెపట్ల ప్రేమ కలిగినప్పుడేగాని ఆ యువతి ఆయన దగ్గరకు వెళ్లరాదు. అప్పుడాయన ఆమెను పేరుపెట్టి తిరిగి తనవద్దకు రమ్మని పిలుస్తాడు. ఎస్తేరుకి మహారాజు వద్దకు వెళ్లే వంతు వచ్చి నప్పుడు, ఆమె ఏమీ కావాలని కోరలేదు. అంతఃపుర పర్యవేక్షకుడైన హేగే తనకేమి సూచించాడో అవే తీసుకుంది. (ఎస్తేరు మొర్దెకై పెంపుడు కూతురు, అతని పినతండ్రి అబీహాయిలు కూతురు). ఎస్తేరును చూసిన ప్రతి ఒక్కరికీ ఆమె నచ్చింది. చివరికి ఎస్తేరు రాజ భవనంలో మహారాజు సముఖానికి తీసుకెళ్లబడింది. అది సరిగ్గా టెబేతు అనబడే పదోనెల, అహష్వేరోషు పాలనలో ఏడవ సంవత్సరం.
ఎస్తేరు 2:12-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆరుమాసములు గోపరస తైలముతోను, ఆరు మాసములు సుగంధవర్గములతోను, స్త్రీల పరిమళక్రియలకొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళక్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు. పండ్రెండు మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్లుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చి నప్పుడు ఒక్కొక చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను, ఏమనగా ఆ తీరునవారు పరిమళక్రియలు చేయుకాలము సంపూర్ణమగుచుండెను. మరియు అంతఃపురములోనుండి రాజు ఇంటిలోనికి వెళ్లవలసిన సమయమందు ఆమె యేమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుటకద్దు. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్లి మరుదినము ఉపపత్నులను కాయు రాజుయొక్క షండుడైన షయష్గజు అను అతని వశములోనున్న రెండవ అంతఃపురమునకు తిరిగివచ్చును. ఆమెయందు రాజు సంతోషించి ఆమెను పేరుపెట్టి పిలిచితేనేగాని ఆమె రాజు నొద్దకు మరల వెళ్లకుండెను. మొర్దకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రియైన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్లుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజుయొక్క షండుడైన హేగే నిర్ణ యించిన అలంకారముగాక ఆమె మరి ఏమియు కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికి ఆమెయందు దయపుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు ఏడవ సంవత్సరమున టెబేతు అను పదియవ నెలలో రాజ నగరులోనికి అతనియొద్దకు పోగా
ఎస్తేరు 2:12-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఒక యువతి రాజైన అహష్వేరోషు దగ్గరకు వెళ్లే సమయం రాకముందు, ఆమె ఆరు నెలలు పాటు గోపరస తైలం, మరో ఆరు నెలలు వివిధ పరిమళద్రవ్యాలు వాడాలి. ఈ విధంగా ఒక యువతి రాజు దగ్గరకు వెళ్లాలి: అంతఃపురం నుండి రాజు సముఖంలోకి వెళ్లేటప్పుడు, ఆమెకు ఏది కావాలో అది తనకు ఇవ్వబడుతుంది. సాయంత్రం ఆమె అక్కడికి వెళ్తుంది, ఉదయం అంతఃపురంలో ఇంకొక భాగముకు, ఉపపత్నులపై అధికారిగా ఉన్న షయష్గజు యొక్క సంరక్షణకు తిరిగి వెళ్తుంది. రాజుకు ఆమె నచ్చి, తన పేరు పెట్టి పిలిపిస్తే తప్ప ఆమె అతని దగ్గరకు తిరిగి వెళ్లదు. రాజు దగ్గరకు వెళ్లడానికి ఎస్తేరు యొక్క వంతు వచ్చినప్పుడు (ఈమె మొర్దెకై పినతండ్రి అబీహయిలు కుమార్తె, మొర్దెకై ఈమెను దత్తత తీసుకున్నాడు), ఆమె రాజు యొక్క నపుంసకుడు, అంతఃపురం యొక్క అధికారియైన హేగై ప్రతిపాదించింది తప్ప మరి ఏవి అడగలేదు. ఎస్తేరును చూసిన వారందరికి ఆమె అంటే ఇష్టం కలిగింది. అలా ఎస్తేరు రాజైన అహష్వేరోషు పరిపాలనలోని ఏడవ సంవత్సరంలో టెబేతు అనే పదవ నెలలో రాజభవనంలోకి వెళ్లింది.